Skip to main content

డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్‌ ద్వారా.. ఉన్నత విద్యకు మార్గాలు

వేలకు వేలు ఫీజుల భారాన్ని మోయలేని వారికి, అప్పటికే చేస్తున్న ఉద్యోగాలను వదులుకొని ఉన్నత విద్యకు సమయాన్ని వెచ్చించలేని వారికి దూరవిద్యా కోర్సులు వరప్రదాయినులు!
జాబ్ మార్కెట్లో అదనపు అర్హతగా ఉండేందుకు, ఉద్యోగంలో పదోన్నతులకు డిస్టెన్స్ కోర్సులు ఉపయోగపడతాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ యూనివర్సిటీలు డిస్టెన్ మోడ్‌లో కోర్సులను అందిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ విధానంలో ఈ కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిపై ఫోకస్...

దూరవిద్య లక్ష్యాలు
  • రకరకాల కారణాల వల్ల రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశం పొందలేని వారిని విద్యా సముపార్జనకు దగ్గర చేయడం.
  • చదువును మధ్యలో ఆపేసిన వారికి సరళీకృత విద్య (Liberal education) ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, వృత్తి నైపుణ్యాలను పెంపొందించే కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం.
  • విద్యార్థులకు అందుబాటులో ఉండే సమయానికి అనుగుణంగా కోర్సులను, అధ్యయన పద్ధతులను అందించడం.
  • విద్యార్థులకు, విద్యా సంస్థలకు మధ్య దూరాన్ని తగ్గించి మంచి విద్యా వాతావరణాన్ని పెంపొందించడం.
  • సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అవసరమయ్యే కోర్సులకు రూపకల్పన చేసి, విద్యార్థులకు అందుబాటులో ఉంచడం.

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా
ఏ కోర్సులో చేరినప్పటికీ అభ్యర్థుల అంతిమ లక్ష్యం మంచి ఉద్యోగంతో సుస్థిర కెరీర్‌ను అందుకోవడమే! అభ్యర్థులు కూడా ఇలాంటి కోర్సుల వైపే మొగ్గుచూపుతారు. అందువల్ల విద్యా సంస్థలు ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగినట్లు డిస్టెన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులు డిప్లొమా మొదలు పీజీ స్థాయి వరకు అందుబాటులో ఉంటున్నాయి. ఉదాహరణకు ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్యా విభాగం సర్టిఫికెట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ అకౌంటింగ్, డిప్లొమా ఇన్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ వంటి కోర్సులను అందిస్తోంది. పీజీ డిప్లొమా స్థాయిలో కో ఆపరేషన్ అండ్ రూరల్ స్టడీస్, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ ఆఫ్ వలంటరీ ఆర్గనైజేషన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది.
  • ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్- మూడేళ్ల కాలవ్యవధి గల బీఎస్సీ (ఏవియేషన్), పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వంటి వినూత్న కోర్సులను ఆఫర్ చేస్తోంది.
  • ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్... పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సులు అందిస్తోంది. బీఎస్సీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీహెచ్‌ఎం (బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్), ఎంఎస్సీ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్) కోర్సులను ఆఫర్ చేస్తోంది.

ఎంబీఏ, ఎంసీఏ
దూరవిద్యా విధానంలో ఆఫర్ చేస్తున్న కోర్సుల్లో ఎంబీఏ, ఎంసీఏలకు డిమాండ్ బాగుంది. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అవకాశాలు మెరుగ్గా ఉండటంతో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) కోర్సుకు డిస్టెన్స్ మోడ్‌లో ఆదరణ పెరుగుతోంది. భారత సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం 2014-15లో దేశంలో ఐటీ-బీపీఎం మార్కెట్ విలువ 20.9 బిలియన్ యూఎస్ డాలర్లు. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చితే పది శాతం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఎంసీఏ కోర్సుకు ఆదరణ పెరుగుతోంది. మ్యాథమెటికల్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్/నెట్‌వర్కింగ్, కమర్షియల్ తదితరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎలా ఉపయోగపడతాయన్న అంశాలు ఈ కోర్సులో ప్రధానంగా ఉంటాయి.
  • ఐటీ, టెలికం, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బీఎఫ్‌ఎస్‌ఐ తదితర విభాగాల్లో శరవేగ వృద్ధి కారణంగా వివిధ స్పెషలైజేషన్లలో ఎంబీఏ పూర్తిచేసిన వారిని అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంబీఏ వైపు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు మేనేజ్‌మెంట్‌లో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. అయితే స్పెషలైజేషన్ ఎంపికలో తోటివారి ఒత్తిడి, అధిక వేతనాలు కోణంలోనే కాకుండా ఆసక్తిని పరిగణనలోకి తీసుకోవాలని కెరీర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఉదాహరణకు మెకానికల్ ఎబిలిటీ ఉన్నవారు ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్; పరిశీలన, అభ్యసనం, పరిశోధన, విశ్లేషణ, ఇతరులతో మమేకమవడం, కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉన్నవారు మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీలు మరింత ప్రత్యేకత కలిగిన స్పెషలైజేషన్లలో ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి.
  • ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంసీఏతో పాటు ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్), ఎంబీఏ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్‌మెంట్), పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి కోర్సులను అందిస్తోంది.

ఇగ్నో... దూరవిద్యకు కేరాఫ్!
దేశంలో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో ఉన్నత విద్యను అందిస్తూ స్థూల నమోదు శాతం (Gross Enrol-lment Ratio-GER) ను పెంచాలన్న సదుద్దేశంతో పనిచేస్తోంది... ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో). డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనే రెండు ప్రోగ్రామ్‌లతో 1987లో ప్రారంభమైన ఈ సంస్థ నేడు దాదాపు 228 సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, డాక్టోరల్ కోర్సులను అందిస్తోంది. దేశ, విదేశాల్లోని నెట్‌వర్‌‌క ద్వారా దాదాపు 30 లక్షల మంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. నిరంతరం మార్కెట్ అవసరాలకు తగినట్లుగా పరిశ్రమ వర్గాలతో చర్చించి సరికొత్త కోర్సులకు రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో ఏటా కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. విద్యా విధానంలో ఆడియో విజువల్ మెటీరియల్, టెలీకాన్ఫరెన్స్‌లు, ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా విభిన్న అంశాలతో విద్యార్థులకు చేరువవుతోంది. ప్రస్తుతం ఇగ్నోలో జూలై సెషన్‌కు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.
  • ఎంసీఏ, ఎంఎస్సీ (డైటీటిక్స్ అండ్ ఫుడ్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్), ఎంఏ (టూరిజం మేనేజ్‌మెంట్), ఎంఏ (గాంధీ అండ్ పీస్ స్టడీస్), ఎంఏ (ఎక్స్‌టెన్షన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్) తదితర పీజీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • బీఏ (టూరిజం స్టడీస్), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపరేషన్స్, పీజీ డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వంటి కోర్సులున్నాయి.

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ
తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం.. డిస్టెన్స్ కోర్సుల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా మహిళలు, ఉద్యోగాలు చేస్తున్నవారు, అకడమిక్ అర్హతలు, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంపొందించుకోవాలనుకునే వారికి యూనివర్సిటీ వివిధ కోర్సులను ఆఫర్ చే స్తోంది. భౌగోళికంగా, సామాజికంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉన్నతవిద్యకు దూరమైన వారికి విద్యను దగ్గర చేస్తోంది. ‘ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్’ నినాదంతో విద్యా సేవలు అందిస్తోంది. బీఈడీ, ఎంఈడీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ హెర్బల్ ప్రొడక్ట్స్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో దూరవిద్యా కోర్సుల బోధన విధానంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. అధికశాతం యూనివర్సిటీలు డిస్టెన్స్ విద్యార్థులకు‘ఈ-లెర్నింగ్’సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కోర్సు రిజిస్ట్రేషన్ నంబరు, లేదా అడ్మిషన్ నంబరు ఆధారంగా సదరు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో యూజర్-ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుంటే ‘ఈ-లెర్నింగ్’ మెటీరియల్ లభిస్తుంది.

ఎన్‌పీటీఈఎల్-ఆన్‌లైన్ కోర్సులు
దేశంలోని ఏడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు.. ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-గువహటి, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-రూర్కీ); ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)-బెంగళూరు సంయుక్తంగా ఎన్‌పీటీఈఎల్(నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్)ను రూపొందించాయి. దీనికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి నిధులు అందుతాయి.

కోర్సులు-వివరాలు:
  • ఈ-లెర్నింగ్ విధానంలో నేర్చుకునేలా ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్ ఔత్సాహికుల కోసం సబ్జెక్ట్ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో వీడియో/ఆడియోల రూపంలో అందుబాటులో ఉంచుతారు.
  • కోర్సులో చేరిన ప్రతి ఒక్కరూ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వీడియో/ఆడియో తరగతులను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే బయట డీవీడీలు కొనుక్కోవచ్చు. ఒక్కో టైటిల్ డీవీడీ రూ. 200. ఒక డీవీడీలో 30 నుంచి 45 వరకు లెక్చర్స్ ఉంటాయి. దేశంలో కళాశాలలు, యూనివర్సిటీలు సబ్‌స్క్రైబ్ చేసుకుని ప్రత్యేక ప్యాకేజ్‌ను పొందొచ్చు.
  • ఎవరైనా, ఎక్కడ ఉన్నవారైనా ఆన్‌లైన్ కోర్సుల్లో చేరొచ్చు. విద్యార్థులు, ఫ్యాకల్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
  • కోర్సు పూర్తయిన తర్వాత నిర్దేశ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులకు ఐఐటీల నుంచి సర్టిఫికెట్ లభిస్తుంది. పరీక్ష రాయాలా.. వద్దా? అనేది విద్యార్థుల ఇష్టం.
    వెబ్‌సైట్: www.nptel.ac.in

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా...
ఏదో ఒక డిగ్రీ పట్టా కోసం అని కాకుండా ఎంపిక చేసుకున్న కోర్సు... భవిష్యత్తులో తమ కెరీర్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. కోర్సులో చేరేముందు సంబంధిత సంస్థకు యూజీసీ గుర్తింపు ఉందా? లేదా? చూడాలి. కోర్సును ఎలా అందిస్తున్నారు? స్టడీ మెటీరియల్ ప్రామాణికంగా ఉందా? వంటివాటి సమాచారం సేకరించాలి. ప్రస్తుతం జాబ్ చేస్తున్న వారైతే అదే కెరీర్‌లో పైకి ఎదిగేందుకు ఉపయోగపడే కోర్సులను ఎంపిక చేసుకోవాలి. నిరుద్యోగులైతే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకునే కోర్సుల వైపు మొగ్గుచూపాలి. ఉదాహరణకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీలు, పట్టణాల్లో అందిరకీ ఇళ్లు, అమృత్ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆయా రంగాల్లో అవకాశాలు పెరగనున్నాయి. ఈ క్రమంలో ఔత్సాహికులు ఏడాది కాల వ్యవధితో ఇగ్నో ఆఫర్ చేస్తున్న పీజీ డిప్లొమా ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ కోర్సు చేయొచ్చు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారు ఉన్నత స్థానాలు అందుకునేందుకు ఇలాంటి కోర్సులు ఉపయోగపడతాయి.
- డా. పి.వి.కె.శశిధర్, అసోసియేట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, ఇగ్నో, న్యూఢిల్లీ.


దూరవిద్యకు ప్రముఖ యూనివర్సిటీలు
  • ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.ignou.ac.in
  • ఉస్మానియా యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    oucde.net
  • ఆంధ్రా యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.andhrauniversity.edu.in/sde
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.uohyd.ac.in
  • యూనివర్సిటీ ఆఫ్ ముంబై
    వెబ్‌సైట్:
    mu.ac.in/portal
  • మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.manuu.ac.in
  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.braou.ac.in
  • సింబయోసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్
    వెబ్‌సైట్:
    www.scdl.net
Published date : 10 Jul 2015 02:08PM

Photo Stories