NMMS Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్.. ప్రతి నెల రూ.వెయ్యి స్కాలర్‌షిప్
ఈ స్కీమ్‌కు ఎంపికైన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లపాటు ప్రతి నెల రూ.వెయ్యి స్కాలర్‌షిప్‌గా అందుతుంది. అర్హత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంంది. మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్స్ పూర్తి వివరాలు..
ఎన్‌ఎంఎంఎస్
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించి.. ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖకు సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఈ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులు నాలుగేళ్ల పాటు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.12వేల ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు.
అర్హతలు
- ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. వీరు ఏడో తరగతి పరీక్షల్లో 55 (ఎస్సీ, ఎస్టీలైతే 50) శాతం మార్కులు సాధించాలి.
- తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.5 లక్షలకు మించకూడదు.
- ప్రైవేటు పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, ప్రభుత్వ గురుకులాలు, వసతితో కూడిన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు అనర్హులు.
- రాష్ట్రాల వారీగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తాయి. ఇలా ఎంపికైన విద్యార్థుల జాబితాను కేంద్రానికి పంపుతాయి.
రాత పరీక్ష ఇలా
- ఈ స్కాలర్‌షిప్‌ల ఎంపిక కోసం రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల (మ్యాట్, సాట్) రాత పరీక్షను నిర్వహిస్తారు.
- రెండు పేపర్ల పరీక్ష 180 మార్కులకు ఉంటుంది. ఇందులో పేపర్-1లో 90 ప్రశ్నలు, పేపర్-2లో 90 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు మార్కు 1 చొప్పున 180 ప్రశ్నలుంటాయి.
- ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 చొప్పున ఆప్షన్లు ఇస్తారు. నెగిటివ్ మార్కుల నిబంధన లేదు.
- పేపర్-1(మెంటల్ ఎబిలిటీ-మ్యాట్): ఈ విభాగంలో మెంటల్ ఎబిలిటీ-45, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ-20, హిందీ ప్రొఫిషియన్సీ నుంచి 25 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
- పేపర్-2(స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్-సాట్): ఈ దశలో నిర్వహించే పరీక్షలో సైన్స్-35, సోషల్ స్టడీస్-35, మ్యాథమేటిక్స్ విభాగాల నుంచి 20 మార్కులకు చొప్పున ప్రశ్నలుంటాయి.
చదవండి: National Scholarship: నేషనల్ స్కాలర్‌షిప్ విద్యార్థులకు నమోదు చివరి తేది ఇదే..
తుది ఎంపిక ఇలా
ఇలా రాత పరీక్షలో ఎంపికైన విద్యార్థుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు. వీరికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం దాకా ప్రతి నెల రూ.1000 చొప్పున విద్యార్థి బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు. అలాగే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ స్కాలర్‌షిప్ కొనసాగాలంటే.. ప్రతి తరగతిలోనూ నిర్దేశిత మార్కులు సాధించడం తప్పనిసరి. పదోతరగతిలో 60శాతం మార్కులు పొందితేనే స్కాలర్‌షిప్ కొనసాగుతుంది. ఎస్సీ, ఎస్టీలు 55 శాతం మార్కులు పొందాలి.
దరఖాస్తు విధానం
- అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రింటెడ్ నామినల్ రోల్స్, సంబంధిత ధృవపత్రాలను సంబంధిత జిల్లా డీఈఓ కార్యాలయాల్లో 04.11.2023 లోపు అందజేయాలి.
- ఈ పరీక్షలను తెలంగాణలోని 33జిల్లాలకు రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహిస్తారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తులకు చివరి తేదీ: 31.10.2023
- పరీక్ష తేదీ: 10.12.2023
- వెబ్‌సైట్: https://www.bse.telangana.gov.in/
చదవండి: Admissions in Sainik School: బాలికల సైనిక్ స్కూల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..