Skip to main content

UPSC Civils Rankers : భ‌ర‌త‌మాత‌కు సేవ చేసే అరుదైన అవ‌కాశం.. సివిల్స్ ర్యాంక‌ర్ల‌కు మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు సూచ‌న‌లు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : భ‌ర‌త‌మాత‌కు సేవ చేసే అరుదైన అవ‌కాశం సివిల్ స‌ర్వీస్ ర్యాంక‌ర్ల‌కు మాత్ర‌మే ల‌భిస్తుంద‌ని, దాన్ని వాళ్లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు సూచించారు.
upsc civil rankers with former vice president of india venkaiah naidu

యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫ‌లితాల్లో ర్యాంకులు సాధించిన 35 మందిని వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని ద‌స‌ప‌ల్లా హోట‌ల్లో మే 4వ తేదీ (శ‌నివారం) ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌రో గౌర‌వ అతిథిగా దూర‌ద‌ర్శ‌న్ మాజీ అద‌న‌పు డీజీ డాక్ట‌ర్ ఆర్.ఎ. ప‌ద్మ‌నాభ‌రావు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా వెంకయ్య‌నాయుడు ముందుగా ర్యాంక‌ర్లంద‌రికీ హృద‌యపూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మీ ఈ ప‌య‌నం మీ జీవితాల్నే కాదు.. ఈ దేశాన్నే మారుస్తుంద‌న్నారు. అలాగే స‌మాజం, ప్ర‌జ‌లు, దేశం అన్నింటిలో ప‌రివ‌ర్త‌న తీసుకొస్తుంద‌న్నారు. 1947లో మొద‌టి కేంద్ర మంత్రి, ఐర‌న్ మ్యాన్ ఆఫ్ ఇండియా స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్ ఒక మాట చెప్పారు. సివిల్ స‌ర్వీసు అధికారులు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అన్నారు. హామీలు ఇవ్వ‌డం మంచిదే.., కానీ వాటిని ప్ర‌జ‌లకు అందించడం అత్య‌ద్భుతం. మీది కేవ‌లం ఉద్యోగం కాదు.. భ‌ర‌త‌మాత‌కు సేవ చేసే అరుదైన అవ‌కాశం. 

మీరు మొద‌టి అడుగు వేస్తున్నారు. స‌మాజానికి సేవ చేయ‌డ‌మే అత్యున్న‌తం. కుల‌, మ‌త‌, లింగ‌ప‌ర‌మైన విభేదాలు లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ భార‌తీయులే. ఇక్క‌డ వేర్వేరు మ‌తాలు, సంస్కృతులు, భాష‌లు, దేవుళ్లు ఉండొచ్చు. అయినా మ‌న‌మంతా భార‌తీయుల‌మేన‌ని గుర్తుంచుకోవాలి. మీ నిబ‌ద్ద‌తే మ‌న దేశ భ‌విష్య‌త్తును తీర్చిదిద్దుతుంది. మీమీద బోలెడు ఒత్తిడులుంటాయి. 

మీకు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి, జ‌న్మ‌భూమి, మాతృభాష‌.. వీట‌న్నింటినీ..
రాజ‌కీయ బాస్‌లు ఉంటారు. కానీ మీకు అస‌లైన బాస్ ఎవ‌రంటే దేశ ప్ర‌జ‌లే. అస‌లైన భ‌గ‌వ‌ద్గీత‌, బైబిల్ లేదా ఖురాన్... భార‌త రాజ్యాంగ‌మేన‌ని గుర్తుంచుకోవాలి. మీ మ‌నస్సాక్షికే క‌ట్టుబ‌డి ఉండాలి. నిజాయ‌తీతో ఉండాలి. ప్ర‌భుత్వాన్ని మీరే ప్ర‌తిబింబిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ప్ర‌ధాని ఎవ‌రైనా ఉండొచ్చు గానీ, సేవ‌ల‌న్నీ అందేది మీ ద్వారా మాత్ర‌మే. అత్యున్న‌త నైతిక విలువ‌ల‌ను పాటించాల‌న్నారు. స్వాతంత్య్రం త‌ర్వాత అన్ని స్థాయిల్లో విలువ‌లు కొంత ప‌డిపోతూ వ‌స్తున్నాయి. కానీ ఇప్ప‌టికీ విద్య‌, వైద్యం, పాల‌నాయంత్రాంగం మాత్రం అచ‌లంగా ఉన్నాయి. మీకు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి, జ‌న్మ‌భూమి, మాతృభాష‌, మాతృదేశం.. వీట‌న్నింటినీ ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి. 

మీరు నిజాయ‌తీప‌రులైతే అపార గౌర‌వం ల‌భిస్తుంది. అది మీకు విశ్వాసాన్ని క‌ల్పిస్తుంది. రిఫార్మ్, పెర్ఫార్మ్, అండ్ ట్రాన్స్‌ఫార్మ్ అంటారు. అడ్డంకుల‌న్నింటినీ తొల‌గించుకుని ముందుకెళ్లాల‌ని గుర్తుంచుకోండి. ప్ర‌జాసేవ‌, వారి అభివృద్ధికి మీరు నూరుశాతం క‌చ్చితంగా ప‌నిచేయాలి. అవ‌కాశాలు అనేవి ఎప్పుడూ చెప్పిరావు. వ‌చ్చిన‌ప్పుడు వాటిని అందిపుచ్చుకుని వాటి సాయంతో వీలైనంత ఎక్కువ సేవ చేయాలి అని వెంక‌య్య‌నాయుడు సూచించారు. 

మూడు ద‌శ‌లూ దేనిక‌దే...
దూర‌ద‌ర్శ‌న్ మాజీ అద‌న‌పు డీజీ డాక్ట‌ర్ ఆర్.ఎ. ప‌ద్మ‌నాభ‌రావు మాట్లాడుతూ.. యూపీఎస్సీ ప‌రీక్ష‌ల‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంట‌ర్వ్యూ అనే మూడు ద‌శ‌లూ దేనిక‌దే పూర్తి ప్ర‌త్యేక‌మ‌ని.. వీట‌న్నింటిలో వ‌రుస‌గా విజ‌యాలు సాధించి సివిల్స్ ర్యాంకు పొంద‌డం అంటే చిన్న విష‌యం కాద‌ని చెప్పారు. ర్యాంకులు సాధించి దేశ‌సేవ‌కు సంసిద్ధులైన యువ‌త‌ను తాను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాన‌న్నారు. వీరిలో విభిన్న నేప‌థ్యాల వారు ఉన్నార‌ని, కొంద‌రు అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వ‌చ్చిన‌వాళ్ల‌యితే మ‌రికొంద‌రు ఉన్న‌త ఉద్యోగాల‌ను, పెద్ద పెద్ద జీతాల‌ను సైతం వ‌దులుకుని కేవ‌లం సివిల్స్ సాధించాల‌న్న ల‌క్ష్యంతో వ‌చ్చార‌ని చెప్పారు. 

సివిల్స్ సాధించాల‌న్న క‌ల ఉంటే చాల‌దు.. దానికి స‌రైన దిశ‌లో సాధ‌న కూడా అవ‌స‌రం. ఆ సాధ‌న ఎలా ఉండాల‌న్న విష‌యంలోనే మేం విద్యార్థుల‌ను స‌రైన దారిలో న‌డిపించే ప్ర‌య‌త్నం చేస్తాం. అది అందిపుచ్చుకుని, త‌గిన ప్ర‌ణాళిక‌తో సిద్ధ‌మ‌య్యేవారిలో కొంద‌రికి ర్యాంకులు వ‌స్తాయి. ఇందులో మార్గ‌ద‌ర్శ‌క‌త్వం, కృషి, అదృష్టం అన్నీ క‌ల‌గ‌లిసి ఉంటాయి. ఈ కార్య‌క్ర‌మంలో కృష్ణ‌ప్ర‌దీప్ ట్వంటీఫ‌స్ట్ సెంచ‌రీ ఐఏఎస్ అకాడ‌మీ  డైరెక్ట‌ర్ కృష్ణ‌ప్ర‌దీప్, చీఫ్ మెంటార్ డాక్ట‌ర్ భ‌వానీ శంక‌ర్ ఆధ్య‌ర్యంలో జ‌రిగింది.

Published date : 04 May 2024 07:58PM

Photo Stories