Skip to main content

RIE CEE 2023 Notification: ఉపాధ్యాయ విద్యకు మేటి.. ఆర్‌ఐఈ

ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే వారు బీఈడీ, ఎంఈడీ వంటి కోర్సులను ఎంచుకుంటారు. వీటిని పూర్తి చేస్తే టీచింగ్‌ రంగంలో చక్కటి ఉపాధి అవకాశాలు సొంతమవుతాయి. ఇలాంటి టీచింగ్‌ కోర్సులను ప్రముఖ విద్యాసంస్థ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఆర్‌ఐఈ) అందిస్తోంది. ఇటీవల ఆర్‌ఐఈ క్యాంపస్‌ల్లో ప్రవేశాలకు ఎన్‌సీఈఆర్‌టీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఐఈ-సీఈఈ-2023 వివరాలు, కోర్సులు, క్యాంపస్‌లు, సీట్లు, పరీక్ష విధానం తదితర వివరాలు..
rie cee 2023 notification
  • ఆర్‌ఐఈ సీఈఈ 2023 నోటిఫికేషన్‌ విడుదల
  • ఆర్‌ఐఈ క్యాంపస్‌ల్లో టీచింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి సీఈఈ
  • ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, బీఈడీ, ఎంఈడీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఈడీ
  • తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆర్‌ఐఈ-మైసూర్‌కు కేటాయింపు

రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌..సంక్షిప్తంగా ఆర్‌ఐఈలుగా సుపరిచితం. ఉపాధ్యాయ విద్య­కు సంబంధించి ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే అందుబాటులో ఉండే ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులు మొదలు ఎంఈడీ వరకు పలు కోర్సులను ఆర్‌ఐఈ క్యాంపస్‌లు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రతి ఏటా కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(సీఈఈ)ను నిర్వహిస్తారు. ఇందులో సాధించిన స్కోర్, అకడమిక్‌ అర్హతల మార్కులకు వెయిటేజీ కల్పించి ప్రవేశాలు ఖరారు చేస్తారు.

అయిదు క్యాంపస్‌లు

దేశ వ్యాప్తంగా అయిదు ఆర్‌ఐఈ క్యాంపస్‌లు(ఆజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్‌) ఉన్నాయి. వీటిలో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, బీఏ-బీ ఈడీ, బీఎస్సీ-బీఈడీ, ఎంఈడీ, ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ-ఎంఈడీ, ఎంఈడీ అందుబాటులో ఉన్నాయి.

బీఈడీ

అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, ఆర్‌ఐఈ మైసూర్, ఎన్‌ఈఆర్‌ఐఈ-షిల్లాంగ్‌ క్యాంపస్‌ల్లో ఒక్కో క్యాంపస్‌లో 110 సీట్లు చొప్పున ఉన్నాయి. వీటిలో ప్రతి క్యాంపస్‌లో సగం సీట్లను సైన్స్, మ్యాథ్స్‌ గ్రూప్‌(బీఎస్సీ-బీఈడీ), మిగతా సగం సీట్లను సోషల్‌ సైన్స్‌ అండ్‌ లాంగ్వేజ్‌ గ్రూప్‌(బీఏ-బీఈడీ) విద్యార్థులకు కేటాయించారు.

చ‌ద‌వండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ

  • ఆర్‌ఐఈలలో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన కో­ర్సు.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ. ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఈ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. 
  • ఆర్‌ఐఈ-భువనేశ్వర్, మైసూర్‌ క్యాంపస్‌లలో 55 సీట్లు చొప్పున బీఏ-బీఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • బీఎస్‌సీ-బీఈడీకి సంబంధించి భువనేశ్వర్, మైసూర్‌ క్యాంపస్‌లలో ఫిజికల్‌ సైన్స్‌ గ్రూప్‌లో 55 సీట్లు చొప్పున, బయలాజికల్‌ సైన్స్‌ గ్రూప్‌­లో 55 సీట్లు చొప్పున ఉన్నాయి.

మైసూర్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ-ఈడీ

ఆర్‌ఐఈ-మైసూర్‌ ఆరేళ్ల వ్యవధిలోని ఎమ్మెస్సీ-ఈడీ(ఎమ్మెస్సీ-ఎడ్‌) కోర్సును అందిస్తోంది. ఇంటర్మీడియెట్‌ అర్హతతో ఈ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఫిజిక్స్‌ విభాగంలో 22, కెమిస్ట్రీ విభాగంలో 22, మ్యాథమెటిక్స్‌ విభాగంలో 22 సీట్లు చొప్పున ఉన్నాయి.

పీజీ స్థాయిలో.. ఎంఈడీ

పీజీ స్థాయిలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌/సెకండరీ ఎడ్యుకేషన్‌/సీనియర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ స్పెషలైజేషన్లలో..ఎంఈడీ కోర్సును ఆర్‌ఐఈ క్యాంపస్‌లు అందిస్తున్నాయి. అజ్మీర్‌లో 55, భువనేశ్వర్‌లో 36, భోపాల్‌లో 55, మైసూర్‌లో 55 సీట్లు ఉన్నాయి.

చ‌ద‌వండి: Management Courses After 12th: ఐఐఎంలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం) కోర్సుల్లో ప్రవేశాలు

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ+ఎంఈడీ

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ+ఎంఈడీ కోర్సును ఆర్‌ఐఈ భోపాల్‌ క్యాంపస్‌లో అందిస్తున్నారు. ఈ కోర్సు వ్యవధి మూడేళ్లు. సైన్స్‌/సోషల్‌ సైన్స్‌/హ్యుమానిటీస్‌ స్పెషలైజేషన్లలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. మొత్తం 55 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలకు ఆర్‌ఐఈ మైసూర్‌

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆర్‌ఐఈ-మైసూర్‌లోని కోర్సులకు పోటీ పడాల్సి ఉంటుంది.ఆర్‌ఐఈ-మైసూర్‌లోని సీట్లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల­కు కోర్సుల వారీగా కేటాయించిన సీట్ల వివరాలు..

  • బీఎస్సీ-బీఎడ్, బీఏ-బీఎడ్‌ల్లో.. ఒక్కో కోర్సులో ఏపీ విద్యార్థులకు 9 సీట్లు, తెలంగాణ విద్యార్థులకు 6 సీట్లు చొప్పున కేటాయించారు.
  • బీఈడీ కోర్సులకు సంబంధించి ఏపీ విద్యార్థులకు సైన్స్‌ గ్రూప్‌లో 5, ఆర్ట్స్‌ గ్రూప్‌లో 4, తెలంగాణ విద్యార్థులకు సైన్స్‌ గ్రూప్‌లో 3, ఆర్ట్స్‌ గ్రూప్‌లో 3 సీట్లు చొప్పున కేటాయించారు.
  • ఎంఈడీ కోర్సులో ఏపీ విద్యార్థులకు 9, తెలంగాణ విద్యార్థులకు ఆరు సీట్లు ఉన్నాయి.
  • ఎమ్మెస్సీ-ఈడీ, ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ+ఎంఈడీ కోర్సులకు అన్ని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు అర్హత ఉంటుంది. 

అర్హతలు

  • ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఈడీ: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి.
  • ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఈడీ: ఫిజికల్‌ సైన్స్‌ గ్రూప్‌ అభ్యర్థులు ఎంపీసీ గ్రూప్‌లో 50 శాతం మార్కులు; బయలాజికల్‌ సైన్స్‌ గ్రూప్‌ విద్యార్థులు బైపీసీలో 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
  • ఎంఈడీ: బీఈడీ లేదా ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ లేదా బీఈఎల్‌ఈడీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 
  • ఎమ్మెస్సీ-ఎంఈడీ: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ గ్రూప్‌ ఉత్తీర్ణత ఉండాలి.
  • ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ+ఎంఈడీ: 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

చ‌ద‌వండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

సీఈఈ స్కోర్‌తో ప్రవేశం

కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(సీఈఈ)లో స్కోర్‌ ఆధారంగా ఆర్‌ఐఈ క్యాంపస్‌ల్లోని కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. సీఈఈ పరీక్ష మూడు విభాగాల్లో(ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ, టీచింగ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ) నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ విభాగంలో 20 ప్రశ్నలు, మిగతా రెండు విభాగాల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం 160 మార్కులకు సీఈఈ జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.

సీఈఈ స్కోర్, అకడమిక్‌ మార్కులు

సీట్ల కేటాయింపు తుది జాబితా రూపకల్పనలో సీఈఈలో పొందిన స్కోర్‌తోపాటు అకడమిక్‌ మార్కులకు వెయిటేజీ కల్పించే విధానాన్ని అనుసరిస్తారు. సీఈఈ స్కోర్‌కు 60 శాతం, అకడమిక్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీని గణిస్తారు.

కోర్సుకు అనుగుణంగా సీఈఈ క్లిష్టత

అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కోర్సుకు అనుగుణంగా సీఈఈ పరీక్ష సిలబస్, ప్రశ్నల సరళి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెసీ ఈడీ కోర్సుల అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌ స్థాయిలోని అకడమిక్స్‌పై పట్టు సాధించాలి.
బీఈడీ, ఎంఈడీ విద్యార్థులు బ్యాచిలర్‌ స్థాయిలో తాము చదివిన గ్రూప్‌లకు సంబంధించిన సబ్జెక్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. టీచింగ్‌ ఆప్టిట్యూడ్, ఆటిట్యూడ్‌లకు సంబంధించి బోధన పద్ధతులు, పెడగాజి వంటి వాటిపై దృష్టిపెట్టాలి.

చ‌ద‌వండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

ఉద్యోగాలు

ఆర్‌ఐఈల్లో బీఈడీ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు విస్తృతమని చెప్పొచ్చు. ఈ క్యాంపస్‌ల్లో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్స్‌ను సైతం నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా సగటున రూ.30 వేల వేతనం లభిస్తోంది.

అజ్మీర్, భోపాల్‌ ఇంటిగ్రేటెడ్‌ బీఈడీకి ఎన్‌సీఈటీ

అజ్మీర్, బోపాల్‌ క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీలో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎన్‌సీఈటీ) స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకోనున్నారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్‌ టీచింగ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ పేరుతో ఎన్‌సీఈటీ నాలుగేళ్ల బీఈడీ కోర్సుల కోసం ప్రత్యేక స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న 57 టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆర్‌ఐటీ- భోపాల్, అజ్మీర్‌ క్యాంపస్‌లను కూడా సదరు ఇన్‌స్టిట్యూట్‌ల జాబితాలో చేర్చారు.

చ‌ద‌వండి: Career Guidance: మూడేళ్ల డిగ్రీ.. ఎలా ముందుకుసాగాలో తెలుసుకుందాం..

సీఈఈ-2023 సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 6, 2023
  • సీఈఈ పరీక్ష తేదీ: జూలై 2, 2023
  • తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cee.ncert.gov.in/
Published date : 01 Jun 2023 04:53PM

Photo Stories