Skip to main content

రైల్వే కొలువులు- అర్హతలు

భారత రైల్వే.. రవాణా వ్యవస్థకు వెన్నుముక. దేశంలో రైల్వేరవాణా భౌగోళికంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి.. ప్రయాణికులతోపాటు వస్తువుల రవాణాకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది.
రైల్వేలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి వివిధ జోన్లల్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ కేటగిరీల్లో మొత్తంగా 2,22,159 ఖాళీలు ఉన్నట్లు ఆయన లోక్‌సభలో ఓ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఖాళీల్లో గ్రూప్-ఏ మొదలు గ్రూపు-డీ వరకు పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలను నిర్వహణ అవసరాల మేరకు భర్తీ చేసే అవకాశముంది.

ఆరునెలల్లోనే భర్తీ..
రైల్వే బోర్డులు చేపట్టే నియామకాలు పూర్తికావడానికి ఏళ్ల కొద్దీ పడుతుందనే విమర్శ ఉంది. ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నా.. తుది ఫలితాల వెల్లడికి సుదీర్ఘం కాలం పడుతోంది. దరఖాస్తు ప్రక్రియ మొదలు, తుది ఫలితాలు వెలువడే సరికి దాదాపు రెండేళ్లు పడుతుంది. దీంతో అభ్యర్థులుప్రత్యామ్నయ ఉద్యోగ అవకాశాలు వెతుక్కుకోవడంతోపాటు రైల్వే రిక్రూట్‌మెంట్స్‌పై నమ్మకం కోల్పోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల రైల్వే బోర్డు చైర్మన్.. నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని రైల్వేబోర్డ్ జోనల్ అధికారులకు సూచించారు. ఆయా నోటిఫికేషన్లకు భర్తీ ప్రక్రియను ఆరు నెలలలోపే పూర్తి చేసేలా డెడ్‌లైన్లు విధించుకోవాలని పేర్కొన్నారు.

‘సేఫ్టీ’ పోస్టులే ఎక్కువ :
దేశంలో వరుసగా రైల్వే ప్రమాదాలు చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన రైల్వేశాఖ.. ఉద్యోగుల కొరత కూడా ప్రమాదాలకు ప్రధాన కారణమని భావించింది. జోన్లవారిగా ఉన్న ఖాళీల వివరాలు సేకరించిన రెల్వే బోర్డు.. ఎక్కువగా సేఫ్టీ సంబంధిత ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది. వీటిల్లో డ్రైవర్, గార్డులు, గ్యాంగ్‌మెన్, ఇతర టెక్నికల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నిషియన్ పోస్టులు :
అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నిషియన్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశముంది. దాదాపు ఈ రెండు పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్లు వెలువడుతాయి.
అర్హతలు: అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు పదోతరగతితోపాటు ఐటీఐ లేదా మెకానికల్, ఎలక్టిక్రల్, ఎలక్టాన్రిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఉన్నత స్థాయి కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు.

టెక్నీషియన్ కేటగిరీలో పలు ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. వీటికి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. జాబ్ ప్రొఫైల్ ఆధారంగా పదో తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లతో 10+2 ఉత్తీర్ణత అవసరం లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. కొన్ని టెక్నీషియన్ పోస్టులకు పదో తరగతితోపాటు ఆయా విభాగాల్లో ఐటీఐ చదివి ఉండాలి.
రాత పరీక్ష: అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టుల కు ఉమ్మడి రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దేశంలోని ఆర్‌ఆర్‌బీలన్నీ ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తాయి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న బోర్డు పరిధిలో పరీక్ష రాయొచ్చు. పరీక్షలో 100 నుంచి 120 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్‌‌స అండ్ రీజనింగ్, జనరల్ సైన్‌‌స అండ్ టెక్నికల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
ఎంపిక విధానం: అసిస్టెంట్ లోకో పైలట్‌కు మొత్తం మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్, చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుపుతారు.

ఇంజనీరింగ్ పోస్టులు :
రైల్వే నుంచి రాబోయే నోటిఫికేషన్లలో ముఖ్యమైనవి.. జూనియర్ ఇంజనీర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉద్యోగాలు. ఈ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశముంది. వీటికి డిప్లొమా, ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్/సీనియర్ సెక్షన్ రీసెర్చ్ ఇంజనీర్/ఇంజనీర్ పోస్టులకు-సంబంధిత బ్రాంచీలో నాలుగేళ్ల ఇంజనీర్ డిగ్రీ(బీఈ/బీటెక్) ఉండాలి. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత బ్రాంచీలో ఇంజనీరింగ్ డిప్లొమా అవసరం. గత నోటిఫికేషన్ ప్రకారం- కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు-మెటలర్జీ/ కెమికల్ ఇంజనీర్‌లో డిగ్రీ లేదా ఎమ్మెస్సీ కెమిస్ట్రీ లేదా అప్లయిడ్ కెమిస్ట్రీ చేసిన వారికి అవకాశం ఇచ్చారు. ఈ పోస్టుల ఎంపికలో ఆన్‌లైన్ టెస్టులో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలు ఉండవు.

గ్రూప్-డి పోస్టులు :
  • రైల్వేలో పదోతరగతి లేదా ఐటీఐ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో కొన్ని ఉద్యోగ ప్రకటనలు వెలువడుతుంటాయి. వాటిల్లో ప్యూన్, హెల్పర్, కామాటి, సఫాయివాలా, గ్యాంగ్‌మెన్ మొదలైన పోస్టులు ఉంటాయి. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అన్ని పోస్టుల కంటే ఈ ఖాళీలే ఎక్కువగా ఉండే అవకాశముంది.
  • ఇక ముఖ్యంగా రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) విభాగంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు రైల్వే శాఖ యోచిస్తుంది. రైల్వేశాఖలో ఆర్పీఎఫ్ ఉద్యోగానికి పదోతరగతి ఉత్తీర్ణత అర్హతగా కేటాయించారు. 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) పోస్టులు :
డిగ్రీ ఉత్తీర్ణతతోఈ కేటగిరీ కింద పలు ముఖ్యమైన ఉద్యోగాలకు ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది. కమర్షియల్ అప్రెంటీస్, ట్రాఫిక్ అప్రెంటీస్, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్/టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్, సీనియర్ టైం కీపర్... లాంటి పోస్టులకు ఉమ్మడిగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. కొన్ని పోస్టులకు స్పెషలైజ్డ్ విద్యార్హతలు అడుగుతారు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా పరీక్షించే వీలు ఉంటుంది.

అంతా ఆన్‌లైనే..
దరఖాస్తు ప్రక్రియ మొదలు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఇది అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. దరఖాస్తులు, పరీక్షలు, ఫలితాలు.. ఇలా మొత్తం నియామక ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది.

పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://rrbsecunderabad.nic.in
Published date : 05 Jan 2018 01:06PM

Photo Stories