Skip to main content

ఇండియన్ రైల్వే ‘లెవల్-1’ విజయానికి వ్యూహాలు..

భారతీయ రైల్వే కొంత కాలంగా వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలకు మార్గం చూపుతోంది. గతేడాది పెద్దసంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసిన రైల్వే ఈ ఏడాదిలోనూ భారీసంఖ్యలో ఖాళీలతో నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది.
తాజాగా లక్షకు పైగా ఖాళీలతో లెవల్-1 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి/ఐటీఐ అర్హతతో ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా పెరుగుతున్న దృష్ట్యా గ్రాడ్యుయేషన్, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోటీని తట్టుకొని, పరీక్షలో విజయం సాధించేందుకు సూచనలు...

పరీక్ష విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం అర్హత సాధించాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు; ఓబీసీ (ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు తెచ్చుకోవాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్కులుంటాయి. మెరిట్ జాబితా ఆధారంగా మొత్తం ఖాళీలకు 1:3 నిష్పత్తిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులకు పిలుస్తారు. అవసరమైతే రెండో దశ సీబీటీ నిర్వహిస్తామని రైల్వే పేర్కొంది.

విభాగం

ప్రశ్నలు

మార్కులు

జనరల్ సైన్స్

25

25

మ్యాథమెటిక్స్

25

25

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్

30

30

జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్

20

20

మొత్తం

100

100


మ్యాథమెటిక్స్ :
 • ఇందులో బేసిక్ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. పదో తరగతి వరకు ఉండే అర్థమెటిక్ అంశాలపై దృష్టిసారించడం ద్వారా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.
 • సంఖ్యా వ్యవస్థలు, కసాగు, గసాభా, నిష్పత్తి-అనుపాతం, శాతాలు, మెన్సురేషన్, కాలం-పని, కాలం-దూరం, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, ఆల్జీబ్రా, జామెట్రీ, త్రికోణమితి, సాంఖ్యకశాస్త్రం తదితర చాప్టర్లలోని సమస్యలకు వేగంగా సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి.
 • ఎక్కాలు, వర్గాలు-వర్గమూలాలు, ఘనమూలాలను గుర్తుంచుకోవడం ద్వారా త్వరగా సమాధానాలు గుర్తించేందుకు అవకాశముంటుంది. క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ సిస్టర్న్ అంశాలు కొంత క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వీటికి అధిక సమయం కేటాయించాలి.
 • నిష్పత్తులు, శాతాలు, కాలం-పని, కాలం-దూరం, కసాగు, గసాభా, వడ్డీ లెక్కలు, లాభనష్టాలు వంటి చాప్టర్లలోని ప్రశ్నలకు ‘ఫార్ములా’ ఆధారంగా కాకుండా జనరల్‌గా ఆలోచించి సమాధానాలు రాబట్టే విధంగా సన్నద్ధమవ్వాలి. దీనివల్ల పెన్, పేపర్ అవసరం లేకుండానే సమాధానాలు గుర్తించవచ్చు. క్యాలెండర్ ప్రశ్నలను సంవత్సరం, నెల, రోజుల ఆధారిత కోడ్‌ల ద్వారా అత్యంత వేగంగా కచ్చితత్వంతో సమాధానాలు గుర్తించొచ్చు. ఇక కొన్ని సమస్యలకు ఆప్షన్ల ఎలిమినేషన్ ద్వారా కూడా త్వరగా పరిష్కారం కనుక్కోవచ్చు.

ముఖ్యాంశాలు-వెయిటేజీ అంచనా (ప్రశ్నలు)...

సంఖ్యా వ్యవస్థ

1-2

బీజగణితం

1-2

బాడ్‌మాస్

1

ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్

1

నిష్పత్తి-అనుపాతాలు

2

శాతాలు

2-3

క్షేత్రగణితం

2-3

లాభనష్టాలు

2-3

రేఖాగణితం, త్రికోణమితి

3-4

కేలండర్, గడియారం

1-2


జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ :
 • కొద్దిగా శ్రమిస్తే ఈ సెక్షన్‌లో మంచి మార్కులు సాధించేందుకు అవకాశముంది. మిగిలిన విభాగాలతో పోల్చితే దీనికి అధిక వెయిటేజీ ఉంది. అనాలజీస్; ఆల్ఫాబెటికల్, నంబర్ సిరీస్; కోడింగ్-డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిలాయిజమ్స్, జంబ్లింగ్, వెన్‌డయాగ్రమ్స్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, డెరైక్షన్స్, స్టేట్‌మెంట్-ఆర్గ్యుమెంట్, డెసిషన్ మేకింగ్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 • జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సెక్షన్‌లో ఇచ్చిన ప్రశ్నను క్షుణ్నంగా అర్థం చేసుకొని సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తార్కిక ఆలోచనా సామర్థ్యం ఉన్నవారు ఎక్కువ మార్కులు పొందడానికి వీలున్న విభాగమిది. అభ్యర్థులు అనలిటికల్‌గా ఆలోచించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.
 • ఆల్ఫాబెటికల్ సిరీస్ ప్రశ్నలకు వేగంగా సమాధానాలు గుర్తించేందుకు ఇంగ్లిష్ అక్షరాల వరుస క్రమాన్ని గుర్తుంచుకోవాలి. అనలిటికల్ రీజనింగ్ విభాగంలోని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలంటే ప్రాక్టీస్ ముఖ్యం.

ముఖ్యాంశాలు-వెయిటేజీ అంచనా..

అంశం

ప్రశ్నలు

అనాలజీస్

2-3

ఆల్ఫాబెటికల్, నంబర్ సిరీస్

3-4

కోడింగ్-డీకోడింగ్

2-3

మ్యాథమెటికల్ ఆపరేషన్స్

1-2

వెన్‌డయాగ్రమ్

1-2

డేటా ఇంటర్‌ప్రెటేషన్, సఫీషియన్సీ

1-2

కన్‌క్లూజన్స్, డెసిషన్ మేకింగ్

1

అనలిటికల్ రీజనింగ్

3-4

క్లాసిఫికేషన్స్

2-3

డెరైక్షన్స్

1-2

స్టేట్‌మెంట్స్-ఆర్గ్యుమెంట్స్

4-5


జనరల్ సైన్స్ :
పదోతరగతి స్థాయి వరకు సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పదో తరగతి వరకు పుస్తకాలు సేకరించుకొని, ముఖ్యాంశాలపై పట్టు సాధించాలి. సొంతంగా నోట్స్ రాసుకోవడం మేలు. ఇది పరీక్షకు ముందు రివిజన్‌కు ఉపయోగపడుతుంది. నిత్యజీవితంతో ముడిపడిన సైన్స్ అంశాలపై దృష్టిసారించడం ప్రధానం.

ముఖ్యాంశాలు-వెయిటేజీ అంచనా..
ఫిజిక్స్ :

చాప్టర్

ప్రశ్నలు

కాంతి

1-3

ఉష్ణం

1-2

ధ్వని

1-2

విద్యుత్

1-3

ఆధునిక భౌతికశాస్త్రం

1-3

యాంత్రిక శాస్త్రం

2-3


కెమిస్ట్రీ :

పరమాణు నిర్మాణం

1-2

రసాయన బంధం

1

నిత్యజీవితంలో రసాయనశాస్త్ర అనువర్తనాలు

2-3

ఆమ్లాలు, క్షారాలు

1

లోహ శాస్త్రం

1

కర్బన రసాయనశాస్త్రం

1

 • అదే విధంగా జీవశాస్త్రంలో విటమిన్లు, వ్యాధులు, కణ నిర్మాణం, మొక్కలు, మానవ శరీర నిర్మాణం తదితర అంశాలపై దృష్టిసారించాలి. గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్, ఆమ్లవర్షాలు, ఓజోన్, జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థ వంటి పర్యావరణ సంబంధ అంశాలపైనా అవగాహన అవసరం. ఈ క్రమంలో ముఖ్యమైన పర్యావరణ సదస్సులు, తీర్మానాలను తెలుసుకోవాలి.

జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్..
 • ఈ విభాగంలో స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. భారతదేశ భౌగోళిక స్థితిగతులు, రాజకీయ వ్యవస్థ, ఇతర దేశాలలో సంబంధాలు, కొత్త ప్రభుత్వ విధానాలు, పథకాలు, దేశాల కరెన్సీలు, వార్తల్లోని వ్యక్తులు, పుస్తకాలు-రచయితలు తదితరాలకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వీటితో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు; రక్షణ సాంకేతికత పరిజ్ఞానం, సైనిక విన్యాసాలు, తాజాగా జరిగిన క్రీడలు-విజేతలు, బడ్జెట్ ముఖ్య అంశాలు తదితరాలను తెలుసుకోవాలి.
 • భారతీయ రైల్వేలపై ప్రశ్నలు అడగొచ్చు. అంతర్జాతీయ సరిహద్దులు, భారత స్వాతంత్య్ర ఉద్యమం, జాతీయ చిహ్నాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, జాతీయ ప్రాధాన్య సంస్థలు-అవి ఉన్న ప్రాంతాలు, నదులు, డ్యాములు, సరస్సులు, ప్రసిద్ధ కట్టడాలు తదితర అంశాలు కూడా ముఖ్యమైనవి.

ముఖ్యాంశాలు-వెయిటేజీ అంచనా..

అంశం

ప్రశ్నలు

క్రీడలు

2-3

భౌగోళికశాస్త్రం

3-4

ఆర్థికశాస్త్రం

1-2

విస్తరణ రూపం, సంస్థలు

2-3

చరిత్ర

3-4

పాలిటీ

2-3

కరెంట్ అఫైర్స్

3-4


గత పరీక్షల ప్రశ్నపత్రాల విశ్లేషణ ప్రకారం విభాగాల వారీగా ముఖ్యాంశాలు..
 • భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, పరిపాలన: ఎన్నికలు; నియామకాలు; ముఖ్యమైన ప్రకరణలు; తాజా చట్టాలు (సవరణ చట్టాలు).
 • భౌగోళిక శాస్త్రం: నదులు-ఉపనదులు; ప్రదేశాలు, జాతీయ పార్కులు.
 • చరిత్ర: ఆధునిక చరిత్ర; పుస్తకాలు- రచయితలు; ఉద్యమాలు, నినాదాలు, చారిత్రక ప్రదేశాలు, ముఖ్య సంఘటనలు-సంవత్సరాలు.
 • ఆర్థికశాస్త్రం: సంస్థలు-ప్రధాన కార్యాలయాలు; బడ్జెట్, నియామకాలు, విధానాలు.
 • క్రీడలు: టోర్నీలు-కప్‌లు, క్రీడాంశం-క్రీడాకారుల సంఖ్య; విజేతలు, క్రీడా వేదికలు.

వేగం, కచ్చితత్వంతోనే విజయం..
కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 90 నిమిషాల్లోనే 100 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు నిమిషం కంటే తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మ్యాథమెటిక్స్; జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్లలోని ప్రశ్నలకు వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు గుర్తించేలా నైపుణ్యాలు పెంచుకోవాలి. దీనికి ఏకైక మార్గం.. ప్రాక్టీస్! ఈ సెక్షన్ల ప్రిపరేషన్‌కు ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు. జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్‌కు పాఠశాల స్థాయి పుస్తకాల్లోని ముఖ్యాంశాలపై తప్పనిసరిగా పట్టుసాధించాలి. అదే విధంగా కరెంట్ అఫైర్స్‌కు నిత్యం పేపర్ చదువుతూ సొంతంగా నోట్స్ రాసుకోవడంతో పాటు ఓ ప్రామాణిక మ్యాగజైన్‌ను అనుసరించాలి. ఇంటర్నెట్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. గత ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి.
- ఎన్.వినయ్‌కుమార్‌రెడ్డి, డెరైక్టర్, ఐఏసీఈ.
Published date : 22 Mar 2019 07:05PM

Photo Stories