CAT Exam 2021: వీటిలో అడుగుపెడితే.. ఉజ్వల భవిష్యత్ ఖాయం
- ఐఐఎంల్లో ప్రవేశాలకు తొలి ప్రామాణికం క్యాట్
- క్యాట్ స్కోర్‌తోపాటు మరెన్నో అంశాలకు వెయిటేజీ
- మలి దశలో జీడీ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ
- వీటిపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలంటున్న నిపుణులు
- నవంబర్ 28న క్యాట్ పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)
క్యాట్ 2021కు దరఖాస్తు ప్రక్రియ ఇటీవలే ముగిసింది. నవంబర్ 28న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది క్యాట్‌కు హాజరుకానున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. ఐఐఎంల ప్రవేశ విధానంపై సమగ్ర కథనం...
క్యాట్ 2021కు 2 లక్షల 30 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులంతా ప్రస్తుతం ఈ పరీక్షలో టాప్ స్కోర్ సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. వీరు క్యాట్ ఫలితాల ఆధారంగా.. మలిదశలో ఆయా ఐఐఎంలు వేర్వేరుగా నిర్వహించే ప్రవేశ ప్రక్రియ గురించి కూడా ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలన్నది నిపుణుల సూచన.
క్యాట్.. కీలకం
ఐఐఎంల్లో ప్రవేశం పొందడంలో క్యాట్ స్కోర్ కీలకమని చెప్పొచ్చు. ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించి.. మలిదశ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తాయి. సదరు ఇన్‌స్టిట్యూట్‌లు నిర్దిష్ట కటాఫ్ పర్సంటైల్ ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంటాయి. ఆయా ఐఐఎంలు క్యాట్‌లో 80 పర్సంటైల్ నుంచి 95 పర్సంటైల్ వరకూ కటాఫ్‌గా నిర్దేశిస్తున్నాయి.
40 శాతం వెయిటేజీ
తుది జాబితా రూపకల్పనతో క్యాట్ స్కోర్‌కు 40 శాతం వెయిటేజీ లభిస్తోంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు 40 నుంచి 50 శాతం వెయిటేజీ దక్కుతోంది. అభ్యర్థి ప్రొఫైల్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ తదితర అంశాలకు 20 శాతం మేర ఐఐఎంలు వెయిటేజీ కల్పిస్తున్నాయి.
మలి దశ ఇలా
ఐఐఎంలు క్యాట్‌లో నిర్దిష్ట కటాఫ్ పర్సంటైల్ సాధించిన విద్యార్థులకు మలి దశలో.. రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్(జీడీ) నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రతిభ ఆధారంగా చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలోనూ విజయం సాధిస్తే.. ఐఐఎంలో ప్రవేశం ఖాయం అవుతుంది.
గ్రూప్ డిస్కషన్
గ్రూప్ డిస్కషన్‌లో అభ్యర్థులను బృందాలుగా ఏర్పాటు చేస్తారు. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దానిపై చర్చించమంటారు. ఇందులో కోర్ నుంచి కాంటెంపరరీ వరకూ.. అనేక అంశాలు ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన పరిణామాలపైనా ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలి.
రిటెన్ ఎబిలిటీ టెస్ట్
రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో.. అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతున్నారు. సదరు అంశాలకు సంబంధించి మూడు వందల నుంచి నాలుగు వందల పదాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలు సబ్జెక్ట్ నాలెడ్జ్, సోషల్ అవేర్‌నెస్ సమ్మిళితంగా ఉంటున్నాయి.
పర్సనల్ ఇంటర్వ్యూ
గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో నిపుణల కమిటీ సదరు అభ్యర్థికి మేనేజ్‌మెంట్ విద్య పట్ల ఉన్న వాస్తవ ఆసక్తి, అతని భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని అందుకునేందుకు అతను ఎంపిక చేసుకున్న మార్గాలు తదితరాలను తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతుంది.
వెయిటేజీ ఇలా
- ఐఐఎంలు అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా క్యాట్‌తోపాటు మరెన్నో అంశాలకు వెయిటేజీ ఇస్తున్నాయి.
- మొత్తం వంద మార్కుల వెయిటేజీ ఫార్మట్‌లో.. 35శాతం నుంచి 50 శాతం మేరకు జీడీ, పీఐలకు వెయిటేజీ ఉంటోంది.
- డైవర్సిటీ వెయిటేజీ పేరుతో జెండర్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీలకు మూడు నుంచి అయిదు శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నారు.
- అకడమిక్ వెయిటేజీ విధానాన్ని కూడా ఐఐఎంలు అమలు చేస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు ఒక్కో కోర్సుకు ప్రత్యేకంగా వెయిటేజీ ఉంటోంది. ఈ వెయిటేజీని ఒక్కో కోర్సుకు పది శాతంగా పరిగణిస్తున్నారు.
- అకడమిక్ వెయిటేజీలోనే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి ప్రత్యేక వెయిటేజీని కల్పిస్తున్నారు. ఈ వెయిటేజీ రెండు నుంచి మూడు శాతం మధ్యలో ఉంటోంది.
అనుభవం
ఐఐఎంలు వర్క్ ఎక్స్‌పీరియన్స్(పని అనుభవం)కు కూడా వెయిటేజీ ఇస్తున్నాయి. పని అనుభవం ఉన్న అభ్యర్థులకు అయిదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ లభిస్తోంది. ఈ వెయిటేజీ కూడా అభ్యర్థులు పని చేస్తున్న రంగం, అనుభవం గడించిన సంవత్సరాల ఆధారంగా ఉంటోంది.
జండర్ వెయిటేజీ
- మహిళలను ప్రోత్సహించేందుకు ఐఐఎంలు ప్రత్యేకంగా జండర్ డైవర్సిటీ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆ క్రమంలో ప్రాథమిక దశలో క్యాట్ స్కోర్‌తోపాటు జండర్ డైవర్సిటీ, అకడమిక్ మెరిట్‌కు ప్రత్యేక మార్కులు/పాయింట్లు ఇస్తున్నాయి.
- ఐఐఎం కోల్‌కత జండర్ డైవర్సిటీ వెయిటేజీ పేరుతో మహిళా విద్యార్థులకు అదనంగా మూడు మార్కులు కేటాయిస్తోంది.
- ఐఐఎం లక్నో.. మహిళా విద్యార్థులకు రెండు పాయింట్లు ఇస్తోంది.
- ఐఐఎం రోహ్‌తక్.. జండర్ డైవర్సిటీ, నాన్–ఇంజనీరింగ్ ఫ్యాక్టర్స్ పేరుతో మొత్తం ఎంపిక ప్రక్రియలో వీటికి 30 పాయింట్లు కేటాయిస్తుండటం విశేషం.
- ఐఐఎం రాయ్‌పూర్.. జెండర్ డైవర్సిటీకి 20 శాతం వెయిటేజీ ఇస్తోంది.
- ఐఐఎం–ఉదయ్‌పూర్.. 15 పాయింట్లు; ఐఐఎం – కాశీపూర్ మూడు పాయింట్లు జెండర్ వెయిటేజీకి కేటాయిస్తున్నాయి.
పీజీ సీట్లు 4318
ఐఐఎం క్యాంపస్‌లలో పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ మొదలు.. ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ వరకు అన్ని కోర్సులకు కలిపి దాదాపు 12,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో, క్యాట్ ఉత్తీర్ణతతో ప్రవేశం లభించే పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ సీట్ల సంఖ్య 4318 మాత్రమే.
గ్రూప్ డిస్కషన్ ఎంతో కీలకం
మలి దశలో గ్రూప్ డిస్కషన్ ఎంతో కీలకమని అభ్యర్థులు గుర్తించాలి. గ్రూప్ డిస్కషన్‌లో అకడమిక్ అంశాలే కాకుండా.. సామాజిక విషయాలపైనా చర్చించమని అడుగుతున్నారు. కాబట్టి టెక్నికల్, నాన్–టెక్నికల్.. రెండు నేపథ్యాల విద్యార్థులు.. సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. పర్సనల్ ఇంటర్వ్యూలో మేనేజ్‌మెంట్ విద్యలో చేరడానికి కారణాలు.. కెరీర్ లక్ష్యాలను స్పష్టంగా చెప్పి.. మెప్పించే విధంగా వ్యవహరించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి.
–రామ్‌నాథ్.ఎస్.కనకదండి, క్యాట్, కోర్స్ డైరెక్టర్, టైమ్ ఇన్‌స్టిట్యూట్