Skip to main content

Union Budget 2023-24: వందలో రూ.20 వడ్డీలకే పోతోంది.. పెట్రోల్ స‌బ్సిడీలో భారీ కోత‌... బ‌డ్జెట్‌పై పూర్తి విశ్లేష‌ణ ఇలా...

మహిళా ఆర్థిక సాధికారత, యువతకు ఉపాధి సృష్టి కేంద్ర బడ్జెట్‌ 2023–24 లక్ష్యం. గత తొమ్మిదేళ్లకాలంలో తలసరి ఆదాయం రెట్టింపు కన్నా అధికంగా ఉంది. రూ.1.97 లక్షలకు చేరువగా ఉంది. ఇదే కాలంలో భారత్‌ ప్రపంచంలో అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది.
Union Budget 2023-24 Analysis

అవస్థాపనా సౌకర్యాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా అధిక ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణకు బడ్జెట్‌ ప్రాధాన్యత ఇచ్చింది. రైతులు, మహిళలు, అధిక నికర సంపద కలిగిన వ్యక్తులు.. చిన్న వ్యాపారాలు, మధ్య తరగతి ప్రజలను సంతృప్తి పరిచేలా ఆయావర్గాలకు తాయిళాలు, పథకాలను ప్రకటించడం బడ్జెట్‌లో గమనించవచ్చు. ద్రవ్యలోటు పూడ్చడానికి అవసరమైన 17.8 ట్రిలియన్‌ రూపాయల సమీకరణ ప్రభుత్వానికి సవాలుగా నిలిచే అవకాశం ఉంది. 

అమ్రిత్‌కాల్‌ మార్గానికి పటిష్టమైన పునాది
సమ్మిళిత వృద్ధి, చివరిమైలుకు చేరుకోవడం, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, సామర్థ్యాన్ని వెలికితీయడం, హరిత వృద్ధి, యువశక్తి ఆర్థిక రంగాన్ని బడ్జెట్‌లో ప్రాధాన్యతలుగా (సప్తర్షి) ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. 2047 సంవత్సరానికి భారత్‌ 100వ స్వాతంత్య్రదినోత్సవాన్ని జరుపుకోబోతున్న నేపథ్యంలో ‘‘అమ్రిత్‌ కాల్‌’’ అనే పదాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్‌ 2023–24ను రాబోవు 25 సంవత్సరాల కాలంలో పయనించే అమ్రిత్‌కాల్‌ మార్గానికి పటిష్టమైన పునాదిగా భావించవచ్చని ప్రభుత్వం భావించింది.

అవకాశాల కల్పనే లక్ష్యం...
పటిష్టమైన పబ్లిక్‌ ఫైనాన్స్, దృఢమైన ఆర్థికరంగంతో కూడిన సాంకేతిక ఆధారిత, నాలెడ్జ్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థనను సృష్టించడం లాంటి లక్ష్యాలతో ప్రభుత్వం అమ్రిత్‌కాల్‌పై దృష్టిసారించింది. యువత తమ ఆకాంక్షలను సాధించుకునే దిశగా దేశ పౌరులకు అవకాశాల కల్పన, అభివృద్ధి సాధన దిశగా ఉపాధి పెంపు, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడం అమ్రిత్‌కాల్‌ లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది. 
రైల్వేలకు రూ.2.4లక్షల కోట్లు....
కేంద్ర బడ్జెట్‌లో రైల్వేమంత్రిత్వశాఖ వ్యయాన్ని రూ.2.4 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. 2022–23లో పోల్చినప్పుడు 2023–24లో ఈ మొత్తంలో పెరుగుదల 65.6 శాతంకాగా, 2013–14తో పోల్చినప్పుడు 9 రెట్లు అధికం. గత ఏడాదితో పోల్చినప్పుడు ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదిత వ్యయంలో పెరుగుదలను వందేభారత్‌ రైళ్ల ఉత్పత్తికి వినియోగిస్తారు. ప్రస్తుతం వందేభారత్‌ రైళ్లను చెన్నై, సోనిపట్, రాయ్‌బరేలీ, లాతూర్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. డిశంబర్‌ 2023నాటికి పూర్తిగా హైడ్రోజన్‌ వినియోగంతో నడిచే రైలు సిద్ధమవుతుందని, మొదటిగా కల్కా–సిమ్లాహెరిటేజ్‌ సర్క్యూట్‌ మధ్య ఈ రైలు నడుస్తుందని బడ్జెట్‌లో ప్రస్తావించారు.

Railways

భారత్‌ –100 చేరుకోవడానికి ముందుగానే స్వయంసహాయకబృందాల ద్వారా మహిళలతో ఆర్థిక సాధికారత, పి.ఎం.విశ్వకర్మ కౌశల్‌ సమ్మన్, మిషన్‌ నమూనాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, హరితవృద్ధిలాంటి నాలుగు పరివర్తన అవకాశాలను అందిపుచ్చుకోవాలని బడ్జెట్‌లో ప్రస్తావించారు.

రూపాయి రాక:
రాష్ట్రాలకు సంబంధించి పన్నులు, డ్యూటీలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వ మొత్తం రాబడులలో వస్తు, సేవల పన్ను, ఇతర పన్నుల వాటా 17 శాతం కాగా, కార్పొరేషన్‌ పన్ను 15 శాతం, ఆదాయ పన్ను 15 శాతం, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీలు 7 శాతం, కస్టమ్స్‌ సుంకాలు 4 శాతం, పన్నేతర రాబడి 6 శాతం, రుణేతర మూలధన రాబడులు 2 శాతం, రుణాలు, ఇతర లియాబిలిటీస్‌ వాటా 34 శాతంగా ఉంటుంది.
రూపాయి పోక ఇలా....
రాష్ట్రాలకు సంబంధించి పన్నులు, డ్యూటీలను కలుపుకుని మొత్తం వ్యయంలో వడ్డీ చెల్లింపుల వాటా 20 శాతం కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు(రక్షణ, సబ్సిడీలపై మూలధన వ్యయాన్ని మినహాయించి) 17 శాతం, రక్షణ రంగం 8 శాతం, సబ్సిడీలు 7 శాతం, ఫైనాన్స్‌ కమీషన్‌ ఇతర బదిలీలు 9 శాతం, కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాల పన్నులు, డ్యూటీల వాటా 18 శాతం, పెన్షన్‌ 4 శాతం, కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్‌ పథకాలు 9 శాతం ఇతర వ్యయం 8 శాతం వాటా కలిగి ఉంటాయి.

రాబడి – వ్యయ అంచనాలు:
2023–24 బడ్జెట్‌లో మొత్తం రాబడులు(రుణాలు మినహాయించి) రూ.27,16,281 కోట్లగా ప్రతిపాదించారు. ఈ మొత్తంలో రెవెన్యూ రాబడులు రూ.26,32,281 కోట్లు. 2022–23 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2023–24లో మొత్తం రాబడులలో(రుణాలు మినహాయించి) పెరుగుదల 11.7 శాతం కాగా, రెవెన్యూ రాబడులలో 12.1 శాతం, మూలధన రాబడులలో 0.6 శాతం పెరుగుదలను ప్రతిపాదించారు.

Money

మొత్తం వ్యయం రూ.45,03,097 కోట్లు
2023–24 కేంద్ర బడ్జెట్‌లో మొత్తం వ్యయంను రూ.45,03,097 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయం రూ.35,02,136 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.10,00,961 కోట్లు. 2022–23 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2023–24లో మొత్తం వ్యయంలో పెరుగుదల 7.5 శాతం కాగా, రెవెన్యూవ్యయంలో పెరుగుదల 1.2 శాతం, మూలధన వ్యయంలో పెరుగుదల 37.4 శాతం.

2023–24లో రెవెన్యూలోటు స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 2.9 శాతంగా, ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతంగా, ప్రాథమికలోటును జీడీపీలో 2.3 శాతంగా ప్రతిపాదించారు. 2022–23లో సవరించిన అంచనాల ప్రకారం జీడీపీలో రెవెన్యూలోటు 4.1 శాతం, ద్రవ్యలోటు 6.4శాతం, ప్రాథమిక లోటు 3 శాతంగా నమోదైంది.

సబ్సిడీలపై వ్యయం ఇలా.... 
సబ్సిడీలపై మొత్తం వ్యయం 2023–24లో రూ.4,03,084 కోట్లుగా అంచనా. 2022–23 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2023–24లో ఈ మొత్తంలో తగ్గుదల 28.3 శాతం. ఆహార సబ్సిడీగా రూ.1,97,350 కోట్లు, ఎరువుల సబ్సిడీ రూ.1,75,100 కోట్లు, పెట్రోలియం సబ్సిడీ రూ.2,257 కోట్లు, ఇతర సబ్సిడీల మొత్తాన్ని రూ.28,377 కోట్లుగా ప్రస్తుత బడ్జెట్‌ 2023–24లో ప్రతిపాదించారు.

పెట్రోలియం సబ్సిడీలో భారీగా కోత
2022–23 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2023–24లో ఆహార సబ్సిడీలో మొత్తం 31.3 శాతం, ఎరువుల సబ్సిడీలో 22.3 శాతం, పెట్రోలియం సబ్సిడీలో 75.4 శాతం ఇతర సబ్సిడీలలో 29.9 శాతం తగ్గుదల ఏర్పడింది. అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి వడ్డీ సబ్సిడీలు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ‘ధరల మద్దతు పథకానికి’ సంబంధించిన సబ్సిడీలు.. నౌకా నిర్మాణం పరిశోధన, అభివృద్ధికి సంబంధించి సహాయం ఇతర సబ్సిడీలలో భాగంగా ఉంటాయి.

పన్ను విధానం:
ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌ రాయితీతో కూడిన పన్నువిధానంలో మార్పులు తీసుకువచ్చింది. ఈ విధానాన్ని నూతన పన్ను విధానంగా భావిస్తారు. వ్యక్తుల వేతనాలకు సంబంధించి స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000ను నూతన పన్ను విధానంలో కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వ నికర పన్ను రాబడి 2023–24లో రూ.23,30,631 కోట్లు, పన్నేతర రాబడి రూ. 3,01,650 కోట్లుగా అంచనా.

శ్లాబ్‌లు మారితే పన్ను బాదుడే...
నూతన పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. తదుపరి శ్లాబ్‌ రూ.3,00,001–రూ.6,00,000 వ్యక్తిగత ఆదాయంపై 5 శాతం, రూ.6,00,001–రూ.9,00,000 వరకు 10 శాతం, రూ.9,00,001 –రూ. 12,00,000 వరకు 15 శాతం, రూ.12,00,001–రూ.15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల ఆదాయంపైన ఆదాయంపై 30 శాతం ఆదాయపన్ను విధిస్తారు.
రూ. 7లక్షల వరకు నో పన్ను...
పన్ను రిబేటు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు నూతన పన్ను విధానంలో పెంచడంతో రాయితీ విధానం కింద నూతన పన్ను విధానంలో రూ.7లక్షల వ్యక్తిగత ఆదాయంపై పన్ను చెల్లించనవసరం లేదు. రూ.5కోట్లపై బడిన ఆదాయంపై విధించే సర్‌చార్జీని 37 శాతం నుంచి 29 శాతానికి తగ్గించారు. రాయితీ పన్ను విధానంలో గరిష్ట మార్జినల్‌ పన్నురేటు 42.74 శాతం నుంచి 39 శాతానికి తగ్గింపు.
మినహాయింపు స్వల్పమే....
2022–23 పన్ను శ్లాబ్‌ రేటు ప్రకారం రూ.7 లక్షల వ్యక్తిగత ఆదాయంపై రూ.33,800 పన్ను విధించగా, 2023–24 నూతన పన్ను విధానంలో ఏ విధమైన పన్ను ఉండదు. ఇదేకాలంలో రూ.10 లక్షల ఆదాయంపై చెల్లించే పన్ను రూ.78 వేల నుంచి రూ.54,600కు రూ. 15 లక్షలకు సంబంధించి రూ.1,95,000 నుంచి రూ.1,45,600కు, రూ.20 లక్షలపై రూ.3,51,000 నుంచి రూ.2,96,400కు.. రూ. 50 లక్షలపై రూ.12,87,000 నుంచి రూ.12,32,400కు పన్ను తగ్గింది.

Army

మౌలిక సదుపాయాల అభివృద్ధి:
మూలధన వ్యయం 2022–23తో పోల్చినప్పుడు 2023–24లో 33 శాతం పెంపుద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10 లక్షల కోట్లను ప్రతిపాదించారు. ఈ మొత్తం జీడీపీలో 3.3 శాతంగా ఉంటుంది. నూతనంగా ఏర్పాటైన ‘‘మౌలిక సదుపాయాల ఫైనాన్స్‌ సెక్రటేరియేట్‌’’ ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు తగిన సహకారాన్ని అందిస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నౌకాశ్రయాలు, బొగ్గు, ఉక్కు రంగాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి 100 రవాణా సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులపై పెట్టుబడిని రూ.75 వేల కోట్లుగా ప్రతిపాదించగా, ఈ మొత్తంలో రూ.15 వేల కోట్లను ప్రవేటు ఆధారాల ద్వారా సమీకరిస్తారు.
వడ్డీ లేకుండా 50 ఏళ్లపాటు రుణాలు
రాష్ట్ర ప్రభుత్వాలకు మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను ప్రోత్సహించడానికి రూ.1.3లక్షల కోట్లను 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాన్ని అందించడానికి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంపునకు 50 అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్టులు, వాటర్‌ ఏరోడ్రోమ్స్, అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్లను ఏర్పాటు చేస్తారు.

పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని ఏర్పాటుచేయడం ద్వారా టైర్‌–2, టైర్‌–3 పట్టణాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. భౌతిక మౌలిక సదుపాయాలపై వ్యయంతో పాటు డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పెంపునకు అనేక చర్యలను బడ్జెట్‌లో ప్రస్తావించారు. జాతీయ డేటా గవర్నెన్స్‌ విధానం రోడ్‌ సెక్టార్‌ యాజమాన్యం, పట్టణ సేవల డెలివరీ, మౌలిక సదుపాయాల యాజమాన్యం, పట్టణ భద్రత, సెక్యూరిటీ యాజమాన్యం లాంటి రంగాలలో నవ కల్పనలకు దోహదపడుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

సంక్షేమం:
మహిళా, శిశు సంక్షేమం కోసం 2023–24 బడ్జెట్‌లో రూ.25,448.75 కోట్లను మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు కేటాయించారు. రెండు సంవత్సరాల కాలపరిమితిలో 7.5 శాతం వడ్డీ రేటుతో ‘మహిళా సమ్మాన్‌ పొదుపు సర్టిఫికెట్ల’ను జారీ చేస్తారు. దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన నేషనల్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌ కింద, గ్రామీణ మహిళలతో కూడిన 81 లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు.

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద చిన్న రైతులకు కేటాయించిన మొత్తంలో రూ.54 వేల కోట్లను మూడు కోట్ల మంది మహిళా రైతులకు ఆర్థిక సహాయంగా ప్రతిపాదించారు. మహిళా శిశు సంక్షేమం కోసం అన్ని మంత్రిత్వ శాఖలకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,27,010 కోట్లను ప్రతిపాదించారు. 2022–23 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2023–24లో ఈ మొత్తం ప్రతిపాదిత వ్యయంలో పెరుగుదల 6.3 శాతం.
షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ప్లాన్‌ కింద 2022–23 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2023–24లో కేటాయించిన మొత్తంలో పెరుగుదల 4.3 శాతం కాగా, షెడ్యూల్డ్‌ తెగల సబ్‌ప్లాన్‌ను కేటాయించిన మొత్తంలో పెరుగుదల 26.7 శాతం. 2023–24 బడ్జెట్‌లో షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ప్లాన్‌ రూ.1,59,126 కోట్లు, షెడ్యూల్డ్‌ తెగల సబ్‌ప్లాన్‌ కింద రూ.1,19,510 కోట్లను కేటాయించారు. ఈశాన్య ప్రాంతం అభివృద్ధి కోసం ప్రతిపాదిత బడ్జెట్‌లో రూ.94,680 కోట్లు కేటాయించారు. 2022–23 సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు ఈ మొత్తంలో పెరుగుదల 30.5 శాతం.
ఎస్టీలకు లబ్ధి చేకూర్చేలా...
ప్రత్యేకంగా నిర్లక్ష్యానికి గురైన షెడ్యూల్డ్‌ తెగల గ్రూప్‌నకు బడ్జెట్‌లో రాబోవు 3 ఏళ్ల కోసం రూ.15 వేల కోట్లను కేటాయించారు. ఆయా గ్రూపులలో సామాజిక–ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా ఈ మొత్తాన్ని కేటాయించారు. చివరి లక్ష్యానికి చేరుకోవడంలో భాగంగా ‘ప్రధానమంత్రి పీవీటీజీ మిషన్‌’ ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 75 ప్రత్యేకంగా నిర్లక్ష్యానికి గురైన షెడ్యూల్డ్‌ తెగల గ్రూపులు లబ్ధిపొందుతాయి. 

వివిధ ప్రధాన పథకాలకు వనరుల కేటాయింపు:
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ, పట్టణ) పథకం వనరుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత(79,590కోట్లు) పొందింది. తదుపరి స్థానాలలో జల్‌ జీవన్‌ మిషన్‌(రూ.70 వేల కోట్లు), పీఎం కిసాన్‌(రూ.60 వేల కోట్లు), జాతీయ విద్యా మిషన్‌(రూ.38,953 కోట్లు), జాతీయ ఆరోగ్య మిషన్‌(రూ.36,785 కోట్లు నిలిచాయి).

వ్యవసాయరంగం:
గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ–స్టార్టప్‌ల ప్రోత్సాహానికి ‘వ్యవసాయ వృద్ధి నిధి’ ఏర్పాటు చేస్తారు. మత్స్యకారులు, ఫిష్‌ వెండర్స్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు మద్దతునిమిత్తం రూ.6 వేల కోట్లతో ‘పీఎం మత్స్య సంపద యోజన’ ఏర్పాటు చేస్తారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం తీసుకున్నప్పటికీ, ప్రస్తుత బడ్జెట్‌లో ఈ అంశం ప్రస్తావన లేదు.
తగ్గిన వ్యవసాయ రంగం వాటా...
ప్రైవేటు పెట్టుబడులు, స్టార్టప్‌ఉ, వ్యవసాయ పరపతికి సంబంధించిన అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించారు. 2022–23 బడ్జెట్‌లో వ్యవసాయ రుణాలు రూ.18 లక్షల కోట్లు కాగా, 2023–24 బడ్జెట్‌లో ఈ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లగా ప్రతిపాదించారు. పశు సంపద, డైరీ, ఫిషరీస్‌ రంగాలకు వ్యవసాయ పరపతిలో ప్రాధాన్యత ఉంటుంది.

Agriculture

మొత్తం బడ్జెట్‌ వ్యయంలో వ్యవసాయరంగం వాటా 2022–23లో 3.36 శాతం కాగా, 2023–24లో 2.7 శాతానికి తగ్గింది. తృణధాన్యాలకు సంబంధించి భారత్‌ను ‘ ప్రపంచహబ్‌’గా రూపొందించడం(శ్రీ అన్న), వ్యవసాయరంగంలో సహకార–ఆధారిత అభివృద్ధి, ప్రజా సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన లాంటి ప్రకటనలను వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రస్తావించారు. పీఎం కిసాన్‌లో కలిపి వ్యవసాయ, అనుబంధ రంగాలకు వనరుల పంపిణీ 2022–23లో పోల్చినప్పుడు 2023–24లో 5.8 శాతం అధికం.

ఇదేకాలంలో గ్రామీణాభివృద్ధి పథకాలపై వ్యయంలో తగ్గుదలను గమనించవచ్చు. 2022–23లో గ్రామీణాభివృద్ధి పథకాలకు రూ.2.43 ట్రిలియన్లు. ప్రస్తుత బడ్జెట్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.60 వేల కోట్లు కేటాయించగా, 2022–23లో ఈ పథకంపై వాస్తవ వ్యయం రూ.89,400 కోట్లు. ప్రభుత్వం రసాయన ఎరువుల రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా పది మిలియన్ల రైతులు సహజ వ్యవసాయాన్ని చేపడతారని బడ్జెట్‌లో పేర్కొన్నారు.

2023–24 కేంద్ర బడ్జెట్‌ ముఖ్యాంశాలు:
– ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం – రూ.51 వేల కోట్లు
– స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద 11.7 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించారు.
– ఉజ్వల పథకం కింద 9.6 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చారు
– పీఎం జన్‌ధన్‌ ఖాతాలు 47.8 కోట్లకు చేరుకున్నాయి.
– పీఎం సురక్ష బీమా, పీఎం జీవన్‌ జ్యోతి యోజన కింద 44.6 కోట్ల మందికి బీమా కల్పించారు.
– ఏప్రిల్‌ 1, 2023 నుంచి ప్రారంభమయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు సంబంధించిన ‘పునర్నిర్మిత పరపతి హామీ పథకానికి కార్పస్‌గా రూ.9 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.
– రక్షణ మంత్రిత్వశాఖకు కేటాయింపులు – రూ.5,93,538 కోట్లు
– స్వచ్ఛభారత్‌ మిషన్‌కు – 12,192 కోట్ల కేటాయింపు
– నేషనల్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌ – రూ.14,129 కోట్ల కేటాయింపు
– ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో సభ్యత్వం 27 కోట్లకు పెరిగింది.
– 2022లో రూ.126 లక్షల కోట్ల విలువైన 7400 కోట్ల డిజిటల్‌ చెల్లింపులు యూపీఐ ద్వారా జరిగాయి.
– కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమీకృత ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమం ‘ ఐ గాట్‌ కర్మయోగి’ ప్రారంభం
– రాబోయే మూడేళ్లకాలంలో మెట్టభూముల అభిలషణీయ వినియోగం, బయోడైవర్సిటీ పెంపు, కార్బన్‌స్టాక్, ఎకో–టూరిజం అవకాశాల పెంపుద్వారా స్థానికులకు ఆదాయ కల్పనకోసం ‘అమ్రిత్‌దారోహర్‌’ పథకం అమలు
– అధిక విలువతో కూడిన ఉద్యానవన పంటలకు వ్యాధిరహిత, నాణ్యతతో కూడిన ప్లాంటింగ్‌ మెటీరియల్‌ లభ్యతను మెరుగుపర్చడానికి ‘ఆత్మనిర్భర్‌ మొక్కల శుద్ధి’ కార్యక్రమాన్ని రూ. 2200 కోట్ల వ్యయంతో ప్రారంభిస్తారు.

- డా. త‌మ్మా కోటిరెడ్డి, ఎకనామిక్స్ ప్రొఫెస‌ర్‌

Published date : 10 Feb 2023 06:32PM

Photo Stories