Skip to main content

పట్టా కాదు.. పట్టు కావాలి..ఇలా అయితేనే జాబ్‌

జపాన్‌ దేశంలో పాఠ్యాంశాల బోధనతోపాటు విద్యార్థి ఎదగగలిగేలా నైపుణ్యాలు నేర్పుతారు. చైనాలో సాంకేతికత విద్యార్థులకు పట్టాతో పాటు ఉద్యోగాన్ని అందిస్తారు. కానీ మనదేశంలో పట్టా కోసం పరితపించే ఆలోచనే విద్యార్థిని ఆవహిస్తోంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్షల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థులు బయటకు వస్తున్నా ఉద్యోగాలు వేలల్లో మాత్రమే వస్తున్నాయి. నైపుణ్యం లేకుండా పట్టా పట్టుకొచ్చేస్తే ఉద్యోగాలు ఇవ్వలేమని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం పట్టాకోసమే గాకుండా నైపుణ్యం సాధించే దిశగా విద్యార్జన సాగాలని నిపుణులు అంటున్నారు. అదే విజయ మార్గమని స్పష్టం చేస్తున్నారు.
పట్టాతో ప్రయోజనం లేదు..
విద్యార్థులు కేవలం పట్టాను తీసుకుని బయటకు వెళితే ప్రయోజనం లేదు. అంతర్గత సామర్థ్యాలు పెంచుకుని పరిశ్రమకు తగ్గ నైపుణ్యాలు సాధించాలి. ఆ దిశగా ప్రథమ సంవత్సరం నుంచే కృషి చేయాలి. –పి.వి.కృష్ణంరాజు, చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌

ప్రథమ సంవత్సరం...
ఒక జిల్లాలో 32 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఈ ఏడాది దాదాపు 14వేల మంది విద్యార్థులు చేరారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతానికి చెందినవారే. విద్యార్థులు ప్రధానంగా ఆంగ్లభాషలో పట్టుకోసం గట్టి ప్రయత్నమే చేయాలి. అది మొదటి ఏడాదిలో ప్రారంభం కావాలి. ఇంజనీరింగ్‌ విద్య అంటే పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాలపై అవగాహన పెంచుకుని, నమూనా ప్రశ్నాపత్రాలపై దృష్టి సారించాలి. అన్నింటికీ మించి సమయపాలన నేర్చుకోవాలి.

రెండవ సంవత్సరం..
మొదటి సంవత్సరంతో పాటు రెండవ సంవత్సరం ఆరునెలల పాటు కామన్‌కోర్సు ఉంటుంది. ఇకపై కోర్‌ సబ్జెక్టువైపు బోధన మళ్లుతుంది. ఇక్కడి నుంచి క్రీయాశీలకంగా విద్య సాగుతుంది. వర్క్‌షాపులు, టెక్నికల్‌ సింపోనియమ్స్, సెమినార్లు, ప్రజంటేషన్లు వంటి వాటిపై దృష్టి సారించాలి. ప్రాజెక్టు రిపోర్టు తయారుచేయడం, పరిశోధనలలో ఫ్యాకల్టీతో కలిసి పనిచేయడం వంటివి అలవాటు చేసుకోవాలి.

మూడో సంవత్సరం...
విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటున్నాడో, ఉద్యోగం వైపు దృష్టి సారించాలనుకుంటున్నాడో నిర్ణయించుకోవలసింది ఇక్కడే. అంతర్గత సామర్థ్యాన్ని అంచనా వేస్తూ పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా సాగే ఇంటర్న్‌షిప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. 30 నుంచి 180 రోజులు ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు. మంచి పరిశ్రమను ఎంచుకుని సమయపాలన, మైండ్‌ మేనేజ్‌మెంట్, తదితర లక్షణాలు అలవర్చుకోవాలి. మరోవైపు ఈ కాలంలో గేట్‌ కోసం సాధన ప్రారంభించాలి. స్టార్టప్‌ ప్రాజెక్టులు ఆవిష్కరించాలి. ఇలా మూడవ సంవత్సరం కీలకంగా వినియోగించుకోవాలి.

చివరి సంవత్సరంలో...
ఈ దశలో విద్యార్థులు నమూనా మౌఖిక పరీక్షలకు హాజరుకావడం, తమ రెజ్యూమ్‌ పక్కాగా తయారుచేసుకోవడం, బృంద చర్చల్లో పాల్గొనడం వంటివి సాధన చేయాలి. పత్రికలు చదువుతూ లోకజ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. జేఎన్‌టీయూకేలో ప్రముఖ ఎంఎన్‌సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఇంటర్వ్యూలు నిర్వహించింది. విద్యార్థులను టాటా సంస్థ చైర్మన్‌ ఎవరని అడిగితే చెప్పలేకపోయారని టీసీఎస్‌హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఆశ్చర్యపోయారు.
Published date : 26 Apr 2021 05:44PM

Photo Stories