Skip to main content

NMMS: ప్రతిభకు ప్రోత్సాహం.. ఉపకార వేతనం

రాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి, వారికి ఉపకార వేతనాలు అందించేందుకు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షకు నోటిఫికేషన్‌ ఇటీవల విడుదలైంది.
NMMS
ప్రతిభకు ప్రోత్సాహం.. ఉపకార వేతనం

 ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి, అర్హత పొందిన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ ఏడాదికి రూ.12 వేల చొప్పున నాలుగేళ్ల పాటు ఉపకార వేతనం అందిస్తున్నారు. ఇది పేద విద్యార్థులకు విద్యాపరంగా భరోసానిస్తోంది.

పేద విద్యార్థులకు భరోసా

కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యాన ఎన్‌ఎంఎంఎస్‌ను 2008–09 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల ఆధ్వర్యాన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఎన్‌ఎంఎంఎస్‌ ప్రవేశ పరీక్షకు అర్హులు. ఎంపికై న విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు స్కాలర్‌షిప్‌ నేరుగా జమ చేస్తారు.

చదవండి: PM Yashasvi Scheme 2023: 30 వేల మందికి రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు స్కాలర్‌షిప్స్‌... అర్హతలు...

పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ చదివిన వారికి మాత్రమే స్కాలర్‌షిప్‌ కొనసాగిస్తారు. ట్రిపుల్‌ ఐటీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చదివే వారికి స్కాలర్‌షిప్‌ కొనసాగింపు ఉండదు. ఏటా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి వందలాది మంది ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనానికి ఎంపికవుతున్నారు. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగిన ప్రవేశ పరీక్షలో ఉమ్మడి జిల్లా నుంచి 9,498 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

చదవండి: Scholarships: ప్రతిభ చూపే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

దరఖాస్తు చేసుకోవాలిలా..

విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి. జనరల్‌, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున పరీక్ష రుసుం చెల్లించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సెప్టెంబర్ 15 చివరి తేదీ. పరీక్ష రుసుం చెల్లించేందుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ. ప్రధానోపాధ్యాయులు ప్రింటెడ్‌ నామినల్‌ రోల్స్‌, ధ్రువపత్రాలను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించడానికి సెప్టెంబర్ 19 చివరి తేదీ. వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలి.

Published date : 16 Aug 2023 03:54PM

Photo Stories