CAT-2022 Exam Preparation Tips: 50 'డే'స్ సక్సెస్ ప్లాన్..
కామన్ అడ్మిషన్ టెస్ట్..సంక్షిప్తంగా క్యాట్!! దేశంలో మేనేజ్‌మెంట్ విద్యలో.. ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంలు) క్యాంపస్‌లలో.. ఎంబీఏ/మేనేజ్‌మెంట్ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో.. ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఈ టెస్ట్‌కు ఏటా రెండు లక్షల మంది వరకు పోటీ పడుతుంటారు! ఈ ఏడాది క్యాట్-2022 పరీక్ష నవంబర్ 27న జరుగనుంది. అంటే.. అభ్యర్థులకు ఇప్పటినుంచి నికరంగా అందుబాటులో ఉన్న సమయం 50 రోజులు!! ఈ నేపథ్యంలో.. క్యాట్‌లో మెరుగైన స్కోర్ సాధించడానికి ప్రిపరేషన్ ప్లాన్..
- నవంబర్ 27న క్యాట్ ఎంట్రన్స్
- ఐఐఎంలలో మేనేజ్‌మెంట్ పీజీ, పీహెచ్‌డీలకు మార్గం
- ఎంట్రన్స్‌లో మెరుగైన స్కోర్ ప్రధానం
- ప్రణాళికాబద్ద ప్రిపరేషన్ కీలకమంటున్న నిపుణులు
క్యాట్‌కు ఏటేటా పోటీ పెరుగుతోంది. ఐఐఎంల్లో చేరాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ సాగిస్తున్న సీరియస్ అభ్యర్థుల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. మరోవైపు క్యాట్‌లో ప్రశ్నల శైలి, క్లిష్టత స్థాయి కూడా పెరుగుతోంది. కాబట్టి అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ 50 రోజుల సమయాన్ని ఎంతో కీలకంగా భావించాలి అంటున్నారు నిపుణులు.
మూడు విభాగాలు.. రెండు గంటలు
ఈ ఏడాది క్యాట్ మూడు సెక్షన్లుగా రెండు గంటల వ్యవధిలో ఉంటుందని.. నిర్వాహక ఇన్‌స్టిట్యూట్ ఐఐఎం-బెంగళూరు పేర్కొంది. అభ్యర్థులకు వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్(24 ప్రశ్నలు); డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్(20 ప్రశ్నలు); క్వాంటిటేటివ్ ఎబిలిటీ(22 ప్రశ్నలు) విభాగాల్లో మొత్తం 66 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 40 నిమిషాల చొప్పున సమయం అందుబాటులో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కుల విధానం కూడా ఉంటుంది.
పెరుగుతున్న క్లిష్టత
క్యాట్‌లో ప్రశ్నల క్లిష్టత స్థాయి ప్రతి ఏటా పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది క్యాట్‌లో వీఏఆర్‌సీ, డీఐఎల్‌ఆర్ నుంచి అడిగిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని పరీక్షకు హాజరైన అభ్యర్థులు చెప్పారు. ముఖ్యంగా డీఐఎల్‌ఆర్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సాధించేందుకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. దీంతో ఎక్కువ మంది అభ్యర్థులకు సమయాభావ సమస్య ఎదురైంది. ఒకే రోజు మూడు స్లాట్లలో జరిగే పరీక్షలో ఒక స్లాట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా, మరో స్లాట్‌లో కొంత క్లిష్టంగా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుత అభ్యర్థులు ప్రశ్నల క్లిష్టత స్థాయి ఎలా ఉన్నా.. సమాధానాలు గుర్తించేలా సన్నద్ధత పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.
సమయ పాలన, సబ్జెక్ట్ విభజన
- క్యాట్ అభ్యర్థులు ముందుగా సమయ పాలనపై ప్రధానంగా దృష్టిపెట్టాలి. మొత్తం మూడు సెక్షన్లుగా నిర్వహించే ఈ పరీక్షలో రాణించాలంటే..ఇప్పటి నుంచి నిర్దిష్టమైన సమయ పాలన పాటించాలి. పరీక్షలో ప్రతి సెక్షన్‌ను 40 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. తమ వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా టైం మేనేజ్‌మెంట్ పాటించాలి.
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ప్రతి రోజు ప్రతి సెక్షన్‌కు మూడు గంటలు చొప్పున కేటాయించాలి. వాస్తవానికి అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకుని రివిజన్‌పై దృష్టిపెడుతుంటారు. కాబట్టి ముందుగా సిలబస్‌లో పేర్కొన్న అంశాల్లో ఇప్పటికీ పూర్తి చేయని టాపిక్స్ ఉంటే.. వాటిని అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేసుకునే విధంగా సమయం కేటాయించుకోవాలి.
- ప్రతి రోజూ ఒక్కో సెక్షన్‌కు మూడు గంటలు చొప్పున మొత్తం 9 గంటలు; వారానికి రెండు మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరయ్యే విధంగా వ్యవహరించాలి.
- నవంబర్ మొదటి వారం నుంచి పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. అప్పటికీ సిలబస్‌లో పేర్కొన్న అంశాల ప్రిపరేషన్‌ను పూర్తి చేయకపోయినా.. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. పూర్తి చేసిన అంశాల్లోనే మరింత రాణించే విధంగా ప్రాక్టీస్ కొనసాగించాలి.
- ఇప్పటి నుంచి కనీసం 10 నుంచి 12 మాక్ టెస్ట్‌లకు హాజరై.. బలహీనంగా ఉన్న అంశాలపై కొంత ఎక్కువ దృష్టి పెట్టాలి.
సెక్షన్ల వారీగా.. ప్రిపరేషన్
వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్
ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉండే విభాగం.. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇందులో మంచి స్కోర్ కోసం ప్రాక్టీస్ చాలా కీలకం. నిర్దేశిత ప్యాసేజ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అధికశాతం ప్రశ్నలు ప్యాసేజ్ సారాంశం అర్థమైతేనే సమాధానం ఇవ్వగలిగేలా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు స్పీడ్ రీడింగ్‌తోపాటు ఏదైనా ఒక టాపిక్‌ను చదువుతున్నప్పుడే అందులోని కీలక అంశాలను గుర్తించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. పంక్చుయేషన్స్ నుంచి ప్యాసేజ్ మెయిన్ కాన్సెప్ట్ వరకూ.. అన్నింటిపైనా అవగాహన పెంచుకోవాలి. అర్థాలు, సమానార్థాలు, ఫ్రేజెస్, వర్డ్ యూసేజ్, సెంటెన్స్ ఫార్మేషన్ అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి. వీటితోపాటు వొకాబ్యులరీపైనా పట్టు సాధించాలి. ఫలితంగా ఆయా ప్యాసేజ్‌లలో వినియోగించిన పదజాలాన్ని వేగంగా అర్థం చేసుకుని.. నిర్దేశిత సమయంలో సమాధానాలిచ్చే నైపుణ్యం లభిస్తుంది.
రీడింగ్ కాంప్రహెన్షన్
కొంత ఎక్కువ స్కోరు సాధించడానికి అవకాశం ఉన్న విభాగం.. రీడింగ్ కాంప్రహెన్షన్. ఇందులో రాణించాలంటే.. అభ్యర్థులు విశ్లేషణాత్మకంగా చదవడం అలవర్చుకోవాలి. చదివేటప్పుడేæ అందులోని ముఖ్య సమాచారం, ప్రశ్నార్హమైన అంశాలు, కీలక పదాలు గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. అందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదవాలి. వీటిని చదివిన తర్వాత సొంతంగా, క్లుప్తంగా సారాంశాన్ని రాసుకోవాలి. వొకాబ్యులరీని పెంచుకోవడం వెర్బల్ ఎబిలిటీలో ఎంతో ఉపయుక్తం. ఇంగ్లిష్ గ్రామర్‌పైనా పట్టు సాధించాలి. ప్రిఫిక్స్, సఫిక్స్ విధానంలో వర్డ్ లెర్నింగ్.. వొకాబ్యులరీని పెంచుకునేందుకు దోహదపడుతుంది. ప్రతి రోజు కనీసం 20 నుంచి 30 కొత్త పదాలను నేర్చుకోవాలి. ఆయా పదాల వినియోగంపైనా అవగాహన పెంచుకోవాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్
గ్రాఫ్‌లు, చార్ట్‌లు, డేటా సంబంధిత ప్రశ్నలు ఉండే.. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో స్కోర్ కోసం ప్రత్యేక కసరత్తు చేయాలి. ఇందులో అధిక శాతం ప్రశ్నలు స్వీయ విశ్లేషణ, సూక్ష్మ పరిశీలన ఆధారంగా సమాధానం రాబట్టేవిగా ఉంటాయి. అంటే.. గ్రాఫ్‌లు, చార్ట్‌లలో ఇచ్చిన దత్తాంశాలపై నేరుగా ప్రశ్నలు అడగకుండా.. సంబంధిత కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని సమాధానం కనుక్కునే విధంగా ఈ ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఇందులో రాణించేందుకు పర్సంటేజెస్, యావరేజెస్‌పై పట్టు సాధించాలి. ఇందుకోసం ఏదైనా ప్రామాణిక మెటీరియల్ లేదా ఆన్‌లైన్ టెస్ట్‌లోని ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కేవలం ఒకే తరహా ప్రశ్నలు కాకుండా.. విభిన్న క్లిష్టతతో కూడిన సమస్యలను సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంశాలతో ఉండే ఈ సెక్షన్‌లో రాణించడానికి వేగం చాలా ముఖ్యం. ము ఖ్యంగా కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలిగే నేర్పు సొంతం చేసుకోవాలి. నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు ప్రాబబిలిటీ,పెర్ముటేషన్స్/కాంబినేషన్స్, నెంబర్స్, అల్‌జీబ్రా, జామెట్రీ విభాగాలపై దృష్టి పెట్టాలి.
వీటికి సంబం«ధించిన బేసిక్ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. వాస్తవానికి క్యాట్‌లో ఎదురయ్యే ప్రశ్నల్లో పది శాతం మేర బేసిక్స్ ఆధారంగా సొంత ఆలోచనతో సాధించాల్సినవిగా ఉంటాయి. వీటికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పరీక్షలో నేరుగా ఫార్ములా బేస్డ్‌గా ఉండే ప్రశ్నల సాధనపై దృష్టిపెట్టాలి. ప్రస్తుత సమయంలో సబ్జెక్ట్ ప్రిపరేషన్‌తోపాటు ఆయా సెక్షన్లలో గత ప్రశ్నల ప్రాక్టీస్ కూడా కీలకమని గుర్తించాలి.
ముఖ్యాంశాలు
- క్యాట్ స్కోర్ ఆధారంగా 20 ఐఐఎంలలో ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం.
- ఐఐఎంలతోపాటు మరో వేయికి పైగా బి-స్కూల్స్‌లో క్యాట్ స్కోర్‌తో మేనేజ్‌మెంట్ పీజీలో అడుగుపెట్టొచ్చు.
- క్యాట్ ప్రిపరేషన్‌కు కచ్చితమైన టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి.
- అక్టోబర్ చివరి నాటికి ప్రిపరేషన్ పూర్తి చేసుకోవాలి.
- అక్టోబర్ చివరి నుంచి పరీక్ష తేదీ వరకు పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి.
- కనీసం వారానికి ఒక మోడల్ టెస్ట్‌కు హాజరు కావాలి.
- కనీసం ఎనిమిది గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి.
క్యాట్-2022 ముఖ్య సమాచారం
- నవంబర్ 27న మూడు స్లాట్లలో క్యాట్ పరీక్ష.
- హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: అక్టోబర్ 27 నుంచి.
- ఫలితాల వెల్లడి: డిసెంబర్ చివరి వారం/2023 జనవరి మొదటి వారం.
- వివరాలకు వెబ్‌సైట్: https://iimcat.ac.in