Skip to main content

డిస్టెన్స్ ఎంబీఏతో కెరీర్‌లో ముందడుగు

తరుణ్.. బీటెక్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం లభించింది. జీతం విషయంలో తృప్తి పొంది జాబ్‌లో చేరిపోయాడు... దీపక్.. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, బీటెక్ అయిపోగానే తప్పనిసరై ఉద్యోగంలో చేరాడు... ఉన్నత విద్యపై ఆశ ఉన్నప్పటికీ, అవకాశం దొరకలేదు. ఇలాంటి వారి కలలను సాకారం చేస్తూ.. రెగ్యులర్ కోర్సులకు దీటుగా.. డిస్టెన్స్ ఎంబీఏ కోర్సులు నిలుస్తున్నాయి. దేశంలోని అత్యున్నత మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల వరకు డిస్టెన్స్ ఎంబీఏ కోర్సులు అందిస్తున్న నేపథ్యంలో ప్రయోజనాలు, ఎంపికలో అనుసరించాల్సిన విధానాలపై విశ్లేషణ..
దశాబ్దాలుగా డిస్టెన్స్ ఎంబీఏ కోర్సులు ఉన్నా.. ప్రస్తుతం మేనేజ్‌మెంట్ విద్యతో అవకాశాలపై అవగాహన పెరిగి, ఎంబీఏ కోర్సులకు డిమాండ్ అధికమైంది. ఇందుకు తగినట్లుగా సీట్ల సంఖ్య లేకపోవటంతో డిస్టెన్స్ ఎంబీఏ కోర్సులకు క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని యూనివర్సిటీల స్థాయిలో దూరవిద్య కేంద్రాల్లో డిస్టెన్స్ ఎంబీఏ కోర్సు అందుబాటులో ఉంది. రెగ్యులర్ ఎంబీఏకు సరితూగేలా కరిక్యులం, ప్రాజెక్ట్ వర్క్, స్పెషలైజేషన్ విధానాలు అమల్లో ఉన్నాయి. డిస్టెన్స్ ఎంబీఏలో లభించే నైపుణ్యాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రెగ్యులర్ కరిక్యులంకు దీటుగా..
డిస్టెన్స్ ఎంబీఏ అందించే ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. రెండు/మూడేళ్ల కాలపరిమితితో నిర్వహించే కోర్సులో ఏటా 45 నుంచి 60 రోజుల వరకు రెగ్యులర్ ఎంబీఏ అధ్యాపకులతో క్లాస్‌రూం లెక్చర్స్ అందిస్తున్నాయి. వాటిలో 75 నుంచి 80 శాతం హాజరు ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్ ప్రధాన క్యాంపస్‌కు వెళ్లే అవసరం లేకుండా స్టడీ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. కోర్సులో చేరిన విద్యార్థులు రెగ్యులర్ ఫ్యాకల్టీతో సంప్రదించి, మేనేజ్‌మెంట్ రంగంలో తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవచ్చు.

ఆన్‌లైన్ లెక్చర్స్ సదుపాయం
డిస్టెన్స్ ఎంబీఏ కోర్సుల్లో అభ్యర్థులకు అనువుగా ఉండేందుకు ఆన్‌లైన్ లెక్చర్స్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌లు తమ వెబ్‌సైట్ ద్వారా ఇంటర్నెట్ ఆధారంగా ఈ లెక్చర్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. నిర్దిష్ట సమయంలో ఇంటర్నెట్ ఆధారంగా లైవ్ లెక్చర్స్ ద్వారా అభ్యసించేలా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తరగతి గదిలో అభ్యసిస్తున్నామనే భావన పొందుతుంటారు.

అనువైన అభ్యసన ప్రక్రియ
దూరవిద్య కోర్సుల్లో విద్యార్థికి అనువైన సమయంలో అభ్యసించే అవకాశం ఉంటుంది. కోర్సుకు నమోదు చేసుకున్న సమయంలోనే విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నాయి. ఆన్‌లైన్ పద్ధతిలో లెక్చర్స్ లైబ్రరీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. విద్యార్థులు తమకు నచ్చిన అంశాన్ని, అనువైన సమయంలో చదువుకునే అవకాశం లభిస్తుంది. కరిక్యులం మేరకు అభ్యసనం పూర్తిచేస్తేనే పరీక్షలో ఉత్తీర్ణత లభిస్తుంది. స్పెషలైజేషన్ ఎంపిక, ప్రాజెక్ట్ వర్క్, అసైన్‌మెంట్స్ పూర్తి చేయటం వంటివి రెగ్యులర్ ఎంబీఏ మాదిరిగానే అమలవుతున్నాయి. వీటి ద్వారా విద్యార్థుల నైపుణ్యాల మూల్యాంకనం నిరంతరం జరుగుతుంది.

ఎవరికి అనుకూలం?
డిస్టెన్స్ ఎంబీఏ ఇటు ఉద్యోగస్తులకు, అటు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేనివారికి.. వారి లక్ష్యాల దిశగా అడుగులు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేస్తున్న సంస్థ లేదా విభాగంలో ఉన్నత హోదా పొందేలా నిర్వహణ నైపుణ్యాలను అందిస్తోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం లభిస్తోంది. ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేని వారికి, చక్కటి మార్గంగా నిలుస్తోంది. ఫీజుల మొత్తాలు కూడా ఆయా వర్గాలకు అనుకూలంగా ఉంటున్నాయి. ఎంపిక చేసుకున్న ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి ఏడాదికి రూ. 18 వేల నుంచి రూ. లక్షన్నర వరకు ఫీజులు ఉంటున్నాయి.

పార్ట్-టైం కోర్సులు
పార్ట్-టైం ఎంబీఏ లేదా పార్ట్ టైం పీజీ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ అవకాశం కూడా ఉంది. వారాంతాల్లో లేదా రోజూ సాయంత్ర సమయాల్లో క్లాసుల బోధన ఉంటుంది. ఈ పార్ట్ టైం కోర్సులు ఉద్యోగస్తులకు బాగా ఉపకరిస్తాయి. నిరంతరం ప్రత్యక్షంగా క్లాసులు వినే అవకాశం ఉంటుంది. డిస్టెన్స్ ఎంబీఏతో పోల్చితే, వీటి ఫీజులు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి.

ఐఐఎంలలో కోర్సులు
అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు కూడా డిస్టెన్స్ విధానంలో మేనేజ్‌మెంట్‌లో పీజీ కోర్సులు అందించటంలో ముందుంటున్నాయి. ఏడాది నుంచి మూడేళ్ల కాలపరిమితితో సర్టిఫికెట్, పీజీపీ, పీజీ డిప్లొమా స్థాయిల్లో పలు కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. కోర్సు వ్యవధిలో నిర్దేశిత సమయంలో, క్యాంపస్‌లో కాంటాక్ట్ క్లాస్‌లు లేదా వీకెండ్ క్లాస్‌లు నిర్వహిస్తున్నాయి. ఐఐఎం రోహ్‌తక్, ఐఐఎం -కోజికోడ్, ఐఐఎం- ఇండోర్ వంటివి కోర్సులను అందిస్తున్నాయి. క్లాస్‌లు నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సులు ప్రధానంగా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కు ఉద్దేశించిన నేపథ్యంలో కనీసం మూడు నుంచి పదిహేనేళ్ల అనుభవం ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజుల మొత్తాలు కూడా రూ. 8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటున్నాయి. NIIT Imperia, Hughes Global Education సంస్థల భాగాస్వామ్యంతో ఐఐఎం- అహ్మదాబాద్, ఇండోర్, కోల్‌కతా, లక్నోలు ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నాయి.

కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు
  • ఐఐఎం కోజికోడ్
    కోర్సు:
    ఈపీజీపీ
    కాలపరిమితి: రెండేళ్లు
    వెబ్‌సైట్: www.iimk.ac.in
  • ఐఐం కోల్‌కతా
    కోర్సు: సీనియర్ లీడర్‌షిప్ ప్రోగ్రాం
    కాలపరిమితి: 9 నెలలు
    వెబ్‌సైట్: www.iimcal.ac.in
  • ఐఐఎం- లక్నో
    కోర్సు:
    ద వర్కింగ్ మేనేజర్స్ ప్రోగ్రామ్
    కాలపరిమితి: మూడేళ్లు
    వెబ్‌సైట్: www.iiml.ac.in
  • ఐఐఎం ఇండోర్
    కోర్సు: పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్;
    కాలపరిమితి: రెండేళ్లు
    వెబ్‌సైట్: www.iimidr.ac.in
  • ఐఐఎం రాయ్‌పూర్
    కోర్సు: పీజీపీడబ్ల్యుఈ
    కాలపరిమితి: ఒకటిన్నర సంవత్సరం
    వెబ్‌సైట్: www.iimraipur.ac.in
  • ఐఐఎం రోహ్‌తక్
    కోర్సు: ఈపీజీపీ ఇన్ మేనేజ్‌మెంట్
    కాలపరిమితి: రెండేళ్లు
    వెబ్‌సైట్: www.iimrohtak.ac.in
  • ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
    కోర్సు: ఎంబీఏ
    ప్రవేశం: ఓపెన్ మ్యాట్ స్కోర్ ఆధారంగా
    వెబ్‌సైట్: www.onlineadmission.ignou.ac.in
  • సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్
    కోర్సు: పీజీడీబీఏ;
    ప్రవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
    వెబ్‌సైట్: www.scdl.net
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ
    కోర్సులు: పీజీడీఎం; పీజీడీఎం (ఎగ్జిక్యూటివ్), పీజీడీబీఏ
    వెబ్‌సైట్: www.imtcdl.ac.in
  • నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
    కోర్సులు: పలు స్పెషలైజేషన్లతో డిప్లొమా; పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సులు
    వెబ్‌సైట్: www.distance.nmims.edu
  • ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ
    కోర్సు: ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ హెచ్‌ఆర్‌ఎం
    వెబ్‌సైట్: www.xlri.ac.in
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రయోజనాలు
  • అనువైన సమయంలో అభ్యసన ప్రక్రియ.
  • 24 x 7 ఆన్‌లైన్ లెర్నింగ్ సదుపాయం.
  • రెగ్యులర్‌తో పోల్చితే కొంచెం తక్కువ ఫీజులు.
  • ఉద్యోగస్తులకు మరింత ఉన్నత హోదాలు కల్పించేందుకు మార్గం.
  • ఇష్టమున్నా లేకున్నా క్లాస్‌రూంలో కూర్చోవాలనే నిబంధన లేకపోవడం.
ప్రతికూలతలు
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అధిక శాతం సానుకూల అంశాలతోపాటు ప్రతికూలతలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • లెక్చరర్స్‌తో డెరైక్ట్ ఇంటరాక్షన్‌కు అవకాశం లేకపోవడం.
  • స్వీయ క్రమశిక్షణ లోపిస్తే, ఫలితం శూన్యం.
  • ఇప్పటికీ కొన్ని పరిశ్రమల నుంచి అంతగా గుర్తింపు లభించకపోవడం.
  • కొన్ని సందర్భాల్లో అన్ని కోర్సులు అందుబాటులో ఉండకపోవడం.
ఎంపిక విధానంలో వేర్వేరు నిబంధనలు
డిస్టెన్స్ ఎంబీఏ, పార్ట్-టైం ఎంబీఏ కోర్సుల ఎంపిక విధానం ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల నిబంధనల మేరకు ఉంటోంది.
  • ఐఐఎంలు క్యాట్/జీమ్యాట్ స్కోర్ల ఆధారంగా నిర్వహించే గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.
  • ఇతర ప్రముఖ బి-స్కూల్స్ తాము సొంతగా నిర్వహించే ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ / పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తున్నాయి.
  • రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీల పరిధిలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ నేరుగా ప్రవేశం కల్పిస్తున్నాయి.
వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కు అనుకూలం
ప్రస్తుతం డిస్టెన్స్ ఎంబీఏ ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది. తమ కెరీర్‌లో ముందడుగు వేసేందుకు ఉపకరిస్తోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో కాంటాక్ట్ క్లాసులకు వెళ్లేందుకు కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. లెక్చరర్స్‌తో ప్రత్యక్ష ఇంటరాక్షన్‌కు లభించే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- ప్రొఫెసర్ వి.శేఖర్, ఓయూసీసీబీఎం

గుర్తింపుపై అప్రమత్తంగా
డిస్టెన్స్ ఎంబీఏ చేయాలనుకున్న విద్యార్థులు, కోర్సులు, కాలవ్యవధి, వాటికి గుర్తింపు గురించి పూర్తి అవగాహనను పెంపొందించుకొని, స్పష్టమైన నిర్ణయానికి రావాలి. ఇప్పుడు చాలావరకు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లకు పరిశ్రమల పరంగా గుర్తింపు ఉన్నప్పటికీ.. అధికారికంగా గుర్తింపు లేకపోవటంతో ప్రభుత్వ అవకాశాలు దక్కట్లేదు. అందుకే గుర్తింపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
- ప్రొఫెసర్ ఎల్.డి.సుధాకర్‌బాబు, డెరైక్టర్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఏయూ.
Published date : 18 Dec 2015 11:47AM

Photo Stories