Skip to main content

Union Budget: 87 నిమిషాల్లో బడ్జెట్‌ ప్రసంగం... ‘పన్ను’ను 51 సార్లు పలికిన నిర్మల

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరో రికార్డు క్రియేట్‌ చేశారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఆమె ప్రసంగం కేవలం 87 నిమిషాల్లో ముగిసింది. తక్కువ సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డును ఆమె క్రియేట్‌ చేశారు.

బుధవారం 2023–24 బడ్జెట్‌ను దాదాపు 16,236 పదాలతో అతి చిన్న బడ్జెట్‌ ప్రసంగం చేశారు. సాధారణంగా కనీసం 2 గంటల పాటు జరిగే బడ్జెట్‌ ప్రసంగాలలో ఇది అతి చిన్నది.
ఎక్కువ, తక్కువ బడ్జెట్‌ ప్రసంగాలు ఇవే...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  2020 బడ్జెట్‌ ప్రసంగంలో 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది బడ్జెట్‌ ప్రసంగాల చరిత్రలో సుదీర్ఘమైనది. వ్యవధి పరంగా సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డును సీతారామన్‌ సొంతం చేసుకున్నారు. భారత తొలి (పూర్తి) మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్, 2019లో తన తొలి బడ్జెట్‌ ప్రసంగంలో 2 గంటల 17 నిమిషాలు మాట్లాడారు. ఇంకా రెండు పేజీలు మిగిలి ఉన్నప్పటికీ, అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కుదించుకుని ప్రసంగంలో మిగిలిన భాగాన్ని చదివినట్లుగా పరిగణించాలని ఆమె స్పీకర్‌ను కోరారు.
మరి కొన్ని రికార్డులు.....
ఆ తరువాత  ఫిబ్రవరి 1, 2020న 2020–21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. 2021లో ఆమె గంటా 50 నిమిషాల పాటు ప్రసంగించారు.
ఇక మాజీ ఆర్థిక మంత్రి జస్వంత్‌ సింగ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో(2003) 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు.
మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో(2014) 2 గంటల 10 నిమిషాల పాటు ప్రసంగించారు.
పదాల పరంగా 1991లో మన్మోహన్‌ సింగ్‌ సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి.
పన్ను, అభివృద్ధి, రాష్ట్రాలు, ఆదాయం, ఆర్థిక.. ఈ పదాలను నిర్మల ఎక్కువగా ఉపయోగించారు. 
పన్ను అనే పదాన్ని 51 సార్లు, అభివృద్ధి 28 సార్లు, రాష్ట్రాలు 27 సార్లు, ఆదాయం 26 సార్లు, ఫైనాన్స్‌ అనే పదాన్ని 25 సార్లు ఉపయోగించారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలైన నేపథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి  దోహదపడే అమృత్‌కాల్‌ బడ్జెట్‌ అనే పదాన్ని కూడా ఎక్కువగా ప్రస్తావించారు.

Published date : 01 Feb 2023 03:56PM

Photo Stories