Skip to main content

ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ (1)-2020 పరీక్ష విధానం

రక్షణ రంగంపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ చక్కటి వేదిక. ఇంటర్ విద్యార్హతతో యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావచ్చు.
ఇందులో అర్హత సాధించిన వారు శిక్షణ పొందుతూ.. బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులు చదువు కోవచ్చు. అనంతరం సంబంధిత విభాగంలో ప్రత్యేక శిక్షణ పొంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో ఆఫీసర్ హోదాతో ఉద్యోగంలో చేరొచ్చు. రెండేళ్ల సర్వీసుతోనే పదోన్నతి లభిస్తుంది. 13ఏళ్లు పనిచేస్తే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో వరుసగా కల్నల్, కమాండర్, వింగ్ కమాండర్ స్థాయికి చేరుకోవచ్చు. ఈ పరీక్ష ఏటా రెండు సార్లు జరుగుతుంది.

మొత్తం ఖాళీలు: 418
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) : 370
నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 48
అర్హత:
ఆర్మీ వింగ్ పోస్టులకు ఇంటర్/10+2 ఉత్తీర్ణత. ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ ఆఫ్ ఎన్‌డీఏ, 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారూ అర్హులే. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.
వయసు: 2001 జులై 2-2004 జులై 1 మధ్య జన్మించి ఉండాలి.

శిక్షణలో నెలకు రూ.56,100:
తుది ఎంపికలో అర్హత సాధించిన వారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ-పుణేలో చదువు, శిక్షణ ఇస్తారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి, నేవల్ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఏడాది నుంచి 18 నెలల వరకు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ. 56,100 స్టయిపెండ్ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. అనంతరం వీరు ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ (పైలట్) హోదాతో కెరీర్ ప్రారంభిస్తారు. ఈ మూడు సమాన స్థాయి ఉద్యోగాలు.

ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లుంటాయి.
  • పేపర్-1లో మ్యాథమెటిక్స్ నుంచి 300 మార్కులకు ప్రశ్నలొస్తాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.
  • పేపర్-2లో 600 మార్కులకు జనరల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో ఇంగ్లిష్‌కు 200 మార్కులు, జనరల్ నాలెడ్జ్‌కి 400 మార్కులు కేటాయించారు. జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజిక్స్ నుంచి 100, కెమిస్ట్రీ నుంచి 60, జనరల్ సైన్స్ నుంచి 40, చరిత్ర, స్వాతంత్రోద్యమాలు వంటి విభాగాల నుంచి 80, భూగోళశాస్త్రం నుంచి 80, వర్తమానాంశాల నుంచి 40 మార్కులకు ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. నెగిటివ్ మార్కుల విధానం ఉంది.
  • రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తారు. ఈ విభాగానికి 900 మార్కులు కేటాయించారు. తొలిరోజు ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ర్యాటింగ్(ఓఐఆర్),పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్(పీపీ అండ్ డీటీ) నిర్వహిస్తారు. ఇందులో అర్హులకు మిగిలిన నాలుగు రోజులు ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్, ఆఫీసర్ టాస్కులు, సైకాలజీ టెస్టులుంటాయి. రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అనంతరం వైద్య పరీక్షలు, అభ్యర్థి ప్రాథమ్యాలను పరిగణలోకి తీసుకొని సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం:
 దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తు ఫీజు: రూ.100
 దరఖాస్తులు ప్రారంభం: జనవరి 8, 2020
 దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 28, 2020
 పరీక్ష తేదీ: ఏప్రిల్ 19, 2020
 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in
Published date : 11 Jan 2020 04:39PM

Photo Stories