Designing Courses: ఏఐఎస్‌టీ–2022కు నోటిఫికేషన్.. కోర్సులు, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్ ఇలా..
- ఎఫ్‌డీడీఐ ఆధ్వర్యంలో బ్యాచిలర్, పీజీ స్థాయిలో డిజైన్ కోర్సులు
- సర్టిఫికెట్ సొంతం చేసుకుంటే డిజైనింగ్ రంగంలో తళుకులీనే కెరీర్
- తాజాగా 2022లో ప్రవేశానికి ఎఫ్‌డీడీఐ ఎంట్రన్స్ నోటిఫికేషన్
యువతలో కొంత మంది వినూత్నమైన, నలుగురిలో ప్రత్యేక గుర్తింపు లభించే కెరీర్ కోసం అన్వేషిస్తుంటారు. తమలోని సృజనాత్మకత కెరీర్‌కు సోపానంగా నిలవాలని భావిస్తారు. అలాంటి వారికి చక్కటి మార్గం.. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ). కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12 క్యాంపస్‌లు ఉన్నాయి. అవి.. పాట్నా, కోల్‌కత, నోయిడా, జోథ్‌పూర్, అంక్లేశ్వర్, గుణ, ఛింద్వారా, ఫర్సత్‌గంజ్, రోహ్‌తక్, చండీగఢ్, హైదరాబాద్, చెన్నై. ఇక్కడ డిజైన్ కోర్సుల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలతోపాటు ఫ్యాషన్ ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవచ్చు.
4 బ్యాచిలర్, 2 పీజీ ప్రోగ్రామ్‌లు
జాతీయ స్థాయిలో ఉన్న 12 క్యాంపస్‌ల ద్వారా నాలుగు బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లు, 2 పీజీ ప్రోగ్రామ్‌లను ఎఫ్‌డీడీఐ అందిస్తోంది. బ్యాచిలర్ ప్రోగ్రామ్స్‌లో మొత్తం 1800 సీట్లు, పీజీ ప్రోగ్రామ్స్‌లో 360 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లు
- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్–ఫుట్‌వేర్ అండ్ ప్రొడక్షన్
- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ – ఫ్యాషన్
- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్–లెదర్ గూడ్స్ అండ్ యాక్ససరీస్
- బీబీఏ – రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్కండైజ్
పీజీ ప్రోగ్రామ్‌లు
- ఎం.డిజైన్ – ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్
- ఎంబీఏ – రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్కండైజ్
అర్హత
- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులు: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.
- మాస్టర్ ఆఫ్ డిజైన్: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్. ఫుట్‌వేర్/లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్/ఫ్యాషన్/ఇంజనీరింగ్/ఫైన్‌ఆర్ట్స్/ఆర్కిటెక్చర్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చదివిన వారు అర్హులు.
- ఎంబీఏ(రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశానికి.. ఏఐఎస్‌టీ
- ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్న యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ముందుగా ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్(ఏఐఎస్‌టీ)ను నిర్వహిస్తారు. పరీక్ష విధానం, మార్కింగ్ యూజీ, పీజీ కోర్సులకు వేర్వేరుగా ఉంటుంది.
- యూజీ పరీక్ష ఇలా: ఎఫ్‌డీడీఐ–ఏఐఎస్‌టీ పరీక్ష యూజీ, పీజీకి కలిపి నాలుగు సెక్షన్‌లు (సెక్షన్–ఏ, బీ, సీ, డీ) లుగా ఉంటుంది. మొత్తం 200 మార్కులకు జరిగే ఈ పరీక్ష సమయం రెండున్నర గంటలు. మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్ –ఏ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, సెక్షన్ బీ వెర్బల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు– 40 మార్కులు, సెక్షన్–సి జనరల్ అవేర్ నెస్ 35 ప్రశ్నలు–35 మార్కులు, సెక్షన్ డీలో బిజినెస్ అప్టిట్యూడ్ టెస్ట్ 25 ప్రశ్నలు–50 మార్కులు, డిజైన్ అప్టిట్యూడ్ టెస్ట్ 25 ప్రశ్నలు– 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పీజీ పరీక్ష ఇలా: పీజీ ప్రవేశ పరీక్షలో నాలుగు సెక్షన్ల నుంచి 175 ప్రశ్నలు– 200 మార్కులకు ఉంటాయి. సెక్షన్ ఏ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు–50 మార్కులు, సెక్షన్ బీ ఇంగ్లిష్ 50 ప్రశ్నలు–50 మార్కులు,సెక్షన్ సి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 50 ప్రశ్నలు–50 మార్కులు, సెక్షన్ డి మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్ 50 ప్రశ్నలు– 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.
కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ
బ్యాచిలర్, పీజీ స్థాయి ప్రోగ్రామ్‌లకు నిర్వహించే ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా.. ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు ఖరారు చేస్తారు. సీటు ఖరారు చేసుకున్న అభ్యర్థులు నిర్దేశిత తేదీలోపు తమకు సీటు లభించిన క్యాంపస్‌లో రిపోర్టింగ్ లెటర్ అందించాల్సి ఉంటుంది.
చదవండి: Fashion Career: డిజైనింగ్ రంగం... కొలువుల తరంగం
షైనింగ్ కెరీర్
ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌ల్లో కోర్సులు పూర్తి చేసుకుంటూనే.. ప్రముఖ సంస్థల్లో కొలువులు లభిస్తాయి. బ్యాచిలర్, పీజీ ఉత్తీర్ణులకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా రూ.లక్షల వేతనంతో కొలువులు ఖరారవుతున్నాయి. గత మూడేళ్ల క్యాంపస్ ప్లేస్‌మెంట్ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఎనభై శాతం మందికి పైగా విద్యార్థులకు ఆఫర్లు లభించడమే కాకుండా.. సగటు వేతనం రూ. ఎనిమిది లక్షలుగా నమోదైంది. ఆదిత్య బిర్లా గ్రూప్, టాటాగ్రూప్, బాటా, ఫ్లిప్‌కార్ట్, అడిడాస్ ఇండియా, పూమా, ఆలైన్ అపారెల్స్ తదితర ప్రముఖ సంస్థలు టాప్ రిక్రూటర్స్‌గా నిలిచాయి. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కోణంలో స్టార్టప్ సంస్థలను కూడా నెలకొల్పే అవకాశం లభిస్తోంది.
జాబ్ ప్రొఫైల్స్ ఇవే
ఎఫ్‌డీడీఐ కోర్సులు పూర్తిచేసుకుంటే.. ఫుట్‌వేర్ డిజైనర్, ప్రొడక్ట్ డెవలపర్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్, క్వాలిటీ కంట్రోలర్, ఫుట్‌వేర్ టెక్నాలజిస్ట్, మెర్చెండైజర్, మార్కెటింగ్, ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్, ట్రెండ్ అనలిస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డిజైన్ మ్యానుఫాక్చరింగ్ ఆపరేషన్స్, స్టోర్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, ఏరియా మేనేజర్ వంటి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బీబీఏ, ఎంబీఏ కోర్సులు చేసిన వారికి ప్రముఖ ఈ–కామర్స్, టెక్స్‌టైల్ రంగాల్లోని సంస్థల్లో నిర్వహణ విభాగాల్లో కొలువులు లభిస్తున్నాయి.
ఈ నైపుణ్యాలు తప్పనిసరి
ఎఫ్‌డీడీఐ– ఏఐఎస్‌టీలో ఎంట్రన్స్‌తో సీటు సొంతం చేసుకున్నా.. కెరీర్ రాణించాలంటే ప్రత్యేక నైపుణ్యాలు కావాలి. ముఖ్యంగా ఇది క్రియేటివిటీతో ముడిపడిన రంగం. కాబట్టి ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే వారు స్కెచ్ ప్యాటర్న్, స్కేల్ డ్రాయింగ్ లేదా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. అలాగే నైపుణ్యాలను ఎప్పటికప్పుడు తెలిపేలా పవర్‌పాయింట్ ప్రజంటేషన్స్ కానీ లేదా హ్యాండ్ పెయింట్ ప్రజంటేషన్స్ ఇస్తుండాలి. సేఫ్టీ్ట, కంఫర్ట్, క్వాలిటీ.. ఇలా అన్ని విషయాల్లో మెరుగైన ప్రొడక్ట్‌ను డిజైన్ చేయాలి. ప్రొడక్షన్ స్టేజ్‌లోనే తయారీకి సంబంధించి డిజైనర్ల్ల జోక్యం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి డిజైన్ ఫైనల్ చేశాక మార్పులు చేయడానికి ఆస్కారం ఉండదు. ఇలాంటి నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకునేలా వ్యవహరించాలి.
ఏఐఎస్‌టీలో విజయం కోసం
ఎఫ్‌డీడీఐలో కోర్సుల్లో ప్రవేశించి, షైనింగ్ కెరీర్‌కు మార్గం వేసే ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్‌లో విజయానికి దృష్టి పెట్టాల్సిన అంశాలు..
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో విజయానికి అర్థమెటిక్–రేషియో, మిక్చర్స్, వర్క్, యావరేజ్, పర్సంటేజ్, టైమ్ అండ్ స్పీడ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంటరెస్ట్, బేసిక్ స్టాటిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా నెంబర్ ప్రాపర్టీస్, ప్రాబబిలిటీ, కౌంటింగ్ ప్రిన్సిపల్స్, జామెట్రీ, డెరివేటివ్స్ (మ్యాగ్జిమా–మినిమా) వంటి ప్యూర్ మ్యాథ్స్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
వెర్బల్ ఎబిలిటీ
ఈ విభాగంలో రాణించేందుకు ఇంగ్లిష్ గ్రామర్‌తోపాటు, లాజికల్ రీజనింగ్ అంశాలు, సీటింగ్ అరేంజ్‌మెంట్,స్వీక్వెన్సెస్,బ్లడ్ రిలేషన్స్,కోడింగ్, డీ–కోడింగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
జనరల్ అవేర్‌నెస్
ఈ విభాగానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అదే విధంగా హైస్కూల్ స్థాయి సోషల్ సబ్జెక్ట్‌ను చదివి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్య ఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్
డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి ఏదైనా ఒక ఆకృతిని రూపొందించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇక.. బిజినెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి డిజైన్ రంగంలో తాజా పరిణామాలు, మార్కెట్ పరిస్థితులు, టాప్ కంపెనీలు తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ఎఫ్‌డీడీఐ–ఏఐఎస్‌టీ–2022 ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2022
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: ఏప్రిల్ 29– 30
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: జూన్ 6 నుంచి
- ఏఐఎస్‌టీ పరీక్ష తేదీ: జూన్ 19, 2022
- ఏఐఎస్‌టీ పరీక్ష కేంద్రాలు: అంక్లేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఛింద్వారా, ఫర్సత్‌గంజ్, గుణ, హైదరాబాద్, జోథ్‌పూర్, నోయిడా, పాట్నా, రోహ్‌తక్, ఆగ్రా, బెంగళూరు, భోపాల్, డెహ్రాడూన్, ఢిల్లీ, గ్వాలియర్, ఇండోర్, జైపూర్, జంషెడ్‌పూర్, కాన్పూర్, కోల్‌కత, కొచి, లక్నో, ముంబై, పుణె, రాంచి, రాయ్‌పూర్, విశాఖపట్నం
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.fddiindia.com/admissionprocess.php
చదవండి: Fashion Designing: ఫ్యాషన్ రంగం.. ఉద్యోగాల తరంగం