కెరీర్ గైడెన్స్.. ఇండియన్ రైల్వేస్
భారతీయ రైల్వే వివిధ జోన్లు, కేటగిరీల్లో కలిపి..దాదాపుగా 13వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సిగ్నల్ (గ్రేడ్-2, గ్రేడ్-3), టెలికాం మెయింటెనర్ గ్రేడ్-3, వెరెలైస్ టెలికమ్ మెయింటెనర్, అమెచ్యూర్ వైండర్, ఎలక్ట్రికల్ ట్రై న్ లైటింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ ఎలక్ట్రికల్ ఫిట్టర్, స్విచ్ బోర్డ్ అటెండెంట్ అండ్ ఎయిర్ కంప్రెషన్ డ్రైవర్, క్రేన్ డ్రైవర్, మెషీన్ ఆఫ్ సెట్ ప్రింటింగ్, కంపోజింగ్, బైండింగ్, వేబ్రిడ్జ్, హ్యామర్‌మెన్, పాలిషర్, ట్రిమ్మర్, మౌల్డర్, మెల్టర్, ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, షీట్ మెటర్ వర్కర్, బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్, మేసన్, పెయింటర్, టూల్ ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, టర్నర్, పైప్ ఫిట్టర్, ప్లంబర్, ప్లాంట్ ఆపరేటర్, మోటార్ మెకానిక్, మోటార్ ట్రక్ డ్రై వర్, వ్యాగన్ డ్రైవర్, డ్రై వర్ కమ్ మెకానిక్, ఇంజిన్ డెవలప్‌మెంట్, కంప్రెషర్ డ్రై వర్, ట్రాక్ మెషీన్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇందులో సిగ్నల్ గ్రేడ్ పోస్టులకు బీఎస్సీ (ఫిజిక్స్) లేదా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. మిగతా పోస్టులకు పదో తరగతితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ సర్టిఫికెట్.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా. రాత పరీక్షలో మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఆర్థిమెటిక్, జనరల్ ఇంటలిజెన్స్, రీజనింగ్, టెక్నికల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 31, 2012.
వివరాలకు: https://rrbsecunderabad.nic.in
గతంలో
గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో దాదాపు 16 వేల అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేసింది. గత నెలలో కమర్షియల్ అంపెట్రీస్, ట్రాఫిక్ అంపెట్రీస్, ఈసీఆర్‌సీ, గూడ్స్ గార్డ్స్, జూనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ విభాగాల్లో దాదాపు 10 వేలకు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్‌లో కూడా భారతీయ రైల్వే నుంచి వివిధ రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు వస్తాయని ఆశించొచ్చు. ఈ నేపథ్యంలో భారతీయ ైరె ల్వేలో ఉండే వివిధ ఉద్యోగాలు, వాటి, అర్హత సంబంధిత వివరాలను ఒక సారి పరిశీలిస్తే..
భారతీయ రైల్వేలో గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉద్యోగాలు ఉంటాయి. గెజిటెడ్‌లో గ్రూప్-ఏ, బి, నాన్-గెజిటెడ్ కేడర్‌లో గ్రూప్-సి, డి కేడర్ పోస్టులు ఉంటాయి. గ్రూప్-ఏ పోస్టులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) భర్తీ చేస్తుంది. గ్రూప్-సి నుంచి ప్రమోషన్ల ఆధారంగా గ్రూప్-బి పోస్టుల నియామకం జరుగుతుంది.
నాన్-గెజిటెడ్ కేడర్‌లో గ్రూప్-సి, డి పోస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఆయా జోన్ల వారీగా భర్తీ చేస్తుంది. గ్రూప్-సి, డిలలో రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి. అవి..టెక్నికల్, నాన్-టెక్నికల్. ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ అర్హతలతో ఉండే ఉద్యోగాలన్నీ టెక్నికల్ విభాగానికి చెందినవి. టెన్త్, సాధారణ డిగ్రీ అర్హతలతో నిర్వహించే పరీక్షలన్నీ నాన్ టెక్నికల్ పరిధిలోకి వస్తాయి.
పది నుంచి మెడిసిన్ వరకు
అర్హతల పరంగా చూస్తే.. పదో తరగతి అర్హతతో ట్రై న్ క్లర్క్/గూడ్స్ క్లర్క్/కోచింగ్ క్లర్క్/టికెట్ కలెక్టర్/కమర్షియల్ క్లర్క్‌తోపాటు రైల్వే ప్రొటె క్షన్ ఫోర్స్(ఆర్‌పీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్, గ్రూప్-డి పరిధిలోకి వచ్చే ట్రాక్‌మెన్, గేట్‌కీపర్, హెల్పర్, సఫాయివాలా, ప్యూన్, హమాల్, కళాశీ, పోర్టర్ మొదలైన ఉద్యోగాలు పొందొచ్చు. ఐటీఐ అభ్యర్థులకు అసిస్టెంట్ లోకోపైలట్, కొన్ని రకాల గ్రూప్-డి పోస్టులు; డిప్లొమా పూర్తి చేస్తే జూనియర్ ఇంజనీర్; డిగ్రీ ఉత్తీర్ణులకు రైల్వే ప్రొటె క్షన్ ఫోర్స్(ఆర్‌పీఎస్‌ఎఫ్) ఎస్‌ఐ, గూడ్స్ గార్డ్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, జూనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్; ఇంజనీరింగ్ పూర్తిచేస్తే సెక్షన్ ఇంజనీర్...ఇలా అకడెమిక్ బ్యాగ్రౌండ్ ఆధారంగా వివిధ రకాల ఉద్యోగాలను ఆర్‌ఆర్‌బీ కల్పిస్తుంది. మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సు, ఫిజియోథెరపిస్ట్, ఫార్మాసిస్ట్, పారామెడికల్ విభాగానికి సంబంధించిన వివిధ రకాల పోస్టులు, టీచర్, లా అసిస్టెంట్ తదితర పోస్టులు కూడా ఉంటాయి. మెడికల్/పారామెడికల్/టీచర్ పోస్టులకు ఆయా విభాగాల్లో నిర్దేశించిన విధంగా డిగ్రీ/డిప్లొమా ఉండాలి.
టెక్నికల్ ఉద్యోగాలు: డీజిల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో పైలట్, స్కిల్డ్ ఆర్టిజన్, సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, అప్రెంటీస్, ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్, ఎలక్ట్రీషియన్, మెటిరీయల్ సూపరింటెండెంట్ తదితరాలు.
నాన్ టెక్నికల్ ఉద్యోగాలు: టికెట్ కలెక్టర్, గూడ్స్ గార్డ్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ సూపర్‌వైజర్, రిజర్వేషన్ కమ్ ఎంక్వైరీ క్లర్క్, ట్రై న్ క్లర్క్, రాజ భాష అధికారి, స్టాటిస్టికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ క్లర్క్/అకౌంట్స్ క్లర్క్, కోచింగ్ క్లర్క్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ తదితరాలు.
రిక్రూట్‌మెంట్ విధానం
రిక్రూట్‌మెంట్ పద్ధతి ఉద్యోగాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా రాత పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, వైవా వంటి అంశాలు ఎంపిక పక్రియలో ఉంటాయి. రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్/జనరల్ ఇంటలిజెన్స్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఉద్యోగాలకు పేర్కొన్న అర్హతలాధారంగా టెక్నికల్/ప్రొఫెషనల్ సబ్జెక్ట్ సంబంధిత అంశాలపై కూడా ప్రశ్నలు వస్తాయి. ఉద్యోగాలకు పేర్కొన్న అర్హతలాధారంగా ఎగ్జామ్ ప్యాట్రన్/ప్రశ్నల స్థాయి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమల్లో ఉంది. కేటగిరీల వారీగా ఎంపిక ప్రక్రియను పరిశీలిస్తే..
ప్రొబేషనరీ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, అసిస్టెంట్ లోకోపైలట్ తరహా సేఫ్టీ కేటగిరీ పోస్టులకు రాత పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్ అనే రెండు దశలతో కూడిన ఎంపిక విధానం ఉంటుంది. రెండింటిలో మెరిట్ సాధించిన వారికే నియామకం ఖరారవుతుంది.
క్లర్క్స్, ట్రాఫిక్ అండ్ కమర్షియల్ అప్రెంటీస్, జూనియర్ అకౌంట్స్, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ అసిస్టెంట్స్ వంటి నాన్ టెక్నికల్ కేటగిరీ పోస్టులకు కూడా రెండంచెల రాత పరీక్ష ఉంటుంది. రెండో దశలో సాధించిన మెరిట్ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు. క్లరికల్ కేడర్‌కు మాత్రం టైపింగ్ టెస్ట్‌లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
- సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్స్, పారామెడికల్ వంటి టెక్నికల్ కేడర్ పోస్టులకు ఒకే సారి నిర్వహించే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
- రాజ భాష అసిస్టెంట్స్ పోస్టులకు రాత పరీక్ష, తర్వాత నిర్వహించే క్వాలిఫైయింగ్ ట్రాన్స్‌లేషన్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
- జూనియర్ స్టెనోగ్రాఫర్స్ పోస్టులకు రాత పరీక్ష, షార్ట్‌హ్యాండ్ టెస్ట్ అనే రెండంచెల పద్ధతిలో ఎంపిక ఉంటుంది.
- టీచర్లు, లా అసిస్టెంట్స్, ఫిజియోథెరపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్స్‌కు రాత పరీక్ష తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ/కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష, ఫిజికల్ పరీక్ష, వైవా వాక్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
గ్రూప్-ఏ పోస్టులు
గ్రూప్-ఏ పోస్టులను యూపీఎస్‌సీ భర్తీ చేస్తుంది. ఇందుకోసం సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ (ఎస్‌సీఆర్‌ఏ) పరీక్షలు రాయాలి. యూపీఎస్‌సీ భర్తీ చేసే రైల్వే ఉద్యోగాలు..
స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ (ఎస్‌సీఆర్‌ఏ):
ఈ పరీక్షతో ఉచితంగా మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కోర్సు పూర్తయిన వెంటనే రైల్వేలో క్లాస్-1 హోదాలో ఉద్యోగం లభిస్తుంది. కోర్సులో భాగంగా ఏడాది పాటు లండన్‌లో శిక్షణ నిర్వహిస్తారు. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బిట్) మెస్రా, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందిస్తుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) ఉత్తీర్ణత. రాత పరీక్షలో: మొత్తం 600 మార్కులకు 3 పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ ఎబిలిటీ టెస్ట్, పేపర్-2 ఫిజికల్ సైన్స్, పేపర్-3 మ్యాథ్స్. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేసే గ్రూప్-ఎ పోస్టులు:
- ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్)
- ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్‌టీఎస్)
- ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ (ఐఆర్‌పీఎస్)
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్
ప్రకటన: ఏటా డిసెంబర్/జనవరిలో
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి: 21-30 ఏళ్లు.
ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూల ద్వారా.
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేసే సర్వీస్‌లు
కేటగిరీ-1:
ఇండియన్ రై ల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (సివిల్)
ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (సివిల్)
కేటగిరీ-2:
- ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్
- ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (మెకానికల్)
కేటగిరీ-3:
- ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్
- ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (ఎలక్ట్రికల్)
కేటగిరీ-4:
- ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్
- ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (టెలి కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు)
అర్హత: ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ వయోపరిమితి: కనిష్టంగా 21, గరిష్టంగా 30 ఏళ్లు.
మెడికల్ ఆఫీసర్
మెడికల్ ఆఫీసర్ (అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ రైల్వేస్) పోస్టుల భర్తీ కూడా యూపీఎస్సీ నిర్వహించే కంబైండ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా జరుగుతుంది. నోటిఫికేషన్ ఆగస్ట్‌లో వస్తుంది. ఎగ్జామ్‌ను జనవరిలో నిర్వహిస్తారు. వయసు: 32 ఏళ్లు.
వెబ్‌సైట్: www.upsc.gov.in
మాతృ భాషలో కూడా:
ప్రస్తుతం రైల్వే శాఖ గతంలో మాదిరిగా కాకుండా సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జోన్ల వారీగా ఖాళీలను గుర్తించి ఆయా జోన్ల పరిధిలోని అభ్యర్థులకు ఆ ఖాళీలను కేటాయిస్తోంది. అంతేకాకుండా ఆ జోన్‌కు చెందిన అధికార భాషలో కూడా పరీక్ష రాసే వీలు కల్పిస్తోంది (గతంలో రాత పరీక్షలో ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఉండేది). అంటే మన రాష్ట్ర అభ్యర్థులు తెలుగు భాషలో పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. మన రాష్ట్ర పరిధిలోకి సికింద్రాబాద్ జోన్ (సౌత్ సెంట్రల్ జోన్), ఈస్ట్‌కోస్ట్ జోన్లు వస్తాయి . విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభ్యర్థులు ఈస్ట్‌కోస్ట్ జోన్-ఆర్.ఆర్.బి.-భువనేశ్వర్ కిందకు వస్తారు. మిగిలిన జిల్లాల అభ్యర్థుల పరిధి సికింద్రాబాద్ జోన్ . అయితే అభ్యర్థులు తాము ఏ భాషలో పరీక్ష రాయదలచుకున్నారో ఆ విషయాన్ని దరఖాస్తు చేసే సమయంలోనే స్పష్టం చేయాలి. ఈ విధానం వల్ల ఇంగ్లిష్, హిందీ విషయంలో ఇబ్బంది నెదుర్కొనే గ్రామీణ అభ్యర్థులకు ఊరట లభిస్తోంది.
ఆర్‌ఆర్‌బీ విడుదల చేసే ఉద్యోగాల సమాచారాన్ని ఎంప్లాయిమెంట్ న్యూస్ లేదా సంబంధిత జోనల్ వెబ్‌సైట్స్ లేదా యూపీఎస్సీ వెబ్‌సైట్ లేదా సాక్షిఎడ్యుకేషన్ డాట్‌కామ్ నుంచి పొందొచ్చు.
ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్స్:
Ahmedabad www.rrbahmedabad.gov.in
Ajmer www.rrbajmer.org
Allahabad www.rrbald.gov.in
Bangalore www.rrbbnc.gov.in
Bilaspur www.rrbbilaspur.gov.in
Bhopal www.rrbbpl.nic.in
Bhubaneswar www.rrbbbs.gov.in
Chandigarh www.rrbcdg.org
Chennai www.rrbchennai.net
Gorakhpur www.rrbgkp.gov.in
Guwahati www.rrbguwahati.gov.in
Jammu & Srinagar www.rrbjammu.nic.in
Kolkata www.rrbkolkata.org
Malda www.rrbmalda.gov.in
Mumbai www.rrbmumbai.gov.in
Muzaffarpur www.rrbpatna.gov.in
Patna Ranchi www.rrbranchi.org
Secunderabad www.rrbsec.org
Thiruvananthapuram www.rrbthiruvananthapuram.net