Group I: ఇంటర్వ్యూలు షెడ్యూల్ ప్రకారమే
షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించుకునేందుకు Andhra Pradesh Public Service Commission (APPSC)కు అనుమతినిచ్చింది. అంతేకాకుండా ఇంటర్వ్యూల అనంతరం ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. అయితే అభ్యర్థుల తుది ఎంపిక ఫలితాలు మాత్రం తాము ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎంపికైన అభ్యర్థులకు తెలియజేయాలని APPSCని ఆదేశించింది. అలాగే పిటిషనర్ల సమాధానపత్రాలు, వారు సాధించిన మార్కుల వివరాలను సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూలై 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ మూల్యాంకనం చేయించిన APPSC సరైన విధానాలను అనుసరించలేదని, ఈ మాన్యువల్ మూల్యాంకనంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
చదవండి:
- Interview Tips in APPSC Group 1 (2018): ఇంటర్వ్యూల్లో రాణించేందుకు నిపుణుల సలహాలు...
- APPSC, TSPSC Groups: ఇంటర్వ్యూలకు స్వస్తి.. ప్రతిభే గీటురాయి
- TSPSC: గ్రూప్–1, 2 పోస్టులకు ఇంటర్వ్యూలు లేనట్టే..!
ఈ దశలో విఘాతం కలిగించలేం..
APPSCపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదట ఓసారి మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి, తర్వాత దాన్ని తొక్కిపెట్టి తిరిగి మరోసారి మూల్యాంకనం చేశారంటూ APPSCపై పిటిషనర్లు ఆరోపణలు చేశారన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘గతంలో డిజిటల్ మూల్యాంకనం కోసం, ఆ తర్వాత మాన్యువల్ మూల్యాంకనం కోసం భారీగా ఖర్చు చేశారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను APPSC తరఫు సీనియర్ న్యాయవాది ప్రాథమిక దశలోనే తీవ్రంగా ఖండించారు. Group I Mains పరీక్ష ఫలితాలను వెల్లడించేందుకు వీలుగా సమాధాన పత్రాలను మాన్యువల్ మూల్యాంకనం విధానంలో దిద్దాలంటూ APPSCని 2021లో హైకోర్టు ఆదేశించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొంది. కాబట్టి ఆ ఆదేశాలకు ఈ దశలో విఘాతం కలిగించలేం. ఇప్పటికే 325 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం పిలుపు అందుకున్నారు. అందువల్ల APPSCకి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఇచ్చి తీరాలి. అయితే ఇక్కడ పిటిషనర్ల ప్రయోజనాలను కూడా కాపాడాల్సి ఉంది. అందువల్ల షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూలు కొనసాగించుకునేందుకు, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు APPSCకి అనుమతినిస్తున్నాం. ఎంపిక ప్రక్రియ ఫలితాలు ఈ వ్యాజ్యాల్లో ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయి’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.