Engineering Colleges Seats 2023 : ఇంజినీరింగ్ సీట్లు.. అత్యధికంగా ఈ బ్రాంచ్ సీట్లపైనే.. అంగట్లో సరుకులా..
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సీట్లకు డిమాండ్ పెరగడంతో అంగట్లో సరుకుగా అమ్ముడుపోతున్నాయి. రోజురోజుకూ ఫీజుల మోత మోగుతోంది. సివిల్, మెకానికల్ వంటి ఇంజినీరింగ్ కోర్సులు కాకుండా సీఎస్‌ఈ బ్రాంచ్ వైపే మొగ్గు చూపిస్తుండటంతో ఒకేసారి డిమాండ్ పెరిగినట్లయింది. దీంతో ఇంజినీరింగ్ కళాశాలలు సీఎస్‌ఈ బ్రాంచ్‌కి ఫీజులు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
ఈ ఇంజినీరింగ్ కాలేజీల వైపుకు క్యూ..
సీఎస్‌ఈ కోర్సుపై ఆసక్తి ఉన్నవారు కౌన్సెలింగ్ కన్వీనర్ కోటాతో సంబంధం లేకుండా బి కేటగిరీలో సీట్లు దక్కించుకునేందుకు పేరొందిన ఇంజినీరింగ్ కాలేజీలకు క్యూ కడుతున్నారు. ఫలితంగా సీఎస్‌ఈ నాలుగేళ్ల కోర్సు కలిపి ప్రస్తుతం రూ.16.లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఫీజు పలుకుతోంది. మరోవైపు వసతి ఫీజు అదనంగా ఏడాదికి రూ.1.50 లక్షలు వసూలు చేయడం సర్వసాధారణంగా తయారైంది.
అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఇష్టానుసారం బాదేస్తుండగా.. స్వయం ప్రతిపత్తి కళాశాలలు ఏకంగా డొనేషన్ల పేరిట వసూళ్లకు దిగుతున్నాయి. మరోవైపు ఏటా కొంత మొత్తం చెల్లించాలన్న షరతు పెట్టడం మరింత విస్మయానికి గురి చేస్తోంది.
ఇంక మెరిట్ లేకపోతే.. అంతే..
ఇంజినీరింగ్ కాలేజీలకు సీఎస్‌ఈ సీట్ల తాకిడి పెరిగింది. మెరిట్‌ను బట్టి ఫీజుల మోత మోగిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌లో 90% పైగా మార్కులు ఉండాలని, జేఈఈ మెయిన్లో 75% మార్కులు వచ్చి ఉండాలనే నిబంధన పెడుతున్నాయి. మెరిట్ లేకపోతే డొనేషన్లను పెంచేస్తున్నాయి. చాలా కళాశాలలు కోర్ ఇంజినీరింగ్, ఐటీ సీట్లను తగ్గించేసుకుని, సీఎస్‌ఈ సీట్లను పెంచేశాయి.
భారీ మొత్తంలో ఫీజులను చెల్లించే ఆర్థిక స్థోమత లేని వారు ఎక్కడో చోట కన్వీనర్ కోటాలో వచ్చిన సీటులో చేరిపోదామని నిర్ణయించుకుంటున్నారు. వాస్తవంగా కోర్ ఇంజినీరింగ్ సివిల్, మెకానికల్, లాంటి వాటిలో పెద్దగా ఉద్యోగావకాశాలు లేకపోవడంతో విద్యార్థులందరూ సాఫ్ట్‌వేర్ బాటపడుతున్నట్లు తెలుస్తోంది.
☛ Best Branch In BTech : బీటెక్‌లో ఏ బ్రాంచ్ సెలక్ట్ చేసుకుంటే మంచిదంటే..?
జేఎన్టీయూ పరిధిలోనే..
హైదరాబాద్ నగర పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బి కేటగిరీ కింద ఇప్పటికే సగానికి పైగా సీట్లు భర్తీ అయినట్లు తెలుస్తోంది. ఏకంగా కొన్ని కళాశాలలు సీఎస్‌ఈ సీట్లు పూర్తయినట్లు స్పష్టం చేస్తున్నాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలోనే 149 కాలేజీలుండగా ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా (ఎ కేటగిరీ) ద్వారా.. మిగిలిన 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటా (బి కేటగిరీ)లో ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటా పూర్తయిన తర్వాత మేనేజ్‌మెంట్ కోటాను భర్తీ చేయాలని కానీ కన్వీనర్ కోటాప్రక్రియ కంటే ముందే మీ కేటగిరి సీట్లు అంగట్లో సరుకుగా అమ్ముడుపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.