జాతికి జీవన రేఖ..యువత భవితకు వెలుగు రేఖ..
Sakshi Education
- రైల్వే నుంచి ఆరువేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే నియామక బోర్డుల నుంచి సెప్టెంబర్ 20న కేంద్రీకృత నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సుదీర్ఘ సమయం తర్వాత ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులకు వచ్చిన సువర్ణ అవకాశమిది. ఆకర్షణీయ వేతనాలు, భత్యాలతో సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు మంచి తరుణమిది.
అర్హత:
- సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (ఎస్‌ఎస్‌ఈ) గ్రూపు ఉద్యోగాలకు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌స, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర బ్రాంచ్‌ల్లో బీఈ లేదా బీటెక్.
- జూనియర్ ఇంజనీర్ (జేఈ) గ్రూపు ఉద్యోగాలకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌స, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర బ్రాంచ్‌ల్లో డిప్లొమా ఉండాలి.
- కొన్ని పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కాకుండా ఇతర కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. ఉదాహరణకు జూనియర్ ఇంజనీర్ (ఐటీ) పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి పీజీడీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)/బీసీఏ/డీవోఈఏసీసీ-ఎ లెవెల్ సర్టిఫికెట్ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు.
- కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి మెటలర్జీ/కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులతో పాటు ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా అప్లయిడ్ కెమిస్ట్రీ పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
- మొత్తం 77 కేటగిరీల పోస్టులున్నాయి. వీటిలో ఉద్యోగం స్వభావాన్ని బట్టి ప్రత్యేక బ్రాంచ్‌లో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా/ ఇతర అర్హతను నిర్దేశించారు. దరఖాస్తు చేసుకునే ముందు వీటిని పరిశీలించాలి.
వయో పరిమితి: - ఎస్‌ఎస్‌ఈ ఉద్యోగాలకు 2015, జనవరి 1 నాటికి 20-35 ఏళ్ల వయసుండాలి.
- జేఈ ఉద్యోగాలకు 2015, జనవరి 1 నాటికి 18-33 ఏళ్ల వయసుండాలి.
- ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 13 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 15 ఏళ్లు, ఇతర పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
రాత పరీక్ష విధానం:
| విభాగం | ప్రశ్నలు |
1. | టెక్నికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ | 90 |
2. | జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, |
|
| జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ | 60 |
| మొత్తం | 150 |
- ప్రశ్నపత్రం బహుళైచ్చికాలతో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
- రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. నెగిటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
- ఇంగ్లిష్/హిందీ/ఉర్దూ లేదంటే స్థానిక భాషను మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 19, 2014.
- జూనియర్ ఇంజనీర్ గ్రూపు పరీక్ష తేదీ: డిసెంబర్ 14, 2014
- సీనియర్ ఇంజనీర్ గ్రూపు పరీక్ష తేదీ: డిసెంబర్ 21, 2014
- పరీక్ష ఫీజు: అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100. మిగిలిన వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించొచ్చు.
- ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్‌ఆర్‌బీకి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌ఎస్‌ఈ, జేఈలకు రెండింటికీ అర్హత ఉంటే విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.
- పరీక్ష కేంద్రాలు: ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌కు దరఖాస్తు చేసుకుంటే సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో పరీక్ష రాయొచ్చు.
- వెబ్‌సైట్: rrbsecunderabad.nic.in
90 మార్కుల విభాగం:
జనరల్ సైన్స్: సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గ్రూపు పరీక్షలో జనరల్ సైన్స్‌కు సంబంధించి ఇంటర్ స్థాయి ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకుంటే ప్రశ్నలకు తేలిగ్గానే సమాధానాలు గుర్తించొచ్చు. జేఈ పరీక్షకు అయితే పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి.
టెక్నికల్ ఎబిలిటీ: ఎస్‌ఎస్‌ఈ ప్రశ్నపత్రంలో సివిల్; మెకానికల్; ఎలక్ట్రికల్; ఎలక్ట్రానిక్స్; కంప్యూటర్స్; ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్; ఇన్‌స్ట్రుమెంటేషన్, మెజర్‌మెంట్, ఇంజనీరింగ్ డ్రాయింగ్/గ్రాఫిక్స్‌పై ప్రశ్నలుంటాయి. జేఈకి కూడా ఇవే అంశాలపై ప్రశ్నలుంటాయి కానీ కాస్త తక్కువ స్థాయిలో ఉంటాయి.
- ఉద్యోగ సాధనకు మంచి స్కోర్ సాధించాలంటే ఏదైనా ఒక బ్రాంచ్‌కు చెందిన విద్యార్థి మరికొన్ని ఇతర బ్రాంచ్‌లకు సంబంధించిన అంశాలపైనా పట్టుసాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మెకానికల్ గ్రాడ్యుయేట్‌కు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు కష్టంగా ఉంటాయి. అందువల్ల ఓ ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను అనుసరించి వివిధ సబ్జెక్టుల్లోని ముఖ్యమైన భావనలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి.
- ఎలక్ట్రికల్‌లో ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, బేసిక్ సర్క్యూట్ల అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.
- ఎలక్ట్రానిక్స్‌లో ఎలక్ట్రానిక్ డివెసైస్, సర్క్యూట్లు, కమ్యూనికేషన్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
- కంప్యూటర్స్‌కు సంబంధించి C, Java, DBMS తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- సివిల్‌లో Strength of Materials, Fluid Mechanics, Surveying అంశాలు ముఖ్యమైనవి.
- మెకానికల్‌లో థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, హీట్ ఇంజిన్స్ అంశాలు ప్రధానమైనవి.- ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో Transducers, Control systems అంశాలు ముఖ్యమైనవి.
అర్థమెటిక్:న్యూమరికల్ ఎబిలిటీ, టైమ్-డిస్టెన్స్-స్పీడ్, యావరేజ్, రేషియో, పర్సంటేజీ, ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్స్ వంటి అంశాలపై దృష్టిసారించాలి.
జనరల్ అవేర్‌నెస్: అవార్డులు-విజేతలు, ముఖ్యమైన తేదీలు, పుస్తకాలు-రచయితలు, ముఖ్యమైన వ్యక్తులు, భారత భౌగోళికశాస్త్రం, క్రీడలు, సైన్స్-టెక్నాలజీ, సాహిత్యం, వర్తమాన వ్యవహారాలను చదవాలి. ఈ ప్రశ్నలన్నీ జ్ఞాపకశక్తిని పరీక్షించేలా ఉంటాయి.
జనరల్ ఇంటెలిజెన్స్: ఈ విభాగంలో అభ్యర్థి తార్కిక, వివేచనాత్మక శక్తిని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు సిరీస్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, లాజికల్ సీక్వెన్స్, నంబర్ సిరీస్, అనాలజీ, ర్యాంకింగ్స్ తదితర అంశాల సమస్యల్ని ప్రాక్టీస్ చేయాలి.
రీజనింగ్ ఎబిలిటీ: పజిల్స్, కాస్ అండ్ ఎఫెక్ట్, బ్లడ్ రిలేషన్స్, మేకింగ్ జడ్జ్‌మెంట్స్, అనలైజింగ్ ఆర్గ్యుమెంట్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ విభాగాలకు ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకాలు ఉపయోగపడతాయి.
రిఫరెన్స్
- మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్- ఆర్‌కే జైన్
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్- వి.కె.మెహతా
- సివిల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్- రంగాచారి
- ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్- రాజ్‌పుట్
- కంప్యూటర్ సైన్స్ ఆబ్జెక్టివ్- థిమోతీ
- సిలబస్‌పై పూర్తిగా అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవాలి.
- చదివిన అంశానికి సంబంధించిన ప్రశ్నలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి.
- బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లలో అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
- ప్రిపరేషన్‌లో కొంత సమయాన్ని గ్రూప్‌గా చదవడానికి కేటాయించాలి. దీనివల్ల తెలియని అంశాలపై పట్టు సాధించేందుకు అవకాశముంటుంది.
- గత ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రశ్నల స్థాయిని అర్థం చేసుకొని దానికనుగుణంగా ప్రిపరేషన్‌ను మలచుకోవాలి.
- ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్టుల్లోని ప్రాథమిక సూత్రాలను ఒకచోట రాసుకొని, వాటిని పునశ్చరణ చేస్తుండాలి.
- సమయ పాలన అలవడటం కోసం నమూనా ప్రశ్నపత్రాలను సాధిస్తుండాలి.
- అన్ని బ్రాంచ్‌ల్లో కంటే మెకానికల్ బ్రాంచి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
- రోజులో టెక్నికల్ సబ్జెక్టుకు కనీసం 4 గంటలు, ఇతర విభాగాలకు 3 గంటలు కేటాయించాలి.
ప్రిపరేషన్‌కు పటిష్ట ప్రణాళిక అవసరం ప్రస్తుత నోటిఫికేషన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు, డిప్లొమా పూర్తి చేసిన వారికి అద్భుత అవకాశమని చెప్పొచ్చు. అభ్యర్థులు జనరల్ సైన్స్, జనరల్ టెక్నికల్ ఆప్టిట్యూడ్ అంశాలపై దృష్టికేంద్రీకరించాలి. గత నోటిఫికేషన్లతో పోల్చితే ప్రస్తుత పరీక్షకు సిద్ధమయ్యేందుకు తక్కువ సమయం ఉంది. అందువల్ల పటిష్ట ప్రణాళికతో చదవాలి. చివర్లో 15 రోజులను రివిజన్‌కు కేటాయించాలి. పరీక్షలో విజయం సాధిస్తే మంచి కెరీర్ సొంతమవుతుంది. జేఈకి అయితే శిక్షణ పూర్తయ్యాక నెలకు దాదాపు రూ.30 వేలు, అదే ఎస్‌ఎస్‌ఈకి అయితే రూ.40 వేలు అందుతుంది. ఐదేళ్ల తర్వాత డిపార్ట్‌మెంటల్ పరీక్షలో విజయం సాధించి గ్రూప్-బి స్థాయి ఉద్యోగాలను చేజిక్కించుకునే అవకాశముంటుంది జి.ఎ.వి.ప్రసాద్, జేఈ/మెకానికల్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే. |
Published date : 04 Oct 2014 06:32PM