Skip to main content

AP Intermediate Results 2024 :ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్‌ జిల్లా విద్యార్థులు సత్తా

ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్‌ జిల్లా విద్యార్థులు సత్తా
AP Intermediate Results 2024 :ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్‌ జిల్లా విద్యార్థులు సత్తా

విజయవాడ : ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్‌ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొదటి రెండో సంవత్సరాలకు చెందిన ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో జిల్లాను తృతీయ, ద్వితీయ స్థానాల్లో నిలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 79 శాతంతో రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 87 శాతం ఫలితాలతో రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించారు. గత ఏడాది వరకూ ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఫలితాలు ప్రకటించగా, ఈ ఏడాది నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా ఇంటర్మీడియెట్‌ బోర్డు ఫలితాలను ప్రకటించింది.

బాలికలు 88 శాతం..

ఎన్టీఆర్‌ జిల్లాకు సంబంధించి రెండో సంవత్సరం విద్యార్థులు 87 శాతం విజయం సాధించారు. అందులో బాలికలు 88 శాతం విజయం సాధించారు. అలాగే బాలురు 86 శాతం విజయం సాధించారు. మొదటి ఏడాది ఫలితాల్లో బాలికలు 81 శాతం విజయం సాధించగా, బాలురు 78 శాతం విజయం సాధించారు. మొత్తం మీద బాలికలు అత్యధికంగా విజయం సాధించి తమ రికార్డును భద్రం చేసుకున్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లా 83 శాతం ఫలితాలతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. మార్చి మొదటి తేదీ నుంచి 20వ తేదీ వరకూ 99 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు.

పరీక్షకు హాజరైన విద్యార్థులు..

మొదటి సంవత్సరానికి సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన విద్యార్థులు 38,307 మంది పరీక్షకు హాజరుకాగా అందులో 21,217 మంది బాలురు, 17,090 మంది బాలికలు ఉన్నారు. ఉత్తీర్ణులైన వారు 30,353 మంది ఉండగా అందులో 16,558 మంది బాలురు, 13,795 మంది బాలికలు ఉన్నారు. రెండో సంవత్సరంలో 34,156 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందులో 18,892 మంది బాలురు, 15,264 బాలికలు ఉన్నారు. ఉత్తీర్ణులైన వారిలో 29,707 మంది ఉండగా అందులో బాలురు 16,263, బాలికలు 13,444 ఉన్నారు.

ఒకేషనల్‌లో 70 శాతం ఫలితాలు..

ఎన్టీఆర్‌ జిల్లాలో ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి 70 శాతం ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 703 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందులో 493 మంది విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించారు. వారిలో బాలికలు 80 శాతంతో టాప్‌లో ఉన్నారు. అలాగే ఒకేషనల్‌ మొదటి ఏడాదికి సంబంధించి 1,018 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందులో 599 మంది ఉత్తీర్ణతను సాధించారు. మొదటి ఏడాది మొత్తం ఉత్తీర్ణత 59 శాతంగా ఉంది.

Also Read:   Twin Sisters Got Same Marks in 10th and Inter

రీకౌంటింగ్‌కు అవకాశం..

విద్యార్థులకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు సంబంధించి ఫీజు చెల్లింపునకు ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు

టాప్‌ లేపిన మొవ్వ జూనియర్‌ కాలేజీ

ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ స్థానం కై వసం ,మొవ్వ: మండల కేంద్రం మొవ్వ గ్రామంలోని క్షేత్రయ్య జూనియర్‌ కళాశాల ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల్లో 2022–24విద్యా సంవత్సరానికి గాను జిల్లా ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌శాస్త్రి శుక్రవారం విలేకరులకు తెలిపారు. జనరల్‌ కోర్సుల్లో 91.26 శాతం ఉత్తీర్ణత, వృత్తి విద్యా విభాగంలో 92.9 శాతాన్ని సాధించిందని.. ప్రథమ సంవత్సర ఫలితాల్లో జనరల్‌ విభాగంలో 48.54 శాతాన్ని, వృత్తి విద్యా విభాగంలో 86.54 శాతాన్ని సాధించినట్లు తెలిపారు. కాగా ఎన్‌. హర్షిత (ఎంఈటీ) 968/1000, కె. శ్రీవిద్య(ఎంపీసీ) 963/1000, పి. శ్రావ్య (బైపీసీ) 953/1000 మార్కులు సాధించి కళాశాలలో తొలి మూడు స్థానాల్లో నిలిచినట్లు ప్రిన్సిపాల్‌ వెల్లడించారు.

సప్లిమెంటరీకి అవకాశం..

ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ మొదటి తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించారు.

Published date : 13 Apr 2024 05:18PM

Photo Stories