ITI Courses After 10th: సత్వర ఉపాధికి కేరాఫ్ ఐటీఐ
- తెలంగాణ ఐటీఐల్లో ప్రవేశాలు ప్రారంభం
- పదో తరగతి అర్హతతో దరఖాస్తుకు అవకాశం
- ఎనిమిదో తరగతి అర్హతగా మరికొన్ని కోర్సులు
- కోర్సు పూర్తి చేసుకుంటే..సత్వర ఉపాధికి మార్గం
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 10, 2023
- ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఐటీఐల్లో 2023-24 సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 274 ఐటీఐలు ఉండగా.. వీటిలో 63 ప్రభుత్వ ఐటీఐలు, మిగతావి ప్రైవేట్ ఐటీఐలు. రాష్ట్రంలోని ఐటీఐల్లో 24 ఇంజనీరింగ్, 13 నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి.
- నాన్-ఇంజనీరింగ్ విభాగంలో.. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, డ్రైవర్ కమ్ మెకానిక్, ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, హాస్పిటల్ హౌస్ కీపింగ్, ఐఓటీ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, సెక్రటేరియల్ ప్రాక్టీస్, స్యూయింగ్ టెక్నాలజీ, స్మార్ ఫోన్ టెక్నీషియన్ కమ్ యాప్ టెస్టర్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్, డెంటల్ లేబరేటరీ ఎక్విప్‌మెంట్ టెక్నీషియన్‌లు ఉన్నాయి.
చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..
ఇంజనీరింగ్.. పలు ట్రేడ్‌లు
- ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్/మెకానిక్), ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ (గ్రైండర్), మోటార్ వెహికిల్ మెకానిక్, ఆటో బాడీ పెయింటింగ్ మెకానిక్, ఆటో బాడీ రిపెయిర్ మెకానిక్, ఆటోఎలక్ట్రిషియన్ అండ్ ఎలక్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, జనరల్ పెయింటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, షీట్‌మెటల్ వర్కర్, సోలార్ టెక్నీషియన్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ విభాగాల్లో ఇంజనీరింగ్ ట్రేడ్‌లు అందిస్తున్నాయి.
ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధి
- అన్ని బ్రాంచ్‌లకు సంబంధించి ఏడాది, రెండేళ్ల వ్యవధిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ ట్రేడ్‌ల్లో ఎక్కువ శాతం కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు. ఆయా ట్రేడ్‌లను అనుసరించి.. పదో తరగతి, ఎనిమిదో తరగతి అర్హతగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
మెరిట్ ఆధారంగా ప్రవేశం
- ట్రేడ్‌ను అనుసరించి కోర్సు ఆరు నెలల నుంచి రెండేళ్ల వ్యవధిలో ఉంటుంది.
- ఆయా ట్రేడుల్లో ప్రవేశానికి పదో తరగతి, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- సదరు ట్రేడ్‌లకు అర్హతగా పేర్కొన్న తరగతుల్లో పొందిన మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థులు నిర్దేశిత వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత.. ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న ట్రేడ్‌లు, ఐటీఐలను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాలి. వీటి ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది.
చదవండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్ డిప్లొమా.. భవితకు ధీమా
డీఎస్‌టీ విధానం.. వినూత్న బోధన
ఐటీఐల్లో డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ విధానం ప్రకారం శిక్షణనిస్తారు. కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా.. సదరు పరిశ్రమలకు అవసరమైన రీతిలో శిక్షణ అందిస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలోని కోర్సులకు గరిష్టంగా మూడు నెలలు, ఏడాది వ్యవధి గల కోర్సులకు మూడు నుంచి ఆరు నెలలు, రెండేళ్ల వ్యవధి గల కోర్సులకు ఆరు నెలల నుంచి సంవత్సరంపాటు.. ఆయా సంస్థల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించే విధానం అమలవుతోంది. ఫలితంగా..కోర్సు వ్యవధిలో దాదాపు మూడో వంతు లేదా సగం సమయాన్ని అభ్యర్థులు తమ ట్రేడ్‌కు సంబంధించి ఇండస్ట్రీలో పని చేస్తూ క్షేత్ర నైపుణ్యాలు సొంతం చేసుకోగలుగుతున్నారు. దీంతో కోర్సు పూర్తయ్యాక వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. కోర్సు వ్యవధిలో 70 శాతం సమయాన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్, మిగతా 30 శాతాన్ని థియరిటికల్ ట్రైనింగ్ ఇచ్చేలా కరిక్యులం అమలవుతోంది.
ఎన్‌సీవీటీ ట్రేడ్ టెస్ట్‌కు అర్హత
ఐటీఐల్లో ఆయా ట్రేడ్‌ల్లో కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు.. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌కు హాజరయ్యే అర్హత లభిస్తుంది. ఈ ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి కంపెనీల్లో అప్రెంటీస్ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇంజనీరింగ్ ట్రేడ్‌లకు సంబంధించి ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణతను కొన్ని సంస్థలు తప్పనిసరి చేస్తున్నాయి. దీంతో ఐటీఐ పూర్తి చేసుకున్నాక.. ట్రేడ్ టెస్ట్‌లోనూ విజయం సాధిస్తే ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి.
ఎన్‌ఏపీఎస్‌కూ అర్హత
ఐటీఐ పూర్తి చేసుకుంటే.. జాతీయ స్థాయిలో అమలవుతున్న నేషనల్ అప్రెంటీస్ ప్రమోషన్ స్కీమ్‌కు కూడా అర్హత లభిస్తుంది. ఎన్‌ఏపీఎస్ పోర్టల్‌లో తమ పేరు, అర్హతలు, ట్రేడ్ వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా.. సంస్థల్లో అప్రెంటీస్ ట్రైనీగా అవకాశం అందుకోవచ్చు. అప్రెంటీస్ ట్రైనింగ్ సమయంలో.. రూ.9వేల వరకు స్టయిఫండ్ అందుతుంది. శాశ్వత ఉద్యోగుల సంఖ్య 30 మంది ఉన్న సంస్థలు అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకునే విధంగా ఎన్‌ఏపీఎస్ విధానాలను రూపొందించారు. దీంతో ఐటీఐ పూర్తి చేసుకున్న వారికి అప్రెంటీస్ అవకాశాలు లభిస్తున్నాయి.
చదవండి: Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్ అవకాశాలు ఇవే..
ఉద్యోగ, ఉపాధిలో ముందంజ
- ఐటీఐ పూర్తి చేసుకున్న వారు ఉద్యోగ సాధనలో ముందుంటున్నారనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. ఇంజనీరింగ్ ట్రేడ్‌లు ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టెక్నీషియన్స్, ఫ్లోర్‌మెన్ కొలువులు లభిస్తున్నాయి. వీరికి నెలకు రూ.20వేల వరకూ వేతనం అందుతోంది. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ వంటివి పూర్తి చేసిన వారికి చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు లభిస్తున్నాయి.
- ఐటీఐ ఉత్తీర్ణులు స్వయం ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెకానిక్ వంటి ట్రేడ్‌లు పూర్తి చేసుకున్న విద్యార్థులు సొంతంగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు.
మూడు మహిళా ఐటీఐలు
తెలంగాణ రాష్ట్రంలో మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూడు ఐటీఐలను కేటాయించారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్ సంతోష్ నగర్‌లోని ప్రభుత్వ ఐటీఐలతోపాటు హన్మకొండలోని మరో ప్రైవేట్ ఐటీఐనీ మహిళా ఐటీఐలుగా గుర్తించారు.
ఫీజులు ఇలా
తెలంగాణ ఐటీఐల్లో పట్టణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ ట్రేడ్‌లకు రూ.16,500, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్‌లకు రూ.13,200 ఫీజుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ ట్రేడ్‌లకు రూ.15వేలు, నాన్-ఇంజనీరింగ్ ట్రేడ్‌లకు రూ.12వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఐటీఐల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి ట్యూషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు, వెబ్ ఆప్షన్స్ చివరి తేదీ: జూన్ 10, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://iti.telangana.gov.in