Skip to main content

ఈ స్కిల్స్‌ ఉంటే ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్స్‌గా మంచి కెరీర్‌.. లక్షల్లో వేతనాలు..!

ఐటీ రంగంలో కొలువుల కోసం అన్వేషిస్తున్నారా.. జాబ్‌ మార్కెట్లో పోటీ చూసి ఆందోళన చెందుతున్నారా..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలుంటే.. తేలిగ్గానే కొలువు సొంతం చేసుకోవచ్చు. ఎంట్రీ లెవల్‌లోనే లక్షల్లో వేతనం అందుకోవచ్చు. ఒక్కసారి నిలదొక్కుకుంటే..S ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. టాప్‌–10 సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌ జాబితాలో నిలిచిన కొలువు.. ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ !! ఈ నేపథ్యంలో.. ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఏమిటి.. ఎలాంటి నైపుణ్యాలు అవసరం.. సదరు కోడింగ్‌ స్కిల్స్‌ నేర్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రతి విభాగంలో ప్రతి సంస్థకు వెబ్‌సైట్‌ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా నేటి ఈకామర్స్‌ యుగంలో వినియోగదారులకు ఆన్‌లైన్‌ సేవలు అందించేందుకు వెబ్‌సైట్‌ చాలా అవసరం. కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌.. ఇలా దేనిద్వారానైనా మనం ఇంటర్నెట్‌ను వినియోగించేటప్పుడు సదరు వెబ్‌సైట్‌లో మనకు స్క్రీన్‌పై కనిపించే టెక్ట్స్‌, చిత్రాలు, వీడియోలు, కలర్స్, ఫాంట్స్, మెనూ.. ఇవన్నీ ఫ్రంట్‌ ఎండ్‌ కిందకు వస్తాయి. సదరు వెబ్‌సైట్స్‌ను ఆకర్షణీయంగా, యూజర్‌ ఫ్రెండ్లీగా, యూజర్‌ ఇంటరాక్టివ్‌గా రూపొందించే వారే.. ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్స్‌! అందుకోసం వీరికి హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్‌ నైపుణ్యాలు తప్పనిసరి. ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్‌గా కొలువు ఖాయం చేసుకోవచ్చు. ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు సైతం అందుకోవచ్చు.

హెచ్‌టీఎంఎల్‌..
ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో కీలకం.. హైపర్‌ టెక్ట్స్‌ మార్క్‌అప్‌ లాంగ్వేజ్‌ (హెచ్‌టీఎంఎల్‌). దీనిద్వారా వెబ్‌సైట్‌ లే అవుట్‌ను, స్ట్రక్చర్‌ను, కంటెంట్‌ను రూపొందిస్తారు. హెడ్డింగ్స్, పేరాలు, బాక్స్‌లు, ఇమేజ్‌లు, టెక్ట్స్, టేబుల్స్‌ వంటివన్నీ హెచ్‌టీఎంఎల్‌ ద్వారానే సాధ్యం. వెబ్‌సైట్‌ తెరవగానే మనకు హోమ్‌ పేజ్, హెడర్, బాడీ, పుటర్, వీడియోలు, పిక్చర్స్‌ వంటివి కనిపిస్తుంటాయి. ఇలా వెబ్‌పేజీలను సిద్ధం చేసే ప్రాథమిక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌.. హెచ్‌టీఎంఎల్‌. మార్క్‌ అప్‌ అప్లికేషన్‌గా పిలిచే హెచ్‌టీఎంఎల్‌ ద్వారా వెబ్‌సైట్‌ యూజర్లు పేజ్‌ సోర్స్, ఇన్‌స్పెక్ట్‌ ఎలిమెంట్స్‌ వంటి అంశాలను చూసే అవకాశం కూడా ఉంటుంది.

సీఎస్‌ఎస్‌..
ప్రస్తుతం ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో సీఎస్‌ఎస్‌ కీలకంగా నిలుస్తోంది. సీఎస్‌ఎస్‌ అంటే క్యాస్కేడింగ్‌ సై్టల్‌ షీట్స్‌. హెచ్‌టీఎంఎల్‌ ద్వారా వెబ్‌సైట్‌ స్ట్రక్చర్‌ను రూపొందిస్తే.. దానికి కలర్స్, ఫాంట్స్, స్పేస్, మార్జిన్స్‌ వంటి వాటి ద్వారా చక్కటి రూపు ఇచ్చేది సీఎస్‌ఎస్‌. ఒక్క మాటలో చెప్పాలంటే.. హెచ్‌టీఎంఎల్‌ డాక్యుమెంట్‌ స్క్రీన్‌పై ఎలా కనిపించాలో నిర్ణయించేది సీఎస్‌ఎస్‌. వెబ్‌పేజెస్‌కు పలు రకాల స్టయిల్స్‌ను రూపొందించడం, బ్యాక్‌గ్రౌండ్‌ కలర్స్, బోర్డర్స్,టేబుల్స్, హైట్, విడ్త్, వెబ్‌ పేజ్‌ జూమ్‌–ఇన్, జూమ్‌–అవుట్, లింక్స్, యానిమేషన్స్, బటన్స్‌ వంటివి ఇచ్చేందుకు సీఎస్‌ఎస్‌ ఉపయోగపడుతుంది. దీనివల్ల వీక్షకులకు సదరు వెబ్‌సైట్‌ను, అందులో అంతర్గతంగా ఉండే వెబ్‌ పేజ్‌లు, ఇతర లింక్‌ పేజ్‌లను సులభంగా బ్రౌజ్‌ చేయడం, నేవిగేట్‌ చేయడం వీలవుతోంది.

జావా స్క్రిప్ట్‌..
ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో ఎంతో కీలకంగా భావించే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌.. జావా స్క్రిప్ట్‌. ఇది ప్రపంచంలోనే అత్యంత పాపులర్‌ ప్రోగ్రామింగ్‌ ల్వాంగేజ్‌. ఇది వెబ్‌సైట్‌కు సంబంధించిన ఇంటరాక్టివ్‌ అప్లికేషన్స్‌ రూపొందించడానికి అవసరమయ్యే ముఖ్యమైన నైపుణ్యం. ప్రధానంగా వెబ్‌సైట్‌ను యూజర్‌ ఇంటరాక్టివ్‌గా మార్చడంలో జావా స్క్రిప్ట్‌ తోడ్పడుతుంది. ఇది హెచ్‌టీఎంఎల్‌ డాక్యుమెంట్‌ కంటెంట్‌ను, అట్రిబ్యూట్స్‌ను, సీఎస్‌ఎస్‌ స్టైల్స్‌ను మార్చగలదు. జావా స్క్రిప్ట్‌ ద్వారా వెబ్‌సైట్‌లోని ఫామ్స్, అలర్ట్స్, కుకీస్, పాప్‌–అప్‌ పేజెస్, వీడియోస్‌ వంటి వాటిని యూజర్‌ ఇంటరాక్టివ్‌గా మార్చొచ్చు. జావా స్క్రిప్ట్‌ ద్వారా వెబ్‌సైట్‌కు సంబంధించిన అన్ని రకాల సదుపాయాలను సులువుగా వీక్షించే అవకాశం లభిస్తుంది. జావా స్క్రిప్ట్‌.. వెబ్‌ అప్లికేషన్స్, మొబైల్‌ యాప్స్, గేమ్‌ డెవలప్‌మెంట్‌లో ఉపయోగపడుతుంది. జాబ్‌ స్క్రిప్ట్‌ నిపుణులకు వెబ్‌ అప్లికేషన్స్‌పై అవగాహనతోపాటు, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌ కోడింగ్‌ స్కిల్స్‌ అవసరం.

ఫ్రంట్‌ ఎండ్‌ టు బ్యాక్‌ ఎండ్‌..
వినియోగదారుల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా వెబ్‌సైట్‌ను రూపొందించడంలో..  జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌ నైపుణ్యాలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ మూడింటిపై పట్టు ఉన్న వారు ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్స్‌గా రాణించొచ్చు. వీరు సర్వర్‌సైడ్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యం అయిన బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్‌గా మారాలనుకుంటే.. పీహెచ్‌పీ, పైథాన్, జావా వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లను నేర్చుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి : part 2: ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ స్కిల్స్‌ నేర్చుకునేందుకు ఎన్నో మార్గాలు.. వివరాలు తెలుసుకోండిలా..

Published date : 23 Jun 2021 05:27PM

Photo Stories