బీటెక్ పట్టాతోనే..ఐఐఎంలో పీహెచ్‌డీ !
ఐఐఎం చట్టంతో..
వాస్తవానికి ఐఐఎం-బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్ తదితర క్యాంపస్‌లు ఇప్పటికే తాము అందించే ఫెలో ప్రోగ్రామ్ (డాక్టోరల్ డిగ్రీ)లో ప్రవేశానికి నాలుగేళ్ల బీటెక్; సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ డిగ్రీలతోపాటు నిర్ణీత టెస్ట్ స్కోర్లు సాధిస్తేనే తదుపరి ఎంపిక ప్రక్రియకు అనుమతిస్తున్నాయి. అయితే పట్టా ఇచ్చే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఐఐఎం-యాక్ట్ 2017 ద్వారా లభించిన స్వయం ప్రతిపత్తి వెసులుబాటుతో నాలుగేళ్ల బీటెక్ డిగ్రీతో పూర్తిస్థాయి అధికారాలతో, పట్టా ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఐఐఎంలు ఫెలో ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పించే అవకాశముంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే...
తాజా ప్రతిపాదనను వచ్చే విద్యా సంవత్సరం (2019-20) నుంచే పట్టాలెక్కించేందుకు అన్ని ఐఐఎంలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో త్వరలో సంప్రదింపులు జరిపి.... పీహెచ్‌డీ అర్హతలకు సంబంధించి అమల్లో ఉన్న యూజీసీ యాక్ట్ నుంచి మినహాయింపు లభించేలా ఐఐఎంలు ఒప్పించనున్నాయి. మొత్తంమీద ఈ విషయంపై మరి కొద్ది రోజుల్లోనే పూర్తి స్పష్టత రానుంది. ఇది కార్యరూపం దాల్చితే.. ఈ ఏడాది బీటెక్, సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు కూడా అన్ని ఐఐఎంల ఫెలో ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
అర్హతను బట్టి వ్యవధి :
ప్రస్తుత నిబంధనల ప్రకారం పీజీ అర్హతతో చేరే ఫెలో ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి నాలుగున్నరేళ్ల నుంచి అయిదేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలి. అయితే ఇకపై నాలుగేళ్ల బీటెక్ అర్హతతో ప్రవేశించే అభ్యర్థులకు ఫెలో ప్రోగ్రామ్ వ్యవధిని మూడేళ్లుగా నిర్ణయించే అవకాశముంది.. అలాగే సీఏ, సీఎస్, సీఎంఏ అర్హతతో ప్రవేశిస్తే ఫెలో ప్రోగ్రామ్ వ్యవధిని రెండేళ్లుగా నిర్దేశించనున్నారు. ఈ వ్యవధిలోపు అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌లో కోర్స్ వర్క్ పూర్తిచేసి థీసిస్ సమర్పిస్తేనే పట్టా అందుతుంది.
టెస్ట్ స్కోర్లు తప్పనిసరి :
- ప్రస్తుత విధానంలో పీజీ అర్హతతో ఐఐఎంల ఫెలో ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి క్యాట్ లేదా స్పెషలైజేషన్ బట్టి జీమ్యాట్/జీఆర్‌ఈ/యూజీసీ నెట్/యూజీసీ జేఆర్‌ఎఫ్/గేట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
- యూజీసీ జేఆర్‌ఎఫ్ ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు... ఫెలో ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునే స్పెషలైజేషన్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టులో యూజీసీ జేఆర్‌ఎఫ్ సాధించాలి. ఉదాహరణకు ఫైనాన్స్ అండ్ కంట్రోల్ స్పెషలైజేషన్ ఫెలో ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. కామర్స్/ఎకనామిక్స్/మేనేజ్‌మెంట్‌లో యూజీసీ జేఆర్‌ఎఫ్ సాధించాలి.
మలిదశలో మరో ప్రక్రియ :
ఫెలో ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐఎంలు మలి దశలో మరో పరీక్ష నిర్వహిస్తాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న స్పెషలైజేషన్ మేరకు రాత పరీక్ష నిర్వహించడం.. అందులో ఉత్తీర్ణత ఆధారంగా సంబంధిత విభాగాల ప్రొఫెసర్ల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ చేసి.. అభ్యర్థుల్లో వాస్తవ ఆసక్తిని పరిశీలించి తుది జాబితా రూపొందిస్తారు. ఈ ప్రవేశ ప్రక్రియ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. అభ్యర్థుల ఎంపికకు అకడమిక్ పర్సంటేజీలు, టెస్ట్ స్కోర్లే కాకుండా.. రిఫరెన్స్ లెటర్స్, వాటిని ఇచ్చిన వ్యక్తులు, వారి ప్రొఫైల్స్ వంటివాటిని సునిశితంగా పరిశీలిస్తారు.
రూ.30 వేలకు పైగా..
ఫెలో ప్రోగ్రామ్‌లకు ఎంపికైన అభ్యర్థులకు ఐఐఎం క్యాంపస్‌లు ఆర్థిక ప్రోత్సాహం కూడా అందిస్తున్నాయి. డాక్టోరల్ ప్రోగ్రామ్‌కు ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. అంతేకాకుండా ఆయా క్యాంపస్‌ల విధానాలను అనుసరించి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రతి నెల స్టైపెండ్ లభిస్తుంది. దీనికి అదనంగా కాంటింజెన్సీ గ్రాంట్, ట్రావెల్ గ్రాంట్స్, ఉచిత హాస్టల్ సదుపాయం/హెచ్‌ఆర్‌ఏ తదితరాలను అందిస్తున్నాయి.
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్లు :
ఫెలో ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఐఐఎంలు ఏటా సెప్టెంబర్‌లో నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియను డిసెంబర్‌లో ప్రారంభించి జనవరి చివరి వారం వరకు కొనసాగిస్తాయి. ఫిబ్రవరి, మార్చిలో మలిదశ ఎంపిక ప్రక్రియ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తాయి.
కొన్ని ఐఐఎం క్యాంపస్‌లు.. ఫెలో ప్రోగ్రామ్ స్పెషలైజేషన్లు...
ఐఐఎం | స్పెషలైజేషన్లు | వెబ్‌సైట్ |
అహ్మదాబాద్ | అగ్రికల్చర్, బిజినెస్ పాలసీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్, పర్సనల్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, ప్రొడక్షన్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్, పబ్లిక్ సిస్టమ్స్.. | |
బెంగళూరు | డెసిషన్ సెన్సైస్, ఎకనామిక్స్ అండ్ సోషల్ సెన్సైస్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హెచ్‌ఆర్‌ఎం, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ పాలసీ, స్ట్రాటజీ.. | |
లక్నో | అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, డెసిషన్ సెన్సైస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హెచ్‌ఆర్‌ఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ | |
కోజికోడ్ | ఎకనామిక్స్; ఫైనాన్స్, అకౌంటింగ్ అండ్ కంట్రోల్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్, మార్కెటింగ్, ఓబీ అండ్ హెచ్‌ఆర్‌ఎం, క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ | |
కోల్‌కతా | ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ కంట్రోల్, హెచ్‌ఆర్‌ఎం, ఎంఐఎస్, మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, ఓబీ, పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్, రీజనల్ డెవలప్‌మెంట్, సోషియాలజీ, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ | |
ఇండోర్ | కమ్యూనికేషన్, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఓబీ అండ్ హెచ్‌ఆర్‌ఎం, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ | |
రాయ్‌పూర్ | బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ, ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ |
విద్యార్థులకు ప్రయోజనం... తాజా ప్రతిపాదన కచ్చితంగా విద్యార్థులకు ప్రయోజనం కలిగించే అంశమే. బీటెక్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటే వారు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్ ద్వారా నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఐఐఎంలలోనూ క్యాట్, ఇతర స్కోర్ల ఆధారంగా నేరుగా ఎఫ్‌పీఎంలో చేరే అవకాశం లభిస్తుంది. దీనివల్ల విద్యార్థులకు సమయం ఆదా అవుతుంది. - ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్, డెరైక్టర్, ఐఐఎం-విశాఖపట్నం. |