Engineering Seats: సీట్లు రానివారికా... అందరికా?.. పెరిగిన ఇంజనీరింగ్ సీట్లపై అస్పష్టత..
దీనిపై కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడం, తాజాగా సీట్ల పెంపునకు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. మాప్‌ఆప్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పెరిగిన సీట్లపై విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.
కౌన్సెలింగ్ ఎలా?
రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటాకింద 86 వేల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, ఇందులో ఈ ఏడాది 79 వేల సీట్లు భర్తీ అయ్యాయి. మూడు దశలతోపాటు, ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. అంతిమంగా స్పాట్ అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. సీట్లు వచ్చిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లోనూ రిపోర్టు చేసి, సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. సీట్లు రానివారు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో, దోస్త్ ద్వారా డిగ్రీలోనూ చేరారు.
ఈ దశలో కౌన్సెలింగ్ నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. కేవలం మిగిలిపోయిన విద్యార్థులకు మాత్రమే కౌన్సెలింగ్ చేపట్టాలా? మొత్తం అభ్యర్థులకూ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఇవ్వాలా? అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.
చదవండి: Engineering Seats: ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు హైకోర్టు ఓకే.. కొత్తగా ఇన్ని వేల సీట్లు అందుబాటులోకి
ఎక్కడా సీటు రాని వారు మాత్రమే ప్రస్తుతం మిగిలిపోయారు. వీరికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు ప్రయత్నించినా, ఆఖరుకు సివిల్, మెకానికల్, ఈఈఈలో చేరారు. ఇప్పుడు 3 వేల సీట్లు పెరిగితే, అందులో 2,100 కన్వీనర్ కోటా కింద ఉంటాయి.
కేవలం సీట్లు రాని వారికే వీటిని కేటాయిస్తే, అంతకన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి అన్యాయం జరుగుతుందని అధికారులు అంటున్నారు.
యూటర్న్ కష్టమే
ఇప్పటికే 79 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరారు. పెరిగిన సీట్లకు వీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తే కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటికొస్తుంది. వివిధ కాలేజీల్లో పలు గ్రూపుల్లో చేరిన వారు కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేందుకు ప్రయత్నిస్తారు.
దీనివల్ల ఇప్పటికే చేరిన కాలేజీల్లో మళ్లీ సీట్లు ఖాళీ అవుతాయి. వీటికి మరో దఫా కౌన్సెలింగ్ చేపట్టాలి. మొత్తం మీద కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి చేపట్టడమే అవుతుందని సాంకేతిక విద్య విభాగం చెబుతోంది.
చదవండి: IITH: సీఎం చేతులమీదుగా ఐఐహెచ్‌టీ ప్రారంభం.. ఏటా ఇంత మంది విద్యార్థులుకు డిప్లొమా కోర్సు
ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రైవేట్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ పూర్తయింది. ఉన్నత విద్యామండలి ర్యాటిఫికేషన్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
కోర్టు తీర్పు ద్వారా పెరిగిన సీట్లకు కౌన్సెలింగ్ చేపడితే ర్యాటిఫికేషన్ ప్రక్రియ వాయిదా వేయాల్సి ఉంటుంది. పరిస్థితి అంతా గందరగోళంగానే ఉందని సాంకేతిక విద్యకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని అధికారులు, విద్యార్థులు కోరుతున్నారు.
Tags
- Engineering Admissions 2024
- Engineering seats
- Telangana News
- Computer Science Branches
- private colleges
- Mop Up Counselling
- TG EAPCET
- TGCHE
- Engineering courses
- High Court
- Btech Admissions
- engineering colleges
- Seat increase approval
- New engineering seats
- Engineering Spot Admissions
- SakshiEducationUpdates