Skip to main content

PM Yashasvi Scheme 2023: 30 వేల మందికి రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు స్కాలర్‌షిప్స్‌ ... అర్హతలు, ఎంపిక విధానం ఇదే...

ఫీజుల భారం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్స్‌తో చేయూతనిస్తోంది. అందుకోసం పీఎం-యశస్వి పేరుతో ప్రత్యేక స్కాలర్‌షిప్‌ పథకానికి రూపకల్పన చేసింది!
pm yasasvi scheme 2023 benefits
  • పాఠశాల విద్యలో స్కాలర్‌షిప్స్‌కు పీఎం యశస్వి స్కీమ్‌
  • ఓబీసీ, ఈబీసీ, డీ-నోటిఫైడ్‌ గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనం
  • యంగ్‌ అచీవర్స్‌ టెస్ట్‌ (వైఈటీ) ద్వారా అభ్యర్థుల ఎంపిక
  • తొమ్మిది, పదకొండు తరగతుల విద్యార్థులు అర్హులు
  • తాజాగా 2023-24కు వైఈటీ నోటిఫికేషన్‌ విడుదల

దీనిద్వారా విద్యార్థులు తమ సమీప ప్రాంతంలోని ప్రముఖ స్కూల్స్‌లో.. తొమ్మిదో తరగతి, పదకొండో తరగతిలో చేరి ప్రతి నెల స్కాలర్‌షిప్‌ అందుకోవచ్చు!! ఇందుకోసం ఎన్‌టీఏ నిర్వహించే యంగ్‌ అచీవర్స్‌ టెస్ట్‌ (వైఈటీ)లోఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. తాజాగా 2023 సంవత్సరానికి సంబంధించి.. వైఈటీ నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. పీఎం-యశస్వి స్కీమ్‌తో ప్రయోజనాలు, అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు.. 

BC and OBC Scholarships 2023: బీసీ, ఈబీసీ సంచార జాతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

దేశంలో హైస్కూల్‌ స్థాయిలో డ్రాప్‌-అవుట్స్‌ సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈబీసీ), ఓబీసీలు, గిరిజన ప్రాంతాల్లోని డీ-నోటిఫైడ్‌ ట్రైబ్స్‌ వర్గాలకు చెందిన విద్యార్థుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. వీరికి స్కాలర్‌షిప్‌ ద్వారా చేయూతనందించి ఉన్నత విద్యవైపు ప్రోత్సహించేందుకు రూపొందించిన స్కాలర్‌షిప్స్‌ పథకమే.. పీఎం యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డ్‌ ఫర్‌ వైబ్రెంట్‌ ఇండియా(పీఎం యశస్వి).

9 నుంచి 12వ తరగతి వరకు స్కాలర్‌షిప్‌

  • పీఎం-యశస్వి స్కాలర్‌షిప్‌ పథకం మార్గనిర్దేశాల ప్రకారం-ప్రభుత్వం గుర్తించిన అత్యున్నత శ్రేణి పాఠశాలల్లో చదువుతున్న ఓబీసీ, ఈబీసీ, డీ-నోటిఫైడ్‌ ట్రైబ్స్‌ వర్గాలకు చెందిన పిల్లలకు తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్ర­తి నెల నిర్దిష్ట మొత్తంలో స్కాలర్‌షిప్‌ అందిస్తారు. 
  • తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఏటా రూ.75 వేలు; పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థులకు ఏటా రూ.1.25 లక్షలు చొప్పున స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

ఈ ఏడాది 30 వేల మందికి
2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో మొత్తం 30 వేల మందికి పీఎం-యశస్వి స్కాలర్‌షిప్స్‌ను అందించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రాల వారీగా కోటాను పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 1,401 మంది; తెలంగాణలో 1,001 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్‌ అందించనున్నారు. మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్యలో 30 శాతం స్కాలర్‌షిప్స్‌ను అమ్మాయిలకు కేటాయిస్తారు.

అర్హతలు

  • తొమ్మిదో తరగతి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2022-23లో ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత పొందాలి. 
  • పదకొండో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2022-23లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
  • విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి. 
  • స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే తదుపరి ఏడాది స్కాలర్‌షిప్‌ను కొనసాగిస్తారు.

వయసు

  • తొమ్మిదో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్‌ 1, 2007 - మార్చి 31, 2011 మధ్యలో జన్మించి ఉండాలి.
  • పదకొండో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్‌ 1, 2005 - మార్చి 31, 2009 మధ్యలో జన్మించి ఉండాలి.

India Post Recruitment 2023: ఏ పరీక్ష లేకుండానే 30,041 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు.. పదో తరగతి పాస్ అయితే చాలు

స్కూల్స్‌.. ప్రమాణాలు
పీఎం-యశస్వి స్కాలర్‌షిప్‌ అందకునే విద్యార్థి చదివే స్కూల్‌కు నిర్దిష్ట ప్రమాణాలు ఉండాలని పేర్కొన్నారు. సదరు పాఠశాలలో 10, 12 తరగతుల్లో వంద శాతం ఫలితాలు వచ్చి ఉండాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ నిర్దేశించింది. ఇలాంటి పాఠశాలలను గుర్తించేందుకు జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. అంటే.. ఈ స్కాలర్‌షిప్‌ అందుకోవాలంటే.. టాప్‌ స్కూల్స్‌లో విద్యార్థులు చదువుతుండాలి లేదా ప్రవేశం ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫ్రీషిప్‌ కార్డ్‌
పీఎం-యశస్వి స్కీమ్‌ ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఫ్రీషిప్‌ కార్డ్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వీటిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన విద్యార్థులకు జారీ చేస్తాయి. వీటి ద్వారా విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌లో ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు చెల్లించకుండానే అడుగు పెట్టొచ్చు.

వైఈటీలో ప్రతిభతో ఎంపిక
పీఎం-యశస్వి స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయడం కోసం జాతీయ స్థాయిలో యశస్వి ఎంట్రన్స్‌ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చేపడుతోంది.

మొత్తం 100 మార్కులు

  • వైఈటీ పరీక్ష.. తొమ్మిది, పదకొండో తరగతుల విద్యార్థులకు వేర్వేరుగా ఉంటుంది. పరీక్షలో సబ్జెక్ట్‌లు, మార్కులు రెండు తరగతులకు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. వాటి క్లిష్టత స్థాయి ఆయా తరగతులకు అనుగుణంగా ఉంటుంది. వైఈటీ పరీక్షను నాలుగు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్‌ 30 ప్రశ్నలు-30మార్కులు, సైన్స్‌ 25 ప్రశ్నలు-25 మార్కులు, సోషల్‌ సైన్స్‌ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌/జనరల్‌ నాలెడ్జ్‌ 20 ప్రశ్నలు-20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 
  • పరీక్ష పూర్తిగా ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో పెన్‌ పేపర్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండున్నర గంటలు. పరీక్షను ఇంగ్లిష్‌/హిందీలో నిర్వహిస్తారు.

రాష్ట్ర స్థాయిలో మెరిట్‌ జాబితా
యంగ్‌ అచీవర్స్‌ టెస్ట్‌లో పొందిన మార్కుల ఆధారంగా రాష్ట్రాల వారీగా.. ఆయా వర్గాలకు నిర్దిష్ట సంఖ్యలో స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తారు. ప్రతి రాష్ట్రానికి, వర్గానికి సంబంధించి.. వారికి కేటాయించిన సంఖ్య ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ మెరిట్‌ జాబితాలో నిలిచి స్కాలర్‌షిప్‌నకు అర్హత పొందిన వారికి.. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని జమ చేస్తారు. ఆ తర్వాత.. విద్యార్థులు అకడమిక్‌గా చూపిన ప్రతిభ, పరీక్షల్లో పొందిన మార్కులు, హాజరు శాతం ఆధారంగా కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.

SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

వైఈటీ.. దరఖాస్తు విధానం
ఎన్‌టీఏ నిర్వహించే వైఈటీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో.. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డ్‌; పుట్టిన తేదీ ధ్రువ పత్రం; ఆధార్‌ నెంబర్‌; విద్యార్హతల సర్టిఫికెట్లు; ఫొటోగ్రాఫ్‌; సంతకం; కుల ధ్రువీకరణ పత్రం; ఆదాయ ధ్రువీకరణ పత్రం; దివ్యాంగ విద్యార్థులు పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

మంచి మార్కులు పొందాలంటే

  • వైఈటీ పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ ఏడు, ఎనిమిది తరగతుల పుస్తకాలు; పదకొండో తరగతి విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ పదో తరగతి పుస్తకాలు చదవాలి. అన్ని సబ్జెక్ట్‌లలోని ముఖ్యాంశాలను చదవాలి. ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్‌లో ఆయా సిద్ధాంతాలు, సూత్రాలు, భావనలను చదవాలి.
  • నేచురల్‌ సైన్స్‌కు సంబంధించి వ్యాధులు, బ్యాక్టీరియాలు, మానవ శరీర నిర్మాణం, కణజాలం, కిరణజన్య సంయోగ ప్రక్రియ వంటి కీలకమైన అంశాలను చదవాలి.
  • సోషల్‌ సైన్సెస్‌ విషయంలో హిస్టరీ, జాగ్రఫీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఎబిలిటీ విభాగంలో రాణించేందుకు.. జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలను తెలుసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులు, నూతన నియామకాలు, సదస్సులు, సమావేశాలు, ముఖ్యమైన ప్రదేశాలు, క్రీడలు-విజేతలు, వ్యక్తులు-అవార్డులు, దేశాలు -రాజధానులు, దేశాలు-కరెన్సీ వంటి అంశాలపై పూర్తి సమాచారం సేకరించుకుని చదవాలి. అదే విధంగాఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ప్రతి అధ్యాయం చివరలో ఉండే కొశ్చన్స్‌/ఎక్సర్‌సైజ్‌లను ప్రాక్టీస్‌ చేయడం మేలు చేస్తుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 10.08.2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: ఆగస్ట్‌ 12 - 16,2023
  • ఎన్‌టీఏ-వైఈటీ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 29, 2023 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి జిల్లా కేంద్రాలు, తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాలు. 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://yet.nta.ac.in/, https://www.nta.ac.in/, https://socialjustice.gov.in/
Last Date

Photo Stories