Skip to main content

మేటి ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీఏ చేసేందుకు మార్గాలు ఎన్నో.. స‌మాచారం తెలుసుకోండిలా..

ఒక వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించాలంటే.. సమర్థ నాయకత్వం అవసరం. వినూత్న ఆలోచనలు, నాయకత్వ పటిమ, దార్శనికత.. ఎప్పటికప్పడు ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా మారుతూ.. సృజనాత్మకతతో ముందుకు వెళ్లే నేర్పు ఉండాలి. మరి ఇలాంటి నాయకత్వæ లక్షణాలు పెంపొందించే చదువు ఏదైనా ఉందా..! అంటే.. అదే ఎంబీఏ(మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌)!! మేనేజ్‌మెంట్‌ విద్యకు సంబంధించి ప్రవేశాలు కల్పించేందుకు ఆయా బీస్కూల్స్, యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు.. విభిన్న ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి.

 ప్రతిష్టాత్మక ఐఐఎంల్లో ప్రవేశాలకు వీలు కల్పించే క్యాట్‌ 2020కు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. క్యాట్‌తోపాటు ప్రముఖంగా నిలుస్తున్న మరికొన్ని ఎంబీఏ ఎంట్రెన్స్‌ టెస్టుల గురించి తెలుసుకుందాం..

ఎంబీఏ..

ఆసక్తి, అభిరుచులకు తగినట్లు విభిన్న స్పెషలైజేషన్లు ఉండే కోర్సు.. మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ). గ్రాడ్యుయేషన్‌ ఏ విభాగంలో పూర్తి చేసినా.. ఎంబీఏలో చేరొచ్చు. మంచి బీస్కూల్‌లో ఎంబీఏ చేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయాలనుకుంటే.. సంబంధిత  ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలు ఎంబీఏలో ప్రవేశాల కోసం విభిన్న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.  

క్యాట్‌ :

 •     దేశంలో నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ విద్యను అందించడంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లకు మంచి పేరుంది. అంతటి గుర్తింపు కలిగిన ఐఐఎంల్లో ప్రవేశం పొందాలంటే.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌) రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులు ఐఐఎంలతోపాటు ఇతర బిజినెస్‌ స్కూళ్లల్లో ఎంబీఏలో చేరేందుకు అవకాశం ఉంటుంది.  ఇప్పటికే క్యాట్‌ 2020 నోటిఫికేషన్‌ విడుదలైంది.  సెప్టెంబర్‌ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 •     అర్హత: క్యాట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్‌ అభ్యర్థులు 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు 45శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. అలాగే డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదివే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 •     పరీక్షా విధానం: ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే క్యాట్‌ పరీక్ష మూడు సెక్షన్లుగా ఉంటుంది. ఇందులో డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 
 •     ఎంపిక ప్రక్రియ : ఐఐఎంలు క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా తదుపరి ఎంపిక ప్రక్రియ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తాయి.  గ్రూప్‌ డిస్కషన్, రిటన్‌ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వూల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ, పని అనుభవం, అకడెమిక్‌ రికార్డు తదితరæ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. 
 •     వెబ్‌సైట్‌: https://iimcat.ac.in

మ్యాట్‌..

 • జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాసంస్థల్లో ఎంబీఏలో చేరడానికి  అందుబాటులో ఉన్న మరో మార్గం..  మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(మ్యాట్‌ ). ఏటా నాలుగుసార్లు నిర్వహించే ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 600 బీస్కూల్స్‌లో ప్రవేశం పొందే అవకాశం లభిస్తుంది. ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్లలో మ్యాట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. 
 •     అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీలో (ఏదేని గ్రూప్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలాంటి వయోపరిమితి నిబంధనలేదు.
 •     పరీక్ష విధానం: మ్యాట్‌ పరీక్ష ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 5 విభాగాల నుంచి 200 ప్రశ్నలను ఆబ్జెక్టివ్‌ విధానంలో అడుగుతారు. లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్, డేటా అనాలసిస్‌ అండ్‌ డేటా సఫిషియెన్సీ, మ్యాథమెటికల్‌ స్కిల్స్, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగాల్లో పరీక్ష ఉంటుంది. ప్రతీ విభాగం నుంచి 40 ప్రశ్నలు చొప్పున, ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ప్రతీ తప్పు సమాధానానికి నాల్గో వంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. మ్యాట్‌ సెప్టెంబర్‌ 2020 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది సెప్టెంబర్‌ 15. పరీక్ష తేదీ సెప్టెంబర్‌ 20, 2020.  
 •     పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://mat.aima.in/sep20/

జీమ్యాట్‌..

 • జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించే పరీక్ష.. గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌  అప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీమ్యాట్‌). గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌(జీఎంఏసీ).. జీమ్యాట్‌ పరీక్షను నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని 2వేలకు పైగా బీస్కూల్స్‌లో ప్రవేశాల కోసం 114 దేశాల్లోని 650పైగా పరీక్షా కేంద్రాల్లో జీమ్యాట్‌ పరీక్ష జరుగుతుంది. 
 •     అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ (ఏదేని గ్రూప్‌) పూర్తిచేసినవారై ఉండాలి. 
 •     వయసు : 18 ఏళ్ల వయసు నిండిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
 •     ఏడాదికి ఐదుసార్లు జీమ్యాట్‌ పరీక్షను రాసుకునే వెసులుబాటు ఉంది. ఒకసారి పరీక్షకు రాశాక తిరిగి 16 రోజుల తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసుకోవచ్చు.
 •     పరీక్ష విధానం: జీమ్యాట్‌ పరీక్షను ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహిస్తారు. మొత్తం నాలుగు సెక్షన్‌లుగా  పరీక్ష ఉంటుంది. ఇందులో అనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్, ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలు ఉంటాయి. రెండు ఆçప్షనల్‌ బ్రేక్స్‌తో మూడున్నర గంటల కాలవ్యవధితో పరీక్షను నిర్వహిస్తారు. 
 •     ఎంపిక ప్రక్రియ: జీమ్యాట్‌లో సాధించిన స్కోర్‌ అధారంగా ఆయా బీస్కూల్స్‌ అభ్యర్థులను షార్‌లిస్ట్‌ చేస్తాయి. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారికి గ్రూప్‌ డిస్కషన్, రిటన్‌ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వూ్యలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి ప్రవేశం కల్పిస్తారు.
 •     పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.mba.com/exams/gmat

ఎక్స్‌ఏటీ(గ్జాట్‌)..

 • జాతీయ స్థాయిలో మంచి పేరున్న మరో ఎంబీఏ ఎంట్రెన్స్‌.. జేవియర్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(ఎక్స్‌ఏటీ). స్టీల్‌ సిటీ జంషెడ్‌పూర్‌లో ఏర్పాటైన ప్రతిష్టాత్మక బీస్కూల్‌.. జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ).. ఎక్స్‌ఏటీ పరీక్షను ఏటా నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా దాదాపు 150 బీస్కూల్స్‌లో ఎంబీఏలో ప్రవేశం పొందే అవకాశం లభిస్తుంది. 2021 విద్యా సంవత్సరానికి  సంబంధించి గ్జాట్‌ నోటిఫికేషన్‌ ఈ నెల (సెప్టెంబర్‌) రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.  
 •     అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీలో (ఏదేని గ్రూప్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎటువంటి వయోపరిమితి నిబంధనలేదు.
 •     పరీక్ష విధానం : ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు.  ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వెర్బల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ, డెషిసన్‌ మేకింగ్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్, జనరల్‌ నాలెడ్జ్‌ పై పరీక్ష ఉంటుంది. ప్రశ్నల సంఖ్య ప్రతిఏటా మారుతుం టుంది. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. 
 •     ఎంపిక ప్రక్రియ: ఎక్స్‌ఏటీ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వూలను నిర్వహించి  ప్రవేశాలను కల్పిస్తారు. 
 •     పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.xlri.ac.in

సీమ్యాట్‌..

 • దేశంలో మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించే మరో ప్రవేశ పరీక్ష.. కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీమ్యాట్‌). నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రతి ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో సాధించిన స్కోర్‌ అధారంగా దేశ వ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన దాదాపు 500కి పైగా  ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఎంబీఏలో ప్రవేశాలు పొందొచ్చు. అక్టోబర్‌ చివరి వారంలో సీమ్యాట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.
 •     అర్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ( 10+2+3)లో ఉత్తీర్ణత ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 •     పరీక్షా విధానం: కంప్యూటర్‌ బెస్డ్‌ విధానంలో సీమ్యాట్‌ ఉంటుంది. నాలుగు విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు–400 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్,లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ కాంప్రెహెన్షన్, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతీ సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి. అలాగే ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. 
 •     ఎంపిక విధానం : సీమ్యాట్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సంబంధిత విద్యాసంస్థలు.. గ్రూప్‌ డిస్కషన్‌(జీడీ), పర్సనల్‌ ఇంటర్వూ(పీఐ), రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌ వంటివి నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తాయి.  
 •     పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://cmat.nta.nic.in/webinfo/public/homeaspx

ఐఐఎఫ్‌టీ..

 • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ).. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని  మరో ప్రతిష్టాత్మక స్వయం ప్రతిపత్తి విద్యా సంస్థ. ఫారిన్‌ ట్రేడ్‌లో నాణ్యమైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు దీనిని ఏర్పాటుచేశారు.  ఐఐఎఫ్‌టీకి  న్యూఢిల్లీ, కోల్‌కత్తా, దారుస్సలాంల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చూస్తోంది. సెప్టెంబర్‌ రెండో వారంలో పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. డిసెంబర్‌ మొదటి వారంలో పరీక్షను నిర్వహిస్తారు. 
 •     అర్హతలు: ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం మూడేళ్ల కాలవ్యవధి కలిగిన బ్యాచిలర్‌ డిగ్రీ (ఏదైన విభాగం)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 
 •     పరీక్షా విధానం: ఐఐఎఫ్‌టీ పరీక్ష ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌  పద్ధతిలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 120 నిమిషాలు. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్, వెర్బల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.  ప్రతి తప్పు సమాధానానికి  మూడో వంతు(1/3) మార్కు కోతను విధిస్తారు. 
 •     ఎంపిక ప్రక్రియ : ఐఐఎఫ్‌టీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి.. గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వూ, రిటన్‌ ఎబిలిటీ టెస్ట్‌లను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.  
 •     పూర్తి వివ‌రాల‌కు‡ వెబ్‌సైట్‌: http://tedu.iift.ac.in/iift/index.php

ఏపీ/టీఎస్‌ ఐసెట్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ ప్రవేశాలకోసం ఏటా నిర్వహించే పరీక్ష.. ఐసెట్‌(ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌). ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏపీఐసెట్‌.. తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీల్లో ప్రవేశాలకు టీఎస్‌ ఐసెట్‌ జరుగుతుంది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఏపీ ఐసెట్, టీఎస్‌ ఐసెట్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఏటా మార్చి/ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది.

Published date : 05 Sep 2020 12:51PM

Photo Stories