Private School Teachers: ప్రైవేట్‌ స్కూళ్లలో టీచర్లపై ఆరా.. వారి అర్హతలేంటో తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో పనిచేసే ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించింది.

ఏయే విద్యార్హతలున్నాయో ఆరా తీయాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్య డైరెక్టరేట్‌ కార్యాలయం ఇప్పటికే అంతర్గత ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్‌ పాఠశాలల వివరాలను ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేసి..అందులో పొందుపర్చాలని అధికారులు భావిస్తున్నారు.

ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, ఉన్నత విద్య బోధించే ఉపాధ్యాయుల ధ్రువీకరణ పత్రాలు కూడా పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుల సదస్సులో ముఖ్యమంత్రి ప్రైవేట్‌ స్కూళ్లలో అర్హత లేనివారు బోధిస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు ప్రజలకు వివరించాలని సీఎం భావించినట్టు అధికారులు చెబుతున్నారు.  

చదవండి: Department of Education: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఈ ప‌ని చెయ‌డంపై నిషేధం

యూడైస్‌కూ అందించాలి  

కేంద్ర ప్రభుత్వ అధీనంలోని యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌)లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల డేటా ఏటా పొందుపర్చాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, మౌలిక వసతులు ఏమున్నాయో ఇందులో పేర్కొనాలి. విద్యాశాఖ ఇప్పటివరకూ ప్రభుత్వ స్కూళ్లలోని వివరాలనే యూడైస్‌కు సమగ్రంగా ఇస్తోంది.

ప్రైవేటు స్కూళ్ల నుంచి అన్ని వివరాలు అందడం లేదని అధికారులు చెబుతున్నారు. వివరాల కోసం ఎన్ని లేఖలు రాసినా ప్రైవేట్‌ స్కూళ్లు స్పందించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర వివరాలు తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

ప్రైవేట్‌లోనే టీచర్లు ఎక్కువ  

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల స్కూళ్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 29 వేలు, ప్రైవేట్‌ 11 వేల వరకూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1.35 లక్షల మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ స్కూళ్లలో 2 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. అయితే సర్కారీ స్కూళ్లలో 26 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేట్‌ స్కూళ్లలో 34 లక్షల మంది చదువుతున్నారు.

ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కనీసం మౌలిక వసతులు కూడా లేని, ఏ అర్హత లేనివారు బోధిస్తున్నా విద్యార్థులు ఎందుకు ప్రైవేట్‌ బాట పడుతున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

పర్యవేక్షణ ఉంటేనే సాధ్యం 

ప్రైవేట్‌ పాఠశాలలు స్వచ్ఛందంగా ఉపాధ్యాయుల అర్హతలను వెల్లడించే అవకాశమే లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. బీఈడీ అర్హతతో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉన్నారా అనేది తెలుసుకోవాలి. దీనికి మండల స్థాయిలో ఎంఈఓ, జిల్లా స్థాయిలో డీఈఓలు దృష్టి పెట్టాలి.

అయితే డీఈఓ, ఎంఈఓ పోస్టుల్లో మెజారిటీగా ఇన్‌చార్జ్‌లనే కొనసాగిస్తున్నారు. దీంతో పర్యవేక్షణ లోపాలు వెంటాడే అవకాశం ఉందని చెబుతున్నారు.

#Tags