Skip to main content

AP EAPCET - 2022: విజయానికి అనురించాల్సిన వ్యూహాలు... ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం!

APEAPCET - 2022 notification details
APEAPCET - 2022 notification details

ఇంజనీరింగ్‌.. బీటెక్‌.. ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ విద్యార్థుల తొలి ప్రాధాన్యం! ఇందుకోసం.. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో నిర్వహించే.. ఎంట్రన్స్‌లకు పోటీ పడుతున్న పరిస్థితి! ముఖ్యంగా.. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంట్రన్స్‌లపై ప్రత్యేకంగా.. దృష్టిపెడుతున్న వైనం! కారణం.. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లో విజయంతో.. సొంత రాష్ట్రంలోనే బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో.. బీటెక్‌ సీటు సొంతం చేసుకోవచ్చనే ఆలోచన! ఇలాంటి వారంతా.. తమ స్వప్న సాకారానికి సన్నద్ధులు కావాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో.. ఏపీ–ఈఏపీ–సెట్‌–2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది! ఇంజనీరింగ్‌ మాత్రమే కాకుండా.. ఫార్మసీ, అగ్రికల్చరల్‌ అనుబంధ కోర్సులకూ ఈఏపీసెట్‌ ర్యాంకే ఆధారంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఏపీ–ఈఏపీసెట్‌–2022 వివరాలు, విజయానికి అనురించాల్సిన వ్యూహాలు, ప్రవేశాలు లభించే కోర్సులు తదితర అంశాలపై విశ్లేషణ..

  • అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సులకూ ఈఏపీసెట్‌ ర్యాంకే ఆధారం
  • ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ఈఏపీసెట్‌–2022 ప్రక్రియ
  • జూలై 4 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు
  • కాన్సెప్ట్‌లు, అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో విజయం సాధించే అవకాశం

ఏపీలో ఇంజనీరింగ్‌ కాలేజ్‌లలో చేరడానికి మార్గం.. ఈఏపీ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ).. కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌. వీటిలో ర్యాంకుతో ఇంజనీరింగ్‌తోపాటు, ఫార్మసీ, ఫార్మ్‌–డి వంటి కోర్సుల్లోనూ ప్రవేశించొచ్చు. వాటి ఆధారంగా భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు . తాజాగా 2022–23 ప్రవేశాలకు సంబంధించి ఏపీ–ఈఏపీ సెట్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది.

చ‌ద‌వండి: After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!! 

ఈ కోర్సుల్లో ప్రవేశానికి

  • ఏపీ–ఈఏపీ సెట్‌ను ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), బీటెక్‌(ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హస్బెండరీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సు, బీఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తారు.
  • ఈఏపీ సెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా.. తర్వాత దశలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.

అర్హత

  • ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు.. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులు కూడా అర్హులే.
  • అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌ బైపీసీ గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించాలి. 
  • రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో అయిదు శాతం మినహాయింపు ఉంటుంది.
  • ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు కూడా ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

నాలుగు విభాగాలు.. 160 మార్కులు

ఏపీ ఈఏపీసెట్‌ ఎగ్జామ్‌ మూడు విభాగాల్లో 160 మార్కులకు జరుగుతుంది. పరీక్షను ఇంజనీరింగ్‌ స్ట్రీమ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌లుగా వేర్వేరుగా నిర్వహిస్తారు. 

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష

  • ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • మ్యాథమెటిక్స్‌ నుంచి 80; ఫిజిక్స్‌ నుంచి 40; కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి.
  • పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతుంది.

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌

  • అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌లో.. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలుంటాయి.
  • బయాలజీ(బోటనీ, జువాలజీ) నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్‌ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. బయాలజీలో బోటనీ, జువాలజీ నుంచి 40 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.

విజయానికి సన్నద్ధ ఇలా

ఈఏపీసెట్‌లో విజయానికి, మెరుగైన ర్యాంకుకు సబ్జెక్ట్‌ వారీగా అనుసరించాల్సిన వ్యూహాలు..

​​​​​​​చ‌ద‌వండి: After‌ Inter MPC‌: ఇంజనీరింగ్‌తోపాటు వినూత్న కోర్సుల్లో చేరే అవకాశం.. అవకాశాలు, ఎంట్రన్స్‌ టెస్టుల వివ‌రాలు ఇలా..

మ్యాథమెటిక్స్‌

ఈఏపీసెట్‌లో 50 శాతం వెయిటేజీ ఉన్న సబ్జెక్ట్‌.. మ్యాథమెటిక్స్‌. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాథమిక సూత్రాలపై పట్టుసాధించాలి. త్రికోణమితిలో సూత్రాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకొని సరైన చోట అన్వయించగలిగేలా ప్రిపరేషన్‌ సాగించాలి. దీంతోపాటు విద్యార్థులు వేగం, కచ్చితత్వంపై దృష్టిసారించాలి.

ముఖ్య చాప్టర్లు

  • ఇంటర్‌ మ్యాథ్స్‌ సిలబస్‌ను ఆల్జీబ్రా, కాల్కులస్, జామెట్రీ, వెక్టార్‌ ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీగా విభజించొచ్చు. విద్యార్థులు బోర్డు పరీక్షల కోణంలో లిమిట్స్‌ అండ్‌ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్‌ ఆఫ్‌ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, డిఫైనెట్‌ ఇంటెగ్రల్, డిఫెరెన్షియెల్‌ ఈక్వేషన్స్‌పై దృష్టి పెట్టాలి. 
  • జామెట్రీకి వెయిటేజీ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో 2డీ, 3డీ జ్యామెట్రీ, లోకస్, ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ యాక్సెస్, స్రై ్టట్‌ లైన్స్, సర్కిల్, సిస్టమ్‌ ఆఫ్‌ సర్కిల్స్, పారాబోలా, ఎల్లిప్స్, డైరక్షన్‌ కొసైన్స్, డైరక్షన్‌ రేషియోస్, ప్లేన్‌ తదితరాలు కీలక అంశాలుగా ఉంటాయి. 
  • ఆల్జీబ్రా విభాగంలో.. ఫంక్షన్స్‌ మ్యాథమెటికల్‌ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్‌ నంబర్స్, డిమోయర్స్‌ థీరమ్, క్వాడ్రాటిక్‌ ఎక్స్‌ప్రెషన్, థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్, బైనామియల్‌ థీరమ్‌ తదితరాలపై పట్టు సాధించాలి. 
  • ట్రిగ్నోమెట్రీలో.. ట్రిగ్నోమెట్రీ రేషియోస్‌ అప్‌ టు ట్రాన్స్‌ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్‌ ఈక్వేషన్స్, ఇన్వెర్స్‌ ట్రిగ్నోమెట్రిక్‌ ఫంక్షన్స్, హైపర్‌బోలిక్‌ ఫంక్షన్స్, ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ట్రయాంగిల్‌ టాపిక్స్‌ను సమగ్రంగా ప్రిపర్‌కావాలి. 
  • వెక్టర్‌ ఆల్జీబ్రా నుంచి అయిదు లేదా ఆరు ప్రశ్నలు వస్తున్నాయి. అడిషన్‌ ఆఫ్‌ వెక్టర్స్, ప్రొడక్ట్‌ ఆఫ్‌ వెక్టర్స్, మెజర్స్‌ ఆఫ్‌ డిస్పెర్షన్‌ అండ్‌ ప్రాబబిలిటీలో మెజర్స్‌ ఆఫ్‌ డిప్రెషన్, ప్రాబబిలిటీ, ర్యాండమ్‌ వేరియబుల్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌పై పట్టుసాధించాలి.

  –ఎం.ఎన్‌.రావు, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ నిపుణులు

ఫిజిక్స్‌

ఎంసెట్‌లో అత్యధికంగా హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్‌ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ చాప్టర్‌ నుంచి దాదాపు పది ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీని తర్వాత వర్క్‌ ఎనర్జీ పవర్, సిస్టమ్‌ ఆఫ్‌ పార్టికల్స్‌ అండ్‌ రొటేషనల్‌ మోషన్, లాస్‌ ఆఫ్‌ మోషన్, మోషన్‌ ఇన్‌ ఎ ప్లేన్, మూవింగ్‌ చార్జెస్‌ అండ్‌ మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి అయిదు లేదా ఆరు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గ్రావిటేషన్‌ కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్‌ పొటెన్షియెల్‌ అండ్‌ కెపాసిటెన్స్‌పై చాప్టర్ల నుంచి నాలుగు ప్రశ్నల చొప్పున అడిగే అవకాశం ఉంది. వీటి తర్వాత వెయిటేజీ పరంగా వరుసగా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఇండక్షన్, రేఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్‌ కరెంట్, వేవ్‌ ఆప్టిక్స్, మోషన్‌ ఇన్‌ ఎ స్రై ్టట్‌ లైన్, మెకానికల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రిక్‌ చార్జెస్‌ అండ్‌ ఫీల్డ్స్, డ్యూ్యయల్‌ నేచుర్‌ ఆఫ్‌ రేడియేషన్‌ అండ్‌ మేటర్, న్యూక్లిౖయె, సెమికండక్టర్‌ ఎలక్ట్రానిక్స్‌పై దృష్టిపెట్టాలి. పరీక్షలో అత్యధిక వెయిటేజీ ఉంటున్న మెకానిక్స్‌పై ప్రిపరేషన్‌ సమయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ, మోడ్రన్‌ ఫిజిక్స్‌ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
–రవీంద్ర, సబ్జెక్ట్‌ నిపుణులు

కెమిస్ట్రీ

ఫిజికల్‌ కెమిస్ట్రీలో సొల్యూషన్స్‌ చాప్టర్‌ నుంచి ప్రధానంగా ప్రాబ్లమ్‌ బేస్డ్‌ ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతోపాటు రౌల్ట్స్‌ లా,ఐడియల్,నాన్‌ ఐడియల్‌ సొల్యూషన్స్, సాల్యుబిలిటీ, మెలారిటీ, మెలాలిటీ, వేపర్‌ ప్రెజర్‌ ఆఫ్‌ లిక్విడ్‌ సొల్యూషన్స్‌ తదితరాలపై దృష్టిపెట్టాలి. సాలిడ్‌స్టేట్‌లో క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ క్రిస్టలైన్‌ సాలిడ్స్,ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ, బ్యాండ్‌ థియరీ ఆఫ్‌ మెటల్స్, మ్యాగ్నెటిక్‌ ప్రాపర్టీస్,ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టరలో నెర్ట్స్‌ ఈక్వేషన్‌పై ప్రాబ్లమ్‌ బేస్డ్‌ ప్రశ్నలు, ఎలక్ట్రాలసిస్‌ రిలేటెడ్‌ ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. గ్రూప్‌ మూలకాలు, బాయిలింగ్, మెల్టింగ్‌ పాయింట్లు, ఎలక్ట్రో పాజిటివిటీ, ఎలక్ట్రో నెగిటివిటీ, ఫస్ట్‌ ఆర్డర్‌ రియాక్షన్, టైప్స్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్, స్టాండర్డ్‌ రిడక్షన్, పొటన్షియల్‌ వాల్యూమ్‌ టాపిక్స్‌పై దృష్టిపెట్టాలి. బోరాక్స్, డైబోరేన్‌ స్ట్రక్చర్, ప్రిపరేషన్, ప్రాపర్టీస్, డైమండ్, రాఫైట్‌ స్ట్రక్చర్లు, సిలికాన్ల గురించి క్షుణ్నంగా చదవాలి. వీటితోపాటు డి, ఎఫ్‌–బ్లాక్‌ ఎలిమెంట్లు, స్టాండర్డ్‌ రిడక్షన్‌ పొటన్షియల్‌ వాల్యూ, వెస్పర్‌ థియరీ తదితరాలపై ఫోకస్‌ పెట్టాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీని జనరల్, హైడ్రోకార్బన్లు, హాలో కాంపౌండ్లుగా విభజించుకొని చదవాలి. ఇందులో హైడ్రో కార్బన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు, హోమోజినైజేషన్, రియాక్షన్‌ విత్‌ బేయర్స్‌ రియేజెంట్, హాలోజన్, ఎస్‌ఎల్‌ మెకానిజమ్స్, యాసిడ్‌ స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ ఫీనాల్స్, కార్బాక్సిలిక్‌ యాసిడ్స్, అమైన్స్‌పై దృష్టి పెట్టాలి. 
కెమిస్ట్రీని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్‌ కెమిస్ట్రీలుగా విభజించుకొని చదవాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో పట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇనార్గానిక్‌ తర్వాత వెయిటేజీ పరంగా వరుసగా ఆర్గానిక్, ఫిజికల్‌ కెమిస్ట్రీలు నిలుస్తాయి. కెమిస్ట్రీ అంటే.. సహజంగా చాలా మందికి తెలియని భయం ఉంటుంది. కాబట్టి ఆ భావనను పక్కనబెట్టి ప్రిపేరయితే కెమిస్ట్రీలోనూ మంచి మార్కులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
–విజయ్‌ కిశోర్, సబ్జెక్ట్‌ నిపుణులు

బోటనీ

డైవర్సిటీ ఇన్‌ ది లివింగ్‌ వరల్డ్, స్ట్రక్చరల్‌ ఆర్గనైజేషన్స్‌ ఇన్‌ ప్లాంట్స్‌(మార్ఫాలజీ), రీ ప్రొడక్షన్‌ ఇన్‌ ప్లాంట్స్, ప్లాంట్‌ సిస్టమాటిక్స్, సెల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్, ఇంటర్నల్‌ ఆర్గనైజేషన్స్‌ ఆఫ్‌ ప్లాంట్స్, ప్లాంట్‌ ఎకాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ (బ్యాక్టీరియా, వైరస్‌), జెనిటిక్స్, మాలిక్యులర్‌ బయాలజీ, బయో టెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్‌ అండ్‌ హ్యూమన్‌ వెల్ఫేర్‌ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
– బి.రాజేంద్ర, సబ్జెక్ట్‌ నిపుణులు

జువాలజీ

జువాలజీ నుంచి డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ వరల్డ్, స్ట్రక్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఇన్‌ యానిమల్స్, యానిమల్‌ డైవర్సిటీ,, లోకోమోషన్‌ అండ్‌ రీప్రొడక్షన్‌ ఇన్‌ ప్రొటొజోవా, బయాలజీ అండ్‌ హ్యూమన్‌ వెల్ఫేర్, స్టడీ ఆఫ్‌ పెరిప్లెనేటా అమెరికానా, ఎకోలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్‌ అనాటమీ అండ్‌ ఫిజియాలజీ, çహ్యూమన్‌ రీప్రొడక్షన్, జెనిటిక్స్, ఆర్గానిక్‌ ఎవల్యూషన్, అప్లయిడ్‌ బయాలజీ అంశాలపై దృష్టి పెట్టాలి.
– కె.శ్రీనివాసులు, సబ్జెక్ట్‌ నిపుణులు

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం

  • ఈఏపీసెట్‌కు ప్రిపరేషన్‌ సాగించే క్రమంలో.. అభ్యర్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయా అంశాల అభ్యసనంతోపాటు వాటిపై ఉన్న అవగాహన తెలుసుకునేందుకు సమాధానాలు, సమస్యల సాధాన చేయాలి. అదే విధంగా షార్ట్‌ నోట్స్‌ రూపొందించుకోవాలి. 
  • ప్రాబ్లమ్స్‌ ప్రాక్టీస్‌ చేసేటప్పుడు దానికి సంబంధించిన సూత్రం, సిద్ధాంతంపై అవగాహనతో అడుగులు వేయాలి.
  • ఒక కాన్సెప్ట్‌కు చెందిన ప్రశ్నను భిన్న కోణాల్లో సమస్యను సాధించేందుకు కృషి చేయాలి.
  • ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌కు సమయం వెచ్చించేలా సమయ పాలన పాటించాలి.
  • విద్యార్థులు ప్రతి చాప్టర్‌లోని సినాప్సిస్‌పై పట్టు సాధించాలి.

పునశ్చరణ

  • అభ్యర్థులు పరీక్ష తేదీకి కనీసం నెల రోజుల ముందు నుంచి పూర్తిగా పునశ్చరణకే ప్రాధాన్యం ఇచ్చేలా సమయాన్ని కేటాయించుకోవాలి. 
  • దీనికి అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకునే చేసుకునే విధంగా వ్యవహరించాలి. రివిజన్‌ సమయంలో తమకు ఎదురైన సందేహాలను నివృత్తి చేసుకోవాలి. కొత్త అంశాలు, అకడమిక్స్‌లో విస్మరించిన అంశాలుంటే.. వాటిపై కొత్తగా దృష్టి పెట్టడం సరికాదని గుర్తించాలి.

జాతీయ స్థాయి ఎంట్రన్స్‌లతో సమ్మిళితం

ఈఏపీసెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల్లో ఎక్కువ మంది జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్‌ వంటి పరీక్షలకు కూడా పోటీ పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు ఈఏపీసెట్, జేఈఈ సిలబస్‌లను అదే విధంగా అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ అభ్యర్థులు నీట్‌ సిలబస్‌ను సమ్మిళితం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. ఉమ్మడి అంశాలను గుర్తించి ముందుగా వాటిని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఆయా పరీక్షలకు వేర్వేరుగా ఉన్న అంశాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. తద్వారా విజయావకాశాలు మెరుగుపరచుకుని మంచి ర్యాంకు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఏపీ ఈఏపీ–సెట్‌–2022 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 10
  • జూన్‌ 20వరకు రూ.500 అపరాధ రుసుము; జూన్‌ 25 వరకు రూ.1000 అపరాధ రుసుము; జూలై 1 వరకు రూ.5,000 అపరాధ రుసుము; జూలై 3 వరకు రూ.10 వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: జూన్‌ 23 నుంచి జూన్‌ 26 వరకు;
  • హాల్‌ టికెట్‌ డౌన్‌ లోడ్‌ సదుపాయం: జూన్‌ 27 నుంచి;
  • ఈఏపీ–సెట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: జూలై 4 నుంచి జూలై 8 వరకు; (ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు)
  • అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: జూలై 11,12 (ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు);
  • పూర్తి వివరాలు, ఆన్‌లైన్‌ దరఖాస్తుకు వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx


​​​​​​​చ‌ద‌వండి: AP EAPCET: కంప్యూటర్‌ సైన్స్ టాప్‌.. ఇతర కొత్త కోర్సుల్లో సీట్ల కేటాయింపు పూర్తి వివరాలు

Published date : 02 May 2022 05:15PM

Photo Stories