త్వరలో క్యాట్ నోటిఫికేషన్.. జాతీయ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీఏకు అవకాశం..
ఈ ఏడాది క్యాట్–2021 నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. క్యాట్ నిర్వాహక ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐఎం–అహ్మదాబాద్‌ను ప్రకటించారు. నవంబర్ చివరి వారంలో క్యాట్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. క్యాట్ పరీక్ష విధానం, టాప్ స్కోర్ సాధించేందుకు మార్గం.. మలిదశ ఎంపిక ప్రక్రియపై ప్రత్యేక కథనం..
దేశంలో మేనేజ్‌మెంట్ విద్యకు అత్యున్నతమైన ఇన్‌స్టిట్యూట్‌లు..ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) క్యాంపస్‌లు. ఇవి అం దించే పీజీ కోర్సు పూర్తిచేసుకుంటే..కార్పొరేట్ కంపెనీల్లో లక్షల వేతనాలతో కొలువు ఖాయం అవుతుంది. అలాంటి ఐఐఎంల్లో ప్రవేశానికి తొలి అడుగు.. క్యాట్. 2021 క్యాట్‌కు సంబంధించి సన్నాహకాలు ప్రారంభమయ్యాయి.
గతేడాది మాదిరిగానే!
క్యాట్ అభ్యర్థుల్లో.. ఈ ఏడాది పరీక్ష విధానం ఎలా ఉంటుంది.. ఏ ఏ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.. సిలబస్–ప్రశ్నల తీరులో ఏమైనా మార్పులు ఉంటాయా.. ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి క్యాట్ విషయంలో అధికారికంగా ప్రకటన విడుదలయ్యే వరకు పరీక్ష విధానం గురించి స్పష్టంగా చెప్పడం కొంత కష్టమే అంటున్నారు నిపుణులు. కారణం..ప్రతి ఏటా క్యాట్ పరీక్ష విధానంలో ఏదో ఒక ఊహించని మార్పు జరుగుతుండటమే! గత సంవత్సరం క్యాట్ పరీక్ష విధానాన్ని పరిగణనలోకి తీసుకొని..ఈ ఏడాది కూడా దాదాపు ఇదే విధంగా ఉండొచ్చని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మూడు విభాగాలు..
గత ఏడాది(క్యాట్–2020) మొత్తం మూడు విభాగాల్లో.. రెండు గంటల వ్యవధిలో పరీక్ష జరిగింది.
సెక్షన్–ఎ: వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్(వీఏఆర్‌సీ)–26 ప్రశ్నలు.
సెక్షన్–బి: డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్(డీఐఎల్‌ఆర్)–24 ప్రశ్నలు.
సెక్షన్–సి: క్వాంటిటేటివ్ ఎబిలిటీ(క్యూఏ)–26 ప్రశ్నలు.
మొత్తం 76 ప్రశ్నలకు క్యాట్ జరిగింది. పరీక్ష సమయాన్ని రెండు గంటలకు కుదించారు. అంతకుముందు సంవత్సరాల్లో ఇది మూడు గంటలు. గత ఏడాది అనూహ్యంగా పరీక్ష సమయం కేవలం రెండు గంటలుగా నిర్ణయించారు. అంతేకాకుండా ఒకే రోజు మూడు స్లాట్లలో పరీక్ష నిర్వహించడం గమనార్హం.
ఎంసీక్యూ, నాన్–ఎంసీక్యూస్..
క్యాట్–2020లో.. ఆబ్జెక్టివ్ తరహా బహుళైచ్ఛిక ప్రశ్నలతోపాటు, చిన్నపాటి వాక్యాలు లేదా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిన విధంగా నాన్–ఎంసీక్యూలను అడిగారు. వీఏఆర్‌సీ విభాగం నుంచి 8, డీఐఎల్‌ఆర్ నుంచి 6, క్యూఏ నుంచి 8 చొప్పున నాన్–ఎంసీక్యూ ప్రశ్నలు ఎదురయ్యాయి.
ప్రిపరేషన్ మొదలు..
ఈ ఏడాది నవంబర్ చివరి ఆదివారం పరీక్ష జరిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే.. పరీక్షలో మెరుగైన స్కోర్ సాధించే వీలుంటుంది. తద్వారా ఐఐఎంలు తదుపరి దశలో నిర్వహించే ఎంపిక ప్రక్రియ(జీడీ/పీఐ)కు అర్హత లభిస్తుంది.
వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్..
ఇది అభ్యర్థుల్లోని ఇంగ్లిష్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షించే విభాగం. ఇందులో రాణించాలంటే.. యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా ఫ్యాక్ట్స్, ఇన్ఫరెన్సెస్, జంబుల్డ్ పేరాగ్రాఫ్‌లను ప్రాక్టీస్ చేయాలి. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడిగే రీడింగ్ కాంప్రహెన్షన్‌లో.. స్కోర్ కోసం అసెంప్షన్స్, స్టేట్‌మెంట్స్‌పై పట్టు సాధించాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్..
ఈ విభాగంలో విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే.. టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. లాజికల్ రీజనింగ్ విషయంలో క్యూబ్స్, క్లాక్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్..
ఈ విభాగం పూర్తిగా అభ్యర్థుల్లోని మ్యాథమెటికల్, అర్థమెటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలంటే.. అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్–టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్ మ్యాథ్స్, జామెట్రీ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఇంకా చదవండి :part 2: క్యాట్‌లో నిర్దిష్ట కటాఫ్ సాధించే మార్గాలు ఇవే..