Skip to main content

సృజనాత్మకతక కెరీర్‌కు మార్గాలు...

ఎంఎస్సీ, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్... ఇందులో అర్హత ఏదైనా.. బహుశా వీరిలో చాలా మంది 9 టు 5 జాబ్ చేస్తుంటారు! ఇక విధుల విషయానికొస్తే.. ముందే నిర్ణయించిన ఒకే రకమైన పద్ధతిలో ముందుకుసాగు తుంటారు.
ఇలాంటి రొటీన్ ఉద్యోగాలకు భిన్నంగా సృజనాత్మకతకు పెద్దపీట వేసే కెరీర్స్ పట్ల నేటి యువత ఆసక్తి పెంచుకుంటోంది. తమలోని సృజనాత్మ కతకు సవాలు విసిరే.. రేడియో జాకీ, పెయింటర్, వాయిస్‌ఓవర్ ఆర్టిస్ట్, ఈవెంట్ మేనేజర్, ట్రావెల్ ఫోటోగ్రాఫర్ వంటి వినూత్న కెరీర్ మార్గాలను ఎంచుకుంటోంది. వీటినే ఆఫ్‌బీట్ కెరీర్స్ అంటున్నారు! ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతను ఆకర్షించడంలో ముందుంటున్న ఈ ఆఫ్‌బీట్ కెరీర్స్ గురించి తెలుసుకుందాం..

1. రేడియో జాకీ:
గతంలో రేడియో అనౌన్సర్‌ను కేవలం ఓ ప్రయోక్తగానే పరిగణించేవారు. నేటి ఎఫ్‌ఎం రేడియో యుగంలో.. ‘రేడియో జాకీ’లు సినిమా హీరోల్లా రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. దాంతో పెద్ద సంఖ్యలో యువత రేడియో జాకీలుగా పేరుతెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. రేడియో జాకీగా రాణించేందుకు.. ఇన్‌ఫార్మ్.. అప్‌డేట్.. ఎంటర్‌టైన్.. అనే మూడు ముఖ్య సూత్రాలను అనుసరించాలంటున్నారు నిపుణులు. అందుకోసం సృజనాత్మకత, సమయస్ఫూర్తి, వాక్‌చాతుర్యం, స్నేహశీలత వంటి సహజలక్షణాలు ఉండాలి.
విద్యార్హతలతో పనిలేదు :
రేడియో జాకీగా మారేందుకు నిర్దిష్టంగా విద్యార్హతలంటూ ఏమీ లేవు. రేడియో జాకీకి సంబంధించి కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ... వాటిని పూర్తిచేసినంత మాత్రాన సక్సెస్ అవుతారని చెప్పలేం! ఎందుకంటే.. ప్రస్తుతం దేశంలో పేరొందిన చాలామంది రేడియో జాకీలు ఎలాంటి కోర్సులు పూర్తిచేయకుండానే, ఎటువంటి శిక్షణ తీసుకోకుండానే శ్రోతలను అలరిస్తున్నారు.
డిమాండ్ :
అనుభవమున్న రేడియో జాకీలతోపాటు క్రియేటివిటీ కలిగిన ప్రెషర్స్‌కి సైతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రేడియో సిటీ, రెడ్ ఎఫ్‌ఎం, రేడియో మిర్చి వంటి రేడియో స్టేషన్లు ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నాయి.
కోర్సులు..
1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రేడియో అండ్ టీవీ జర్నలిజం కోర్సులో ప్రవేశం కల్పిస్తోంది.
2. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్- మూడు నెలల వ్యవధితో రేడియో జాకీ షార్ట్ టెర్మ్ కోర్సును అందిస్తోంది.
3. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ మీడియా (ఐఐఎంఎం)- రేడియో అండ్ టీవీ జర్నలిజం స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్స్ ఇన్ జర్నలిజం అండ్ మాస్‌కమ్యూనికేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది.

2. ట్రావెల్ ఫోటోగ్రాఫర్ :
‘క్యాప్చర్ ది ప్లేసెస్ అండ్ ఫేసెస్’... అందమైన ప్రదేశాలు, ముఖారవిందాలను మరింత అందంగా కెమెరాతో క్లిక్‌మనిపించగలరా? అయితే మీరే ట్రావెల్ ఫోటోగ్రాఫర్..!! ప్రకృతి అందాలతోపాటు ప్రజల సంస్కృతి, ఆచారాలు, చారిత్రక ప్రదేశాలను తమ కెమెరాలో అందంగా బంధించే వారినే ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అంటున్నారు. ట్రావెల్ ఫోటోగ్రాఫర్ ప్రతి ఫోటో.. వీక్షకులకు ఆ ప్రదేశాన్ని దర్శించిన అనుభూతిని ఓ మధుర జ్ఞాపకంలా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది.
ఇవి తప్పనిసరి..
1. ఫోటోగ్రాఫిక్ దృష్టి ఉండాలి.
2. వివిధ ప్రదేశాలు, సంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన అవసరం. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలుండాలి. తద్వారా ఆయా ప్రాంతాల ప్రజలతో త్వరగా మమేకమవొచ్చు. దీనివల్ల మంచి స్టిల్స్ తీసే అవకాశం లభిస్తుంది.
3. ప్రధానంగా ప్రయాణాన్ని ఇష్టపడాలి.
రూ.20 వేల వరకు...
మ్యాగజైన్‌లకు ఫోటో జర్నలిస్ట్‌గా పనిచేసే వారికి ప్రారంభంలో నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు లభిస్తుంది. ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్న వారికి తీసిన ఫోటో ఆధారంగా ఆదాయం అందుతుంది.

3. ఈవెంట్ మేనేజర్ :
పెద్ద పెద్ద ఫంక్షన్లు, పార్టీలను బాగా ఆస్వాదిస్తారా! వాటి నిర్వహణలో తగిన అనుభవం ఉందా! బేరసారాలు చేయడంతోపాటు ఇతరులను కలుపుకుని పనిచేయగలరా! అయితే మీరూ ఈవెంట్ మేనేజర్‌గా మారొచ్చు! అవును.. ఆయా అంశాల్లో ఆసక్తి కలిగిన ఎంతోమంది వెడ్డింగ్ ప్లానర్స్, బ్రైడల్ కన్సల్టెంట్స్‌గా స్వయం ఉపాధి పొందుతున్నారు. స్వయం ఉపాధిపై ఆసక్తి లేని వారు.. వెడ్డింగ్ అండ్ ఈవెంట్ కంపెనీల్లో ఉద్యోగులుగా చేరొచ్చు.
ఎందుకు డిమాండ్ ?
ప్రస్తుతం ఉన్నత వర్గాలు, ఎగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ, బిజినెస్ రంగాల్లోని వారు, ఇతర కార్పొరేట్ ఉద్యోగాల్లోని వారు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. వీరి దగ్గర డబ్బయితే ఉంది.. కానీ, సమయమే చిక్కట్లేదు. దాంతో క్షణం తీరికలేని వీరు దొరికిన కొద్ది సమయాన్ని ఉల్లాసంగా గడిపేందుకే ఇష్టపడుతున్నారు. ఇప్పుడిదే ఈవెంట్ మేనేజర్లకు వరంగా మారింది. పెళ్లి, పుట్టిన రోజు, గృహప్రవేశం.. ఇలా.. శుభకార్యం ఏదైనా అధికశాతం మంది ఈవెంట్ మేనేజర్ల వైపే చూస్తున్నారు.

4. పెయింటింగ్ :
అందమైన పెయింటింగ్ చూసినప్పుడు మనసు పరవశిస్తుంది. పెయింటర్ ప్రకృతి అందాలను తన మనసులో ముద్రించుకొని... సృజనాత్మకతో వాటిని అద్భుత చిత్రాలుగా మలుస్తాడు. ప్రస్తుతం సమాజంలో పెయింటింగ్ ప్రియులు పెరిగిన నేపథ్యంలో.. చిత్రలేఖనం యువతకు చక్కటి ఆఫ్‌బీట్ కెరీర్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం పెయింటింగ్‌కి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్ (బీఎఫ్‌ఏ), రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అవకాశాలు..
పెయింటింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి టీచింగ్, యానిమేషన్ స్టూడియోస్, సినిమా రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం పెయింటింగ్‌లో ఫ్రీలాన్సింగ్ అవకాశాలు కూడా లభిస్తున్నాయి. కార్పొరేట్ ఆఫీసులు, గృహాల్లో కుడ్య చిత్రాలను పెద్ద సంఖ్యలో పెడుతున్నారు. కాబట్టి పెయింటింగ్ నైపుణ్యాలు ఉన్నవారికి కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా ఉండదని చెప్పొచ్చు.
వేతనాలు :
పెయింటింగ్‌లో వేతనాలు పనితీరును బట్టి ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన వారు వేసే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రముఖ స్కూల్స్‌లో డ్రాయింగ్ టీచర్‌గా చేరితే ప్రారంభంలో రూ.20 వేలు జీతంగా అందుకోవచ్చు.

5. శిల్పకళాకారులు :
స్కల్ప్‌చర్ (శిల్పకళ)... అణువణువునా సృజనాత్మకను నింపుకున్న ఓ కళా రూపం. రాయి, ఇసుక, ఇతరత్రా వస్తువులు, పదార్థాలను ఉపయోగించి.. చూపరులను కట్టిపడేసే కళారూపాలను తయారుచేయడంలో చేయి తిరిగిన వారే శిల్పకళాకారులు. ప్రస్తుతం సృజనాత్మకత, నవీనత కలిగిన శిల్పకళాకారులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (స్కల్ప్‌చర్), మాస్టర్ ఆఫ్ పైన్ ఆర్ట్స్ (స్కల్ప్‌చర్) వంటి కోర్సులను దేశంలోని పలు యూనివర్సిటీలు, కాలేజీలు అందిస్తున్నాయి. ఆయా కోర్సులను పూర్తిచేయడం ద్వారా శిల్పకళలో మరింత నైపుణ్యం సొంతం చేసుకోవచ్చు.
నైపుణ్యాలు..
చూసే వస్తువులు, చదివే అంశాల పట్ల చక్కటి పరిశీలనా సామర్థ్యం ఉండాలి. మదిలో మెదిలే భావాలు, ఆలోచనలకు చక్కటి రూపం ఇవ్వగలగాలి. వ్యక్తిగతంగా పనిచేయగలిగే నేర్పు ఉండాలి. అందమైన వస్తువులు, ప్రదేశాల పట్ల ఆరాధన భావం ఉండాలి. అప్పుడే అందమైన శిల్పం రూపుదిద్దుకుంటుంది.
కెరీర్ ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కువ మంది శిల్పకళాకారులు ఇంటి వద్దే శిల్పాలు, విగ్రహాలు తయారుచేస్తున్నారు. కొందరు సొంతంగా స్టూడియోలు ఏర్పాటు చేసుకొని వ్యాపార సంస్థలు, ఇతర ఏజెన్సీలు, ప్రభుత్వాలకు అవసరమైన శిల్పాలను సరఫరా చేస్తున్నారు. అద్భుతమైన శిల్ప కళాఖండాలను రూపొందించగలిగితే.. ప్రత్యేక ప్రదర్శనల ద్వారా విక్రయించి, ఆదాయం పొందొచ్చు.

6. ఎథికల్ హ్యాకర్ :
ఎవరికీ తెలియకుండా కంప్యూటర్‌లోని సమాచారాన్ని అక్రమంగా తస్కరించడాన్ని హ్యాకింగ్ అంటారు. ఎథికల్ హ్యాకింగ్ అంటే.. యజమాని అనుమతితోనే కంప్యూటర్‌లోకి ప్రవేశించి డేటాను నాశనం చేయడం. కంప్యూటర్ ఎంత సురక్షితంగా ఉంది? దాని సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి లోపాలు ఉన్నాయి? వాటిని ఎలా సరిచేయాలి? అనే విషయాలను గుర్తించడానికి ఎథికల్ హ్యాకర్లను నియమిస్తారు. కంప్యూటర్ నుంచి తమకు లభించిన కీలక సమాచారాన్ని వీరు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.
రాణించాలంటే..
ఎథికల్ హ్యాకర్‌గా పేరు తెచ్చుకోవాలంటే.. హ్యాకర్లు అనుసరించే హ్యాకింగ్ విధానాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్ నెట్‌వర్కింగ్ నాలెడ్‌‌జ సంపూర్ణంగా ఉండాలి. జావా, సీ++ వంటి కంప్యూటర్ అప్లికేషన్లపై పట్టు అవసరం. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘యూనిక్స్’పై పరిజ్ఞానం సంపాదించాలి. తార్కిక ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక వైఖరి ఉండాలి. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో సంబంధిత ఎథికల్ హ్యాకింగ్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. డిగ్రీతోపాటు సర్టిఫికేషన్ ఉంటే ఉద్యోగ వేటలో కలిసొస్తుంది.
భారీ డిమాండ్...
భారత ఐటీ పరిశ్రమలో ఎథికల్ హ్యాకర్ల అవసరం పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా నిపుణులు అందుబాటులో లేరు. ప్రధానంగా బీపీఓ, ఫైనాన్‌‌స, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో ఎథికల్ హ్యాకర్లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎథికల్ హ్యాకర్లకు విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఉంది.

7. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ :
రేడియో లేదా టీవీలో వచ్చే ప్రకటనల్లో కొన్ని గొంతులను వినగానే వారు మనకు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. ఆ గొంతుకు అభిమానులుగా మారిపోతాం. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు ఉన్న శక్తి అది. అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాల సంఖ్య విస్తృతమవుతుండటంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. వినసొంపైన స్వర మాధుర్యం ఉన్నవారికి నప్పే నయా కెరీర్.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్.
కనిపించిన వాయిస్ :
అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, షారుఖ్ వంటి బాలీవుడ్ నటులంతా.. టీవీ ప్రకటనల్లో తెలుగులో మాట్లాడుతూ కనిపిస్తుంటారు. నిజంగా వారు తెలుగులో మాట్లాడుతున్నారా! ఎంతమాత్రం కాదు. టీవీ ప్రకటనలు, సీరియల్స్, సినిమాల్లో కనిపించే కళాకారులంతా స్వయంగా డబ్బింగ్ చెప్పలేరు. వారికి గొంతు అరువిచ్చేందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉంటారు. అడ్వర్‌టైజ్‌మెంట్ల రూపకల్పనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. గొంతును అరువిచ్చే కళాకారులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ వీడియోలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, సెల్‌ఫోన్ రింగ్‌టోన్లు, రేడియో ప్రకటనల రూపకల్పనకు వీరిని నియమిస్తున్నారు.
అర్హతలు!
వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక కోర్సులు అందుబాటులో లేవు. కానీ, ఫొనెటిక్స్ కోర్సులు చేసినవారు వాయిస్ ఒవర్ ఆర్టిస్ట్‌లుగా కెరీర్‌లో త్వరగా రాణించొచ్చు. మంచి ఆర్టిస్ట్ అయ్యేందుకు మంచి గొంతు ఉంటే చాలు. ఆర్టిస్టులకు అడిషన్‌‌స నిర్వహిస్తారు. అందులో నెగ్గితే ఎంపికై నట్లే!

సమయస్ఫూర్తి ముఖ్యం :
సమయస్ఫూర్తి, విషయాలను నవ్వు తెప్పించేలా చెప్పగలిగే నేర్పు, స్పష్టమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఉన్నవారెవరైనా రేడియో జాకీ కెరీర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కెరీర్‌లో రాణించేందుకు జనరల్ నాలెడ్జ్ ముఖ్యం. కాబట్టి రేడియో జాకీగా మారాలనుకునే వారు చుట్టూ జరిగే పరిణామాలను గమనిస్తుండాలి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం వల్ల తాజా ట్రెండ్స్‌పై అవగాహన ఏర్పడుతుంది. రేడియో జాకీ కెరీర్‌ను చేపట్టేందుకు ఎలాంటి కనీస విద్యార్హత అవసరంలేదు. కానీ, డిగ్రీ పూర్తిచేసుంటే.. వివిధ అంశాలపై సరైన అభిప్రాయం చెప్పగలిగే సామర్థ్యం లభిస్తుంది. వాయిస్ స్వీట్‌గా లేనప్పటికీ మాడ్యులేషన్ హెచ్చుతగ్గులపై స్పష్టతతో రేడియో జాకీలుగా రాణిస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ.. ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ తమదైన శైలితో ముందడుగువేయడం ద్వారా రేడియో జాకీగా రాణించొచ్చు. నేను 12 ఏళ్లుగా రేడియో జాకీగా పనిచేస్తున్నా ఎలాంటి విసుగూ లేదు. ఎందుకంటే రేడియో జాకీ కెరీర్‌లో నాకు ప్రతి రోజూ ఒక సవాలే! రేడియో జాకీ వేతనాలు రూ.20వేల నుంచి ప్రారంభమై.. అనుభవం, పనితీరు ఆధారంగా వేగంగా పెరుగుతాయి.
- ఆర్‌జే శివ్, రేడియో సిటీ 91.1.

నిర్వహణ నైపుణ్యాలు అవసరం..
వెడ్డింగ్ లేదా ఈవెంట్ ప్లానర్ బహుముఖ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నిర్వహణ నైపుణ్యాలు మెండుగా ఉన్నవారు.. ఈ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. వివాహాన్నే తీసుకుంటే.. ఆహ్వానం మొదలు.. వేదిక, భోజనం, వసతి ఏర్పాటు వంటివి కీలకం. వీటిని సక్రమంగా, ప్రణాళిక ప్రకారం నిర్వహించినప్పుడే.. ఈవెంట్ విజయవంతమవుతుంది. కస్టమర్ల అభిరుచులను సరిగా అర్థంచేసుకొని తదనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహించడంపైనే ఈవెంట్ ప్లానర్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. తాజా ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అనుసరిస్తుండాలి. అలాగే ఆయా మతాచారాలు, ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం; అలంకరణకు ఉపయోగించే రంగులు, పూలు తదితరాలతో పాటు సంగీతం వంటివాటిపైనా అవగాహన తప్పనిసరి.
- పరితోష్ నాయుడు, ఈవెంట్ ప్లానర్, పర్పుల్ ఐడీస్.
Published date : 07 Aug 2018 05:30PM

Photo Stories