‘ఎయిడెడ్’ అప్పగింత స్వచ్ఛందమే
వాస్తవానికి అత్యధిక శాతం సంస్థలు పూర్తిగా అధ్వాన ప్రమాణాలతో కునారిల్లాయి. వీటిలో చదివే విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవు. టీచర్లు, అధ్యాపకులు లేక సరైన బోధన కూడా అందడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పగించే విద్యా సంస్థలను ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నది లక్ష్యం. అయితే తెలుగుదేశం, కొన్ని విపక్ష పార్టీలు ఈ విషయాన్ని వక్రీకరిస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను రెచ్చగొడుతుండటం వెనుక వారి రాజకీయ స్వార్థమే తప్ప మరేమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నిపుణుల కమిటీ నివేదిక మేరకే..
- ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం ఎక్కడా ఏకపక్షంగా ముందుకు వెళ్లలేదు. ప్రభుత్వం ఈ విద్యా సంస్థలపై అధ్యయనానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ రత్నకుమారి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.
- ప్రొఫెసర్ డబ్ల్యూ రాజేంద్ర, ప్రొఫెసర్ గొల్ల జ్ఞానమణి, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య, ఇంటర్ విద్య, కాలేజీ విద్య కమిషనర్లను సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది.
- ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పెద్ద ఎత్తున కొత్త కోర్సులతో అందుబాటులోకి వచ్చినందున ఎయిడెడ్ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికలు బాగా తగ్గిపోయాయి. 400కు పైగా ఎయిడెడ్ స్కూళ్లలో ఒక్క విద్యార్థీ లేడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
- ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక వంటి పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతోంది.
- ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏటా రూ.1,226.01 కోట్లు వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను కొనసాగించనవసరం లేదని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ సూచనల మేరకు ప్రభుత్వం అన్ని వివరాలతో సమగ్రంగా ఒక జీవో జారీ చేసింది.
ఇలా చేయడం ఏ విధంగా తప్పవుతుంది?
- ప్రభుత్వ గ్రాంట్ పొందుతున్నందున నిబంధనల మేరకు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. ఆయా సంస్థలను దాతలు ఏ లక్ష్యం మేరకు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం కోసమే సంస్థల ఆస్తులను వినియోగించాలి.
- నిబంధనల మేరకు నడపలేకపోతే తమ సంస్థ కమిటీ అభీష్టం మేరకు సంస్థలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించవచ్చు. లేదా సంస్థలోని ఎయిడెడ్ సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించి, పూర్తి స్థాయి ప్రయివేటు విద్యా సంస్థగా కొనసాగవచ్చు. లేదా ప్రభుత్వ నిబంధనల మేరకు యధాతథంగా కొనసాగవచ్చు.
విద్యా సంస్థలు, అధ్యాపకుల అంగీకారం
- రాష్ట్రంలో 2,249 ఎయిడెడ్ విద్యా సంస్థలుండగా అందులో 1,446 సంస్థలు సిబ్బందిని అప్పగించేందుకు అంగీకరించాయి. 101 సంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వ పరిధిలో చేర్చేందుకు సుముఖత వ్యక్తపరిచాయి. 702 సంస్థలు అంగీకారం చెప్పకుండా యధాతథంగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నాయి.
- సిబ్బంది కూడా ప్రభుత్వంలో కలవడం ద్వారా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే తమకు అన్ని సదుపాయాలు అమలవుతాయని విలీనానికి ముందుకు వచ్చారు.
- విలీనానికి ఆప్షన్లు ఇచ్చిన సంస్థలు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తే దానికీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు.
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
- ఎయిడెడ్ సంస్థలు, సిబ్బంది విలీన ప్రక్రియలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు నుంచి పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ఆయా సంస్థలకు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలను మ్యాపింగ్ చేసి వారిని అందులో చేర్చేలా ప్రతి స్కూలుకూ ఇన్ చార్జ్‌లను నియమించింది.
- ఒకవేళ నిర్ణీత దూరంలో ప్రభుత్వ స్కూలు అందుబాటులో లేకుంటే ఆ ఎయిడెడ్ స్కూలు భవనంలోనే ప్రభుత్వ పరంగా పాఠశాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. అందుకు అవకాశం లేని చోట భవనాలను అద్దెకు తీసుకొని పాఠశాల నెలకొల్పేలా ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు విద్యార్థుల చేరికలూ సాఫీగా సాగేలా చేశారు. తల్లిదండ్రులను సంప్రదించి వారికి నచ్చిన స్కూలులో పిల్లలను చేర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఫీజుల భారం లేనే లేదు
- ఎయిడెడ్ విద్యా సంస్థలు, సిబ్బంది ప్రభుత్వంలో విలీనంతో ఫీజులు పెరుగుతాయని తెలుగుదేశం, ఇతర పార్టీలు చేస్తున్న వాదన కేవలం దుష్ప్రచారమే. ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలుగా కొనసాగినా, అవి ఇష్టానుసారం ఫీజులు పెంచేందుకు వీలులేదు.
- పలు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఎయిడెడ్ సెక్షన్లతో పాటు అన్ ఎయిడెడ్ సెక్షన్లు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అన్ ఎయిడెడ్ సెక్షన్ల కోర్సుల ఫీజులను ప్రైవేటు విద్యా సంస్థలకు మాదిరిగానే రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్ణయిస్తుంది.
- ప్రస్తుతం 2020–21 నుంచి 2022–23 వరకు ఫీజులు ఖరారయ్యాయి. ఈ ఫీజులకు మించి ఏ విద్యా సంస్థ కూడా అదనంగా వసూలు చేయడానికి వీల్లేదు. ఈ ఫీజుల భారం కూడా విద్యార్థులపై పడకుండా ప్రభుత్వమే వాటిని జగనన్న విద్యాదీవెన కింద పూర్తిగా రీయింబర్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజుల భారం అనే ప్రసక్తే ఎక్కడా ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
- వాస్తవానికి ఎయిడెడ్ విద్యా సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాటిని నిర్వీర్యం చేసింది చంద్రబాబునాయుడే. ఈ విద్యా సంస్థల్లో ఎలాంటి నియామకాలూ చేపట్టడానికి వీల్లేకుండా ఖాళీల భర్తీని తిరస్కరిస్తూ 1999 డిసెంబర్ 17వ తేదీన ఆయన ఉత్తర్వులు జారీ చేయించారు. ఆ తర్వాత 2004, 2017లోనూ అవే ఆదేశాలు జారీ చేయించారు.
ప్రభుత్వ పరిధిలోకి స్వచ్ఛందంగా వచ్చిన ఎయిడెడ్ సంస్థలు, సిబ్బంది
కేటగిరీ |
మొత్తం సంస్థలు |
ప్రభుత్వ గ్రాంటు (రూ.కోట్లలో) |
య«థాతథంగా ఉన్నవి |
సిబ్బందిని అప్పగించినవి |
ఆస్తులతోపాటు విలీనమైనవి |
సిబ్బంది |
డిగ్రీ కాలేజీలు |
137 |
364.7 |
6 |
124 |
7 |
1,991 |
జూనియర్ కాలేజీలు |
122 |
171.8 |
9 |
107 |
6 |
1,010 |
స్కూళ్లు |
1,988 |
686.4 |
686 |
1,214 |
88 |
3,580 |
పాలిటెక్నిక్ |
2 |
3.11 |
1 |
1 |
– |
20 |
మొత్తం |
2,249 |
1,226.01 |
702 |
1,446 |
101 |
6,601 |
ఇది చంద్రబాబు నిర్వాకమే
ఎయిడెడ్ వ్యవస్థ కుప్పకూలడానికి గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణం. నియామకాలు నిలిపివేయించారు. ఇతర సదుపాయాలకు ఇచ్చే నిధులను ఆపేశారు. తనకు సంబంధించిన నారాయణ తదితర కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా ఎయిడెడ్‌లో టీచర్లు లేక విద్యార్థుల చేరికలూ తగ్గిపోయాయి.
– శివశంకర్, విద్యావేత్త
ఎక్కడ బలవంతం ఉంది?
ప్రభుత్వం మా విద్యా సంస్థల విలీనానికి ఎక్కడా ఒత్తిడి చేయలేదు. ఉన్నత ప్రమాణాలతో కొనసాగిస్తామనుకుంటే మీరే నిర్వహించుకోండి.. లేదంటే ప్రభుత్వానికి అప్పగిస్తే అభివృద్ధి చేసి ఉత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తామని చెబుతోంది. ఇందులో ఎక్కడ బలవంతం ఉంది? మేమే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాం. యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చినవే విలీనం అవుతున్నాయి. సిబ్బందిని అప్పగించినా విద్యార్థులపై ఫీజుల భారం పడదు. ఆ ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయం బాగుండబట్టే సిబ్బందంతా ఆప్షన్లు ఇచ్చారు.
– రత్నకుమార్, రాష్ట్ర ఎయిడెడ్ విద్యా సంస్థల అసోసియేషన్ అధ్యక్షుడు
విద్యార్థులకు ఎంతో మేలు
ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఎయిడెడ్‌లో సరైన బోధన చేసేందుకు తగినంత సిబ్బంది లేరు. ప్రభుత్వ సంస్థల్లో మెరుగైన బోధన జరుగుతోంది కనుక విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎయిడెడ్ అధ్యాపకులుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వంలో చేరడం ద్వారా ఆ సమస్యలు తీరుతాయి. ప్రభుత్వ విద్యా సంస్థలూ మరింత బలోపేతమై విద్యార్థులకు మంచి విద్య అందుతుంది.
– త్రివిక్రమరెడ్డి, ఏపీ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు