Skip to main content

Distance and Online Learning: యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొద‌లు.. ప్రవేశ సమయంలో తీసుకోవాల్సిన..

Universities: Distance Education Admissions process has started in UG and PG courses for 2022–23 Academic Year, On factors to consider
Universities: Distance Education Admissions process has started in UG and PG courses for 2022–23 Academic Year, On factors to consider

డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌.. దూర విద్య విధానంగా సుపరిచితం! వ్యక్తిగత, ఇతర కారణాలతో.. చదువు మధ్యలో మానేసిన వారు.. తమ ఉన్నత చదువుల కలను సాకారం చేసుకునేందుకు చక్కటి మార్గం. దూర విద్య విధానం ఇప్పుడు ఆధునిక రూపు సంతరించుకుంటోంది. డిస్టెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ పేరుతో.. సరికొత్త విధానం తెరపైకి వచ్చింది. ఇటీవల ఇగ్నో, ఆంధ్రా యూనివర్సిటీ, డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌సార్వత్రిక విశ్వ విద్యాలయం, ఎస్‌వీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో 2022–23 సంవత్సరానికి సంబంధించి.. యూజీ, పీజీ కోర్సుల్లో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో.. దూర విద్య విధానంతో ప్రయోజనాలు, తాజా మార్పులు, ప్రవేశ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం... 

  • ఆన్‌లైన్‌ బోధనకు అనుమతులు
  • అందుబాటులో ఈ–కంటెంట్‌ సదుపాయం
  • ప్రొఫెషనల్‌ కోర్సుల్లోనూ ఆన్‌లైన్, డిస్టెన్స్‌ కోర్సులు
  • పలు యూనివర్సిటీల్లో కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

ఇంటర్మీడియెట్, ఐటీఐ తదితర కోర్సుల తర్వాత ఉన్నత విద్యనభ్యసించలేని వారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. ఇలాంటి వారు తమ వృత్తులు, ఉద్యోగాలు కొనసాగిస్తూనే.. డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తిచేసుకునేందుకు మార్గం.. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల్లో ప్రవేశించిన వారు కెరీర్‌లోఉన్నత అవకాశాలు అందుకోవడానికి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విధానంలో అందుబాటులో ఉన్న పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లు దోహదపడతాయి. ఉన్నత విద్యలో డ్రాప్‌ ఔట్స్‌ను తగ్గించడానికి, అదే విధంగా ఆయా వర్గాల వారి ఉన్నతికి మార్గం వేసేవి.. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు. అందుకే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)..డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విధానంలో కీలక మార్పుల దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా..ఆయా కోర్సులు, వాటికి సంబంధించి టీచింగ్‌–లెర్నింగ్‌ విషయాల్లో మార్పులు, చేర్పులపై మార్గదర్శకాలు జారీ చేస్తోంది.

ఫిజికల్‌ టు ఆన్‌లైన్‌

గతంలో దూర విద్య విధానంలో ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులు.. సంబంధిత యూనివర్సిటీ నుంచి పుస్తకాలు సేకరించుకోవడం, అదే విధంగా నిర్ణీత తేదీల్లో తరగతులకు హాజరవడం ఉండేది. యూజీసీ ఇటీవల వీటిలో మార్పులు చేసింది. పాఠ్యాంశాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచొచ్చని మార్గదర్శకాలు రూపొందించింది. ఆన్‌లైన్‌లో బోధన సాగించే విద్యా సంస్థలు.. ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి 60 శాతం అంశాలను సొంత వనరుల ద్వారా.. మరో 40 శాతం అంశాలను ఎడ్‌–టెక్‌ కంపెనీలు, ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవచ్చని అనుమతించింది. ఇదే సమయంలో సదరు ఎడ్‌–టెక్‌ కంపెనీలు తాము కంటెంట్‌ అందిస్తున్నట్లు ప్రకటించుకోకూడదని స్పష్టం చేసింది. అదే విధంగా స్వయం, ఎన్‌పీటీఈఎల్‌ వంటి మార్గాల ద్వారా ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను ఉంచొచ్చని పేర్కొంది. దీనివల్ల విద్యార్థులు తమకు నచ్చిన లేదా తమకు అనుకూలించిన సమయంలో 24“7 ఎన్విరాన్‌మెంట్‌లో పాఠాలను అభ్యసించే అవకాశం లభించనుంది.

ఆన్‌లైన్‌ కోర్సులు

పాఠ్యాంశాల ఆన్‌లైన్‌ కంటెంట్‌కు అనుమతించిన యూజీసీ.. ఆన్‌ లైన్‌ కోర్సులు నిర్వహించుకునేలా గత ఏడాది ముసాయిదా రూపకల్పన చేసింది. ప్రస్తుతం సర్టిఫికెట్,డిప్లొమా స్థాయిలో దాదాపు 15 కోర్సులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల బ్యాచిలర్, పీజీ స్థాయిలో దాదాపు అన్ని కోర్సులను ఆన్‌లైన్‌ అందించేందుకు అనుమతించేలా ముసాయిదా రూపొందించింది. అంటే.. ఇకపై ఓపెన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో.. బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల్లో చేరే వారు కాంటాక్ట్‌ క్లాస్‌లకు హాజరయ్యే పరిస్థితికి దాదాపుగా ఫుల్‌స్టాప్‌ పడనుంది. ఇలా ఆన్‌లైన్‌ విధానంలో.. క్లాస్‌లకు హాజరవ్వాల్సిన వ్యయ ప్రయాసల నుంచి విముక్తి లభించనుంది. ఆన్‌లైన్‌ కోర్సుల రికార్డింగ్స్‌ను కూడా అందుబాటులో ఉంచడంతో.. ∙విద్యార్థులు తాము హజరు కాలేకపోయిన సెషన్‌కు సంబంధించిన అంశాలను కూడా తమకు వీలైన సమయంలో వినే అవకాశం లభిస్తుంది.


చదవండి: డిస్టెన్స్ ఎంబీఏతో కెరీర్‌లో ముందడుగు

ప్రొఫెషనల్‌ కోర్సులకూ అనుమతి

డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విషయంలో మరో ప్రధానమైన మార్పు.. ప్రొఫెషనల్‌ కోర్సుల బోధనకూ అనుమతి ఇవ్వడం. బ్యాచిలర్‌ స్థాయిలో సంప్రదాయ బీఏ కోర్సులతోపాటు బీబీఏ, బీసీఏ వంటి కోర్సులు, పీజీ స్థాయిలో ఎంఏతోపాటు ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు అందించేందుకు సైతం యూనివర్సిటీలకు అవకాశం కల్పించింది. ఇటీవల కాలంలో లేటెస్ట్‌ టెక్నాలజీగా మారుతున్న బిజినెస్‌ అనలిటిక్స్,డేటాసైన్స్, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్, పీజీ కోర్సుల స్వరూపాన్ని నిర్దేశించడం మరో విశేషంగా పేర్కొనొచ్చు. ఈ మేరకు యూజీసీ(ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్స్‌)రెగ్యులేషన్స్‌ 2020 పేరిట మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీంతో..ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ..ఉన్నత అవకాశాలు అందుకునే ప్రయోజనం కలగనుంది.

ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌లోనూ ఆన్‌లైన్‌ బోధన

ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా పేర్కొంటున్న అంశాల్లోనూ ఆన్‌లైన్‌ కోర్సులు అభ్యసించేలా అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీఈటీ) గత ఏడాది సంబంధిత మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో మేనేజ్‌మెంట్‌ కోర్సులు, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌ కోర్సులను ఆన్‌లైన్, డిస్టెన్స్‌ విధానంలో అందించేందుకు అనుమతి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కీలకంగా మారిన లాజిస్టిక్స్‌ కోర్సులను, ట్రావెల్‌ అండ్‌ టూరిజం కోర్సులను కూడా ఓడీఎల్‌/ఆన్‌లైన్‌ విధానంలో అందించొచ్చని స్పష్టం చేసింది. వీటిని అందించే సంస్థలు స్టాండ్‌ అలోన్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, డీమ్డ్‌ టు బి యూనివర్సిటీలు, యూనివర్సిటీలు ఈ కోర్సులను ఆన్‌లైన్‌ విధానంలో బోధించొచ్చని పేర్కొంది. సదరు ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు తప్పనిసరిగా న్యాక్, ఎన్‌బీఏ, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులు పొంది ఉండాలనే నిబంధన విధించింది.

డిజిటల్‌ యూనివర్సిటీ దిశగా అడుగులు

దేశంలో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విధానం విషయంలో అత్యంత కీలకమైన అంశం.. డిజిటల్‌ యూనివర్సిటీ పేరుతో ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించడం. ఈ మేరకు ఈ ఏడాది బడ్జెట్‌లో డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటు విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. డిజిటల్‌ యూనివర్సిటీ విధానంలో.. ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్న స్కిల్స్‌కు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో విద్యార్థులు తమ అర్హతలకు సరితూగే నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం లభించనుంది. ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే డిజిటల్‌ యూనివర్సిటీ విధానంలో కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో ఇంటర్‌తోనే ఆయా వృత్తుల్లో స్థిరపడిన వారు.. తాజా నైపుణ్యాలను సొంతం చేసుకునే అవకాశం ఏర్పడనుంది.

విద్యార్థులు జాగ్రత్తగా

దూర విద్యా విధానంలో చేరాలనుకునే విద్యార్థులు..కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. యూజీసీ నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, ఈ–లెర్నింగ్‌ సౌకర్యం వంటివి ఉన్నాయో? లేదో? తెలుసుకోవాలి. ప్రతి కోర్సుకు సంబంధించి నిర్దిష్టంగా ఫ్యాకల్టీ–స్టూడెంట్‌ నిష్పత్తిపై యూజీసీ నిబంధన ఉంది. దీని ప్రకారం– యూనివర్సిటీ ప్రధాన కేంద్రంలో సంబంధిత విభాగంలో శాశ్వత ప్రాతిపదికగా పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. అదే విధంగా.. సదరు యూనివర్సిటీ న్యాక్‌ గ్రేడింగ్‌లో.. 4.0 పాయింట్‌ స్కేల్‌లో 3.26 స్కోర్‌తో న్యాక్‌ గుర్తింపు లేదా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో గత మూడేళ్లలో కనీసం రెండుసార్లు టాప్‌–100 జాబితాలో నిలవాలి. విద్యార్థులు   దూర విద్యకు దరఖాస్తు చేసుకునేముందు వీటన్నింటి గురించి తెలుసుకోవాలి. 

కోర్సుల వ్యవధిపై స్పష్టత

ఇక కోర్సుల వ్యవధి విషయంలోనూ విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. యూజీసీ నిబంధనల ప్రకారం–పీజీ కోర్సులను కనిష్టంగా రెండేళ్ల వ్యవధిలో, యూజీ కోర్సులను కనిష్టంగా మూడేళ్ల వ్యవధిలో నిర్వహించాలి. ప్రొఫెషనల్, టెక్నికల్‌ కోర్సుల విషయంలో ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం–పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు రెండేళ్ల వ్యవధిలో, పీజీ సర్టిఫికెట్‌ ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధిలో ఉండటం తప్పనిసరి. ఈ వ్యవధిలో పూర్తి చేసిన కోర్సులకే సంబంధిత సంస్థల నుంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఒక కోర్సును ఎంచుకునే సమయంలో దాని వ్యవధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో చేరితే.. ఉన్నత అవకాశాలు, కెరీర్‌ ఉన్నతి కలను సాకారం చేసుకునే అవకాశం లభిస్తుందని గుర్తించాలి.

డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రయోజనాలు

  • పలు కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన వారు ఉన్నత విద్య చదివే అవకాశం.
  • ప్రస్తుతం బ్యాచిలర్, పీజీ, పీజీ డిప్లొమా స్థాయిలో అందుబాటులో ఉంటున్న డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు.
  • ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం–ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌లోని అంశాల్లోనూ ఆన్‌లైన్‌ బోధన.
  • ఆన్‌లైన్‌ విధానంలోకి మారుతున్న డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌. ఫలితంగా విద్యార్థులు నిరంతరాయంగా పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం.
  • అందుబాటులోకి ఈ–కంటెంట్,ఆన్‌లైన్‌ లెక్చర్స్‌
  • డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటైతే జాబ్‌ రెడీ స్కిల్స్‌ నేర్చుకునే అవకాశం

ప్రయోజనకరంగా మార్చుకోవాలి

డిస్టెన్స్, ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులు.. ఆన్‌లైన్‌ లెక్చర్స్‌ అందుబాటులో ఉన్నాయి.. కదా! ఎప్పుడైనా చదువుకోవచ్చు అనే ధోరణి సరికాదు. దీనివల్ల సెమిస్టర్, లేదా ఇయర్‌ ఎండ్‌ పరీక్షల సమయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆన్‌లైన్‌ సదుపాయాలను క్రమం తప్పకుండా వినియోగించుకోవాలి. ఫలితంగా ఆయా అంశాలపై ప్రాథమిక భావనలు మొదలు తాజా పరిణామాల వరకూ..మెరుగైన పరిజ్ఞానం సొంతం చేసుకోవచ్చు. ప్రొఫెషనల్‌ కోర్సుల విషయంలో ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయడం తప్పనిసరి. ఈ విషయంలోనూ అంకిత భావంతో వ్యవహరించాలి. అప్పుడే చేతిలో సర్టిఫికెట్‌తోపాటు తాము కోరుకున్న ఉన్నతి, ఉజ్వల భవిష్యత్‌ అవకాశాలు సొంతమవుతాయి.
– ప్రొ‘‘ ఫయాజ్‌ అహ్మద్, రీజనల్‌ డైరెక్టర్, ఇగ్నో–తెలంగాణ


చదవండి: డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్‌ ద్వారా.. ఉన్నత విద్యకు మార్గాలు​​​​​​​

Published date : 31 Mar 2022 05:41PM

Photo Stories