Tenth Class Public Exams 2024: పదోతరగతి పరీక్షల్లో ప్రణాళికతో సాధన చేస్తే మెరుగైన ఫలితాలు ....
విజయవాడ పశ్చిమ : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే మెరుగైన ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదంటున్నారు సబ్జెక్ట్ నిపుణులు. పదో తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ముందుకు సాగితే మంచి మార్కులను సాధించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆయా సబ్జెకుల ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు ఇవే.
ప్రశ్నపత్రాన్ని చదవాలి
తెలుగులో ఈ ఏడాది పద్యం పురాణం, ప్రతి పదార్థం తొలగించారు. దాని స్థానంలో పాఠ్యాంశంలో ఉన్న పద్యం ఇచ్చి ప్రశ్నలు ఇస్తారు. లేఖా ప్రక్రియ లేదా కరపత్రం సాధన చేస్తే సులభంగా ఎనిమిది మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అక్షర దోషాలు, కొట్టివేతలు లేకుండా జవాబులు రాయాలి. భావ వ్యక్తీకరణ,
సృజనాత్మకతకు 36 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రాన్ని అవగాహన చేసుకున్న తరువాత వచ్చిన ప్రశ్నలు ముందుగా రాసుకుంటే విద్యార్థులు మంచి మార్కులు పొందవచ్చు.
– కె.వాసుదేవరావు,(తెలుగు పండిట్)
సాధన ద్వారానే లెక్కల్లో మార్కులు
మ్యాథ్స్‌లో 1, 2, 4 మార్కుల ప్రశ్నలకు చాయిస్ ఉండదన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. 8 మార్కుల ప్రశ్నలకు మాత్రమే చాయిస్ ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఇస్తున్న ప్రశ్నపత్రం ఏ, బీ గ్రేడ్ విద్యార్థులు అధికంగా మార్కులు పొందేందుకు, సీ డీ గ్రేడ్ విద్యార్థులు ఉత్తీర్ణులు కావడానికి అనువుగా ఉంది. ఏ, బీ గ్రేడ్ విద్యార్థులు 95కు పైగా మార్కులు సాధించాలంటే 4, 8 మార్కుల ప్రశ్నలపై దృష్టి సారించాలి. బాగా సాధన చేయాలి.
– జె.ఆనంద్‌కుమార్,( గణిత ఉపాధ్యాయులు )
రైటింగ్ స్కిల్ పరీక్షిస్తారు
విద్యార్థుల్లోని సృజనాత్మకతను రైటింగ్ స్కిల్‌లో పరీక్షిస్తారు. లెటర్ రైటింగ్, కాన్వర్సేషన్, డైరీ ఎంట్రీ, ఎడిటర్ లెటర్, బ్రయోగ్రాఫికల్ స్కెచ్, ఫ్రేమింగ్ డబ్యుహెచ్ ప్రశ్నలు లేకుంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్‌పై ప్రశ్నలు ఇస్తారు. ఇచ్చిన గ్రాఫ్ లేదా చార్జ్‌కి పేరాగ్రాఫ్ రాయాలి. వీటిపై పట్టు సాధిస్తే 30 మార్కులు సాధించే వీలుంది. 33వ ప్రశ్న ఏ, బీ రీడింగ్ నుంచి 35వ ప్రశ్న కచ్చితంగా సి రీడింగ్ నుంచి వస్తుంది.
– ఎం.సువర్ణకుమార్,( ఆంగ్ల ఉపాధ్యాయులు )
ప్రమాణాలు పరీక్షించేలా ఇస్తారు
సోషల్‌లో పట్టికలు, గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింటింగ్, సమాచార విశ్లేషణ వంటి వాటిని బాగా సాధన చేయాలి. భారతదేశ, ప్రపంచ పటాల్లో భౌగోళిక ప్రదేశాలు గుర్తించేలా సాధన చేస్తే తక్కువ సమయంలో ఎనిమిది మార్కులు సాధించవచ్చు. మ్యాప్ పాయింటింగ్‌లో కూడా ప్రశ్నలు నేరుగా ప్రదేశాలు గుర్తించమని ఇవ్వకపోవచ్చు. పాఠ్యాంశం చివర ఉన్న ప్రశ్నలను యథాతథంగా ఇవ్వకుండా, విద్యా ప్రమాణాలను పరీక్షించే విధంగా ఇస్తారు.
– డీడీకే రంగమణి,( సోషల్ ఉపాధ్యాయురాలు )
పూర్తిగా అర్థం చేసుకోవాలి
హిందీ పాఠ్యాంశాలను చదవడం, రాయడం, బాగా సాధన చేయడంపై శ్రద్ధ వహించాలి. పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చదివితే ప్రశ్నలు ఎలా అడిగినా సమాధానాలు రాయవచ్చు. సులభంగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న లేఖలు రాయడంపై సాధన చేయాలి. పద్యభాగ సారాంశాలు రెండు ఇస్తారు. ఒకటి రాయాలి.
– వి.అరుణకుమారి,( హిందీ ఉపాధ్యాయురాలు )
పట్టు సాధించాలి
భౌతికశాస్త్రంలో కాంతి, విద్యుత్ యూనిట్లు, సూత్రాల ఉత్పాదన, గణన, నిత్యజీవిత వినియోగం, భేదాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. పాఠ్య పుస్తకంలో పట్టికల రూపంలో ఉన్న సమాచారంపై విద్యార్థికి ఉన్న అవగాహన తెలుసుకునేందుకు ఆరు నుంచి ఎనిమిది మార్కుల వరకు ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ప్రయోగాలు, డయాగ్రమ్స్‌పై దృష్టి సారిస్తే ఎనిమిది మార్కులు సాధించడానికి వీలుంటుంది.
– ఎస్.శ్రీనివాసరావు,( భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు )
ఈ ఏడాది పేపరు–1, పేపర్–2గా వేర్వేరు రోజుల్లో నిర్వ హిస్తున్నారు. 1వ ప్రశ్న నుంచి 17వ ప్రశ్న వరకు బయాలజీ ప్రశ్నలుంటాయి. విద్యార్థులు ప్రయోగాలు, భేదాలు, చిత్రపటాలు, టేబుల్స్‌పై శ్రద్ధ వహించాలి. ప్రశ్నకు, మార్కులకు అనుగుణంగా సమాధానాలు రాసే నేర్పు కలిగి ఉండాలి. అధిక మార్కులు సాధించాలంటే చాయిస్ ప్రశ్నలు కూడా రాయాలి.
– ఎం.అనసూయ, ఎన్‌ఎస్ ఉపాధ్యాయురాలు
Tags
- Guidelines of class 10 exams
- sakshieducation latest news
- ap Tenth Class public exam schedule 2024 details
- AP Tenth Class Study Planning
- Tenth class public exams
- Guidelines of Tenth class
- VijayawadaWest
- Class10Exams
- SubjectExperts
- PreparationPlan
- BetterResults
- ExamInstructions
- district
- Teachers
- subjects
- sakshieducation updates