Skip to main content

CAT-2021: క్యాట్‌.. కటాఫ్‌ తగ్గనుందా!

CAT 2021- Expected Cut Off Marks
CAT 2021- Expected Cut Off Marks

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌).. ప్రతిష్టాత్మక బీస్కూల్స్‌.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) క్యాంపస్‌ల్లో.. మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఇటీవల క్యాట్‌–2021 ఆన్‌లైన్‌ టెస్ట్‌ ముగిసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమకు వచ్చే స్కోర్‌పై అంచనాలు వేసుకుంటున్నారు. వాస్తవానికి ఐఐఎంల్లో ప్రవేశానికి క్యాట్‌ స్కోర్‌ తొలి అడుగు మాత్రమే!! ఐఐఎంలు క్యాట్‌లో ప్రతిభ ఆధారంగా మలి దశ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తాయి. ఈ నేపథ్యంలో.. క్యాట్‌ 2021 కటాఫ్‌ అంచనాలు, మలిదశ ఎంపిక ప్రక్రియ, వివిధ అంశాలకు వెయిటేజీపై ప్రత్యేక కథనం... 

 • క్యాట్‌–2021 క్లిష్టంగా ఉందంటున్న నిపుణులు
 • ఐఐఎంలలో ప్రవేశానికి ముగిసిన తొలి దశ
 • మలి దశలో జీడీ, పీఐలు, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్
 • క్యాట్‌ స్కోర్‌తోపాటు ఇతర అంశాలకూ వెయిటేజీ
   
 • 2,29,969: క్యాట్‌–2021కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య.
 • 1,91,660: నవంబర్‌ 28న మొత్తం మూడు షిఫ్ట్‌లలో నిర్వహించిన క్యాట్‌కు హాజరైన అభ్యర్థుల సంఖ్య.
 • 35 శాతం: ఈ ఏడాది క్యాట్‌ రాసిన మహిళా విద్యార్థుల సంఖ్య. 
 • గత ఏడాది కంటే దాదాపు పది శాతం మేర మొత్తం అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 

క్లిష్టంగానే

 • క్యాట్‌–2021 పరీక్ష కొంత క్లిష్టంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లలో..66 ప్రశ్నలు అడిగారు. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 24 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 20 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 22 ప్రశ్నలు వచ్చాయి. మూడు స్లాట్లలో పరీక్ష నిర్వహించారు. 
 • వీఏఆర్‌సీ, డీఐఎల్‌ఆర్‌ నుంచి అడిగిన ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని నిపుణులు, పరీక్షకు హాజరైన అభ్యర్థులు అంటున్నారు. డీఐఎల్‌ఆర్‌లో ఎక్కువ సమయం వెచ్చించాల్సిన ప్రశ్నలు అడగటంతో సమయాభావం సమస్య ఎదురైంది. 
 • మొదటి స్లాట్‌ కంటే రెండో స్లాట్‌ కొంత సులభంగా ఉందనే వాదన వినిపిస్తోంది.
 • మూడో స్లాట్‌లో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అత్యంత క్లిష్టంగా ఉందని అభ్యర్థులు పేర్కొన్నారు.


నిర్దిష్ట కటాఫ్‌

 • పరీక్ష క్లిష్టంగా ఉండటంతో గతేడాది కంటే కటాఫ్‌ కొంత తగ్గే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా ఐఐఎంలు క్యాట్‌లో నిర్దిష్ట కటాఫ్‌ పర్సంటైల్‌ సాధించిన వారికే మలిదశకు అర్హత కల్పిస్తున్నాయి. కనీసం 80, గరిష్టంగా 95 పర్సంటైల్‌ను కటాఫ్‌గా నిర్దేశిస్తున్నాయి. 
 • గత రెండు, మూడేళ్లుగా ప్రవేశాలు ఖరారైన విద్యార్థుల పర్సంటైల్‌ను పరిశీలిస్తే.. 93 శాతంపైగా పర్సంటైల్‌ ఉంటేనే ప్రవేశం లభిస్తోంది. ఐఐఎం–కోల్‌కత, ఐఐఎం–అహ్మదాబాద్‌ వంటి తొలి తరం ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందాలంటే..99కి పైగా పర్సంటైల్‌ ఉంటేనే సాధ్యమని గత గణాంకాల ఆధారంగా స్పష్టమవుతోంది. 

మలి దశ

క్యాట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మలిదశలో గ్రూప్‌ డిస్కషన్‌(జీడీ), రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌(ఆర్‌ఏటీ), పర్సనల్‌ ఇంటర్వ్యూ(పీఐ)లను ఆయా ఐఐఎంలు నిర్వహిస్తున్నాయి.

చ‌ద‌వండి:  CAT Exam 2021: వీటిలో అడుగుపెడితే.. ఉజ్వల భవిష్యత్‌ ఖాయం

గ్రూప్‌ డిస్కషన్‌

మలి దశలో ఐఐఎం క్యాంపస్‌లలో నిర్వహించే ప్రక్రియ.. గ్రూప్‌ డిస్కషన్‌. అభ్యర్థులను బృందాలుగా విభజించి.. ఏదైనా ఒక టాపిక్‌ ఇచ్చి దానిపై చర్చించమంటారు. కోర్‌ నుంచి కాంటెంపరరీ వరకూ.. వివిధ అంశాలు అడుగుతారు. కాబట్టి జీడీలో రాణించేందుకు అభ్యర్థులు సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన పరిణామాలపై ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలి. 

రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌

గ్రూప్‌ డిస్కషన్‌ తర్వాత అభ్యర్థులు తమ ప్రతిభను చూపాల్సిన మరో పరీక్ష.. రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌. నిర్దిష్టంగా ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి.. అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకునే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. సదరు టాపిక్‌పై మూడు వందల నుంచి నాలుగు వందల పదాల మధ్యలో సమాధానం రాయాల్సి ఉంటుంది.

పర్సనల్‌ ఇంటర్వ్యూ

గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరిగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో సదరు విద్యార్థికి మేనేజ్‌మెంట్‌ విద్య పట్ల ఉన్న వాస్తవ ఆసక్తి, అతని భవిష్యత్తు లక్ష్యాలు తదితర అంశాలను ప్రొఫెసర్స్‌ కమిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.

‘క్యాట్‌’కు 40 శాతం వెయిటేజీ

 • ఐఐఎంలు తుది జాబితా రూపకల్పనలో క్యాట్‌ స్కోర్‌కు 40 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. 
 • మొత్తం వంద మార్కుల వెయిటేజీ ఫార్మట్‌లో.. 35 నుంచి 50 శాతం మేరకు జీడీ, పీఐలకు వెయిటేజీ ఉంటోంది. 
 • జండర్‌ డైవర్సిటీ, కల్చరల్‌ డైవర్సిటీలకు మూడు నుంచి అయిదు శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. 
 • పలు ఐఐఎంలు అకడమిక్‌ వెయిటేజీ నిబంధన కూడా అమలు చేస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్‌ డిగ్రీలకు ఒక్కో కోర్సుకు ప్రత్యేకంగా వెయిటేజీ ఉంటోంది. ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్స్‌ ఉన్న వారికి కొంత అధిక వెయిటేజీ లభిస్తోంది. 

అనుభవం

ఐఐఎంలు తుది జాబితా రూపకల్పనలో పని అనుభవానికి కూడా వెయిటేజీ కల్పిస్తున్నాయి. అనుభవం ఉన్న అభ్యర్థులకు అయిదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ వెయిటేజీ కూడా అభ్యర్థులు పని చేస్తున్న రంగం,అనుభవం గడించిన సంవత్సరాల ఆధారంగా ఉంటోంది. 

చ‌ద‌వండి:  Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!

మహిళలకు ప్రోత్సాహం

 • మేనేజ్‌మెంట్‌ విద్యలో మహిళా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరేలా ప్రోత్సహించేందుకు ఐఐఎంలు జండర్‌ డైవర్సిటీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. 
 • ఐఐఎం కోల్‌కత.. జండర్‌ డైవర్సిటీ వెయిటేజీ పేరుతో మహిళా విద్యార్థులకు అదనంగా మూడు మార్కులు కేటాయిస్తోంది. 
 • ఐఐఎం లక్నో.. మహిళా విద్యార్థులకు రెండు పాయింట్లు కేటాయిస్తోంది.
 • ఐఐఎం రోహ్‌తక్‌.. జండర్‌ డైవర్సిటీ, నాన్‌–ఇంజనీరింగ్‌ ఫ్యాక్టర్స్‌ పేరుతో మొత్తం ఎంపిక ప్రక్రియలో 30 పాయింట్లు కేటాయిస్తుండటం విశేషం
 • ఐఐఎం రాయ్‌పూర్‌..ఎంపిక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీని జండర్‌ డైవర్సిటీకి కేటాయిస్తోంది.
 • ఐఐఎం–ఉదయ్‌పూర్‌..15 పాయింట్లు;ఐఐఎం– కాశీపూర్‌ మూడు పాయింట్లు కేటాయిస్తున్నాయి 

అకడమిక్‌ డైవర్సిటీకి ప్రాధాన్యం

క్యాట్‌లో అర్హతతోపాటు ఐఐఎంల ప్రవేశాల్లోనూ ఇంజనీరింగ్‌ అభ్యర్థులే ముందంజలో ఉంటున్నారనే అభిప్రాయం నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నాన్‌–ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐఐఎంలు అకడమిక్‌ డైవర్సిటీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

సీట్ల వివరాలివే

ఐఐఎం క్యాంపస్‌లలో పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ మొదలు..ఫెలో ప్రోగ్రామ్‌ వరకు అన్ని కోర్సులకు కలిపి దాదాపు 12వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో, క్యాట్‌ స్కోర్‌తో ప్రవేశం లభించే పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల సంఖ్య అయిదు వేల వరకు ఉంది. 

క్యాట్‌–2021 అంచనాలు

మూడు స్లాట్లలో నిర్వహించిన క్యాట్‌లో అడిగిన ప్రశ్నల తీరును పరిగణనలోకి తీసుకుంటే.. ఆయా సెక్షన్ల వారీగా మార్కుల శ్రేణి.. వాటికి లభించే పర్సంటైల్‌ అంచనాలు..

విభాగం 99 పర్సంటైల్‌ వచ్చే మార్కుల శ్రేణి 95 పర్సంటైల్‌ వచ్చే మార్కుల శ్రేణి 90 పర్సంటైల్‌ వచ్చే మార్కుల శ్రేణి
వీఏఆర్‌సీ 40–44 35–40 31–35
క్యూఏ  41–45 34–40 33–36
డీఐఎల్‌ఆర్‌ 30–34 26–30 16–23

                 

మొత్తం స్కోర్, పర్సంటైల్‌ అంచనా

అన్ని విభాగాల్లో కలిపి వచ్చే మార్కుల శ్రేణి, వాటికి లభించే ఓవరాల్‌ పర్సంటైల్‌ శ్రేణి అంచనా..

మొత్తం స్కోర్‌ పర్సంటైల్‌ శ్రేణి
111–120 99పైగా
95–110 95–98
82–100 90–94
78–80 85–89
51–69 80–84


చ‌ద‌వండి:  Career with MBA: డిగ్రీ తర్వాత ఎక్కువ మంది చేరుతున్న కోర్సు.. కారణం ఇదే..

Published date : 16 Dec 2021 06:27PM

Photo Stories