Skip to main content

బెస్ట్ బీ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్

ఎంబీఏ.. మేనేజ్‌మెంట్‌లో పీజీ.. కార్పొరేట్ ప్రపంచంలో మెరుగైన కెరీర్‌కు మార్గం. ఎంబీఏ ప్రముఖ బీస్కూల్‌లో చదివితే.. కంపెనీలకు హాట్‌కేక్‌గా మారొచ్చు!అందుకే విద్యార్థులు ఐఐఎం లాంటి పేరున్న విద్యాసంస్థ నుంచి పట్టా కోసం ఉవ్విళ్లూరుతుంటారు. ఐఐఎంలు ఏటా నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)లో మంచి స్కోర్ కోసం సర్వం ఒడ్డుతారు. దేశంలో ఐఐఎంలతోపాటు పలు బీస్కూల్స్‌కు మేనేజ్‌మెంట్ పీజీ కోర్సులను అందించడంలో మంచి పేరుంది. సదరు బీస్కూల్స్‌లో అడ్మిషన్స్ పొందేందుకు ఆయా ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. రానున్న విద్యాసంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్‌ల సీజన్ ప్రారంభమైంది. అందుకు సంబంధించి ప్రకటనల జారీకి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టాప్ బీ స్కూల్స్‌లో ఎంబీఏ చేయాలని సిద్ధమవుతున్న అభ్యర్థులు క్యాట్‌తో పాటు ఇంకా ఏఏ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మేలు చేస్తుందో తెలుసుకుందాం...
ఆన్‌లైన్‌లో... ఎక్స్‌ఏటీ 2018 :
క్యాట్ తర్వాత ఆ స్థాయిలో పేరున్న మరో ఎంబీఏ ఎంట్రెన్స్ ‘జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్’. ఎక్స్‌ఏటీగా సుపరిచితమైన దీనిని ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ నిర్వహిస్తుంది. ప్రతిఏటా సుమారు 90వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎక్స్‌ఏటీ పరీక్ష ప్రమాణాలు, క్లిష్టత స్థాయి అధికం. దాంతో ఈ పరీక్ష స్కోర్ ఆధారంగా ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎక్స్‌ఏటీలో మంచి స్కోర్ సాధించిన అభ్యర్థులకు ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు దేశ వ్యాప్తంగా మరో 140కు పైగా ప్రముఖ బి-స్కూల్స్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తోంది. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలోని 360 సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు. ఎక్స్‌ఏటీ 2018 నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది.
పరీక్ష విధానం: ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ-ఎక్స్‌ఏటీ మూడున్నర గంటల వ్యవధిలో రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. మొదటి పేపర్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో నాలుగు విభాగాలో ్ల(ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్) ఉంటుంది. రెండో పేపర్ లో మాత్రం జనరల్ నాలెడ్జ్, ఎస్సే రైటింగ్ ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేది: ఆగస్టు 16 నుంచి...
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 30, 2017.
ఎక్స్‌ఏటీ ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి 7, 2018
పూర్తి వివరాల వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://www.xatonline.in

ఐఐఎఫ్‌టీ 2017..
దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ) ఒకటి. ఐఐఎఫ్‌టీ.. మిగతా ప్రముఖ కాలేజీలకు భిన్నంగా, అత్యున్నత ప్రమాణాలతో ఎంబీఏలో ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సును అందిస్తోంది. ఐఐఎఫ్‌టీ 2017, డిసెంబర్ 3వ తేదీన జరుగనుంది.
కోర్సు: ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)
సీట్ల వివరాలు: ఢిల్లీ, కోల్‌కతా, కాకినాడ క్యాంపస్‌ల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఢిల్లీ క్యాంపస్, కోల్‌కతా క్యాంపస్‌తోపాటు కొత్తగా ఏపీలోని కాకినాడలోనూ క్యాంపస్ రానుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అండ్ రైటింగ్ స్కిల్ అసెస్‌మెంట్ ద్వారా.
పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా మల్టిపుల్ చారుుస్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, వోకాబులరీ, గ్రామర్, జనరల్ నాలెడ్‌‌జ అండ్ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాంటిటేటివ్ అనాలసిస్ నుంచి ప్రశ్నలు వస్తారుు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
మొత్తం 123 ప్రశ్నలు. వీటికి 100 మార్కులు. అయితే ఏటా ప్రశ్నల సంఖ్యలో మార్పులు కనిపిస్తుంటాయి. రుణాత్మక మార్కులు ఉంటాయి.
ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్: రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబైల్లో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
పూర్తి వివరాల వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://tedu.iift.ac.in/iift

మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) :
జాతీయ స్థాయిలో బి-స్కూల్ ఎంట్రెన్స్‌ల్లో పేరున్న మరో పరీక్ష.. మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్). ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణత, స్కోర్ ఆధారంగా దేశ, విదేశాల్లో దాదాపు 500 ప్రముఖ బీస్కూల్స్‌లో ప్రవేశానికి మార్గం సులభం చేసుకోవచ్చు. మ్యాట్ మరో విశిష్టత ప్రతి ఏటా నాలుగుసార్లు నిర్వహించడం. ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ఈ పరీక్ష ఉంటుంది. ప్రతిసారి సుమారు 20 వేల మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు.
పరీక్ష విధానం: అయిదు విభాగాల్లో ఉంటుంది. అవి.. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ స్కిల్స్, డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్సీ, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్. వ్యవధి రెండున్నర గంటలు. ప్రతి సెక్షన్ నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు అడుగుతారు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://apps.aima.in/MATSept17/

స్నాప్ టెస్ట్ :
సింబయాసిస్ ఇంటర్నే షనల్ యూని వర్సిటీ (ఎస్‌ఐయూ- పుణె) జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. స్నాప్ టెస్ట్‌గా పిలిచే దీంట్లో ఉత్తీర్ణత ఆధారంగా ఈ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లలో సీట్లు భర్తీ చేస్తారు. ఈ స్కోర్ ఆధారంగా దేశంలో పలు మేనేజ్‌మెంట్ కళాశాలల్లో పీజీ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే వీలుంది.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.snaptest.org

ఏఐసీటీఈ- కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) :
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల నిర్వహణ, అనుమతుల బాధ్యతలను పర్యవేక్షించే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ).. మేనేజ్‌మెంట్ కోర్సుల ఔత్సాహికులకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష సీమ్యాట్. దీంట్లో ర్యాంకు ఆధారంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కళాశాలల్లో మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశించవచ్చు.
పరీక్ష విధానం: మొత్తం నాలుగు విభాగాల్లో ఉంటుంది. క్వాంటిటేటివ్ టెక్నిక్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్. ప్రతి సెక్షన్ నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 400 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులుంటాయి. వ్యవధి మూడు గంటలు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్ : www.aicte-cmat.in

ఎన్‌మ్యాట్ :
జాతీయ స్థాయిలో ప్రైవేట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ల జాబితాలోని టాప్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ప్రవేశాలకు ఈ స్కోరు అవసరం. ఎన్‌మ్యాట్‌గా పిలిచే ఈ ఎంట్రన్స్‌లో బెస్ట్ స్కోర్/ర్యాంకు ఆధారంగా నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు దేశంలో ప్రముఖ 23 బి-స్కూల్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షను గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) నిర్వహిస్తుంది.
పరీక్ష విధానం: మొత్తం మూడు విభాగాల్లో (లాంగ్వేజ్ స్కిల్స్- 32 ప్రశ్నలు; క్వాంటిటేటివ్ స్కిల్స్ - 48 ప్రశ్నలు; లాజికల్ రీజనింగ్ - 40 ప్రశ్నలు) రెండు గంటల వ్యవధిలో ఈ పరీక్ష ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.nmat.org.in

ఏటీఎంఏ :
దేశవ్యాప్తంగా మరో ప్రముఖ మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ టెస్ట్.. ఏటీఎంఏ. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ (ఎయిమ్స్) టెస్ట్ ఫర్ మేనేజ్‌మెంట్ పేరుతో నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. పలు బి-స్కూల్స్‌లో ప్రవేశాలకు అర్హత లభిస్తుంది.
పరీక్ష విధానం: మిగతా మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ టెస్ట్‌లతో పోల్చితే ఈ పరీక్ష స్వరూపం విభిన్నంగా ఉంటుంది. అనలిటికల్ రీజనింగ్ స్కిల్స్, వెర్బల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్.. ఈ మూడు విభాగాల్లోనే ఆరు సెక్షనల్లో నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్ట్‌కు సంబంధించి రెండు విభాగాల్లో మొత్తం ఆరు విభాగాలుగా 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఏటా మూడుసార్లు (ఫిబ్రవరి, మే, జూలై) నెలల్లో నిర్వహిస్తారు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://www.atmaaims.com
Published date : 20 Sep 2017 04:00PM

Photo Stories