నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ సర్వేల ప్రకారం ఆయా రంగాల్లో పుంజుకుంటున్న నియామకాలు.. వివరాలు తెలుసుకోండిలా..
![](/sites/default/files/images/2021/04/28/Technologycoures.jpg)
కాసింత ఉపశమనం లభించింద నుకుంటున్న తరుణంలో.. మళ్లీ సెకండ్ వేవ్ కలకలం! దీంతో.. లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో ఆందోళన మొదలైంది! గత ఏడాది పరిస్థితులే పునరావృతం అవుతాయా? జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ సంస్థలు రిక్రూట్‌మెంట్స్ చేపట్టే అవకాశం ఉందా.. ఇలా ఎన్నో సందేహాలు?! మరోవైపు జాబ్ మార్కెట్‌లో పలు రంగాల్లో సానుకూల సంకేతాలు ఉన్నాయంటూ ఓ తాజా సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో..ఆయా రంగాల్లో జాబ్ ట్రెండ్స్‌పై నిపుణుల విశ్లేషణాత్మక కథనం...
ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం–ఐటీ, రిటైల్ రంగాల్లో నియామకాలు పుంజుకుంటున్నట్లు తేలింది. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ప్రకారం–ఐటీ, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ రంగంలో ఒక్క మార్చి నెలలోనే నూతన నియామకాల పరంగా పదకొండు శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికం నుంచి నియామకాలు పురోగమనంలోనే సాగుతున్నట్లు సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రిటైల్.. ముందజ
సదరు సర్వే నూతన నియామకాల పరంగా 14 రంగాల్లో అధ్యయనం నిర్వహించగా..15 శాతం వృద్ధితో రిటైల్ రంగం అగ్ర స్థానంలో నిలిచింది. అదే విధంగా గత ఏడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చి నాటికి ఏకంగా 24 శాతం వృద్ధి రిటైల్ నియామకాల్లో కనిపిం చింది. అన్‌లాక్ తర్వాత రిటైల్ రంగం పుంజుకొని పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో కార్యకలాపాలను విస్తరిస్తున్న రిటైల్ రంగంలోని సంస్థలు..అందుకు అనుగుణంగా నూతన నియా మకాలకు పెద్దపీట వేస్తున్నాయని నిపుణుల అంచనా.
అనుభవజ్ఞులకు స్వాగతం..
తాజా సర్వే ప్రకారం–పలు రంగాల్లోని సంస్థలు అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇవ్వడం కొత్త ట్రెండ్‌గా కనిపిస్తోంది. మొత్తం నియామకాల్లో 4 నుంచి ఏడేళ్లు, ఎనిమిది నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్న వారికి 6 శాతం చొప్పున పెరుగుదల కనిపించింది. 13 నుంచి 16ఏళ్ల అనుభవం ఉన్న వారి నియామకాల్లో మూడు శాతం వృద్ధి నమోదైంది. కంపెనీలు ప్రధానంగా లీడర్‌షిప్ రోల్స్‌లో నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఫ్రెషర్స్‌కూ ఓకే..
తాజా సర్వే ప్రకారం–ఫ్రెషర్స్‌కూ ఆశాజనక పరిస్థితులే కనిపించాయి. అన్ని రంగాల్లోని సంస్థల్లో ఫ్రెషర్స్ నియామకాల్లో 5శాతం వృద్ధి నమోదైంది. ఇది రానున్న రోజుల్లో ఫ్రెషర్స్‌కు జాబ్ మార్కెట్ పరిస్థితులు సాను కూలం అనడానికి సంకేతం అంటున్నారు నిపుణులు.
డిమాండ్.. జాబ్ రోల్స్
డిమాండ్ నెలకొన్న జాబ్ రోల్స్ పరంగా.. టెక్ ప్రొఫెషనల్స్ ముందంజలో నిలుస్తున్నారు. మొత్తం నియామకాలు, జాబ్ రోల్స్‌ను బేరీజు వేస్తే... ఐటీ, సాఫ్ట్‌వేర్ నిపుణులు 11 శాతం వృద్ధితో ముందంజలో నిలిచారు. సంస్థలు డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తూ..సంబంధిత కార్యకలాపాల నిర్వహణ కోసం టెక్నికల్ స్కిల్స్ ఉన్న వారిని నియమించుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
మార్కెటింగ్‌కూ మంచి రోజులే..
మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌కు కూడా గత కొంత కాలంగా మంచి రోజులే కనిపిస్తున్నాయి. సదరు సర్వే గణాంకాల ప్రకారం–మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ ప్రొఫైల్స్‌లో నూతన నియామకాల్లో పది శాతం పెరుగుదల నమోదైంది. విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న సంస్థలు.. తమ వస్తు సేవలు లక్షిత వినియోగదారులకు చేరువ చేయడంతోపాటు, విక్రయాలు పెంచేలా చూసేందుకు మార్కెటింగ్,అడ్వర్టయిజింగ్ నిపు ణుల నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
పురోగమన బాట
- హెచ్‌ఆర్/అడ్మినిస్ట్రేషన్(8 శాతం), అకౌంట్స్/ఫైనాన్స్ (5 శాతం), బ్యాంకింగ్/ ఇన్సూరెన్స్(5 శాతం), ఫార్మా/బయోటెక్(ఒక శాతం) ప్రొఫైల్స్ పురోగమన బాటలో ఉన్నాయి. ఈ విభాగాల్లో ఒకటి నుంచి పదేళ్ల అనుభవం ఉన్న వారిని నియమించుకునేందుకు సంస్థలు సిద్ధమయ్యాయి.
- మెడికల్/హెల్త్‌కేర్/హాస్పిటల్(2 శాతం), ఐటీ హార్డ్‌వేర్, నెట్ వర్కింగ్(4 శాతం), టెలికం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడింగ్(అయిదు శాతం), ఆయిల్ అండ్ గ్యాస్/ పవర్/ఇన్‌ఫ్రాస్ట్రక్చర్/ఎనర్జీ సెక్టార్(7 శాతం), బీఎఫ్‌ఎస్‌ఐ(ఒక శాతం), బీపీఓ/ఐటీఈఎస్/ సీఆర్‌ఎం/ట్రాన్స్‌క్రిప్షన్(ఒక శాతం)లు నియామకాల పరంగా ఆశాజనంగా ఉన్నాయి.
- ఎఫ్‌ఎంసీజీ/ఫుడ్స్/బెవరేజెస్, ఎడ్యుకేషన్/టీచింగ్/ ట్రైనింగ్, ఆటోమొబైల్ రంగాలు మాత్రం నియామకాల పరంగా ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.
- రానున్న రోజుల్లో నియామకాలు ఆశాజనకంగా ఉంటాయని టీమ్‌లీజ్, ఓఎల్‌ఎక్స్ తదితర సర్వేలు సైతం పేర్కొంటున్నాయి. ఇవి విడుదల చేసిన నివేదికలు..రానున్న రోజుల్లో ముఖ్యంగా ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎడ్‌టెక్, హెల్త్‌కేర్ విభాగాల్లో నియామకాలు పుంజుకుంటాయని పేర్కొన్నాయి.
రిటైల్‌లో..ఉద్యోగాలు
రిటైల్ రంగంలో..ఎంట్రీ లెవల్‌లో..కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫ్లోర్ మేనేజర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిడిల్ లెవల్‌లో.. స్టోర్ మేనేజర్, వేర్‌హౌస్ మేనేజర్, వేర్‌హౌస్ కోఆర్డినేటర్, లాజి స్టిక్స్ మేనేజర్ వంటి కొలువులు దక్కించుకోవచ్చు. ఎంట్రీ లెవల్‌లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ప్రారంభంలో రూ.20వేల నుంచి రూ.25వేల వరకు జీతం లభిస్తోంది. రెండు మూడేళ్ల అనుభవంతో పనిచేస్తున్న విభాగం, అర్హతల ఆధారంగా రూ.25వేల నుంచి రూ.30వేలకు పైగా వేతనం అందుకునే అవకాశం ఉంది.
రిటైల్.. నైపుణ్యాలు
రిటైల్ రంగంలో పలు ఉద్యోగాలకు టెక్ నైపుణ్యాలు కూడా అవసరమవుతున్నాయి. రిటైల్ డేటా అనలిస్ట్, డిజిటల్ ఇమేజింగ్ లీడర్, ఐటీ ప్రాసెస్ మోడలర్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ వంటి టెక్ ఆధారిత జాబ్ ప్రొఫైల్స్ సైతం అందుబాటులోకి వస్తున్నాయి. వీటిల్లో నియామకం కోసం సంస్థలు బీటెక్/ఎంటెక్ స్థాయి ఉద్యోగులను సైతం నియమించుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి.
ఐటీ.. జాబ్ ప్రొఫైల్స్
ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఐఏ ఎగ్జిక్యూటివ్, ఏఐ–ఇంజనీర్, ఎంఎల్ ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రా మర్, ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్/అసోసియేట్ వంటి జాబ్ ప్రొఫైల్స్‌కు డిమాండ్ నెలకొంది. అదేవిధంగా కోర్ విభాగాల్లో ప్రొడక్షన్ మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్, లాజి స్టిక్స్ ఎగ్జిక్యూటివ్, ఆర్‌పీఏ ఇంజనీర్ వంటి కొలువులు లభిస్తున్నాయి. వీరికి నెలకు రూ.30వేల నుంచి నెలకు రూ.లక్ష వరకు వేతనం లభించే అవకాశముంది.
ఈ స్కిల్స్‌కు ప్రాధాన్యం..
టెక్, ఐటీ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ కోణంలో.. ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్; ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్; బ్లాక్‌చైన్ టెక్నాలజీ; డేటా అనాలిసిస్; క్లౌడ్ కంప్యూటింగ్; సైబర్ సెక్యూరిటీ; రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్; బిగ్ డేటా నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. ఈ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు నియామ కాల్లో ప్రాధాన్యం లభిస్తోంది.
నైపుణ్యాలకు మార్గాలు..
- ఐటీ రంగంలో టెక్ నియామకాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్న నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి ప్రస్తుతం ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా విభాగాలకు సంబంధించి పలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులు అభ్యసించే అవకాశం ఉంది. ఏ డొమైన్‌లో ఉద్యోగం ఆశిస్తున్నామో.. సదరు నైపుణ్యాల సాధన విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. అప్పుడే కొలువుల పోటీలో ముందంజలో నిలిచి ఆఫర్ ఖరారు చేసుకునే అవకాశం ఉంటుంది.
- రిటైల్ రంగంలో.. సదరు నైపుణ్యాలను అకడమిక్‌గానే అందుకునే అవకాశాలు లభిస్తున్నాయి. పలు ఇన్‌స్టిట్యూట్‌లు రిటైల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. బీబీఏ–రిటైల్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులు ప్రధానంగా నిలుస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌ఈఎం, ఎస్‌ఈఓ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు ఆన్‌లైన్ మార్గాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
రిక్రూట్‌మెంట్ ట్రెండ్స్.. ముఖ్యసమాచారం
- 15 శాతం వృద్ధితో టాప్‌లో నిలిచిన రిటైల్ సెక్టార్.
- 11 శాతం వృద్ధితో తర్వాత స్థానంలో ఐటీ, సాఫ్ట్‌వేర్.
- గత ఏడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఈ రెండు రంగాల్లో నియామకాలు రెట్టింపు.
- ఫ్రెషర్స్(0–3ఏళ్ల అనుభవం) రిక్రూట్‌మెంట్స్‌లో అయిదు శాతం పెరుగుదల.
- 4 నుంచి ఏడేళ్లు, ఎనిమిది నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్న వారికి నియామకాల్లో 6 శాతం చొప్పున పెరుగుదల.
- టెక్ ప్రొఫెషనల్స్, మార్కెటింగ్ /అడ్వర్టయిజింగ్ విభాగాల్లో నియామకాల్లో పెరుగుదల.
క్యాంపస్ ఆఫర్స్..
ఈ ఏడాది జాబ్ మార్కెట్ సానుకూలంగా ఉంటుందని చెప్పడానికి.. ఇటీవల ఆయా సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో ఇచ్చిన ఆఫర్స్‌నే నిదర్శనంగా పేర్కొనొచ్చు. ఐటీ సంస్థలు మొదలు ఈ–కామర్స్, మాన్యుఫ్యాక్చరింగ్, కన్సల్టింగ్.. ఇలా దాదాపు అన్ని ప్రముఖ రంగాల్లో మెరుగైన ఆఫర్లు లభించాయి. దీంతో ఓపెన్ జాబ్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితులు కొనసాగుతాయనడంలో సందేహం లేదు.
–ప్రొఫెసర్ అభినవ్ కుమార్, ఫ్యాకల్టీ–ఇంఛార్జ్, ఐఐటీ–హెచ్ ప్లేస్‌మెంట్ సెల్