Skip to main content

ఎంబీఏ.. ఇండియా vs అబ్రాడ్

ఎంబీఏ/మేనేజ్‌మెంట్ పీజీ.. నేడు ఎంతో మంది విద్యార్థుల లక్ష్యం.. ఔత్సాహిక విద్యార్థులు దేశంలోని బి-స్కూల్స్‌లో ప్రవేశానికి సిద్ధమవుతూనే.. ఎంబీఏ స్టడీ అబ్రాడ్ దిశగా కూడా ఆలోచిస్తున్నారు.. అవకాశాలపై అన్వేషణ సాగిస్తున్నారు. మరి ఎంబీఎ ఇన్ ఇండియా, ఎంబీఏ స్టడీ అబ్రాడ్.. ఈ రెండు మార్గాల్లో ఏది బెస్ట్!! జాతీయ స్థాయిలో 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి బి-స్కూల్ ఎంట్రన్స్‌ల సీజన్ ప్రారంభమైంది. అటు.. స్టడీ అబ్రాడ్ కోణంలో పలు దేశాల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎంబీఏ ఇన్ ఇండియా.. ఎంబీఏ అబ్రాడ్‌పై విశ్లేషణ..
స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల్లో అత్యధిక శాతం మంది ఎంబీఏ విద్యార్థులే అన్నది గత మూడేళ్ల గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. భారత్ నుంచి వెళ్తున్న మొత్తం విద్యార్థుల్లో 30 శాతం మంది ఎంబీఏ (మేనేజ్‌మెంట్) కోర్సుల కోసమే! అదే సమయంలో దేశంలోనూ ప్రతిష్టాత్మక ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీస్కూళ్లలో ఎంబీఏ పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

అంతర్జాతీయ గుర్తింపు
అమెరికా వంటి విదేశాల్లో ఎంబీఏ చదవాలని మన విద్యార్థులు కోరుకోవడానికి ప్రధాన కారణం.. ఫారిన్ ఎంబీఏ పట్టా చేతిలో ఉంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందనే అభిప్రాయం. కామన్వెల్త్ దేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ పూర్తిచేస్తే ఆయా సభ్య దేశాల్లో ఎక్కడైనా అవకాశం అందుకోవచ్చు. వాస్తవానికి మన దేశంలోని ఐఐఎంలు, ఐఎస్‌బీ, ఇతర ప్రముఖ బీస్కూల్స్‌కు సైతం ఇటీవల కాలంలో అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఉదాహరణకు ఐఐఎం- అహ్మదాబాద్, ఐఐఎం-బెంగళూరు వంటి ఇన్‌స్టిట్యూట్‌లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో, ఎకనామిస్ట్ సర్వేలో టాప్-50, టాప్-100లలో నిలుస్తున్నాయి.

భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఎంబీఏను లక్ష్యంగా చేసుకోవడానికి మరో ప్రధాన కారణం.. కోర్సు వ్యవధి. మన దేశంలో ఎంబీఏ కోర్సు వ్యవధి రెండేళ్లు (ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లకు ఏడాది). అదే ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ వంటి దేశాల్లో వివిధ సంస్థలు 14 నుంచి 16 నెలలకే ఎంబీఏ పట్టా చేతికందిస్తున్నాయి. యూఎస్‌లోనూ దాదాపు ఇదే తీరు కనిపిస్తోంది.

సిలబస్ స్వరూపం
సిలబస్ పరంగానూ విదేశీ యూనివర్సిటీల్లో వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంటారు. మన దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో మాత్రం మూడు, నాలుగేళ్లకోసారి మాత్రమే సిలబస్‌లో మార్పులు జరుగుతున్నాయి. అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌లు ఇటీవల కాలంలో సిలబస్ పరంగా స్వల్ప వ్యవధిలో మార్పులు చేస్తున్నప్పటికీ.. యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు మాత్రం ఈ విషయంలో వెనుకంజలో ఉన్నాయి.

ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్ వర్క్స్
విద్యార్థులకు రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ అందించే ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్ వర్క్స్ పరంగా విదేశీ బీస్కూల్స్.. ఇంటర్న్‌షిప్స్‌ను కరిక్యులంలో తప్పనిసరి చేస్తున్నాయి. కానీ భారత్‌లో ఇప్పటికీ ఇంటర్న్‌షిప్ కరిక్యులంలో భాగంగా లేదు. ఐఐఎంలలో పీపీఓ/ఎస్‌పీఓ పేరుతో కంపెనీల్లో ఇంటర్న్‌షిప్స్ లభిస్తున్నప్పటికీ.. టైర్-2 ఇన్‌స్టిట్యూట్‌లలో మాత్రం ఎక్కువ మందికి ఈ అవకాశం అందడంలేదు.

ప్రతికూలతలు ఉన్నాయ్!
విదేశాల్లో ఎంబీఏ చేయాలంటే.. బెస్ట్ యూనివర్సిటీ ఎంపిక, అర్హత ప్రమాణాలు, వాటిలో ఉత్తీర్ణత పొందేందుకు దాదాపు ఏడాది ముందు నుంచే ఆ కసరత్తు ప్రారంభించాల్సి వస్తోంది. ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌లలో చేరాలనుకుంటే.. అభ్యర్థులు జీమ్యాట్‌లో అత్యుత్తమ స్కోర్ సొంతం చేసుకోవాలి. జీమ్యాట్‌కు హాజరవ్వాలనుకుంటే 250 డాలర్ల ఫీజు చెల్లించాలి. జీమ్యాట్‌లో తొలి విడతలో మంచి స్కోర్ పొందలేక మరోసారి హాజరు కావాలనుకుంటే.. మరోసారి సదరు ఫీజు చెల్లించాల్సిందే. మన దేశంలో ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1600 మాత్రమే.

ఖర్చూ ఎక్కువే
మన దేశంలోని ఐఐఎంలు, ఇతర ప్రథమ శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌లలో రెండేళ్ల ఎంబీఏకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వ్యయం అవుతుంది. విదేశాల్లో ప్రథమ శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌లలో ఫీజులు దాదాపు రెట్టింపు (రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షలు) ఉంటున్నాయి. వీటికి అదనంగా నివాస ఖర్చులు, ఇతర వ్యక్తిగత వ్యయాలకు కనీసం రూ.పది లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులకు రుణ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గ్యారెంటీ లేదు. చదువు పూర్తయ్యాక భారత్‌కు తిరిగొచ్చి సొంతంగా ఉద్యోగాన్వేషణ సాగించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు మన దేశంలో ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగం ఖాయం అనే భరోసా లభిస్తోంది. సగటున రూ.12 నుంచి రూ.15 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.

ఎంబీఏ ఇన్ ఇండియా..
సానుకూల అంశాలు
  • తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తిచేసే అవకాశం.
  • పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశిస్తే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఖాయం.
  • స్పెషలైజేషన్ విధానం అమలవుతున్న నేపథ్యంలో సంబంధిత విభాగంలో ప్రత్యేక నైపుణ్యాలు పొందే సౌలభ్యం.

ప్రతికూల అంశాలు
  • వాస్తవ పరిస్థితులకు సరితూగని విధంగా సిలబస్ కరిక్యులం.
  • ఇంటర్న్‌షిప్ పరంగా ద్వితీయ శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులు.
  • లెర్నింగ్‌లో ఇప్పటికీ సంప్రదాయ విధానాలే కొనసాగుతున్న పరిస్థితి.

ఎంబీఏ స్టడీ అబ్రాడ్..
సానుకూల అంశాలు
  • రియల్ టైం ఎక్స్‌పోజర్ కల్పించేలా కరిక్యులం.
  • 14 నుంచి 16 నెలల్లో కోర్సు పూర్తిచేసే అవకాశం.
  • ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్, ఇంటర్న్‌షిప్స్, రియల్‌టైం ఎక్స్‌పీరియన్స్ పరంగా ఎన్నో సదుపాయాలు.

ప్రతికూల అంశాలు
  • భారత ఇన్‌స్టిట్యూట్‌లతో పోల్చితే రెట్టింపు ఖర్చు.
  • క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నో గ్యారెంటీ.
  • పని అనుభవం ఉంటేనే ప్రవేశాల్లో ప్రాధాన్యం.

ఇటీవల కాలంలో ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్ కోర్సుల పరంగా మన బీస్కూల్స్‌లోనూ ప్రమాణాలు మెరుగవుతున్నాయి. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, మార్కెట్ పరిస్థితులపై అవగాహన కలిగేలా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌కు ఇన్‌స్టిట్యూట్స్ రూపకల్పన చేస్తున్నాయి.
- ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్, ఐఐఎం-బి.

స్టడీ అబ్రాడ్ ఎంబీఏ ఔత్సాహికులు ప్రధానంగా.. కోర్సు తర్వాత లభించే అవకాశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రోగ్రామ్‌కు మార్కెట్‌లో ఏ మేరకు విలువ ఉంది? జాబ్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకోవాలి. చాలా మంది విద్యార్థులు స్టడీ అబ్రాడ్ లక్ష్యంగా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం లభిస్తే చాలు అనే ధోరణితో ఉంటారు. ఇది ఏ మాత్రం సరికాదు.
- ప్రొఫెసర్ బి సురేశ్, ఐఐఎం-వి.
Published date : 26 Jul 2016 01:38PM

Photo Stories