How to choose Engineering College: బ్రాంచ్‌తోపాటు ఇన్‌స్టిట్యూట్ ఎంపిక కూడా కీలకమే... ఈ చిట్కాలను విస్మరించొద్దు!
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు.. బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం క్రేజ్ కోణంలోనే బ్రాంచ్‌లను ఎంపిక చేసుకోవడం సరికాదంటున్నారు. ఆసక్తి లేని బ్రాంచ్‌లో చేరితే.. భవిష్యత్‌లో అకడమిక్‌గా రాణించలేకపోవచ్చు. ఇది భవిష్యత్తు గమ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారముంది. కాబట్టి ఆయా బ్రాంచ్‌ల సిలబస్, కరిక్యులం స్వరూపాన్ని పరిశీలించి.. తమ సహజ ఆసక్తికి అనుగుణంగా ఉండే విభాగాన్ని ఎంపిక చేసుకోవడం మేలు.
Check College Predictor - 2023 AP EAPCET | TS EAMCET
ఇన్‌స్టిట్యూట్ ఎంపిక
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు అందరికీ సీట్లు లభిస్తాయి. అందుకే టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు కోసం విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించాలని ప్రయత్నిస్తుంటారు. కాలేజీ ఎంపికలో ఆయా ఇన్‌స్టిట్యూట్‌లో నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకూ.. వివిధ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు.
చదవండి: ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు ఇవే.. మరో 14,565 ఇంజనీరింగ్ సీట్ల పెంపు.. ఇంకా..
ఎన్‌బీఏ గుర్తింపు
విద్యార్థులు తాము చేరాలనుకుంటున్న బ్రాంచ్‌కు, ఇన్‌స్టిట్యూట్‌కు ఎన్‌బీఏ గుర్తింపు ఉందా? లేదా? అనే విషయం కూడా పరిగణించాలి. కారణం.. ఎన్‌బీఏ గుర్తింపు బ్రాంచ్‌ల వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు మొత్తం బ్రాంచ్‌లలో ఒకట్రెండు బ్రాంచ్‌లకే ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్‌బీఏ అక్రెడిటెడ్ అని వెబ్‌సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటనలిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
విద్యార్థులు కాలేజ్ ఎంపికలో సదరు ఇన్‌స్టిట్యూట్‌కు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న గుర్తింపు గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు గతేడాది ఆయా కాలేజ్‌లో సీట్ల భర్తీ పరంగా ఓపెనింగ్-క్లోజింగ్ ర్యాంకుల సమాచారం సేకరించాలి.
చదవండి: ఇంజినీరింగ్ సీట్లు.. అత్యధికంగా ఈ బ్రాంచ్ సీట్లపైనే.. అంగట్లో సరుకులా..
ఉదాహరణకు యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అదే విధంగా కొన్ని ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లో ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ వంటి బ్రాంచ్‌లలో లాస్ట్ ర్యాంకు 1500 నుంచి 2000లోపే ఉంటోంది. అంటే.. ఆ కళాశాలలు తమ నాణ్యత ప్రమాణాల ఆధారంగా టాపర్స్ ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు.
బోధన విధానాలు
విద్యార్థులు కాలేజ్ ఎంపికలో బోధన పద్ధతులపైనా దృష్టి పెట్టాలి. టీచింగ్‌లో అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుతెన్నులను పరిశీలన చేయాలి. ఇప్పటికే ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులను అడిగి ఈ వివరాలు తెలుసుకోవవచ్చు. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ ఉన్నారని ప్రకటనలిస్తుంటాయి. వాస్తవానికి సదరు పీహెచ్‌డీ ఫ్యాకల్టీ క్లాస్ రూంలో స్టూడెంట్‌తో ఇంటరాక్షన్ ఎంత మేరకు ఉంటుందనేది ముఖ్యం.
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్
కళాశాలలో గత నాలుగేళ్ల ప్లేస్‌మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి. వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి తదితర వివరాలను పరిశీలించాలి. ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయని పలు కాలేజీలు విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాని ఇలా వచ్చిన సంస్థలు కోర్ ప్రొఫైల్స్‌లో ఎంతమందికి అవకాశాలు ఇస్తున్నాయో అడిగి తెలుసుకోవాలి.