APPSC Group1 Ranker Aravind Success Story : గ్రూప్–1 ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు.. అనుకున్నట్టే సాధించాడిలా..
ఈ నేపథ్యంలో గ్రూప్–1లో ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన కె.అరవింద్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
కర్నూలు నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ఓంకార్, రిటైర్డ్ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ కె.రేవతి దంపతుల తనయుడు అరవింద్.
పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తూ..
జి.పుల్లారెడ్డి కాలేజీలో బీటెక్ ఈఈఈ పూర్తి చేసిన ఈ యువకుడు గ్రూప్–1 ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. బాగా ప్రిపేర్ అయి 2018లో గ్రూప్–1 పరీక్ష రాశాడు. తర్వాత 2019 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలు రాశాడు. ఇందులో జిల్లాలో రెండో ర్యాంక్ సాధించి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిగా బి.తాండ్రపాడు సచివాలయంలో చేరారు. ఇక్కడ విధులు నిర్వహిస్తుండగా ఇటీవల వెలువడిన గ్రూప్–1 ఫలితాల్లో డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యాడు.
వీరి ప్రోత్సాహంతోనే..
గ్రామ సచివాలయంలో రెండున్నర సంవత్సరాలు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించడంతో పాలన సంబంధ అంశాలపై కొంత అనుభవం వచ్చిందని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన కల నెరవేరిందని ‘సాక్షి’తో తన ఆనందం పంచుకున్నారు.
తొలిసారిగా గ్రూప్–1 సమాధాన పత్రాలను..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలను ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్ విధానంలో చేశారు.
APPSC Group-1 Ranker Bharath Nayak Success Story : భరత్ అనే నేను.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..
ఈ సారి ఇంటర్వ్యూలను..
2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.
చదవండి: Indian Polity for Competitive Exams: కేంద్ర ప్రభుత్వం – నిర్మాణం, అధికారాలు