TS DEECET 2022: అర్హతలు, పరీక్ష విధానం, కోర్సు తర్వాత కెరీర్ అవకాశాలు..
ఇంటర్మీడియట్‌తోనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేందుకు మార్గం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రి స్కూల్ ఎడ్యుకేషన్. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డీఈఈసెట్ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. డీఈఈసెట్ దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు, పరీక్ష విధానం, కోర్సు తర్వాత కెరీర్ అవకాశాలపై ప్రత్యేక సమాచారం.
మన సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తి బోధన. టీచింగ్‌పై ఆసక్తి ఉండి చిన్న వయసులోనే సుస్థిరమైన కెరీర్‌ను కోరుకునే వారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సులో చేరొచ్చు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్.. డీఈఈసెట్. ఇందులో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్స్ ఆప్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌లు(డైట్), ఎయిడెడ్, మైనారిటీ, అలాగే ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం లభిస్తుంది.
అర్హతలు
ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో కనీసం 50శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు డీఈఈసెట్ దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఆయా కోర్సుల చివరి ఏడాది పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
వయసు: 2022, సెప్టెంబర్1వ తేదీ నాటికి 17 ఏళ్లు పూర్తిచేసుకోవాలి. ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది
డీఈఈసెట్ పరీక్ష విధానం
- ఈ పరీక్ష వంద ప్రశ్నలు–వంద మార్కులకు జరుగుతుంది. ఇందులో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. పార్ట్–1లో జనరల్ నాలెడ్జ్, టీచింగ్,ఆప్టిట్యూడ్‌ల నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. పార్ట్–2లో జనరల్ ఇంగ్లిష్–10, జనరల్ తెలుగు నుంచి 20 ప్రశ్నలుంటాయి. పార్ట్–3లో మ్యాథ్స్–20, ఫిజికల్ సైన్స్–10, బయలాజికల్ సైన్సెస్–10, సోషల్ స్టడీస్‌ల నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాసుకోవచ్చు.
- సబ్జెక్ట్,లాంగ్వేజ్ ప్రశ్నలన్నీ పదోతరగతి స్థాయి సిలబస్ నుంచే ఉంటాయి. కాబట్టి విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలను చదవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
1 నుంచి 5 తరగతులకు బోధన
విజయవంతంగా రెండేళ్ల డీఎడ్ కోర్సును పూర్తిచేసుకున్నవారు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులకు బోధించే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలకు సంబంధించి టీచర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడినప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.07.2022
- వెబ్‌సైట్: http://deecet.cdse.telangana.gov.in/