Skip to main content

కొలువుల రైలు... వస్తోందండీ..!

భారతీయ రైల్వే ఉద్యోగాల కూత మోగించనుంది. గత కొంతకాలంగా వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్న రైల్వేలు.. రానున్న రోజుల్లో భారీగా నియామకాలు చేపట్టనుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో 1.31 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ప్రకటించారు. భారీ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో.. అసలు ఎలాంటి ఉద్యోగాలకు రైల్వేల నుంచి ప్రకటన రాబోతోంది.. ఇండియన్ రైల్వేలో ఉండే పోస్టులు.. ఆయా జాబ్స్‌కు అర్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం...

భారతీయ రైల్వే.. దేశ రవాణా వ్యవస్థకు పెద్దన్న. ఉపాధి పరంగా కూడా ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థ. ప్రభుత్వ లెక్కల ప్రకారం - రైల్వేలో మంజూరైన పోస్టుల సంఖ్య 15,06,598. ఇందులో 12,23,622 మంది ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తుంటే.. 1,51,548 ఖాళీల భర్తీకి సంబంధించిన ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. త్వరలోనే ఈ పోస్టులు భర్తీకానున్నాయి. అలాగే, ప్రస్తుతం 1,31,428 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి లేదా మార్చిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని చెబుతున్నారు.

గ్రూపు-సి, డి పోస్టులే !
రైల్వేలో ఉన్నత ఉద్యోగాలైన గ్రూపు-ఏ, పైస్థాయి పోస్టుల భర్తీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చేపడుతుంది. గ్రూపు-బి పోస్టులను పదోన్నతుల ద్వారానే ఎక్కువగా భర్తీచేసే అవకాశం ఉంటుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)లు, ఆర్‌ఆర్‌సీలు చేపడుతున్న పోస్టులన్నీ గ్రూపు-సి, డి పోస్టులే. రాబోయే నోటిఫికేషన్ల ద్వారా గ్రూపు-సి, డి కేటగిరీలకు చెందిన టెక్నిషియన్స్; వర్క్‌షాప్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు, క్యారేజ్ అండ్ వేగన్, ట్రాక్‌మెన్, టికెట్ కలెక్టర్, ఏఎస్‌ఎం, కమర్షియల్ క్లర్క్, రిజర్వేషన్ క్లర్క్ మొదలైన పోస్టుల భర్తీ ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

2021 నాటికి మరో లక్ష ఉద్యోగాలు..
ఇప్పటికే ఖాళీగా ఉన్న 1.31 లక్షల ఉద్యోగాలకు మరో లక్ష పోస్టులు కలుస్తాయని రైల్వే శాఖ చెబుతోంది. ఎలాగంటే... 2019-2020లో 53 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. అలానే 2020-2021లో మరో 46 వేల మంది కూడా రిటైర్ అవ్వనున్నారు. మొత్తంగా ఈ 99 వేల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని రైల్వే మంత్రి చెబుతున్నారు. అంటే.. రాబోయే రోజుల్లో దాదాపు రెండు లక్షలకు పైగా రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని అంచనా.

భర్తీలో ఆలస్యం..
రైల్వే బోర్డులు చేపట్టే నియామకాలు పూర్తికావడానికి ఏళ్ల కొద్దీ పడుతుందనే విమర్శలు ఉన్నాయి. ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నా.. తుది ఫలితాలు వెలువడే సరికి చాలా సమయం పడుతోంది. గతేడాది విడుదల చేసిన ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ నేటికి పూర్తి కాలేదు. ఆరు నెలల్లోనే ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. అమల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. ఎంపిక ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండటం వల్ల అభ్యర్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

భద్రతా ఉద్యోగాలే ఎక్కువ :
  • అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేలో భద్రత పెద్ద సవాలు. చిన్న భద్రతా లోపాల వల్ల భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఘటనలు అనేకం. అందుకే భద్రతా సిబ్బందిని నియమించుకునే దిశగా రైల్వేశాఖ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువగా సేఫ్టీ సంబంధిత ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది. వీటిలో గార్డులు, గ్యాంగ్‌మెన్, డ్రైవర్, ఇతర టెక్నికల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.
  • ఇప్పటికే అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన రైల్వే.. మరోసారి ఈ రెండు రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వనుంది.
అర్హతలు :
  • అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు పదోతరగతితోపాటు ఐటీఐ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఉన్నత స్థాయి కోర్సులు పూర్తిచేసిన వారు కూడా అర్హులు.
  • టెక్నీషియన్ కేటగిరీలోనూ పలు ఉద్యోగ ఖాళీలను రైల్వే శాఖ భర్తీ చేస్తుంటుంది. వీటికి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. వీటికి ఆయా ఉద్యోగం ఆధారంగా పదోతరగతితోపాటు ఐటీఐ ఉండాలి. లేదా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత అవసరం. లేదా డిప్లొమా ఉండాలి. కొన్ని టెక్నీషియన్ పోస్టులకు పదో తరగతితోపాటు ఆయా విభాగాల్లో ఐటీఐ పూర్తిచేసుండాలి.
పరీక్ష : అసిస్టెంట్ లోకో పైలట్,టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడి రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. దేశంలోని ఆర్‌ఆర్‌బీలన్నీ ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తాయి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న బోర్డు పరిధిలో పరీక్ష రాయొచ్చు. పరీక్షలో 100 నుంచి 120 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్అండ్ టెక్నికల్ ఎబిలిటీకి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష విధానంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

ఎంపిక :
అసిస్టెంట్ లోకో పైలట్‌కు మొత్తం మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష.. తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్.. చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుపుతారు.

ఇంజనీరింగ్ పోస్టులు :
రైల్వే శాఖ ఇటీవల గ్రూపు సి కేటగిరి పోస్టులైన.. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. వీటికి దరఖాస్తు ఫిబ్రవరి 7 వరకు చేసుకోవచ్చు. రాబోయే నోటిఫికేషనల్లోనూ ఇంజనీరింగ్ సంబంధిత ఉద్యోగాలు ఉండే అవకాశముంది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత బ్రాంచీలో ఇంజనీరింగ్ డిప్లొమా అవసరం. పోస్టును బట్టి అర్హతలు వేర్వేరుగా ఉండే అవకాశముంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ టెస్టులో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉంటుంది. గూపు-సి పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు.

డిగ్రీ అభ్యర్థులకు..
డిగ్రీ ఉత్తీర్ణతతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) ఉద్యోగాలకు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ అప్రెంటీస్, ట్రాఫిక్ అప్రెంటీస్, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, గూడ్స్‌గార్డ్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్/టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్, సీనియర్ టైం కీపర్... లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://rrbsecunderabad.nic.in

గ్రూప్-డి పోస్టులు :
రైల్వేలో... పదోతరగతి/ఐటీఐ/తత్సమాన ఉత్తీర్ణతతో కొన్ని ఉద్యోగ ప్రకటనలు వెలువడుతుంటాయి. వాటిలో ప్యూన్, హెల్పర్, సఫాయివాలా, గ్యాంగ్‌మెన్ మొదలైన పోస్టులు ఉంటాయి. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాబోయే నోటిఫికేషన్లలో ఈ పోస్టుల ఖాళీలే ఎక్కువగా ఉండే అవకాశముంది. వీటితోపాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్)లోనూ ఖాళీలు ఉండొచ్చని అంచనా. ఈ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత అర్హతగా ఉంటుంది.
Published date : 06 Feb 2019 04:49PM

Photo Stories