Skip to main content

Budget 2023-24: ఈవీఎంలకు భారీగా కేటాయింపులు... ఎన్ని వేల కోట్లంటే...

ఈవీఎంలపై రగడ కొనసాగుతూనే ఉంది. ప్రతీ ఎన్నికలలోనూ ఈవీఎంల పనితీరుపై అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి.

కొన్ని పార్టీలైతే ఏకంగా ఈవీఎంలను రద్దు చేసేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే వీటన్నింటికి చెక్‌ పెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసి, విమర్శలను పట్టించుకోనవసరం లేదని సూటిగా చెప్తోంది.
1900 కోట్ల కేటాయింపులు...
ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్లు (ఈవీఎం) కొనుగోలు చేయడానికోసం కేంద్ర న్యాయశాఖకు ఈ బడ్జెట్‌లో దాదాపు రూ.1,900 కోట్లను కేటాయించారు. 2024లో రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఈవీఎంలను సమకూర్చుకోవడంతోపాటు వాటికి అనుబంధంగా వాడే ఇతర పరికరాల కొనుగోలు చేయడానికి వీలుగా రూ.1,891.78 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని...
బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, ఇతర పరకరాలను కొనుగోలు చేయడమేకాక పాతవాటిని తుక్కుకింద మార్చడానికి ఈ నిధులను వినియోగిస్తారు. 2024 సంవత్సరంలో రానున్న లోక్‌సభ ఎన్నికలతోపాటు ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘానికి నిధులు అవసరమవుతాయని కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదించడంతో కేంద్ర కేబినెట్‌ గత నెలలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలకోసం బడ్జెట్‌లో నిధులను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌  ఆఫ్‌ ఇండియాల నుంచి ఈవీఎంలను కొనుగోలు చేయనున్నారు.

Published date : 02 Feb 2023 06:04PM

Photo Stories