Success story : 104 సార్లు ఫెయిల్.. 105వ సారి పాస్ అయ్యాడిలా.. ఈయన ప్రయత్నానికి శెల్యూట్ చేయాల్సిందే..
తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని చిన్నకావనం గ్రామానికి చెందిన రత్నప్రభాకరన్(27) మెకానికల్ ఇంజినీరింగ్‌ను 2016లో పూర్తి చేశాడు. పార్ట్‌టైమ్‌గా ఎంబీఏ కోర్సు చేస్తూ.. ఉద్యోగాల వేటను సాగించాడు. పోటీ పరీక్షలు రాయడం ప్రారంభించాడు. అయితే అప్పట్లో ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా పట్టువదలకుండా తన లక్ష్య సాధన కోసం మరింత తీవ్రంగా కష్టపడ్డాడు. లక్ష్యసాధనలో తడబాటు ఎదురైనా పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధించవచ్చని నిరూపించాడు రత్నప్రభాకరన్.
TSPSC Group 1 Mains : గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో తండ్రీ కొడుకులు పాస్.. మెయిన్స్‌కు ఇలా..
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో..
విఫలమైన ప్రతిసారీ తన లోపాలను గుర్తించి వాటిని సరి చేసుకోవడం ప్రారంభించాడు. ఫలితంగా 105వ సారి పరీక్షల్లో విజయం సాధించి ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం శిక్షణ ముగించుకుని కాంచీపురం జిల్లా మానామధిలోని ఇండియన్ బ్యాంకులో విధుల్లో చేరాడు. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ పుస్తకాలు చేతబట్టి.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే రత్నప్రభాకరన్ జాబ్ సంపాదించడంతో స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
స్నేహితులు, బంధువులు హేళన చేస్తున్నా..
సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో అతడిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రత్నప్రభాకరన్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల్లో తాను 65 సార్లు బ్యాంకు ఉద్యోగాల కోసం, 39సార్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసి విఫలమైనట్లు పేర్కొన్నాడు. స్నేహితులు, బంధువుల నుంచి హేళన ఎదురైనా లక్ష్యం వైపే సాగి 105వ సారి విజయవంతం అయినట్లు వెల్లడించాడు.