Skip to main content

ఉన్నత కెరీర్‌కు టికెట్.. రైల్వే ఉద్యోగాలు

 రైల్వేల్లో సాధారణంగా టెక్నికల్, నాన్‌టెక్నికల్ కేడర్ ఉద్యోగాలు ఉంటాయి. వీటిని రైల్వే శాఖ సొంతంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు/సెల్ (ఆర్‌ఆర్‌బీ/సీ) ద్వారా భర్తీ చేస్తుంది. టెక్నికల్ విభాగంలో.. డీజిల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో పైలట్, స్కిల్డ్ ఆర్టిజన్, సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. నాన్ టెక్నికల్ పరిధిలోకి వచ్చే ఉద్యోగాలు..టికెట్ కలెక్టర్, గూడ్స్ గార్డ్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ సూపర్‌వైజర్, రిజర్వేషన్ కం ఎంక్వైరీ క్లర్క్, ట్రైన్ క్లర్క్ తదితరాలు. ఇవి కాకుండా ఉండే గ్రూప్-ఏ పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేస్తుంది. ఇందుకోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ (ఎస్‌సీఆర్‌ఏ) పరీక్షలు నిర్వహిస్తుంది.

యూపీఎస్సీ ద్వారా:
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేసే గ్రూప్-ఏ పోస్టులు: ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్); ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్‌టీఎస్); ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ (ఐఆర్‌పీఎస్); అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ -రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్: ఈ పరీక్ష ద్వారా నాలుగు కేటగిరీ పోస్టులు భర్తీ చేస్తారు. ఇవన్నీ గ్రూప్-ఏ సర్వీస్‌లే. అవి.. కేటగిరీ-1.. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (సివిల్); ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (సివిల్) కేటగిరీ-2.. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్; ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (మెకానికల్). కేటగిరీ-3.. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్; ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (ఎలక్ట్రికల్). కేటగిరీ-4.. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్; ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (టెలి కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు). కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్) ద్వారా డాక్టర్ పోస్టులను కూడా యూపీఎస్సీ భర్తీ చేస్తుంది. అంతేకాకుండా స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ (ఎస్‌సీఆర్‌ఏ) ద్వారా క్లాస్-1 హోదా ఉండే మెకానికల్ ఇంజనీర్ పోస్టుల నియామకం కూడా చేపడుతుంది.

ఇంజనీరింగ్ అర్హతతో:
రైల్వే నేరుగా భర్తీ చేసే పోస్టుల్లో పెద్ద ఉద్యోగం సెక్షన్ ఇంజనీర్. భర్తీ చేసే పోస్టులు: సెక్షన్ ఇంజనీర్-పీవే/ వర్క్స్/ బ్రిడ్జ్ /సివిల్/కెమికల్ /ఆటోమొబైల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/వెల్డర్/ మిల్‌వ్రైట్/ లోకో/ డీజిల్ / ఫిట్టర్. వయోపరిమితి: 20-35 ఏళ్లు. అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా (సింగిల్ స్టేజ్). ఇందులో టెక్నికల్, నాన్ టెక్నికల్ అంశాల్లో ప్రశ్నలడుగుతారు. టెక్నికల్ నుంచి 70 శాతం, నాన్ టెక్నికల్ నుంచి 30 శాతం దాకా ప్రశ్నలు రావొచ్చు.

డిప్లొమా:
డిప్లొమా అర్హతతో ఉండే ఉద్యోగాలు: జూనియర్ ఇంజనీర్ విభాగంలోని వివిధ రకాల పోస్టులన్నీ డిప్లొమా (పాలిటెక్నిక్) అర్హతతో భర్తీ చేస్తారు. ఐటీఐ అర్హతతో ఉన్న ఉద్యోగాలకు డిప్లొమా అభ్యర్థులు కూడా అర్హులే. వయోపరిమితి: 18-33 ఏళ్లు.

రాత పరీక్షలు ఇలా:
వివిధ అర్హతలతో ఆర్‌ఆర్‌బీ రిక్రూట్ చేసుకునే పోస్టుల కోసం నిర్వహించే రాత పరీక్షలో..సాధారణంగా జనరల్ ఇంటెలిజెన్స్, అర్థమెటిక్-రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్ అంశాలు ఉంటాయి. పోస్టు, అర్హతను బట్టి ప్రశ్నల క్లిష్టత స్థాయిలో తేడాలు ఉంటాయి. డిప్లొమా/ఐటీఐ/ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ అర్హతతో ఉద్యోగాలకు సంబంధిత అంశంలో టెక్నికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆయా పోస్టులను బట్టి అడిగే ప్రశ్నలు, విభాగాలు, కేటాయించిన మార్కుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. నిర్దేశించిన పోస్టులకు ఫిజికల్, మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి.

జనరల్ ఇంగ్లిష్:
ఈ విభాగంలో సినానిమ్స్, యాంటోనిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, కామన్ ఎర్రర్స్, కాంప్రెహెన్షన్ ఆఫ్ ప్యాసేజ్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూషన్, స్పెల్లింగ్ ఎర్రర్స్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించాలంటే.. పదాలపై పట్టు సాధించాలి.


అర్థమెటిక్:
ఈ విభాగంలోని ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ఇందులో రాణించాలంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, కసాగు, గసాభా, శాతాలు, లాభ-నష్టాలు, సగటు, కాలం-పని, కాలం-వేగం-దూరం, నిష్పత్తులు, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, వైశాల్యం-చుట్టుకొలత, క్యాలెండర్, గడియారం సంబంధిత అంశాలపై పట్టు సాధించాలి.

రీజనింగ్ ఎబిలిటీ/జనరల్ ఇంటెలిజెన్స్:
అభ్యర్థిలోని విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమిది. రీజనింగ్ విభాగంలో.. సిరీస్ (లెటర్/నంబర్/సింబల్), ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, పజిల్ టెస్ట్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్‌మెంట్, లాజికల్ డయాగ్రామ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, ఫైండింగ్-మిస్సింగ్ నంబర్స్, అర్థమెటికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ అవేర్‌నెస్/కరెంట్ ఈవెంట్స్:
ఈ విభాగంలో రాణించాలంటే.. చరిత్ర, రాజ్యాంగం, స్వాతంత్య్రోద్యమం, ఎకనానమీ, జనరల్ సైన్స్, జాగ్రఫీ, యుద్ధాలు, ఒప్పందాలు, ఉద్యమాలు సంబంధిత తేదీలు, ప్రదేశాలు తదితరాలతోపాటు జాతీయ చిహ్నాలు, అంతర్జాతీయ సరిహద్దులు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు వంటి స్టాక్ జీకే అంశాలు, పరీక్ష జరిగే తేదీకి ముందు సంవత్సర కాలంలో జరిగిన ప్రధాన అంశాలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తులు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి.

రిఫరెన్స్ బుక్స్:
  • అర్థమెటిక్ అండ్ రీజనింగ్: ఆర్.ఎస్. అగర్వాల్
  • ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్
  • జనరల్ అవేర్‌నెస్: మనోరమ ఇయర్ బుక్, అరిహంత్ పబ్లికేషన్స్
  • ఎన్‌సీఈఆర్‌టీ 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్ పుస్తకాలు.
  • కరెంట్ ఈవెంట్స్:ఏవైనా రెండు తెలుగు/ఇంగ్లిష్ దినపత్రికలు
  • టెక్నికల్ సబ్జెక్ట్‌ల కోసం: ఆయా తరగతుల పుస్తకాలు
తెలుగులో కూడా:
ప్రస్తుతం రైల్వే శాఖ సెంట్రల్ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జోన్ల వారీగా ఖాళీలను గుర్తించి ఆయా జోన్ల పరిధిలోని అభ్యర్థులకు ఆ ఖాళీలను కేటాయిస్తోంది. అంతేకాక ఆ జోన్‌కు చెందిన అధికార భాషలో కూడా పరీక్ష రాసే వీలు కల్పిస్తోంది. (గతంలో రాత పరీక్షలో ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే ఉండేది). అంటే మన రాష్ట్ర అభ్యర్థులు తెలుగు భాషలో పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. అయితే అభ్యర్థులు తాము ఏ భాషలో పరీక్ష రాయదలచుకున్నారో ఆ విషయాన్ని దరఖాస్తులో స్పష్టం చేయాలి. ఈ విధానం వల్ల ఇంగ్లిష్, హిందీ విషయంలో ఇబ్బందినెదుర్కొనే గ్రామీణ అభ్యర్థులకు ఊరట లభిస్తోంది.

మన రాష్ట్ర విద్యార్థులు:
మన రాష్ట్ర విద్యార్థులు రెండు రైల్వే జోన్ల పరిధిలోకి వస్తారు. అవి.. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్. ఈస్ట్‌కోస్ట్ జోన్ పరిధిలోకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వస్తాయి. మిగతా జిల్లాలన్నీ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉంటాయి. రైల్వే ఉద్యోగాల ప్రకటనల కోసం ఠీఠీఠీ.టటఛిఛ.జౌఠి.జీ, లేదా ఎంప్లాయిమెంట్ న్యూస్ చూడొచ్చు.

నాలుగు విభాగాలు:
రైల్వే ఉద్యోగాల్లో గ్రూప్- ఏ, బీ,సీ,డీ అనే నాలుగు విభాగాలున్నాయి. గ్రూప్-ఏ, బీ ఉద్యోగులు గెజిటెడ్ హోదాలో కొస్తారు. గ్రూప్ సీ కిందకు సూపర్ వైజరీ క్యాడర్/ క్లరికల్ కం టైపిస్టు ఉద్యోగాలు వస్తాయి. గ్రూప్ డీలో రైల్వే గ్యాంగ్‌మెన్లు, గేట్‌మెన్, కలాసీ ఉద్యోగులుంటారు. గ్రూప్ సీ, డీ విభాగాల ఉద్యోగులు సీనియారిటీ, డిపార్ట్‌మెంటల్ పరీక్షల ద్వారా.. జనరల్ మేనేజర్, డీఆర్‌ఎం, సీనియర్ కమర్షియల్ మేనేజర్, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఆఫీసర్స్(డిప్యూటీ హెచ్‌వోడీ) స్థాయికి పదేళ్లలో ఎదగొచ్చు. రైల్వేలో ఏ, బీ క్యాడర్‌స్థాయి ఉద్యోగాల్లో 70 శాతం పోస్టులను సీనియారిటీ ప్రాతిపదికన గ్రూప్ సీ, డీ విభాగాల్లోని ఉద్యోగులను పదోన్నతి ద్వారా తీసుకుంటారు. కేవలం 30 శాతం మందినే నేరుగా భర్తీచేస్తారు.

పదోన్నతుల ప్రక్రియ:
గ్రూప్ సీ పరిధిలోకి వచ్చే అన్ని ఉద్యోగాలూ ఆర్‌ఆర్‌బీ భర్తీచేస్తుంది. 40 శాతం వరకు గ్రూప్ డీ ఉద్యోగులను పదోన్నతి ద్వారా గ్రూప్-సీలోకి ఎంపిక చేస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి కమర్షియల్ విభాగంలో చేరితే సీనియారిటీ, ప్రతిభ ఆధారంగా అత్యున్నత విభాగమైన చీఫ్ కమర్షియల్ మేనేజర్(సీసీఎం) స్థాయికి చేరుకోవచ్చు. గేట్‌మెన్ సైతం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, స్టేషన్ మాస్టర్, అసిస్టెంట్ ఆపరేటింగ్ మేనేజర్ (ఏవోఎం) వరకు చేరుకోవచ్చు.

సౌకర్యాలు:
కుటుంబ సమేతంగా ఏడాదికి మూడుసార్లు దేశంలో ఎక్కడికైనా ఉచితంగా రైలు ప్రయాణం చేయొచ్చు. దసరా కానుకగా సుమారు 75 రోజుల వేతనాన్ని బోనస్‌గా పొందొచ్చు (ఉన్నతోద్యోగులకు వర్తించదు). ప్రత్యేక క్వార్టర్లు, రైల్వే స్కూళ్లు, రైల్వే ఆసుపత్రుల్లో ఉచిత సేవలు పొందొచ్చు.

అర్హత పోస్టులు
పదో తరగతి కమర్షియల్ క్లర్క్, టికెట్ ఎగ్జామినర్ (టికెట్ కలెక్టర్), ట్రైన్స్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్, ఆర్‌పీఎఫ్ కాని స్టేబుల్, ల్యాబ్ అసిస్టెంట్ (పదో తరగతి, ఎంఎల్‌టీ), గ్యాంగ్‌మెన్, గేట్‌మెన్, కలాసీ, హెల్పర్, సఫాయివాలా, ప్యూన్, హమాల్, పోర్టర్ వంటి గ్రూప్-డీ పోస్టులు. (ఐటీఐ ఉత్తీర్ణులు కూడా అర్హులే).
ఐటీఐ అసిస్టెంట్ లోకో పైలట్, స్కిల్డ్ ఆర్టిజన్, డీజిల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్
ఇంటర్ (ఎంపీసీ) క్లాస్-1 హోదా ఉండే మెకానికల్ ఇంజనీర్ (యూపీఎస్సీ- స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ ద్వారా.)
ఇంటర్ (సెన్సైస్/ ఏదైనా) ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, కార్డియాలజీ టెక్నీషి యన్, ఫిజియోథెరపిస్ట్, ఫీల్డ్ వర్కర్ ల్యాబ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్ వంటి పారామెడికల్ పోస్టులు (వీటికి సంబంధిత విభాగంలో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి)
డిప్లొమా జూనియర్ ఇంజనీర్, పే-వే సూపర్‌వైజర్ పోస్టులు
డిగ్రీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, కమర్షియల్ అప్రెంటీస్, ట్రాఫిక్ అప్రెంటీస్, ఎంక్వైరీ కం రిజర్వేషన్ క్లర్క్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, ఆర్‌పీఎఫ్‌లో ఎస్‌ఐ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఎడ్యుకేషన్‌లో డిప్లొమా /డిగ్రీ), స్టాఫ్ నర్స్ (బీఎస్సీ నర్సింగ్), ల్యాబ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, డైటీషియన్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ వంటి పారామెడికల్ పోస్టులు
ఇంజనీరింగ్ సెక్షన్ ఇంజనీర్-పీవే/ వర్క్స్/ బ్రిడ్జ్ /సివిల్/కెమికల్ /ఆటోమొబైల్/ మెకానికల్/ఎలక్ట్రానిక్స్/వెల్డర్/ మిల్‌వ్రైట్/ లోకో/ డీజిల్, మెటీరియల్ సూపరింటెండెంట్, తదితరాలు.
పీజీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్ (ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/డిగ్రీ), ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్, ల్యాబ్ సూపరింటెండెంట్ (క్లినికల్ సైకాలజిస్ట్), తదితరాలు.

తాజా నోటిఫికేషన్లు

ఉత్తర మధ్య రైల్వే:
పోస్టుల సంఖ్య:
2,175
భర్తీ చేసే పోస్టులు: హెల్పర్, ట్రాక్‌మెన్, పాయింట్స్‌మెన్ తదితరాలు.
అర్హత: పదో తరగతి/తత్సమానం.
గడువు తేదీ: సెప్టెంబర్ 2, 2013
వివరాలకు: rrcald.org

తూర్పు రైల్వే:
పోస్టుల సంఖ్య: 1,608 (ఎక్స్‌సర్వీస్ మెన్ కోటా)
భర్తీ చేసే పోస్టులు: ట్రాక్‌మెన్, హెల్పర్, పోర్టర్, గేట్‌మెన్, గేట్‌కీపర్, తదితరాలు.
అర్హత: పదో తరగతి/తత్సమానం. ఆర్మీలో 15 సంవత్సరాల సర్వీస్
గడువు తేదీ: ఆగస్ట్ 16, 2013.
వివరాలకు: www.rrcer.com

దక్షిణ తూర్పు రైల్వే:
పోస్టుల సంఖ్య: 785 (ఎక్స్‌సర్వీస్ మెన్ కోటా)
భర్తీ చేసే పోస్టులు: హెల్పర్, ట్రాక్‌మెన్, పాయింట్స్‌మెన్.
అర్హత: పదో తరగతి/తత్సమానం. ఆర్మీలో 15 సంవత్సరాల సర్వీస్
గడువు తేదీ: ఆగస్ట్ 26, 2013
వివరాలకు: www.rrcser.in

మధ్య రైల్వే:
పోస్టుల సంఖ్య:
905
భర్తీ చేసే పోస్టులు: హెల్పర్, ట్రాక్‌మెన్, పాయింట్స్‌మెన్ తదితరాలు.
అర్హత: పదో తరగతి/తత్సమానం. ఆర్మీలో 15 సంవత్సరాల సర్వీస్
గడువు తేదీ: ఆగస్ట్ 26, 2013
వివరాలకు: www.rrccr.com
Published date : 15 Aug 2013 04:51PM

Photo Stories