Skip to main content

బహుళ ప్రయోజనాలకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు

కాలక్రమేణా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. సంప్రదాయ కోర్సుల స్థానంలో నూతన విభాగాలు ప్రవేశిస్తున్నాయి.. మారుతున్న అవసరాలు, పెరుగుతున్న ప్రాథమ్యాల మేరకు.. ఒక విద్యార్థి తన సంబంధిత అంశంతోపాటు మిగతా విభాగాలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరిగా మారింది .. ఆ మేరకు రెండు కోర్సుల కలయికతో రూపొందించినవే ఇంటిగ్రేటెడ్ కోర్సులు.. ప్రస్తుతంఅంతా ప్రవేశాల సందడి నెలకొన్ని సమయంలో వివిధ విద్యా సంస్థలు అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్సులపై విశ్లేషణ...

ఒకప్పుడు డీగ్రీ తర్వాత పీజీ చేయాలంటే వేర్వేరు కాలేజీల్లో చేరడం తప్పనిసరి. ఆ మేరకు సంబంధిత నిబంధనలు, ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని కల్పించడానికి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆవిర్భవించాయి. జాతీయ స్థాయిలో పలు యూనివర్సిటీలతోపాటు రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాల యాలు, ఐఐఎస్సీ, ఐఐటీలు కూడా ఇంజనీరింగ్ నుంచి హ్యుమానిటీస్ అంశాల వరకు ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు..

ఇంజనీరింగ్‌లోను..
ఇంటిగ్రేటెడ్ కోర్సులు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాలేదు. ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ ఈ ఒరవడి కొనసాగుతోంది. ఐఐటీల విషయానికొస్తే..ఎంఎస్సీ, ఎంఎస్సీ టెక్, ఎంటెక్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి-ఐదేళ్లు. ఐఐటీ-ఖరగ్‌పూర్ ఎంఎస్సీ (స్పెషలైజేషన్స్-అప్లయిడ్ జియాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్), ఐఐటీ-బాంబే ఎంఎస్సీ (కెమిస్ట్రీ), ఐఐటీ-రూర్కీ ఎంఎస్సీ (అప్లయిడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఐఎస్‌ఎం-ధన్‌బాద్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్), ఐఎస్‌ఎం-ధన్‌బాద్ ఎంఎస్సీ టెక్ (స్పెషలైజేషన్స్-అప్లయిడ్ జియాలజీ, అప్లయిడ్ జియోఫిజిక్స్). ఐఐటీ-రూర్కీ ఎంటెక్ (జియలాజికల్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్), ఐఐటీ-వారణాసి ఎంటెక్ ( ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, జియోఫిజికల్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్) కోర్సులను అందిస్తున్నాయి. అంతేకాకుండా పలు రకాల స్పెషలైజేషన్స్‌తో బీటెక్+ఎంటెక్, ఎంఫార్మసీ డ్యూయల్ డిగ్రీ, బీఎస్, ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా ఇందులో ప్రవేశం పొందొచ్చు. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్) ఎంట్రెన్స్ ద్వారా ఎంఎస్సీ- పీహెచ్‌డీ, ఎంఎస్సీ- పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ, పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఐఐటీల్లో చదివే అవకాశం ఉంది. ఐఐఎస్సీ బీఎస్-ఎంఎస్, ఐఐఎం-ఇండోర్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ వంటి విభిన్న కోర్సులను కూడా అందిస్తున్నాయి.

జేఎన్‌టీయూలో కూడా:
జేఎన్‌టీయూ-హైదరాబాద్ కూడా డబుల్ డిగ్రీ కోర్సులను అందిస్తుంది. అవి.. బీటెక్+ఎంటెక్ (సివిల్ ఇంజనీరింగ్), బీటెక్ (సివిల్)+ఎంబీఏ , బీటెక్+ఎంటెక్ (మెకానికల్), బీటెక్ (మెకానికల్)+ఎంబీఏ, బీటెక్ (ఈఈఈ)+ఎంబీఏ, బీటెక్+ఎంటెక్ (ఈఈఈ), బీటెక్ (ఈసీఈ)+ఎంబీఏ, బీటెక్+ఎంటెక్ (ఈసీఈ), బీటెక్+ఎంటెక్ (సీఎస్‌ఈ), బీటెక్ (సీఎస్‌ఈ)+ఎంబీఏ. ఈ కోర్సుల్లో ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అంతేకాకుండా అమెరికాలోని ఫ్లైట్ యూనివర్సిటీ, బ్యాంకాక్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సుల్లో ఎంసెట్/జేఈఈ-మెయిన్ స్కోర్ ప్రామాణికంగా అడ్మిషన్లు నిర్వహిస్తారు. జేఎన్‌టీయూ-కాకినాడ, ఆంధ్రా యూనివర్సిటీలు కూడా డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందజేస్తున్నాయి.

సంప్రదాయ సబ్జెక్ట్‌లలో..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు యూనివర్సిటీలు కూడా సంప్రదాయ సబ్జెక్ట్‌లలో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందజేస్తున్నాయి. అవి..ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంబీఏ, ఎంఏ (అప్లయిడ్ ఎకనామిక్స్), ఆంధ్రా యూనివర్సిటీ ఎంఏ (ఎకనామిక్స్), నాగార్జున యూనివర్సిటీ ఎంబీఏ, ఎంఎస్సీ (నానో టెక్నాలజీ). ఆయా యూనివర్సిటీలు నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇంటిగ్రేటెడ్ విభాగంలో ఎంఏ/ఎంఎస్సీ కోర్సులను బోధిస్తుంది. కాల వ్యవధి ఐదేళ్లు. ఈ కోర్సులను సెమిస్టర్ పద్ధతిలో నిర్వహిస్తారు. 10 సెమిస్టర్లు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త్ సెన్సైస్ సబ్జెక్ట్‌లను వర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఎంఏ విభాగంలో హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సులు, హ్యుమానిటీస్ కింద తెలుగు, హిందీ, ఉర్దూ భాషా కోర్సులు ఉన్నాయి. సోషల్ సెన్సైస్ కింద ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ..
సైన్స్ అభ్యర్థులకు డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ చేసే అవకాశాన్ని కొన్ని రకాల కోర్సులు క ల్పిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీకోర్సులుగా వ్యవహరిస్తారు. అటువంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (వెబ్‌సైట్: www.iisc.ernet.in )-బెంగళూరు, బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (వెబ్‌సైట్: www.jncasr.ac.in ) -బెంగళూరు, కూడా బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తుంది. అంతేకాకుండా పలు ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఇటువంటి కోర్సులను ప్రవేశపెట్టాయి. తద్వారా పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ఒకే చోట పూర్తి చేసే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది.

పయోజనాలు
ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఎంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ ఒకే చోట చదివే అవకాశం లభిస్తుంది. తద్వారా విలువైన సమయాన్ని కూడా ఆదా చేయవచ్చు. ఉదాహరణకు ఇంజనీరింగ్‌లో డిగ్రీని తీసుకుంటే.. బ్యాచిలర్ నాలుగేళ్లు, పీజీ రెండేళ్లు కలిపి మొత్తం ఆరేళ్లు. అదే ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో ఐదేళ్లలోనే కోర్సును పూర్తి చేయవచ్చు. సంబంధిత సబ్జెక్ట్‌తోపాటు ఇతర అంశాలపై కూడా మంచి అవగాహన వస్తుంది. అంతేకాకుండా మారుతున్న పరిస్థితులు, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను రూపొందిస్తారు. తద్వారా కెరీర్‌లో త్వరగా స్థిరపడొచ్చు.

ఐఐఎం లక్నో: ఐపీఎంఎక్స్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-లక్నో, ఏడాది వ్యవధి గల ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కోర్సుకు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఈ కోర్సును నాలుగు టర్మ్‌లలో బోధిస్తారు. ప్రతి టర్మ్ తొమ్మిది వారాల పాటు ఉంటుంది. ఇందులో మేనేజీరియల్ ఎకనామిక్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, జనరల్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలను బోధిస్తారు.
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
ప్రవేశ విధానం: జీమ్యాట్ స్కోర్ (2011, జూలై 1-అక్టోబర్ 30, 2014 మధ్య స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు), అనుభవం ఆధారంగా నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్వ్యూలు డిసెంబర్‌లో ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014.
వివరాలకు: www.iiml.ac.in

ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్
జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్: ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సు వ్యవధి 16 నెలలు. దీన్ని నాలుగు టర్మ్‌లలో బోధిస్తారు. మొదటి మూడు టర్మ్‌లలో తప్పకుండా చదవాల్సిన 15 సబ్జెక్ట్‌లు ఉంటాయి. నాలుగో టర్మ్‌లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
అర్హత: ఏదైనా డిగ్రీ. సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
ప్రవేశ విధానం: అనుభవం ఆధారంగా నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 20, 2014.
వివరాలకు: www.xlri.ac.in
Published date : 11 Sep 2014 03:28PM

Photo Stories