Skip to main content

Education: విద్యార్థుల ఎదుగుదలే ప్రభుత్వ ‘సంకల్పం’

సాక్షి, అమరావతి: విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, కనీవినీ ఎరుగని పథకాలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపింది.
governments will is the growth of students

 ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం.. వాటిలోని పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా తీర్చిదిద్దనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై శిక్షణనివ్వడానికి ‘సంకల్పం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది.

‘భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైతే పారిపోవడం కాదు.. ఎదుర్కొని పరిష్కారం వెతకాలి.. భిన్న  మనస్తత్వాలు ఉన్న బృందాన్ని కలుపుకుని విజయవంతంగా పనిచేయగలగాలి.. ఇందుకు భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి’.. వంటివాటిపై శిక్షణ మేనేజ్‌మెంట్‌ స్కూళ్లకు మాత్రమే ఇన్నాళ్లూ పరిమితమైంది. ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. తొలిదశలో భాగంగా 1,300 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు శిక్షణ మొదలైంది.

చదవండి: Medical Education: వైద్య విద్యలో నవశకం

పాఠశాల విద్యాశాఖ, మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌ కలిసి ఉచితంగా ఈ శిక్షణను అందిస్తున్నాయి. మూడు దశల్లో మూడేళ్లపాటు దాదాపు 13 లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 1,300 పాఠశాలల్లో (జిల్లాకు 50 స్కూళ్లు) సంకల్పం పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి శుక్రవారం ఒక గంట సమయాన్ని ఇందుకు కేటాయించారు.

మొదటి దశలో 26 జిల్లాల్లోని 1,011 పాఠశాలల్లో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇటీవల మరో 289 పాఠశాలలకు విస్తరించారు. వచ్చే రెండేళ్లలో మొత్తం 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మరో 2,600 స్కూళ్లలో ప్రవేశపెట్టనుంది.  

చదవండి: Job Opportunity: గిరిజన మహిళలకు ఉద్యోగావకాశం..

సంకల్పం అమలు ఇలా.. 

  • జిల్లాకు 50 చొప్పున 26 జిల్లాల్లో హైస్కూళ్లు ఎంపిక  
  • మొత్తం 1,300 ప్రభుత్వ హైస్కూళ్లలో కార్యక్రమం  
  • వచ్చే విద్యా సంవత్సరంలో 2,600 స్కూళ్లకు విస్తరణ 
  • మూడో ఏడాది మొత్తం 6,790 స్కూళ్లలో శిక్షణ 
  • 6–8 తరగతుల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై తర్ఫీదు 
  • మూడేళ్లల్లో మూడు దశల్లో 13 లక్షల మందికి శిక్షణ 

2,600 మంది ఉపాధ్యాయులకు శిక్షణ 

గతేడాది ఫిబ్రవరిలో మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఏపీఎస్‌సీఈఆర్‌టీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘సంకల్పం’ శిక్షణను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం 130 మంది మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చింది. ఈ మాస్టర్‌ ట్రైనర్లు 13 జిల్లా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు (డైట్స్‌) నుంచి 52 మంది ఫ్యాకల్టీలు, ఒక్కో స్కూల్‌కు ఇద్దరు చొప్పున 26 జిల్లాల నుంచి 2,600 మంది ఫిజికల్‌ డైరెక్టర్లు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. వీరు ఆయా స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్‌ ప్రకారం శిక్షణనిస్తారు. శిక్షణ రోజు ఇచ్చిన టాస్‌్కలను విద్యార్థులు స్వయంగా మ్యాజిక్‌ షీట్ల ఆధారంగా పూర్తి చేస్తున్నారు.

తద్వారా వారు నేర్చుకున్న అంశాలను శిక్షకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విద్యార్థులకు స్వీయ–నిర్వహణ, సమస్య–పరిష్కారం, సరైన నిర్ణయం తీసుకోవడం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు వంటి వివిధ కార్యాచరణ–ఆధారిత జీవిత నైపుణ్యాలను విద్యలో అంతర్భాగం చేయడం దేశంలో మన రాష్ట్రంలోనే ప్రారంభమైందని పాఠశాల విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ శిక్షణ కౌమారదశలో ఉన్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, వారి ఉజ్వల భవిష్యత్‌కు దోహదం చేస్తుందన్నారు.  

ఈ 11 అంశాలపై శిక్షణ.. 

సమాజంలో అనేక సందర్భాల్లో వివిధ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అయితే ఇంటి నుంచి మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సాధారణంగా ఎదురయ్యే అంశాలు 11 ఉన్నట్టు అంతర్జాతీయ సర్వే ద్వారా గుర్తించారు. ఆ అంశాలపై వివిధ దశల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ‘కాగి్నటివ్, సోషల్, ఎమోషనల్‌’ అనే మూడు భాగాలుగా విభజించింది. ఏడాదికి ఒక అంశంపై మూడేళ్లపాటు శిక్షణ ఇవ్వనుంది.  

కాగ్నిటివ్‌లో.. సమస్యల పరిష్కారం, సరైన నిర్ణయం తీసుకోవడం, సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్, సృజనాత్మకతపై శిక్షణ ఉంటుంది. విద్యార్థులు తమ ఇల్లు, పరిసరాల్లో గుర్తించినవి, వారికి అవగాహన ఉన్న అంశాలపై తొలి ఏడాది శిక్షణనిస్తున్నారు. 

సోషల్‌ విభాగంలో.. ఎదుటివారిపై సానుభూతి ఎప్పుడు చూపాలి (ఎంపతి), నిశ్చయత (అసెర్టివ్‌నెస్‌), చర్చించి సమస్యను పరిష్కరించడం (నెగోషియేషన్‌), పరస్పర సహకారం (కొలాబరేషన్‌), కమ్యూనికేషన్‌ వంటి అంశాలు ఉన్నాయి. రెండో ఏడాది మొత్తం ఈ అంశాలపైనే శిక్షణ ఉంటుంది. 

ఎమోషనల్‌ (భావోద్వేగాలు) విభాగంలో.. స్వీయ అవగాహన (సెల్ఫ్‌ అవేర్‌నెస్‌), అనుకూలత అంశాలపైనా శిక్షణ ఉంటుంది. వీటన్నింటిపైనా కార్యాచరణ ఆధారిత (క్రీడలు, పరిశీలన) ద్వారా మూడో ఏడాది శిక్షణ ఉంటుంది. 

Published date : 05 Feb 2024 01:58PM

Photo Stories