Skip to main content

కేంద్ర బడ్జెట్ 2016- 17

గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా సాగింది 2016-17 కేంద్ర బడ్జెట్. వచ్చే మూడేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, పేదల ఆరోగ్యం కోసం రూ.లక్ష బీమా, స్వచ్ఛభారత్, ఉపాధి హామీ పథకాలకు భారీ కేటాయింపులు వంటి వాటితో వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్‌నుఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీఫిబ్రవరి 29న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రస్తుత పోటీ పరీక్షల్లో బడ్జెట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ తరణంలో అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా బడ్జెట్ కేటాయింపులు, విశ్లేషణ మీకోసం..

బడ్జెట్ మొత్తం

19,78,060 కోట్లు

ప్రణాళికా వ్యయం

5,50,010 కోట్లు

ప్రణాళికేతర వ్యయం

14,28,050 కోట్లు

రెవెన్యూ వసూళ్లు

13,77,022 కోట్లు

మూలధన వసూళ్లు

6,01,038 కోట్లు

1. అప్పులు

21

2. కార్పొరేషన్ టాక్స్

19

3. ఆదాయపు పన్ను

14

4. కస్టమ్స్

9

5. కేంద్ర ఎక్సైజ్ పన్ను

12

6. సేవా పన్ను, ఇతర పన్నులు

9

7. పన్నేతర ఆదాయం

13

8. రుణేతర మూలధన వసూళ్లు

3


రూపాయి పోక (పైసల్లో)
1. కేంద్ర ప్రణాళిక 12
2. వడ్డీ చెల్లింపులు 19
3. రక్షణ రంగం 10
4. సబ్సిడీలు 10
5. ఇతర ప్రణాళికేతర ఖర్చు 12
6. పన్నులు, సుంకాల్లో రాష్టాలు, యూటీల వాటా 23
7. రాష్ట్రాలు, యూటీలకు ప్రణాళికేతర సహకారం 5
8. రాష్ట్రాలు, యూటీలకు ప్రణాళికా సహకారం 9

బడ్జెట్ ముఖ్యాంశాలు
 • ఎఫ్‌డీఐ పాలసీలో గణనీయమైన మార్పులు చేయటం ద్వారా సాధారణ బీమా కంపెనీల లిస్టింగ్‌కు, బ్యాంకింగ్ రంగంలో కీలక సంస్కరణలకు తెర తీయటం.
 • సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహకానికి ‘‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’’
 • మొత్తం గ్రామీణ రంగానికి రూ.87,675 కోట్ల కేటాయింపు.
 • పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.2.87 లక్షల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్
 • మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.38,500 కోట్లు
 • విద్య, ఆరోగ్యం, సామాజిక రంగానికి రూ.1,51,581 కోట్ల కేటాయింపు.
 • 2016-17లో ప్రధానమంత్రి జన ఔషధి కార్యక్రమం కింద 3000 స్టోర్ల ఏర్పాటు.
 • ఫైనాన్షియల్ కంపెనీల వివాదాల పరిష్కారానికి సమగ్ర నియమావళి.
 • ముద్ర యోజన కింద మంజూరీ లక్ష్యం రూ.1.8 లక్షల కోట్లకు పెంపు.
 • ఎన్‌హెచ్‌ఏఐ, ఐఆర్‌ఈడీఏ, నాబార్డ్‌ల ద్వారా రూ. 31,300 కోట్ల ఇన్ఫ్రా బాండ్లు
 • 2017 మార్చి నాటికి 3 లక్షల రేషన్ డిపోల్లో ఆటోమేషన్.
 • స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి కంపెనీల చట్టం సవరణ.
 • ఏప్రిల్, 2016 నుంచి మార్చి 2019 మధ్య ఏర్పాటు చేసిన స్టార్టప్‌లకు మూడు నుంచి ఐదేళ్ల పాటు లాభాల్లో పూర్తి మినహాయింపు
 • వార్షిక ఆదాయం రూ. కోటి దాటితే అదనంగా 3 శాతం ‘రాబిన్‌హుడ్’ పన్ను
 • సంవత్సరానికి రూ.10 లక్షలకు మించి డివిడెండ్ గనక తీసుకుంటే మొత్తం డివిడెండ్‌పై అదనంగా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 • రూ.2 లక్షలకు పైబడి ఏవైనా వస్తువులు, సేవలు కొన్నా... రూ.10 లక్షలకు పైబడిన లగ్జరీ కార్లు కొన్నా... అక్కడికక్కడే 1 శాతం టీడీఎస్
 • ఆప్షన్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.017 నుంచి 0.05కు పెంపు
 • అన్ని సేవలపై రైతులు, వ్యవసాయ సంక్షేమం నిమిత్తం 0.5 శాతం సెస్సు
 • రూ.1000 మించిన రెడీమేడ్ గార్మెంట్లపై ఎక్సయిజు పన్ను 2 శాతానికి పెంపు
 • బీడీ మినహా పొగాకు ఉత్పత్తులపై ఎక్సయిజు సుంకం 15 శాతానికి పెంపు.
 • బ్లాక్‌మనీ వెల్లడికి 4 నెలల సమయం. ఆ బ్లాక్‌మనీపై 45% పన్ను, వడ్డీ.
 • బొగ్గు, లిగ్నైట్‌లపై క్లీన్ ఎనర్జీ సెస్ టన్నుకు 200 నుంచి రూ. 400కు పెంపు.
 • 2017-18 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం జీడీపీలో 3 శాతం
 • బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం రూ. 25 వేల కోట్లు
 • పేదలందరికీ లక్ష రూపాయల ఆరోగ్య బీమా గొడుగు
 • బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్
 • ప్రైవేట్‌తో కలసి దేశవ్యాప్తంగా డయాలసిస్ సేవాకేంద్రాలు
 • సాగు, పాడి, వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిపి రూ. 44,485 కోట్లు
 • 28.5 లక్షల హెక్టార్ల భూమికి నీటి పారుదల సదుపాయం
 • దేశవ్యాప్తంగా ఐదు లక్షల ఫామ్ పాండ్లు, ఊట బావుల తవ్వకానికి సాయం
 • రైతు రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం రూ.15 వేల కోట్లు
 • గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులతో కూడిన 300 రూర్బన్ సమూహాల ఏర్పాటు
 • 2018 మే 1 నాటికి గ్రామీణ విద్యుదీకరణ పూర్తి
 • మూడేళ్లలో ఆరు కోట్ల పల్లె కుటుంబాలకు ‘డిజిటల్ పరిజ్ఞానం’
 • కిరాణా దుకాణాలను వారమంతా తెరవొచ్చు.
 • సాలీన ఐదు లక్షల లోపు ఆదాయం వచ్చే వారికి ఇస్తున్న రిబేట్ రూ. 2 వేల నుంచి రూ. 5 వేలకు పెంపు

ప్రభుత్వ రుణ ప్రణాళిక 4.2 లక్షల కోట్లు
మార్కెట్ నుంచి కేంద్రం సేకరించే రుణ ప్రణాళిక వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2016-17) రూ.4.2 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) 4.4 లక్షల కోట్లతో పోల్చితే ఇది తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.4.5 లక్షల కోట్ల రుణ ప్రణాళికను నిర్దేశించినప్పటికీ, దీనిని ప్రభుత్వం రూ.4.4 లక్షల కోట్లకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయాలు (రెవెన్యూ, మూలధన రాబడులు)-వ్యయాలకు మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటును 3.5 శాతం వద్ద (స్థూల దేశీయోత్పత్తిలో) కట్టడి చేయడం లక్ష్యంగా మార్కెట్ నుంచి రుణ సమీకరణలను తగ్గించుకుంటున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో 21 పైసలు అప్పు ద్వారానే సమకూరుతుండటం గమనార్హం.

వ్యవసాయ రంగానికి...రూ. 44,485 కోట్లు
బ్యాంకుల ద్వారా పంట రుణాల లక్ష్యం రూ. 9,00,000 కోట్లు
పంటల బీమా పథకానికి.. రూ.5,500 కోట్లు
కొత్తగా సాగులోకి.. 28.5 లక్షల ఎకరాలు
14 కోట్ల మంది రైతులకు వచ్చే ఏడాది కల్లా భూసార కార్డులు..
5 లక్షలు వర్షపు నీటి నిల్వకు నీటి గుంతలు, కొలనులు..
5 లక్షల ఎకరాలు సేంద్రియ సాగు లక్ష్యం..
పాడి పరిశ్రమాభివృద్ధికి.. రూ.850 కోట్లు (పశుధన్ సంజీవని, నకుల్ స్వాస్థ్య పత్ర, ఇ-పశుధన్ హాత్ పథకాలతోపాటు దేశీయ పాడి సంతతిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న నేషనల్ జినోమిక్ కేంద్రానికి ఈ నిధులను వెచ్చిస్తారు.)
రూ.6 వేల కోట్లతో భూగర్భ జలాల పెంపు, సంరక్షణ చర్యలు.
రూ.368 కోట్లతో భూసార పరిరక్షణ చర్యలు
సుదీర్ఘ వ్యవసాయ అవసరాల కోసం నాబార్డ్‌లో ప్రత్యేక నిధి ఏర్పాటు తొలి దశ కింద రూ.20 వేల కోట్లు కేటాయింపు
పశుధన్ సంజీవని కింద పశువులకు ఆరోగ్య కార్డులు అందచేత
సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 89 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా 80.6 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి రానుంది.
వీటికి వచ్చే ఏడాది రూ.17 వేల కోట్లు, రాబోయే ఐదేళ్లలో రూ.86,500 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ 89 ప్రాజెక్టులలో 2017 మార్చి 31 నాటికి కనీసం 23 ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు.
‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకానికి రూ.5,500 కోట్లు పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు రూ.500 కోట్లు కేటాయించారు.

ముఖ్య రంగాలకు ప్రణాళిక కేటాయింపులు (రూ.కోట్లలో)

 

2015-16 సవరించిన బడ్జెట్ అంచనాలు

2016-17 బడ్జెట్ అంచనాలు

వ్యవసాయం, అనుబంధ రంగాలు

10,942

19,394

గ్రామీణ అభివృద్ధి

3,027

2,751

నీటిపారుదల, వరదల నియంత్రణ

1,105

1,024

ఇంధనం

1,71,519

2,05,878

పరిశ్రమలు ఖనిజాలు

45,512

49,372

రవాణా

1,78,502

2,29,874

కమ్యూనికేషన్లు

13,451

13,806

శాస్త్ర సాంకేతిక పర్యావరణం

17,965

20,926

సాధారణ ఆర్థిక సేవలు

38,596

46,685

సామాజిక సేవలు

83,535

1,00,291

సాధారణ సేవలు

18,553

16,247


రహదారులకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు
 • 2016-17 బడ్జెట్‌లో 2.21 లక్షల కోట్ల నిధులను మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు.
 • ఇందులో దాదాపు లక్ష కోట్ల రూపాయలను కేవలం రహదారుల నిర్మాణం కోసమే వెచ్చించనున్నారు.
 • వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) సహా దేశంలో రహదారుల రంగానికి రూ. 97 వేల కోట్లు, రోడ్లు, హైవేలకు భారీగా రూ. 55,000 కోట్లు ఇచ్చారు.
 • దీనికి అదనంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) బాండ్ల రూపంలో రూ. 15,000 కోట్లు సమీకరించి ఖర్చు చేయనుంది.
 • ఇక పీఎంజీఎస్‌వై కోసం మరో రూ. 19,000 కోట్లు కేటాయించారు. సడక్ యోజన నిధులకు రాష్ట్రాల వాటా రూ. 8,000 కోట్లు కలవనుంది.
 • 2012-13లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకానికి రూ. 8,885 కోట్లు, 2013-14లో రూ. 9,805 కోట్లు మాత్రమే కేటాయించారని.. తాజా బడ్జెట్‌లో రూ. 19,000 కోట్ల నిధులకు రాష్ట్రాల వాటా కలిపి మొత్తం రూ. 27,000 కోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యయం చేయనున్నారు
 • దేశంలో మిగిలి వున్న 65 వేల అర్హమైన గ్రామాలనూ ఈ పథకం కింద 2021 నాటికి 2.23 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో అనుసంధానించాలన్న లక్ష్యాన్ని 2019 నాటికే పూర్తిచేయాలని నిర్ణయించారు.
 • దేశవ్యాప్తంగా 50,000 కిలోమీటర్ల రాష్ట్ర హైవేలను వచ్చే ఏడాదిలో జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు.
 • నిలిచిపోయివున్న రూ. లక్ష కోట్లకు పైగా రోడ్డు ప్రాజెక్టుల్లో 85 శాతం ప్రాజెక్టులను మొదలు పెట్టటం, వచ్చే ఏడాది 10,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టటం జరుగుతుందని వివరించారు.

‘రక్షణ’ బడ్జెట్ రూ.2.58 లక్షల కోట్లు
 • రక్షణ రంగ బడ్జెట్ 9.76 శాతం మేరకు పెరిగింది. 2015-16 సవరించిన అంచనాలు రూ.2.33 లక్షల కోట్లు కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.2.58 లక్షల కోట్లకు పెరిగింది.
 • ఇక మిలటరీ పింఛన్ల మొత్తం ఏకంగా 82,000 కోట్లకు ఎగబాకింది. ఒకే ర్యాంక్ ఒకే పింఛను పథకం ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.
 • వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ.19.78 లక్షల కోట్లలో రక్షణ రంగ బడ్జెట్ సుమారు 17.2 శాతంగా ఉంది.
 • త్రివిధ దళాల మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదల (రూ.4,287.07 కోట్లు) మాత్రమే చోటు చేసుకుంది. త్రివిధ దళాల ఆధునీకరణకు రూ.78,586.68 కోట్లు కేటాయించారు.

Education News

ఆరోగ్య రంగానికి రూ. 38,206 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ. 38,206 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4,375 కోట్లు ఎక్కువ. అలాగే పేద, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం రూ. లక్ష విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆయా కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్ల కోసం (60 ఏళ్లు, అంతకన్నా పైబడిన వ్యక్తులు) రూ. 30 వేల టాప్ అప్ ప్యాకేజీని అందిస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 19,037 కోట్లు కేటాయించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు రూ. 2,043 కోట్లు, జాతీయ ఎయిడ్స్ నియంత్రణకు 1,700 కోట్లు కేటాయించారు.

జాతీయ డయాలసిస్ సేవలకు శ్రీకారం
 • ‘‘దేశంలో ఏటా కిడ్నీల వైఫల్యంతో 2.2 లక్షల మంది బాధపడుతుంటే దేశవ్యాప్తంగా సుమారు 4,950 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రైవేటు రంగంలో, ప్రధాన నగరాలు/పట్టణాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. దీంతో 3.4 కోట్ల డయాలసిస్ సెషన్లకు అదనపు డిమాండ్ ఏర్పడుతోంది. ఒక్కో డయాలసిస్ సెషన్‌కు రూ. 2 వేల ఖర్చవుతుండగా ఏటా ఈ ఖర్చు రూ. 3 లక్షలు దాటుతోంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నారు
 • నాణ్యమైన జనరిక్ మందులను చవకగా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జన్‌ఔషధి యోజన కింద 3 వేల స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు.

విద్యకు 70 వేల కోట్లు
 • దేశంలోని 20 ఉన్నత విద్యా సంస్థల్ని ప్రపంచ స్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దడం, 62 నవోదయ కేంద్రాల ఏర్పాటు విద్యారంగ కేటాయింపుల్లో ముఖ్యమైనవి.
 • ప్రాథమిక విద్య, అక్షరాస్యతకు ఈ ఏడాది రూ.43,554 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే రూ. 1,368 కోట్లు ఎక్కువ. ఉన్నత విద్యకు రూ.28,849 కోట్లు కేటాయించగా, 2015-16లో రూ.25,399 కోట్లుగా ఉంది.
 • రూ.1000 కోట్ల ప్రారంభ మూలధనంతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ(హెచ్‌ఈఎఫ్‌ఏ) ఏర్పాటు. లాభాపేక్ష లేకుండా పనిచేసే ఈ సంస్థ మార్కెట్ నుంచి నిధుల్ని సేకరిస్తుంది. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో మౌలికవసతుల సదుపాయాల కల్పనకు ఈ నిధుల్ని ఉపయోగిస్తారు.
 • దేశంలోని పది ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్ని ప్రపంచస్థాయి బోధన, పరిశోధన విభాగాలుగా మార్చేందుకు త్వరలో నియంత్రణ విభాగం ఏర్పాటు.
 • స్కూలు సర్టిఫికెట్లు, కళాశాల డిగ్రీలు, విద్యాసంవత్సరంలో పొందే అవార్డులు, మార్కుల జాబితాల్ని భద్రపరిచేందుకు డిజిటల్ డిపాజిటరీ స్థాపన.
 • గ్రామీణ ప్రాంతాల కోసం సాంకేతిక అక్షరాస్యత పథకం ప్రారంభం. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో 6 కోట్ల కుటుంబాల్లో డిజిటల్ వెలుగులు.
 • జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌లో భాగంగా 76 లక్షల మంది యువతకు శిక్షణనిచ్చామని బడ్జెట్లో జైట్లీ తెలిపారు. అలాగే ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజనలో యువత వద్దకే వ్యాపార అవకాశాలు తీసుకెళ్లాలని నిర్ణయించారు. 1500 మల్టీ స్కిల్ ట్రైనింగ్ కేంద్రాల్ని ఏర్పాటు. వీటన్నింటి కోసం రూ.1,700 కోట్ల కేటాయిపులు..
 • పరిశ్రమలు, విద్యాసంస్థల సహకారంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్టిఫికేషన్ ఏర్పాటు..
 • ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద వచ్చే మూడేళ్లలో కోటి మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని లక్ష్యం.
 • ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల్లో భాగంగా దేశవ్యాప్తంగా 2,200 కాలేజీలు, 300 స్కూళ్లు, 500 ప్రభుత్వ ఐటీఐలతో పాటు 50 వృత్తి శిక్షణ కేంద్రాల్లో వ్యాపార విద్యపై అవగాహన, శిక్షణ..

‘ఫ్లాగ్‌షిప్’ కు కేటాయింపుల జోరు
మౌలిక సదుపాయాల పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంగా కీలకమైన ‘ఫ్లాగ్‌షిప్’ పథకాలపై ప్రధాని మోదీ పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి భారీగా నిధుల కేటాయింపులను పెంచడమే దీనికి నిదర్శనం. మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమానికి దాదాపు ఒకటిన్నర రెట్లు కేటాయింపులు పెంచారు. కరువు పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేయూత కల్పించేందుకు ఉపాధి హామీ పథకం నిధులను కూడా భారీగానే పెంచారు. రెండేళ్లలో దేశంలోని అన్ని గ్రామాలకూ పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం... చౌక గృహ నిర్మాణానికి పెద్దపీట వేయడం... పల్లెల్లో రోడ్లపై మరింతగా దృష్టిపెట్టడం కీలక లక్ష్యాలుగా కన్పిస్తున్నాయి.

ఉపాధికి ‘హామీ’...
2016-17 కేటాయింపు: రూ. 38,500 కోట్లు (11% పెంపు)
2015-16 కేటాయింపు: రూ. 34,699 కోట్లు(12% పెంపు)
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది. గ్రామాల్లో మౌలిక వసతుల పెంపునకు ఈ పథకాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా క్రీడా ప్రాంగణాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం వంటివాటిని కూడా మోదీ ప్రభుత్వం దీనిలోకి చేర్చింది. ఈ స్కీమ్ ద్వారా వర్షాలపైనే ఆధారపడిన ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతలను ఏర్పాటు చేసేవిధంగా ఉపాధి పనులను వాడుకోనున్నట్లు తాజా బడ్జెట్‌లో ప్రకటించారు.

స్వచ్ఛ భారత్ అభియాన్
భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ ఈ వినూత్న కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. దీనికి సంబంధించిన నిధుల కల్పన కోసం అవసరమైతే సర్వీస్ పన్నుకు(ప్రస్తుతం 14 శాతం) అదనంగా గతేడాది 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్సును అమల్లోకి తీసుకొచ్చారు. పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి నిధుల కల్పన కోసం క్లీన్ ఎనర్జీ సెస్ (క్లీన్ ఎన్విరాన్‌మెంట్ సెస్‌గా ఇప్పుడు పేరు మార్చారు)ను ఈ బడ్జెట్‌లో కూడా పెంచారు. బొగ్గు తదితర ఖనిజాలపై ఒక్కో టన్నుపై ఇప్పుడు విధిస్తున్న రూ.200 సెస్‌ను రూ.400కు చేరుస్తున్నారు. స్వచ్ఛ భారత్ పరిధిలోకి స్వచ్ఛ భారత్ అభియాన్(పారిశుద్ధ్యం), జాతీయ గ్రామీణ తాగునీటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది.

(రూ.9,000 కోట్లు (గ్రామీణ)+ రూ.2,300 కోట్లు (పట్టణ))
2016-17 కేటాయింపు: రూ.9,000 కోట్లు (148 % పెంపు)
2015-16 కేటాయింపు: రూ.3,625 కోట్లు
 • 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం.
 • దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎస్‌బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం.
 • కాగా, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం ర్యాంకింగ్‌లను ప్రవేశపెట్టింది. ఇది నగరాలు, పట్టణాల మధ్య నిర్మాణాత్మక పోటీకి తోడ్పడుతుంది.
 • అదేవిధంగా ఎస్‌బీఏలో భాగంగా నగరాల్లోని చెత్తను కంపోస్టుగా మార్చే ఒక ప్రత్యేక పాలసీని ప్రభుత్వం ఆమోదించినట్లు వెల్లడించారు.

జాతీయ గ్రామీణ తాగునీటి పథకం
2016-17 కేటాయింపు: రూ. 5,000 కోట్లు (92% పెంపు)
2015-16 కేటాయింపు: రూ.2,611 కోట్లు(76% తగ్గింపు)
దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని గ్రామీణ ప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి.

గ్రామీణ‌ టెలిఫోనీ...
2016-17లో: రూ. 2,755 కోట్లు (15% పెంపు)
2015-16లో: 2,400 కోట్లు (32% తగ్గింపు)
2016 డిసెంబర్ కల్లా మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్(ఎన్‌ఓఎఫ్‌ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్స్ వినియోగాన్ని పెంచడం. 2017 నాటికి టెలీ డెన్సిటీని 70 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,000 కోట్లు.

ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన
2016-17 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (33% పెంపు)
2015-16 కేటాయింపు: రూ.14,291 కోట్లు (0.7% తగ్గింపు)
 • మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి వాజ్‌పేయి ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పథకం ఇది.
 • ఈ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.27 వేల కోట్ల నిధులు ఖర్చు చేసే అవకాశం ఉందని జైట్లీ బడ్జెట్లో పేర్కొన్నారు.
 • 2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
 • 2011-14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73.5 కిలోమీటర్లు కాగా, ప్రస్తుతం 100 కిలోమీటర్లకు చేరింది.

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన...
2016-17 కేటాయింపు: రూ. 8,500 కోట్లు (25% పెంపు)
2015-16 కేటాయింపు: రూ. 6,800 కోట్లు (32% పెంపు)
 • విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది.
 • 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలో ఇంకా 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని.. వచ్చే 1000 రోజుల్లో వీటికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ హామీనిచ్చారు.
 • దీనిలో భాగంగానే 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజా బడ్జెట్‌లో జైట్లీ ప్రకటించారు.
 • తాజా బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణ విద్యుదీకరణ పథకానికి రూ.3,000 కోట్లు, ఫీడర్‌లను వేరుచేసే కార్యక్రమం వంటి వాటికి (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్స్) రూ.5,000 కోట్లు చొప్పున కేటాయించారు.
 • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16 ఫిబ్రవరి 23 నాటికి)లో కొత్తగా 5,542 గ్రామాలను విద్యుదీకరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత మూడేళ్లలో మొత్తం విద్యుదీకరించిన గ్రామాలకంటే ఇది అధికమని కూడా జైట్లీ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన
2016-17 కేటాయింపు: రూ.20,075 (41% పెంపు)
2015-16 కేటాయింపు: రూ.14,200 కోట్లు(11% కోత)
 • పీఎంఎస్‌వైతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని హౌసింగ్ ప్రాజెక్టులకు(60 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణానికి మించని గృహాలపై) సేవా పన్నును(ప్రస్తుతం ఇది 5.6 శాతంగా ఉంది) పూర్తిగా తొలగిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే చౌక గృహాలకు(60 చదరపు మీటర్ల వరకూ) సంబంధించిన ప్రాజెక్టులకు సైతం ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
 • దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్‌సీ/ఎస్‌టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.
 • మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.75,000 చొప్పున ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న ఇళ్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.15,000 చొప్పున సాయం అందిస్తారు.
 • మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. అయితే, స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ సెప్టిక్ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు.
 • పట్టణ ప్రాంతాల్లోని పేదల గృహ కల్పనకు సర్దార్ పటేల్ అర్బన్ హౌసింగ్ స్కీమ్‌గా పేరు పెట్టారు.

ముఖ్య పథకాలు-కేటాయింపులు (రూ.కోట్లలో)
1. జాతీయ ఉపాధి హామీ పథకం 38,500
2. జాతీయ సామాజిక సహకార కార్యక్రమం 9,500
3. ఎస్టీ సబ్‌ప్లాన్ (అన్ని మంత్రిత్వ శాఖల కింద) 24,005
4. ఎస్సీ సబ్‌ప్లాన్ (అన్ని మంత్రిత్వ శాఖల కింద) 38,833
5. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి 33,097
6. మైనారిటీల అభివృద్ధికి గొడుగు పథకం 1,245
ఏ) వివిధ రంగాల్లో మైనారిటీల అభివృద్ధికి 1125
బీ) మదరసాల్లో విద్యాభివృద్ధికి 120
7. హరిత విప్లవం 12,980
ఏ) కృషోన్నతి యోజన 7580
బీ) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 5400
8. శ్వేత విప్లవం 1273
9. నీలి విప్లవం 575
10. ప్రధాని కృషి సించాయీ యోజన 5717
ఏ) ప్రతి చేనుకు నీరు 500
బీ) నీటిపారుదల లబ్ధి కార్యక్రమం (పీఎంకేఎస్‌వైలోని జలవనరుల మంత్రిత్వ శాఖ కింద) 1377
సీ) ప్రతి చుక్కకు మరింత పంట (పర్ డ్రాప్ మోర్ క్రాప్) 2340
డీ) సమగ్ర వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమం 1500
11. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన 19,000
12. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం 5,000
13. స్వచ్ఛ్ భారత్ అభియాన్ 11,300
14. జాతీయ ఆరోగ్య మిషన్ 20,037
15. రాష్ట్రీయ స్వస్థ సురక్ష యోజన 1,500
16. జాతీయ విద్యామిషన్ 28,010
ఏ) సర్వశిక్షా అభియాన్ 22,500
17. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం 9700
18. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) 16,120
19. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 20,075
20. పట్టణ పునర్నిర్మాణ మిషన్ (అమృత్, స్మార్ట్ సిటీస్) 7,296

రెండు కొత్త సెస్సులు
బడ్జెట్‌లో కేంద్రం కొత్తగా మరో రెండు సెస్సులను ప్రతిపాదించింది. వ్యవసాయ రంగ వృద్ధికి వనరులు సమీకరించే దిశగా.. పన్నులు వర్తించే అన్ని సర్వీసులపైనా ‘‘కృషి కల్యాణ్ సెస్సు’’, కార్లపై ‘‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సు’’ విధించనున్నారు. వీటి ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 8,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. మొత్తం మీద అయిదు ప్రధాన సెస్సుల ద్వారా ఆదాయం 2016-17లో మరో రూ. 23,116 కోట్లు పెరిగి .. రూ. 54,450 కోట్ల పైచిలుకు రాగలదని అంచనా.
 • జూన్ 1 నుంచి మొబైల్ బిల్లులు, హోటళ్లలో భోజనాలు మొదలుకుని విమాన ప్రయాణాల దాకా పన్నులు వర్తించే అన్ని రకాల సర్వీసులపైనా కృషి కల్యాణ్ సెస్సు (కేకేసీ)ని విధించనున్నారు. దీని ద్వారా రూ. 5,000 కోట్లు రాగలవని అంచనా. ఈ నిధులను వ్యవసాయ రంగ వృద్ధికి వినియోగించనున్నారు. కేకేసీ విధింపుతో సర్వీస్ ట్యాక్స్ రేటు అర శాతం మేర పెరిగి 15 శాతం కానుంది. ఇక, కార్లపై ఇన్‌ఫ్రా సెస్సుతో రూ. 3,000 కోట్లు రావొచ్చని అంచనా. మరోవైపు ఏటా రూ. 50 కోట్లకు మించి ఆదాయాన్ని రాని 13 సెస్సులను జైట్లీ తొలగించారు.
 • పెట్రోలు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఇంధనం వినియోగించే చిన్న కార్లపై 1 శాతం, నిర్దిష్ట సామర్థ్యం గల డీజిల్ కార్లపై 2.5 శాతం, ఎస్‌యూవీలు.. పెద్ద కార్లు.. అధిక ఇంజిన్ సామర్ధ్యం గల వాహనాలపై 4 శాతం మేర ఇన్‌ఫ్రా సెస్సు ఉంటుంది.
 • త్రిచక్ర వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు, హైబ్రీడ్ వాహనాలు, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఉపయోగించే హైడ్రోజెన్ వాహనాలకు దీన్నుంచి మినహాయింపు లభిస్తుంది. అలాగే, ప్రత్యేకంగా ట్యాక్సీలు, అంబులెన్సులు, వికలాంగుల కోసం ఉపయోగించే కార్లకు సైతం ఇన్‌ఫ్రా సెస్సు నుంచి మినహాయింపు ఉంటుంది.
 • బొగ్గు, లిగ్నైట్ మొదలైన వాటిపై విధిస్తున్న సెస్సు పేరు మార్చి... టన్నుకు రూ. 200గా ఉన్నదాన్ని రూ. 400కు పెంచారు. దీని పేరును స్వచ్ఛ ఇంధన సెస్సు నుంచి స్వచ్ఛ పర్యావరణ సెస్సుగా మార్చారు. దీని ద్వారా 2016-17లో రూ. 26,148 కోట్లు రాగలవు.
 • అలాగే ఆయిల్ ఇండస్ట్రీస్ అభివృద్ధి సెస్సును విలువ ఆధారిత రేటుగా మార్చి .. మెట్రిక్ టన్నుకు రూ. 4,500 కాకుండా 20 శాతం రేటు చొప్పున విధిస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం తగ్గనుంది. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 14,962 కోట్లు రానుండగా, వచ్చేసారి ఇది రూ. 10,303 కోట్లకే పరిమితం కాగలదని అంచనా.

గ్రామీణాభివృద్ధికి రూ. 87 వేల కోట్లు
ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి మొత్తంగా రూ.87,765 కోట్లను కేటాయించారు. ఇది గత ఏడాది కేటాయింపు రూ. 79,526 కోట్ల కన్నా రూ.8200 కోట్లు అధికం.

గ్రామీణ‌ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు ఇలా..
పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒక్కో పంచాయతీకి (సగటున) రూ. 80 లక్షలు
ఒక్కో మున్సిపాలిటీకి (సగటున) రూ. 21 కోట్లు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూ. 2.87 లక్షల కోట్లు విద్యుదీకరణకు 8,500 కోట్లు
భూ రికార్డుల ఆధునీకరణకు 150 కోట్లు
 • 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు రూ. 2.87 లక్షల కోట్లను సహాయ నిధి (గ్రాంట్ ఇన్ ఎయిడ్)గా అందించనున్నారు. గత ఐదేళ్ల కాలానికి కేటాయించిన మొత్తం కన్నా ఇది 228% అధికం కావడం విశేషం. ఈ నిధుల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 80 లక్షలు, పట్టణ స్థానిక సంస్థకు రూ. 21 కోట్లు అందనున్నాయి. ఈ నిధులకు సంబంధించిన నిబంధనలను ఆయా రాష్ట్రాలను సంప్రదించి.. పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ రూపొందిస్తుంది.
 • ప్రత్యామ్నాయ జీవన వనరులను ప్రోత్సహించేందుకు స్వయం సహాయ బృందాల ఏర్పాటును వేగవంతం చేయాలని నిర్ణయించారు.
 • ఉపాధి హామీ పథకం కింద జలసంరక్షణ, సహజ వనరుల నిర్వహణ కోసం ప్రత్యేక సహాయక బృందాల (క్లస్టర్ ఫెసిలిటేషన్ టీమ్స్) ఏర్పాటు.
 • శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌లో భాగంగా 300 రూరల్ - అర్బన్ క్లస్టర్ల ఏర్పాటు. ఇవి రైతులకు మౌలిక వసతులు, మార్కెట్ సదుపాయాలు తదితరాల్లో సహకారం అందిస్తాయి. - గ్రామీణ యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతి చోదకాల పాత్ర పోషిస్తాయి.
 • 2015 ఏప్రిల్ 1 నాటికి 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 నాటికి వాటిలో 5,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించగలిగామని, గత మూడేళ్లలో మొత్తంగా కూడా ఇంత విద్యుదీకరణ జరగలేదని జైట్లీ ప్రకటించారు. మే 1, 2018 నాటికి 100% విద్యుదీకరణకు కట్టుబడి ఉన్నామన్న జైట్లీ.. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, సమీకృత విద్యుదీకరణ పథకాలకు రూ. 8,500 కోట్లు కేటాయించారు.
 • మొత్తం 16.8 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో దాదాపు 12 కోట్ల గృహాల్లో కంప్యూటర్లు కానీ, డిజిటల్ పరిజ్ఞానం ఉన్నవారు కానీ లేరు. డిజిటల్ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పవేశపెట్టిన డిజిటల్ లిటరసీ మిషన్, డిజిటల్ సాక్షరత అభియాన్ (దిశ) ద్వారా రానున్న మూడేళ్లలో మరో 6 కోట్ల గృహాలకు డిజిటల్ పరిజ్ఞానాన్ని అందిస్తారు.
 • భూమి రికార్డుల ఆధునీకరణలో భాగంగా.. 2016 ఏప్రిల్ 1 నుంచి జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం కేంద్ర పథకంగా కొనసాగుతుంది. ఇందుకోసం రూ. 150 కోట్లను కేటాయించారు.
 • సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా పంచాయతీరాజ్ వ్యవస్థల్లో పాలనాపరమైన అభివృద్ధి కోసం ‘రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్’ను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 665 కోట్లను కేటాయించినట్లు తెలిపింది.

మహిళా, శిశు అభివృద్ధికి రూ.17,408 కోట్లు
 • దేశంలోని చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించడం, అదేసమయంలో మహిళలు, చిన్నారులకు తగిన భద్రత కల్పించడం ధ్యేయంగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న పథకాలకు తాజా బడ్జెట్‌లో రూ.17,408 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.15,860 కోట్లను చిన్నారుల అభివృద్ధికి వెచ్చిస్తారు.
 • బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపులను తాజా బడ్జెట్‌లో రూ.75 కోట్ల నుంచి రూ.వంద కోట్లకు పెంచారు.
 • అదేవిధంగా మహిళలకోసం షెల్టర్ హోమ్స్ ఏర్పాటుకు సంబంధించి 2015-16 బడ్జెట్‌లో రూ.52 కోట్లు కేటాయించగా.. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.వంద కోట్లు కేటాయించారు.
  ఇక మహిళలకోసం ఏకీకృత సేవా కేంద్రాల(ఒన్‌స్టాప్ సెంటర్స్) ఏర్పాటుకు గత బడ్జెట్‌లో కేవలం రూ.13 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.75 కోట్లు ఇచ్చారు. మరోవైపు మహిళల భద్రతకోసం అదనపు పథకాలను చేపట్టడానికి వీలుగా నిర్భయ నిధికి రూ.500 కోట్లు కేటాయించారు.

పన్నుల్లో ఊరట తక్కువే
ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పూ లేదు. కాకపోతే కాస్త తక్కువ ఆదాయం ఉన్నవారికొ కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వగా.. బాగా ఎక్కువ ఆదాయం ఉన్నవారిపై పన్నులు పెంచారు.
రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ఇప్పటిదాకా పన్నులో రూ.2,000 రిబేటు ఇస్తున్నారు. దీన్నిపుడు రూ.5,000కు పెంచారు. దీంతో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.3,000 అదనపు ప్రయోజనం లభించనుంది. 2013లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం సెక్షన్ 87ఏ కింద ఈ రిబేటును ప్రవేశపెట్టారు. అంటే నెలకు రూ.41 వేలు ఆదాయంలోపు ఉన్నవారికే ఈ ప్రయోజనం. అది దాటితే ఎలాంటి రిబేటూ ఉండదు.

Education News

హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్ లేనివారికి..

కంపెనీలన్నీ హెచ్‌ఆర్‌ఏ ఇవ్వవు. కొందరు అద్దె ఇంట్లో ఉన్నా వారికి హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనం లభించదు. అలాంటివారు ఇప్పటి వరకూ సెక్షన్ 80 జీజీ కింద రూ.24,000 మొత్తాన్ని హెచ్‌ఆర్‌ఏ కింద తగ్గించి చూపించుకునే అవకాశం ఉండేది. ఇపుడు ఆ మొత్తాన్ని రూ.60 వేలకు పెంచారు. అంటే హెచ్‌ఆర్‌ఏ లేని ప్రతి ఒక్కరికీ అదనంగా రూ.36,000 మినహాయింపు లభిస్తుంది. వ్యక్తిగత ట్యాక్స్ శ్లాబుల్ని బట్టి గరిష్ఠంగా 10,800 వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది.

తొలిసారి ఇంటిని కొంటే
రుణం తీసుకుని తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 24 కింద లభించే రూ.2 లక్షలకు అదనంగా రూ.50,000 ప్రయోజనాన్ని కల్పిస్తూ ఈ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. కానీ దీని కోసం కొన్ని షరతులు విధించారు. ఇంటి ధర రూ. 50 లక్షలు దాటకుండా... తీసుకునే రుణం రూ.35 లక్షలు దాటకుండా ఉంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

ఎక్కువ ఆదాయం.. ఎక్కువ వడ్డన
ఏడాదికి కోటి రూపాయలు దాటి సంపాదించే వారు సూపర్ రిచ్ సర్‌ఛార్జీ పేరిట 12 శాతాన్ని చెల్లించేవారు. ఇపుడు ఈ సర్‌ఛార్జిని 15 శాతానికి పెంచారు. 2013లో అప్పటి ఆర్థిక మంత్రి తొలిసారిగా ఈ సూపర్ రిచ్ సర్‌చార్జిని 10 శాతంగా ప్రవేశపెట్టారు. గత బడ్జెట్‌లో జైట్లీ వెల్త్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేసి సూపర్ రిచ్ సర్ చార్జీని 12 శాతానికి పెంచారు. ఇప్పుడు ఇది 15 శాతం అయ్యింది.

ఎన్‌పీఎస్ విత్‌డ్రా.. ట్యాక్స్ ఫ్రీ
ఇతర పింఛన్ పథకాల మాదిరిగానే ఎన్‌పీఎస్ నుంచి చేసే విత్ డ్రాయల్స్‌పై కూడా పన్ను భారాన్ని తీసేశారు. 60 ఏళ్లు దాటాక ఎన్‌పీఎస్ కార్పస్ నుంచి మామూలుగా 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేయొచ్చు మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. తద్వారా పింఛన్ వస్తుంది. అయితే విత్‌డ్రా చేసుకునే మొత్తంపై ఇప్పటిదాకా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇకపై మాత్రం విత్‌డ్రా చేసుకునే మొత్తం 40 శాతం దాకా ఉంటే ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. 60 శాతమైతే మాత్రం... మిగిలిన 20 శాతంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగమిస్తే ఈపీఎఫ్ సాయం..
కొత్త ఉద్యోగి కనక ఈపీఎఫ్‌లో చేరితే... మూడేళ్లపాటు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను (జీతంలో 8.33 శాతం) కేంద్రమే ఈపీఎఫ్‌కి జమ చేస్తుంది. అయితే ఉద్యోగి జీతం రూ.15,000 దాటి ఉండకూడదు. దీని వల్ల జీతంలో కనీసం 8.33 శాతం ఈపీఎఫ్‌కి జమచేయాలన్న నిబంధన నుంచి కంపెనీలకు మూడేళ్లు ఊరట లభిస్తుంది. ఉద్యోగికీ లాభం ఉంటుంది. దీని కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది

చౌక ఇళ్లకు ప్రోత్సాహకాలు
చౌక ఇళ్లను నిర్మించే సంస్థలకు వచ్చే లాభాల్లో 100 శాతం డిడక్షన్‌కు వీలు కల్పించారు. మెట్రో నగరాల్లో 30 చదరపు అడుగుల్లో, మిగిలిన పట్టణాల్లో 60 చదరపు అడుగుల్లో నిర్మించే ఫ్లాట్స్‌కి ఈ ప్రయోజనం లభిస్తుంది.

బీమా ఏజెంట్లకు టీడీఎస్ ఊరట
బీమా ఏజెంట్ల కమీషన్‌పై విధించే టీడీఎస్‌ను 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇంతకాలం కమీషన్ రూపంలో వచ్చే ఆదాయం రూ.20,000 దాటితేనే టీడీఎస్ వర్తించేది. దీన్నిప్పుడు రూ.15,000కు తగ్గించారు. బీమా పాలసీకి చేసే చెల్లింపులపై విధించే టీడీఎస్‌ను 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్ స్కీం (ఎన్‌ఎస్‌ఎస్) కమీషన్లపై టీడీఎస్‌ను 20 నుంచి 10 శాతానికి, బ్రోకింగ్ కమీషన్లపై టీడీఎస్‌ను 10 నుంచి 5 శాతానికి తగ్గించారు.

బడ్జెట్‌లో పెరిగేవి-తగ్గేవి
ఈ ఏడాది పన్నుల్లో మార్పుల ద్వారా దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్లు, కార్లు, సిగరెట్లు, బ్రాండెడ్ వస్త్రాలు, విమానయానం వంటివి మరింత ప్రియం కానుండగా.. పాదరక్షలు, సోలార్ దీపాలు, రూటర్లు, సీసీ కెమెరాల వంటివాటి ధరలు తగ్గనున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, బిల్లుల చెల్లింపులు వంటివి భారం కానున్నాయి.

పెరిగేవి
 • పారిశ్రామికంగా వినియోగించే సోలార్ వాటర్ హీటర్లపై పన్నును 7.5 నుంచి 10 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.
 • శీతల పానీయాలు, మినరల్ వాటర్‌పై పన్నును 18 నుంచి 21 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.
 • ఇళ్లు మారినప్పుడు వినియోగించుకునే ‘ప్యాకర్స్ అండ్ మూవర్స్’ సేవలపై పన్నును 4.2 శాతం నుంచి 5.6 శాతానికి పెంచనున్నారు.
 • లాటరీ టికెట్లను, అద్దె వాహనాలను సేవా పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ సేవలపై 5.6 శాతం పన్ను వసూలు చేయాలని ప్రతిపాదించారు.
 • విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సర్క్యూట్ బోర్డులపై పన్నును 1 శాతం పెంచారు. - దీంతో దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్ల ధరలు ఒక శాతం వరకు పెరిగే అవకాశముంది. ఇమిటేషన్ ఆభరణాలపై పన్నును ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 15 శాతానికి పెంచనున్నారు

తగ్గేవి
 • సాధారణ, రెజిన్ రబ్బరు షీట్లపై పన్నును 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాదరక్షల ధరలు భారీగా తగ్గే అవకాశముంది.
 • ఇంటర్‌నెట్ కనెక్షన్ల కోసం వినియోగించే రూటర్లు, బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్‌లు, టీవీ సెట్‌టాప్ బాక్స్‌లపై పన్నును 4 శాతానికి తగ్గించనున్నారు.
 • హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఇంజన్లపై పన్నును 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. దీంతో వాటి ధరలు బాగా తగ్గనున్నాయి.
 • సోలార్ దీపాలు, సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లపై ప్రస్తుతమున్న 12.5 శాతం ఎక్సైజ్ పన్నును పూర్తిగా తొలగించనున్నారు.
 • ఒక కిలోవాట్ నుంచి 1.5 కిలోవాట్ల సామర్థ్యమున్న దేశీ తయారీ మైక్రోవేవ్ ఓవెన్లపై ప్రస్తుతమున్న 10 శాతం పన్నును పూర్తిగా రద్దు చేయనున్నారు.
 • రూ. వెయ్యికి మించిన బ్రాండెడ్ వస్త్రాలపై ఎక్సైజ్ పన్నును ‘ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లేకుండా 2 శాతానికి, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌తో 12.5 శాతానికి’ పెంచనున్నట్లు జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ పన్ను ప్రస్తుతం ‘ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లేకుంటే పూర్తి మినహాయింపు, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌తో 6 శాతం నుంచి 12 వరకు’ ఉంది.
 • విమానాల్లో వినియోగించే ఇంధనం ‘ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)’పై ఆరు శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంపును జైట్లీ ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతం 8 శాతంగా ఉన్న ఈ పన్ను 14 శాతానికి పెరగనుంది.

రాయితీల్లో రూ. 10,000 కోట్లు కోత
 • ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై రాయితీలను వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నాలుగు శాతానికి పైగా తగ్గించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ బిల్లు కింద 2,31,781.61 కోట్లు కేటాయించారు.
 • 2015-16 సంవత్సరంలో సబ్సిడీ బిల్లు సవరించిన అంచనాల ప్రకారం 2,41,856.58 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర తగ్గించారు.
 • 2015-16 లో ఆహార సబ్సిడీ బిల్లు రూ. 1,39,419 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దానిని రూ. 1,34,834.61 కోట్లకు తగ్గించారు.
 • అలాగే.. ఎరువుల సబ్సిడీని రూ. 72,437.58 కోట్ల నుంచి రూ. 70,000 కోట్లకు, పెట్రోలియం సబ్సిడీని రూ. 30,000 కోట్ల నుంచి వచ్చే ఏడాదిలో రూ. 26,947 కోట్లకు కుదించారు.
 • వచ్చే ఏడాది ఎరువుల సబ్సిడీకి 70 వేల కోట్లు కేటాయింపులు జరిపారు. అందులో యూరియా సబ్సిడీకి రూ. 51,000 కోట్లు, అనియంత్రిత ఫాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకు రూ. 19,000 కోట్లు కేటాయించారు.
 • యూరియా సబ్సిడీ రూ. 51 వేల కోట్లలో.. రూ. 40 వేల కోట్లను దేశీయ యూరియాకు, మిగతా మొత్తాన్ని దిగుమతి చేసుకునే యూరియాకు సబ్సిడీగా పేర్కొన్నారు.
 • అనియంత్రిత పాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకుకేటాయించిన రూ. 19 వేల కోట్లలో దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులకు రూ. 12 వేల కోట్లు, దిగుమతి చేసుకునే ఎరువులకు రూ. 6,999.99 కోట్లు కేటాయించారు. ఇందులోనే సిటీ కంపోస్ట్ ఉత్పత్తికి సాయంగా రూ. 1 లక్ష కేటాయించారు.
 • పెట్రోలియం సబ్సిడీ కింద రూ. 26,947 కోట్లు కేటాయించగా.. అందులో రూ. 19,802.79 కోట్లు ఎల్‌పీజీ సబ్సిడీ కింద, మిగతా మొత్తాన్ని కిరోసిన్ సబ్సిడీ కింద కేటాయింపులు జరిపారు.

ఇన్‌ఫ్రాకు రూ. 2.21 లక్షల కోట్ల కేటాయింపు
మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే క్రమంలో.. బడ్జెట్‌లో ఇన్‌ఫ్రా రంగానికి రూ. 2.21 లక్షల కోట్లు కేటాయించారు. 2016-17కి సంబంధించి ఇన్‌ఫ్రాకు మొత్తం రూ. 2.21 లక్షల కోట్లు కేటాయించగా, ఇందులో సింహభాగం రూ. 2.18 లక్షల కోట్లు రహదారులు, రైల్వేలకే ఇవ్వనున్నారు. పోర్టులకు ఊతమిచ్చేలా సాగర్‌మాలా ప్రాజెక్టుకు రూ. 8,000 కోట్లు కేటాయించారు.

ఎరువుకు నగదు బదిలీ
ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతులకే అందివ్వనున్నారు. ఎరువుల సబ్సిడీకి కేంద్రం ఏటా రూ.73 వేల కోట్ల దాకా వెచ్చిస్తోంది. అయితే ఈ సబ్సిడీని రైతులకు కాకుండా ఎరువుల కంపెనీలకు అందిస్తోంది. ఆ కంపెనీలు సబ్సిడీని మినహాయించి రైతులకు ఎరువులు అందిస్తున్నాయి. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, సబ్సిడీ పక్కదారి పడుతోందన్న ఆరోపణలున్నాయి. దీంతో కేంద్రం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

కొత్త పథకాలకు ‘సన్‌సెట్ డేట్’!
ఇక నుంచి కొత్తగా ప్రవేశపెట్టే పథకాలకు ముగింపు తేదీ (సన్‌సెట్ డేట్)ని కూడా ప్రకటించనున్నారు. దీనివల్ల ఆయా పథకాలు నిర్దేశించిన సమయం తర్వాత రద్దవుతాయి. ప్రభుత్వ వ్యయాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు, ప్రభుత్వం తెచ్చే ప్రతీ కొత్త పథకానికి ముగింపు తేదీ కూడా ప్రకటించనున్నారు. దీనివల్ల ఆయా పథకాల ప్రయోజనాలను సమీక్షించవచ్చని, అర్హులైన లబ్ధిదారులకు సహాయం అందించడానికి సులువవుతుందన్నారు.

అమృత్, స్మార్ట్‌సిటీస్‌కు 7296 కోట్లు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్), స్మార్ట్ సిటీ మిషన్‌లకు రూ. 7296 కోట్లను కేటాయించారు. ఇందులో అమృత్ పథకానికి రూ. 4091 కోట్లు, స్మార్ట్‌సిటీస్ మిషన్‌కు రూ. 3205 కోట్లు. 100 నగరాలను ఎంపిక చేసి అందులో తొలి విడతగా టాప్-20 నగరాలను అభివృద్ధి (తాగునీరు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సాంకేతికత, కనీస మౌలిక వసతులు వంటివి) చేసేందుకు గత నెలలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో నగరానికి ఐదేళ్లపాటు రూ.500 కోట్ల నిధులిస్తారు.

నల్ల ధనం వెల్లడికి 4 నెలలు
లెక్కల్లో చూపని ఆదాయాలు, ఆస్తులు స్వచ్ఛందంగా వెల్లడించాలనుకునే వారికి నాలుగు నెలల వ్యవధి ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ వ్యవధిలో సదరు నల్లధనానికి సంబంధించి పన్నులు, పెనాల్టీలు కట్టిన వారిపై తదుపరి ప్రాసిక్యూషన్ తదితర చర్యలు ఉండబోవని తెలిపారు. ఇటువంటి బ్లాక్‌మనీపై 30 శాతం పన్నులు, 7.5 శాతం సర్‌చార్జీ, 7.5 శాతం పెనాల్టీ ఉంటుందని (మొత్తం 45 శాతం) మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

గ్రీన్‌‌ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి
జలమార్గాల అభివృద్ధి కోసం రూ. 800 కోట్లు కేటాయించారు. సాగరమాల ప్రాజెక్టు ద్వారా కనీసం రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలనుకుంటున్నారు.
 • కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్రధాన పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఇండియన్ కస్టమ్స్ సింగిల్ విండో ప్రాజెక్టు అమలు.
 • మరింత మంది దిగుమతిదారులకు డెరైక్ట్ పోర్టు డెలివరీ సౌకర్యం విస్తరణ.
 • కొన్ని తరగతుల ఎగుమతిదారులు, దిగుమతిదారులకు కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులో వాయిదా సౌలభ్యం అందించేందుకు కస్టమ్స్ చట్టానికి సవరణ.

ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఊతం
ఎస్సీ, ఎస్టీలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంకోసం కేంద్రం తాజా బడ్జెట్‌లో ‘స్టాండప్ ఇండియా’ పథకం కింద రూ.500 కోట్లను కేటాయించింది. దీనితోపాటు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వృత్తిపరమైన సాయం అందించడానికి వివిధ పారిశ్రామిక సంఘాల సహకారంతో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖలో జాతీయ హబ్‌ను కూడా ఏర్పాటు చే యనున్నారు.

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలకు రూ.100 కోట్లు
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి, గురు గోవింద్‌సింగ్ 350వ జయంతి ఉత్సవాల నిర్వహణకోసం రూ. 100 కోట్ల చొప్పున కేంద్రం బడ్జెట్ కేటాయింపులు చేసింది.

మైనారిటీల కోసం ‘ఉస్తాద్’
మైనారిటీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికోసం ‘ఉస్తాద్’ పేరిట పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకం ద్వారా బహుళ రంగాల్లో మైనారిటీల అభివృద్ధికోసం చర్యలు చేపడతారు.

క్రీడలకు నామమాత్రపు పెంపు..
క్రీడలకు గత బడ్జెట్‌తో పోలిస్తే కేవలం రూ. 50.87 కోట్లు ఎక్కువ ఇచ్చారు. 2016-17 బడ్జెట్‌లో క్రీడలకు ప్రణాళిక వ్యయం కింద రూ. 1,400 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 192 కోట్లు మొత్తం రూ. 1592 కోట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. గత బడ్జెట్‌లో క్రీడలకు రూ. 1541.13 కోట్లు ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీకి రూ. 381.30 కోట్లు, క్రీడా సంస్థలకు రూ. 545.90 కోట్లు కేటాయించారు.

టెలికంకు రూ.18,413 కోట్లు
కేంద్రం ఈ బడ్జెట్‌లో టెలికం శాఖకు రూ. 18,413.87 కోట్లను కేటాయించింది. రక్షణ రంగానికి ప్రత్యేక స్పెక్ట్రం నెట్‌వర్క్ ఏర్పాటు, స్పెక్ట్రంను వాపస్ చేసిన పీఎస్‌యూలకు చెల్లింపులు చేయడానికి ప్రధానంగా ఈ నిధులు వాడతారు. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం రూ. 2,710 కోట్లతో రక్షణరంగానికి సాధారణ స్పెక్ట్రం నెట్‌వర్క్‌కు బదులు ప్రత్యేకంగా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు.

డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష ్యం రూ.56,500 కోట్లు
ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.56,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా ఒనగూరేది రూ.36,000 కోట్లు. మిగిలిన రూ.20,500 కోట్లు వ్యూహాత్మక వాటాల(మెజారిటీ వాటాలు) విక్రయం ద్వారా సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.69,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకోగా రూ.25,312 కోట్లను మాత్రమే సమీకరించుకోగలిగింది.

10 లక్షల డివిడెండుపై పన్ను..
వ్యక్తులు, సంస్థలకు వచ్చే డివిడెండు రూ. 10 లక్షలు దాటితే 10 శాతం పన్ను విధించాలని బడ్జెట్‌లో జైట్లీ ప్రతిపాదించారు. ఇది డివిడెండు డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)కి అదనంగా ఉండనుంది. ఇప్పటివరకూ డివి డెండ్లు తీసుకునే వాటాదారులు కాకుండా, వాటిని పంపిణీ చేసే కంపెనీలు డీడీటీ చెల్లిస్తుండగా, ఇకపై రూ. 10 లక్షల పైగా డివిఢ డెండు అందుకునే వారు కూడా పన్ను చెల్లించాల్సి వుంటుంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణలు 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగలవు. మరోవైపు ఆప్షన్ ట్రేడింగ్‌లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను 0.017 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు. ఇది జూన్ 1 నుంచి అమల్లోకి రాగలదని అంచనా.

బ్యాంకులకు రూ.25,000 కోట్ల తాజా మూలధనం
బ్యాంకులకు వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర రూ.25,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టత, పోటీతత్వం మెరుగుదలకు ప్రభుత్వం తగిన పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు.

తయారీ సంస్థలకు తోడ్పాటు
పారిశ్రామిక కార్యకలాపాలను ప్రోత్సహించటం, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేందుకు బడ్జెట్‌లో కొత్త తయారీ యూనిట్లకు తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ విధించేలా ప్రతిపాదనలు చేశారు. వీటి ప్రకారం ఈ ఏడాది మార్చి 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త తయారీ యూనిట్లకు కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతమే (సర్‌చార్జి, సెస్సులు అదనం) ఉంటుంది. దీన్ని పొందాలంటే ఆయా సంస్థలు.. లాభాలు, పెట్టుబడుల ఆధారిత డిడక్షన్లు మొదలైనవి క్లెయిమ్ చేసుకోకూడదు. మరోవైపు, రూ. 5 కోట్ల టర్నోవరు ఉండే చిన్న యూనిట్లకు దీన్ని 30 శాతం నుంచి 29 శాతానికి (సర్‌చార్జి, సెస్సు అదనం) తగ్గించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుతం 30 శాతం ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను నాలుగేళ్లలో దశలవారీగా 25 శాతానికి తగ్గించే దిశగా చర్యలు ప్రతిపాదించినట్లు చెప్పారు. కొత్త సెజ్ యూనిట్లు.. సెక్షన్ 10ఏఏ ప్రయోజనాలు పొందాలంటే 2020 మార్చి 31 నాటికల్లా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది.

పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు
పేద మహిళలకు వారి పేరిటే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని ప్రకటించారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించారు. దీనివల్ల 2016-17 సంవత్సరంలో దారిద్య్ర రేఖ (బీపీఎల్)కు దిగువన ఉన్న 1.50 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. బీపీఎల్ దిగువన ఉన్న మొత్తం 5 కోట్ల కుటుంబాలు దీనిద్వారా లబ్ధిపొందేందుకు ఈ పథకాన్ని మూడేళ్లపాటు కొనసాగిస్తామని వెల్లడించారు.

ఒక్క రోజులోనే కంపెనీ నమోదు
ఒక్క రోజులోనే కంపెనీని నమోదు చేసుకునే వీలుండేలా 2013 నాటి కంపెనీల చట్టాన్ని సవరించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తేనున్నారు. వ్యాపారం చేయడం అత్యంత సులభంగా ఉండేలా చూడడం, స్టార్టప్‌లకు అనుకూలమైన నిబంధనలతో ఈ బిల్లును రూపొందించనున్నారు.

శాఖలవారీగా.. కేటాయింపుల వివరాలివీ... (రూ. కోట్లల్లో)
పట్టణాభివృద్ధి శాఖ 15,160
మైనార్టీ వ్యవహారాల శాఖ 3,827.25
సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 9,488
అంతరిక్ష పరిశోధన విభాగం 7,509
సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ 220
సమాచార, ప్రసార శాఖ 4,083
న్యాయ శాఖ 900
అణుశక్తి రంగం 3,000
సాంఘిక న్యాయం, సాధికారత శాఖ 7,350
సాంస్కృతిక శాఖ 2,500
జలవనరుల శాఖ 6,201.21
ఆయుష్ మంత్రిత్వ శాఖ 1,326.20
ఇతరత్రా కేటాయింపులు...
కేంద్ర మంత్రులు, మాజీ ప్రధానుల
ప్రయాణ, ఇతర ఖర్చులు 259
యూపీఎస్సీ 217
లోక్‌పాల్ 8.58
కేంద్ర విజిలెన్స్ కమిషన్ 27.68
సీబీఐ 727.75
ఎయిర్ ఇండియా 1,713
ఈశాన్య రాష్ట్రాలకు 33,907

పసిడి బాండ్లకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఊరట
పసిడి బాండ్ల పథకానికి మరింత ప్రాచుర్యం కల్పించేలా .. వీటికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. గోల్డ్ బాండ్ స్కీము కింద 5, 10, 50, 100 గ్రాముల పసిడికి సరిసమానమైన విలువతో గోల్డ్ బాండ్లను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇవి 5-7 ఏళ్ల కాల వ్యవధితో లభిస్తాయి. ఆర్‌బీఐ ఇప్పటిదాకా ఈ బాండ్లను 2 సార్లు జారీ చేసింది. మరోవైపు, పసిడి డిపాజిట్ల పథకం కింద ఇచ్చే డిపాజిట్ సర్టిఫికెట్లపై వచ్చే వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్‌కు పన్ను నుంచి మినహాయింపు ఉండనుంది. పసిడి డిపాజిట్ పథకాన్ని గతేడాది నవంబర్ 5న ప్రారంభించారు. పుత్తడి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో ఈ 2 పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

తెలంగాణకు రూ.25 వేల కోట్లు
2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.25 వేల కోట్లు వచ్చే అవకాశముందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాలు వేసింది. కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల వాటా (42 శాతం) ద్వారా రాష్ట్రానికి రూ.13,900 కోట్లు సమకూరుతాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల (స్టేట్ ప్లాన్)కు కేటాయించిన నిధుల్లో రూ.5,900 కోట్లు కేటాయించే అవకాశముంది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన స్థానిక సంస్థల గ్రాంట్ల రూపంలో రూ.2,500 కోట్లు రాష్ట్రానికి విడుదలవుతాయి. వీటితో పాటు జాతీయ విపత్తు నిధి నుంచి వచ్చే నిధులు, ఇతరత్రా గ్రాంట్లు మరో రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్లు వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
 • అత్యంత కీలకమైన ఆరు పథకాలకు కేంద్రమే నూటికి నూరు శాతం నిధులు కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. ఉపాధి హామీ పథకం, జాతీయ సామాజిక భద్రత పథకం, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, బీసీలు, నిరాదరణకు గురైన వర్గాల అభివృద్ధి, మైనారిటీల అభివృద్ధి పథకాలు ఇందులో ఉన్నాయి.
 • తెలంగాణలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పడానికి గతంలోనే అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఏమీ కేటాయించలేదు..
 • ఇటీవలే కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 1800 కి.మీ. నిడివి గల కొత్త జాతీయ రహదారుల్లో కనీసం సగం వరకు రోడ్లకు నిధులు అందే అవకాశం కనిపిస్తోంది.
 • పశువులకు ఆరోగ్య గుర్తింపు కార్డులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయిం చింది. అందుకోసం బడ్జెట్లో రూ.850 కోట్లు కేటాయించింది. దీని ప్రకారం తెలంగాణకు దాదాపు రూ. 30 కోట్లు వచ్చే అవకాశం ఉంది. పశుధన్ సంజీవని పథకం కింద ఇచ్చే కార్డుల ద్వారా రాష్ట్రంలో పశువుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు.

కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా.. రూ.24,637.36 కోట్ల
2016-17కు కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 24,637.36 కోట్లుగా ఉంది. ఇది రాష్ట్రాలకు పంపిణీ చేసే మొత్తం పన్నుల్లో (42 శాతం) 4.305 శాతంగా ఉంది. కార్పొరేషన్ పన్ను రూ. 7,729.34 కోట్లు, ఆదాయ పన్ను రూ. 5,990.02 కోట్లు, కస్టమ్స్ పన్ను రూ. 3,851.29 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 3,077.29 కోట్లు, సేవా పన్ను రూ. 3,889.86 కోట్లుగా ఉంది. గత ఏడాది (రూ. 21,893.79 కోట్లు)తో పోల్చితే ఇది సుమారు రూ.2,800 కోట్లు అధికం.

కేంద్రం నుంచి వచ్చే నిధులివే..(అంచనా)

పన్నుల వాటా:

రూ.13,900 కోట్లు

కేంద్ర ప్రాయోజిత పథకాలు:

రూ.5,900 కోట్లు

14వ ఆర్థిక సంఘం నిధులు:

రూ.2,500 కోట్లు

ఇతరత్రా గ్రాంట్లు:

రూ.3,000 కోట్లు

మొత్తం:

రూ.25,300 కోట్లు


ఏపీకి ఇచ్చిన బడ్జెట్.. (రూ. కోట్లలో)

అంశం

కేటాయింపులు

పోలవరం ప్రాజెక్టు

100

విజయవాడ మెట్రో రైల్

106

వైజాగ్ మెట్రో రైల్

0.03

ఐఐటీ

40

ఎన్‌ఐటీ

40

ఐఐఎం

30

ఐఐఎస్‌ఈఆర్

40

ట్రిపుల్ ఐటీ

20

గిరిజన విశ్వవిద్యాలయం

1

పెట్రోలియం వర్సిటీ

2

సెంట్రల్ వర్సిటీ

1

పారిశ్రామిక యూనిట్లకు

 

వడ్డీ రాయితీ ఏపీ,

 

తెలంగాణలకు కలిపి

100 కోట్లు


గత మూడేళ్లలో కేంద్ర పన్నుల్లో వాటా

ఏడాది

వాటా మొత్తం

2014-15

రూ. 14,106.93 కోట్లు

2015-16

రూ. 21,893.79 కోట్లు

2016-17

రూ. 24,637.36 కోట్లు


ప్రపంచంలో అతిపెద్ద బడ్జెట్‌లు (రూపాయల్లో)
అమెరికా
మొత్తం ఆదాయం - 220 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు - 250 లక్షల కోట్లు

చైనా
మొత్తం ఆదాయం - 155 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు - 167 లక్షల కోట్లు
రెవెన్యూ లోటు - 12 లక్షల కోట్లు

జర్మనీ
మొత్తం ఆదాయం - 117 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు - 114 లక్షల కోట్లు
రెవెన్యూ మిగులు - 3 లక్షల కోట్లు

జపాన్
మొత్తం ఆదాయం - 102 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు - 125 లక్షల కోట్లు
రెవెన్యూ లోటు - 23 లక్షల కోట్లు

ఫ్రాన్స్
మొత్తం ఆదాయం - 102 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు -110 లక్షల కోట్లు
రెవెన్యూ లోటు - 8 లక్షల కోట్లు

ఇటలీ
మొత్తం ఆదాయం - 67 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు - 71 లక్షల కోట్లు
రెవెన్యూ లోటు - 4 లక్షల కోట్లు

యూకే
మొత్తం ఆదాయం - 63 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు - 74 లక్షల కోట్లు
రెవెన్యూ లోటు - 11 లక్షల కోట్లు

బ్రెజిల్
మొత్తం ఆదాయం - 59 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు - 60 లక్షల కోట్లు
రెవెన్యూ లోటు - లక్ష కోట్లు

కెనడా
మొత్తం ఆదాయం - 46 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు - 48 లక్షల కోట్లు
రెవెన్యూ లోటు - 2 లక్షల కోట్లు

స్పెయిన్
మొత్తం ఆదాయం - 36 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు - 41 లక్షల కోట్లు
రెవెన్యూ లోటు - 5 లక్షల కోట్లు

ఇండియా (2015-16)
ఆదాయం - 16.70 లక్షల కోట్లు
మొత్తం ఖర్చు - 17.77 లక్షల కోట్లు
రెవెన్యూ లోటు - లక్ష కోట్లపైనే
Published date : 02 Mar 2016 03:31PM

Photo Stories