Skip to main content

ఐఐఎంల‌లో ఏటా పెరుగుతున్న మ‌హిళ‌ల ప్రాతినిథ్యం.. స‌మాచారం ఇదిగో..

ఐఐఎంలు.. మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు! వీటిలో చేరేందుకు పురుష అభ్యర్థులే ఎక్కువగా ఆసక్తి చూపుతారనేది ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం. మహిళా విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ కోర్సులపై పెద్దగా దృష్టిపెట్టరనే వ్యాఖ్యలు! అయితే ఇలాంటి అభిప్రాయాలన్నీ అపోహలే అని తేలిపోయింది. కారణం.. ఈ ఏడాది దేశంలోని ఐఐఎంల్లో పీజీ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల్లో.. ప్రవేశాలు ఖరారు చేసుకున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరగడమే!

మహిళలు మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపడమే కాకుండా.. పురుషులకు దీటుగా టాప్‌ బీ స్కూల్స్‌లో ప్రవేశాలు దక్కించుకోవడం విశేషం! తాజాగా పలు ఐఐఎంలు.. 2020–22 పీజీ మేనేజ్‌మెంట్‌ బ్యాచ్‌లో ప్రవేశంపొందిన మహిళల సంఖ్యను, శాతాన్ని వెల్లడించిన నేపథ్యంలో.. ఐఐఎంల్లో మహిళా విద్యార్థుల ప్రవేశాలు.. జండర్‌ డైవర్సటీ.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ప్రాధాన్యం.. లభిస్తున్న జాబ్‌ ప్రొఫైల్స్‌ గురించి విశ్లేషణ...

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంలు)ల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ పట్టా సొంతం చేసుకుంటే.. కార్పొరేట్‌ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు సొంతమవుతాయన్న సంగతి తెలిసిందే. అలాంటి కీలక పోస్టుల్లో పురుషులు మాత్రమే రాణించగలరనే వాదన ఉండేది. అందుకు తగ్గట్లుగానే మేనేజ్‌మెంట్‌ కోర్సుల ప్రవేశాల్లో పురుష అభ్యర్థులదే పైచేయి అనేది ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం. కాని ఇటీవల కాలంలో కార్పొరేట్‌ సంస్థల్లో కీలక హోదాల్లో తాము కూడా రాణించగలమని మహిళలు నిరూపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ఐఐఎంల్లో ప్రవేశాలు దక్కించుకోవడంలో పురుష అభ్యర్థులకు దీటుగా నిలుస్తున్నారు. మరోవైపు పలు ఐఐఎంలు మహిళా విద్యార్థులను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో గత అయిదారేళ్లుగా ఐఐఎంల్లో మహిళా విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.

టాప్‌–6 ఐఐఎంల్లో మెరుగైన సంఖ్య:

  • టాప్‌–6 ఐఐఎంలుగా పేరొందిన క్యాంపస్‌ల్లో 2020–22 బ్యాచ్‌లో మహిళా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ టాప్‌–6 ఐఐఎంల్లో పీజీ ప్రోగ్రామ్‌లలో చేరిన మొత్తం విద్యార్థుల్లో 33 శాతానికిపైగా మహిళలే ఉండటం విశేషం. గతేడాది ఈ సంఖ్య 26 శాతం మాత్రమే. ఐఐఎంల్లో ఏటేటా పెరుగుతున్న మహిళా విద్యార్థుల సంఖ్యకు ఇది నిదర్శనమని చెప్పొచ్చు.
  • ఐఐఎంలు అనగానే గుర్తొచ్చే ఐఐఎం, అహ్మదాబాద్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఏడాది చేరిన మొత్తం 390 మంది విద్యార్థుల్లో 85 మంది మహిళలే.
  • ఐఐఎం బెంగళూరులో 488 మంది పీజీపీ బ్యాచ్‌లో 146 మంది మహిళలు ఉన్నారు.
  • ఐఐఎం–కోజికోడ్‌లో రికార్డు స్థాయిలో 52 శాతం మంది మహిళా విద్యార్థులు పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు ఖరారు చేసుకున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం 492 మంది విద్యార్థుల బ్యాచ్‌లో.. 148 మంది మహిళా విద్యార్థులే.
  • ఐఐఎం లక్నోలో 451 మందికి ప్రవేశం లభించగా.. అందులో 148 మంది మహిళలే.
  • ఐఐఎం సంబల్‌పూర్‌లో 168 మంది విద్యార్థుల్లో 68 మంది మహిళా విద్యార్థులు ఉన్నారు.
  • ఐఐఎం రోహ్‌తక్‌లో మొత్తం 267 మంది విద్యార్థులకు గాను 69 శాతం మంది మహిళా విద్యార్థులు ప్రవేశాలు ఖరారు చేసుకోవడం విశేషం.
  • ఐఐఎం కోల్‌కతలో కూడా 33 శాతం మంది మహిళా విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
  • ఐఐఎం–ఇండోర్‌లో మొత్తం 496 మంది బ్యాచ్‌లో 199 మంది మహిళలు ఉన్నారు.
  • తెలుగు రాష్ట్రాల్లోని ఐఐఎం విశాఖపట్నంలో 153 మంది విద్యార్థుల్లో దాదాపు 33 మంది మహిళా విద్యార్థులే!
  • ఇలా అన్ని ఐఐఎంలను పరిగణనలోకి తీసుకుంటే.. రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు ఖరారు చేసుకున్న మొత్తం విద్యార్థుల్లో 40 శాతం మేరకు మహిళా విద్యార్థులే ఉండటం విశేషం.

సూపర్‌ న్యూమరరీ సీట్లు:
మేనేజ్‌మెంట్‌ విద్యలో మహిళా విద్యార్థుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో పలు ఐఐఎంలు వారికోసం ప్రత్యేకంగా సూపర్‌ న్యూమరరీ సీట్ల విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ విషయంలో ఐఐఎం–కోజికోడ్, కాశీపూర్‌లు ముందంజలో ఉన్నాయి. కాశీపూర్‌ మొత్తం విద్యార్థుల సంఖ్యకు అదనంగా 15 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే ఐఐఎం కోజికోడ్‌ ప్రత్యేకంగా 60 సీట్లతో మహిళలకు ప్రత్యేక బ్యాచ్‌ను సైతం ప్రారంభించింది.

జండర్‌ డైవర్సిటీకి వెయిటేజీ:
ఐఐఎంల్లో మహిళా విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు జండర్‌ డైవర్సిటీకి ప్రత్యేక వెయిటేజీ ఇవ్వడం కూడా ఒక కారణంగా నిలుస్తోంది! దాదాపు అన్ని ఐఐఎంలు క్యాట్‌ స్కోర్‌తోపాటు మలి దశ ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకునే అంశాల్లో జండర్‌ డైవర్సిటీని కూడా పేర్కొంటున్నాయి. ఐఐఎం–రాయపూర్, రాంచీ, కాశీపూర్, రోహ్‌తక్, త్రిచి, ఉదయ్‌పూర్, బో«ద్‌గయ, సంబల్‌పూర్, సిర్మౌర్‌లు.. జండర్‌ డైవర్సిటీ పేరుతో మహిళా విద్యార్థులకు అయిదు శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. ఐఐఎం–బెంగళూరు, కోల్‌కత రెండు శాతం; లక్నో అయిదు శాతం; విశాఖపట్నం అయిదు శాతం చొప్పున వెయిటేజీ కల్పిస్తున్నాయి.

కార్పొరేట్‌ ప్రోత్సాహం:
ఐఐఎంల్లో మహిళా విద్యార్థులకు కార్పొరేట్‌ రంగం నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తోంది. ప్లేస్‌మెంట్స్‌ విషయంలో బహుళజాతి కంపెనీలు మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్‌ రంగాలకు చెందిన సంస్థలు మహిళలకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని గత రెండు మూడేళ్ల ప్లేస్‌మెంట్‌ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఐఐఎంలు వంటి టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో చదువుకున్న మహిళా అభ్యర్థులను నియమించుకుంటే.. పనితీరు పరంగా చురుగ్గా ఉండటంతోపాటు తమ సంస్థల్లో డైవర్సిటీ సమతుల్యత కూడా సాధించినట్లవుతుందని పలు సంస్థలు భావిస్తున్నాయి.

జాబ్‌ ప్రొఫైల్స్‌ ఇవే:
ఐఐఎంల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ నిర్వహిస్తున్న సంస్థలు.. మహిళలకు ఫైనాన్స్, ఆపరేషన్స్, కమ్యూనికేషన్స్, కన్సల్టింగ్‌ విభాగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. పే ప్యాకేజ్‌ల విషయంలోనూ పురుషులతో పోల్చితే ఎలాంటి వ్యత్యాసం కనిపించని రీతిలో ఆకర్షణీయ పే ప్యాకేజ్‌లు అందిస్తున్నాయి.

ఇతర ప్రోగ్రామ్స్‌లోనూ..
ఐఐఎంల్లో పీజీ మేనేజ్‌మెంట్‌(ఎంబీఏ) ప్రోగ్రామ్‌లోనే కాకుండా.. ఇతర ప్రోగ్రామ్స్‌లోనూ మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. పని అనుభవం ఉంటేనే ప్రవేశం లభించే ఎగ్జిక్యూటివ్‌ పీజీ ప్రోగ్రామ్‌లలో సైతం మహిళా విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఈ విషయంలో అప్పటికే సదరు మహిళలు పని చేస్తున్న సంస్థలు కూడా తోడ్పాటునందిస్తున్నాయి. ఎడ్యుకేషన్‌ లీవ్, ఫైనాన్షియల్‌ స్పాన్సర్‌షిప్‌ వంటి విధానాలను సైతం కొన్ని సంస్థలు అమలు చేస్తున్నాయి. ఇటీవల ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా పలు ఐఐఎంలు.. బిజినెస్‌ అనలిటిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వంటి ప్రోగ్రామ్‌లను ప్రవేశ పెడుతున్నాయి. వీటి ప్రవేశాల్లోనూ మహిళా విద్యార్థులు ముందుంటున్నారు. అకడమిక్‌ నేపథ్యం పరంగా చూస్తే.. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

ఇతర బి–స్కూల్స్‌లోనూ..
మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో మహిళల సంఖ్య పెరగడం అనేది ఐఐఎంలకే పరిమితం కాలేదు. ఇతర బి–స్కూల్స్‌లోనూ ఎంబీఏ ప్రవేశాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఐఐటీలు ప్రవేశం కల్పిస్తున్న ఎంబీఏ కోర్సులు..అలాగే ఐఎస్‌బీ–హైదరాబాద్, ఎఫ్‌ఎంఎస్‌–ఢిల్లీ వంటి ప్రముఖ క్యాంపస్‌లలోనూ మహిళా విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఐఎస్‌బీనే పరిగణనలోకి తీసుకుంటే.. 2019లో 38 శాతంగా ఉన్న మహిళా విద్యార్థుల ప్రవేశాలు.. 2020లో 40 శాతానికి పెరిగాయి.

మారుతున్న దృక్పథం..
మేనేజ్‌మెంట్‌ విద్య, అందులోనూ ఐఐఎంల్లో ప్రవేశం పొందాలనే విషయంలో మహిళా విద్యార్థుల దృక్పథంలోనూ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాచిలర్‌ స్థాయిలో ఇంజనీరింగ్, సోషల్‌ వర్క్‌ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థినులు ఐఐఎంల దిశగా అడుగులు వేస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా సదరు ఐఐఎంల్లోని ఆయా విద్యార్థుల అకడమిక్‌ నేపథ్యాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

ఐఐఎంల్లో మహిళా విద్యార్థులు.. ముఖ్యాంశాలు

  • అన్ని ఐఐఎంలలోనూ జండర్‌ డైవర్సిటీ విధానం అమలు.
  • గత ఏడాదితో పోల్చితే పెరిగిన మహిళా విద్యార్థుల సంఖ్య. l టాప్‌–6 ఐఐఎంలలో 33.5 శాతం మహిళా విద్యార్థులే.
  • 2015–17తో పోల్చితే 2020–22 బ్యాచ్‌లో 30 శాతం పెరుగుదల.
  • మొత్తంగా అన్ని ఐఐఎంల్లో మహిళా విద్యార్థులు 40 శాతం మంది.
  • ఐఐఎం–కోజికోడ్, కాశీపూర్‌లలో సూపర్‌ న్యూమరరీ సీట్లు.
  • ప్లేస్‌మెంట్స్‌లో మహిళా విద్యార్థులకు కార్పొరేట్‌ సంస్థల ప్రాధాన్యం.

ఎన్నో ప్రోత్సాహకాలు..
మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌లో మహిళా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఐఐఎంలు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. జండర్‌ డైవర్సిటీ మాత్రమే కాకుండా.. ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ.. మహిళల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఎంబీఏ చదవాలని ఆసక్తి చూపే మహిళల సంఖ్య పెరుగుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇంతకాలం టెక్నికల్‌ డిగ్రీ నేపథ్యం ఉన్న వారే ఇటువైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. డిగ్రీ స్థాయిలో ఎలాంటి నేపథ్యం ఉన్న విద్యార్థులైనా.. క్యాట్‌కు హాజరై, ఐఐఎంల్లో ప్రవేశం పొందే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
– ప్రొఫెసర్‌ జి.శబరినాథన్, చైర్‌ ప్రొఫెసర్, ఎంబీఏ, ఐఐఎం–బెంగళూరు

Published date : 01 Sep 2020 02:35PM

Photo Stories