ఈ స్టార్టప్స్ వైపు మొగ్గు చూపుతున్న విద్యార్థులు...ఎందుకంటే..?
వీటిల్లో అడుగుపెడితే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తోనే.. భవిష్యత్తు బంగారమవుతుందనే అభిప్రాయం! అందుకే ఎందరో ప్రతిభావంతులు ఐఐఎంల్లో చేరేందుకు సర్వశక్తులూ ఒడ్డుతుంటారు. ఇటీవల ఐఐఎంల ప్లేస్‌మెంట్స్ ముగిశాయి. విద్యార్థులకు ఈ–కామర్స్, స్టార్టప్ కంపెనీలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో.. మొత్తంగా ఐఐఎంల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ట్రెండ్ ఎలా ఉంది.. ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లు పెరగడానికి కారణాలపై విశ్లేషణ...
ఈ–కామర్స్, స్టార్టప్స్...గత కొంత కాలంగా నియామకాల్లో ముందంజలో నిలుస్తున్న రంగాలు. ముఖ్యంగా ఐఐఎంల్లో ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో ఇది మరింతగా స్పష్టమైంది. ఐఐఎంల్లో 2021లో పీజీపీఎం కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఇటీవల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ముగిశాయి. వీరికి ఈ–కామర్స్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇచ్చాయి. కోవిడ్ కారణంగా గత ఏడాది ఈ రంగాల్లోని సంస్థల ఆఫర్లు తగ్గాయి. ఈ సంవత్సరం మాత్రం మార్కెట్లు పుంజుకోవడంతో ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లలో గణనీయమైన పెరుగుదల కనిపిం చింది.
అన్ని ఐఐఎంల్లోనూ అదే ట్రెండ్ :
- తొలి తరం ఐఐఎంలు మొదలు నూతన ఐఐఎంల వరకూ.. దాదాపు అన్ని ఐఐఎం క్యాంపస్‌లలోనూ ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. ఆయా ఐఐఎంల్లో కనిష్టంగా పది శాతం.. గరిష్టంగా 80 శాతం మేరకు ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లు పెరగాయి.
- ఐఐఎం–ఇండోర్‌లో.. ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్స్‌లో గరిష్టంగా 80 శాతం మేర పెరుగుదల కనిపించింది. ఐఐఎం–బెంగళూరులో 53 శాతం; ఐఐఎం–లక్నోలో 24.5 శాతం; ఐఐఎం–కోజికోడ్‌లో 25 శాతం; ఐఐఎం–అహ్మదాబాద్‌లో 10 శాతం వృద్ధి నమోదైంది.
- తెలుగు రాష్ట్రాల్లోని ఐఐఎం–విశాఖపట్నంలోనూ ఈ–కామర్స్ ఆఫర్లు గతేడాది కంటే పది శాతం మేరకు పెరిగి.. మొత్తం 120 మంది విద్యార్థుల్లో.. దాదాపు 30 మందికి ఈ–కామర్స్ సంస్థల్లో ఆఫర్లు లభించాయి.
ఈ–కామర్స్ దిగ్గజాల హవా..
ఈ–కామర్స్ దిగ్గజాలుగా పేరొందిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం, ఫోన్‌పే, రేజర్‌పే సంస్థలు ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో నిలిచాయి. ఈ రంగంలో లభించిన మొత్తం ఆఫర్లలో యాభై శాతం ఈ సంస్థల నుంచే ఉండటం విశేషం. అంతేకాకుండా వేతనాలు కూడా సగటున రూ.12లక్షల నుంచి రూ.30లక్షల వరకు అందించాయి. గతేడాది కంటే 30శాతం అదనంగా ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ చేసుకుంటామని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ.. అందుకు తగినట్లుగానే క్యాంపస్ డ్రైవ్స్‌లో భారీగా నియామకాలు చేపట్టింది. అదే విధంగా అమెజాన్, పేటీఎం కూడా ఈ ఏడాది టెక్, మేనేజ్‌మెంట్ ప్రొఫైల్స్‌లో భారీగా నియామకాలు చేపడతామని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఈ సంస్థలు ఫ్రెషర్స్ నియామకాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
స్టార్టప్స్ హవా..
గత రెండేళ్లుగా వెనుకంజలో ఉన్న స్టార్టప్ కంపెనీల ఆఫర్లు ఈసారి భారీగా పెరిగాయి. ప్రధానంగా ఎడ్‌టెక్, ఫిన్‌టెక్ సంస్థలు ముందంజలో నిలిచాయి. బ్లాక్‌బర్గ్, ఇంటర్వ్యూబిట్, టర్టిల్‌మింట్ వంటి సంస్థలు స్టార్టప్ ఆఫర్స్ భారీగా ఇచ్చాయి. ఐఐఎంల విద్యార్థులు కూడా ఈ స్టార్టప్ ఆఫర్స్‌కు ఆమోదం తెలపడం విశేషం. దీనికి స్టార్టప్ సంస్థల్లో చేరితే తమ కెరీర్ ప్రగతికి పునాదులు వేసుకోవచ్చనే భావనే ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా తమ నైపుణ్యాలను నేరుగా వ్యక్తీకరించి, ఆచరణలో పెట్టే అవకాశం స్టార్టప్ సంస్థల్లోనే ఎక్కువగా ఉంటుందనే అభి ప్రాయంతోనే విద్యార్థులు ఈ ఆఫర్స్‌కు అంగీకరించారని ఆయా ఐఐఎంల క్యాంపస్ ప్లేస్‌మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఫండింగ్ పెరగడమే కారణమా..!
స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇవ్వడానికి వాటికి గతేడాది ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్ రావడం మరో కారణం అనే వాదన వినిపిస్తోంది. హెక్స్‌జన్ సంస్థ సర్వే ప్రకారం–గతేడాది భారత్‌లోని స్టార్టప్ సంస్థలు దాదాపు నాలుగు వందల మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నాయి. వీటిలో యాభై శాతానికి పైగా టెక్ స్టార్టప్స్, ఎడ్‌టెక్ స్టార్టప్స్æ ఉన్నాయని సదరు సర్వే పేర్కొంది. అంతేకాకుండా ప్రముఖ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కో నివేదిక ప్రకారం–2020లో జాతీయ స్థాయిలో ఏడు వేలకు పైగా స్టార్టప్ సంస్థలకు పది బిలియన్ డాలర్ల నిధులను వెంచర్ క్యాపిటలిస్ట్‌లు సమకూర్చారు. వీటిలో మూడొంతులు..ఫిన్‌టెక్, ఈ–కామర్స్ అనుబంధ టెక్ స్టార్టప్‌లే ఉన్నాయి. ఇలా భారీగా నిధులు సమకూర్చు కున్న స్టార్టప్‌లు.. వ్యాపార ఉన్నతికి, విస్తరణకు అవసరమైన మానవ వనరుల కోసం క్యాంపస్ డ్రైవ్స్ బాట పట్టాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కీలకమైన ప్రొఫైల్స్...
ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు కీలక విభాగాల్లో అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. డిజైన్ నుంచి మార్కెటింగ్ వరకు పలు ముఖ్య విభాగాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే హోదాల్లో ఆఫర్లు ఇచ్చాయి. ప్రస్తుత డిజిటలైజేషన్, ఆన్‌లైన్ కార్యకలాపాల్లో పెరుగుదలే దీనికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. అంతేకాకుండా వ్యాపార విస్తరణ వ్యూహాలు సమర్థవంతంగా రూపొందించే నైపుణ్యాలున్న అభ్యర్థులకు ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
మార్కెటింగ్, డేటా అనలిటిక్స్..
ప్రస్తుతం ఈ–కామర్స్ లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ వ్యాపారాలను మరింత వ్యూహాత్మకంగా విస్తరించాలనే ఉద్దేశంతో కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అను గుణంగా సేవలందించడం, కస్టమర్స్ మెచ్చే ప్రొడక్ట్‌లను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకోసం మార్కెటింగ్, డేటాఅనలిటిక్స్ విభాగాల్లో నియా మకాలకు ప్రాధాన్యం ఇచ్చాయి.
స్టార్టప్ సంస్థల్లో.. ఈ ప్రొఫైల్స్ :
స్టార్టప్ సంస్థలు ప్రధానంగా ప్రొడక్ట్ డిజైన్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్‌లో ఎక్కువగా నియామకాలు చేపట్టాయి. దీనికి కారణం.. సదరు స్టార్టప్ సంస్థలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రొడక్ట్‌లు రూపొందించి.. వాటికి మార్కెట్లో ఆదరణ లభించేలా వ్యవహరిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఈ నైపుణ్యాలుంటాయనే ఉద్దేశంతో బి–స్కూల్స్‌లో ప్లేస్‌మెంట్స్ చేపట్టాయి.
ఈ స్కిల్స్ ఉంటేనే..
ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు.. అభ్యర్థుల్లోని కోర్ నైపుణ్యాలే కాకుండా.. వ్యాపా రాభివృద్ధికి దోహదపడే స్కిల్స్‌కూ ప్రాధాన్యం ఇచ్చాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, కొలాబరేషన్, ఇన్నోవేషన్ నైపుణ్యాలున్న విద్యార్థులకు ఎక్కువగా ఆఫర్స్ ఇచ్చాయి. ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కరించి.. వ్యాపార కార్యకలాపాలకు అవరోధం కలగకుండా వ్యవహరించొచ్చనే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు.
మిగతా సెక్టార్స్ సంగతి..
ప్రస్తుత పరిస్థితుల్లో బీఎఫ్‌ఎస్‌ఐ,ఎడ్యుకేషన్ సెగ్మెంట్స్‌లో టెక్ ఆధారిత సేవలు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. గతేడాది ఈ టెక్ స్టార్టప్‌లే నిధుల సమీకరణలో ముందంజలో నిలిచాయి. దాంతో ఫిన్‌టెక్, ఎడ్‌టెక్ వంటి టెక్ స్టార్టప్స్‌లో ఆఫర్లు పెరిగాయి. మరోవైపు ఎప్పటి మాదిరిగానే కన్సల్టింగ్ సంస్థలు, బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడంలో ముందు వరుసలో నిలిచాయి. అదే విధంగా మాన్యుఫ్యాక్చరింగ్ విభాగంలోనూ నియామకాలు ఆశాజనకంగానే కనిపించాయి. వీటిలోనూ అధిక శాతం జాబ్ ప్రొఫైల్స్ డేటా అనాలిసిస్, బిగ్ డేటా, మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాల్లోనే లభించాయి.
సానుకూల సంకేతాలు..
ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈకామర్స్, స్టార్టప్ సంస్థలు.. టైర్–2,టైర్–3ల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. ప్రధానంగా మెట్రో నగరాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ రిక్రూట్‌మెంట్స్ ఉండొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, సీఆర్‌ఎం, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలకు టైర్–2, టైర్–3 ఇన్‌స్టిట్యూట్‌లవైపు చూసే అవకాశాలు న్నాయని ఆయా క్యాంపస్ ప్లేస్‌మెంట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తంగా చూస్తే గతేడాది కోవిడ్ కారణంగా కొంత వెనుకంజలో ఉన్న బి–స్కూల్స్ ప్లేస్‌మెంట్స్.. తిరిగి పుంజుకోవడంతో మేనేజ్‌మెంట్ విద్యార్థులకు భవిష్యత్తు ఆశాజనకం అనే భావన ఏర్పడుతోంది. మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులు రానున్న రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఐఐఎం ప్లేస్‌మెంట్స్ ముఖ్యాంశాలు..
- 2021లో ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్స్‌లో భారీగా పెరుగుదల.
- సగటున రూ. 12 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తున్న వైనం.
- మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, సీఆర్‌ఎం విభాగాల్లో నియామకాలు.
- స్టార్టప్ ఆఫర్స్‌లో టెక్ స్టార్టప్స్ హవా.
- రానున్న రోజుల్లో ఇతర బి–స్కూల్స్‌లోనూ నియామకాలు ఆశాజనకంగా ఉంటాయంటున్న నిపుణులు.
డిజిటలైజేషనే ప్రధాన కారణం...
ఈ–కామర్స్ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టడానికి ప్రధాన కారణం డిజిటలైజేషనే అని చెప్పొచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వినియోగదారులు డిజిటల్ కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ–కామర్స్ మార్కెట్ విస్తృతమవుతోంది. దానికి అనుగుణంగా సంస్థలు నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి.
– ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్, చైర్ పర్సన్, సీడీఎస్, ఐఐఎం–బెంగళూరు