Badi Bata Programme: బడికి చలో.. ’బడిబాట’ పట్టిన ఉపాధ్యాయులు...

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికే విద్యాశాఖ జూన్ 6 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది.

ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ప్రతీరోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విధులు నిర్వహించే ఊళ్లలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత, ఆంగ్ల మాధ్యమం చదువు ప్రయోజనాల గురించి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు.

విద్యార్థుల నమోదును చేపడుతున్నారు. ప్రభుత్వం కూడా పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోంది.

చదవండి: School Admissions: విద్యార్థి ‘ప్రైవేటు’ బాట..! ఈ తరగతి నుంచే చేరిక‌లు ఏక్కువ‌..

సర్కారు బడిలో చదివి.. ఉన్నతంగా ఎదిగి..

నిర్మల్‌ ఖిల్లా: బడి ఓ మధుర జ్ఞాపకం. స్కూల్‌ డేస్‌.. ప్రతి ఒక్కరి జీవితంలో మరపురానివే. పదేళ్లు చదివే పాఠశాల విద్య ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఎంతో మందిని స్నేహితులను చేస్తుంది. జీవితానికి బాటలు పడేది ఇక్కడి నుంచే.. నేటి నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో చదివి, ప్రస్తుతం ఉన్నతంగా ఎదిగిన జిల్లాకు చెందిన వ్యక్తులు, వారి స్కూల్‌ డేస్‌లలో తొలిరోజు గడిచిన అనుభవాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, మిత్రులు, ఉపాధ్యాయులు అందించిన ప్రేరణ, మలుపు తిప్పిన సంఘటనలు ‘సాక్షి’తో పంచుకున్నారు.

తొలిరోజు ఉత్సాహంగా..

వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయంటేనే ఒక పండగ వాతావరణంలా ఉండేది. నేను ఖానాపూర్‌ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను.

ఇంటర్‌, డిగ్రీ నిర్మల్‌లోని ప్రభుత్వ కళాశాల్లోనే పూర్తిచేశాను. పాఠశాలల పునఃప్రారంభం నాటికి మిత్రులందరం కొత్తగా కుట్టించుకున్న ఖాకీ రంగు నిక్కరు, తెల్లచొక్కా యూనిఫాం వేసుకుని వెళ్లేవాళ్లం. కొత్త పుస్తకాలు కొనుక్కుని పుట్టలు వేసుకునే వాళ్లం.

ఫౌంటెయిన్‌ పెన్‌లో ఇంకు నింపుకుని సిద్దం చేసుకునేవారం. గోనె సంచుల బ్యాగులు భుజానికి వేసుకొని బడికి పరుగెత్తుకుని వెళ్లేవాళ్లం. సమీప గ్రామాల వారు సైకిళ్లపై బడికి వచ్చేవారు. కొత్త విద్యార్థులతో కొత్త స్నేహాలు చిగురించేవి. పై తరగతులకు వెళ్తున్నామన్న ఆనందం మదినిండా తొణికిసలాడేది. ఆహ్లాదకర వాతావరణంలో తొలిరోజు పరిచయ కార్యక్రమాలు, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు టైం టేబుల్‌ ఇచ్చేవారు.

అప్పుడు అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలుగు మీడియం చదివే వాళ్లం. మాపై అందరి ఉపాధ్యాయుల ప్రభావం ఉన్నా ప్రధానంగా డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేసిన కలీం సార్‌ క్లాస్‌ అంటేనే బాగా ఇష్ట పడేవారం. పెద్దయిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నా 1960 ప్రాంతంలో మొదటి తరగతితో ప్రారంభమైన ప్రస్థానం, ఆనాటి తొలి రోజు జ్ఞాపకాలు మదిలో ఎప్పుడూ పదిలంగానే ఉంటాయి. 
– డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, ప్రముఖ సాహితీవేత్త, కెనడా రాయబార కార్యాలయ విశ్రాంత ఉద్యోగి, నిర్మల్‌

ఉత్సాహ పూరితంగా మాట్లాడాలి...

కొత్తగా పాఠశాలకు వచ్చే విద్యార్థులను, చిన్న పిల్ల ల ను ఉత్సాహపూరితంగా మాట్లాడేలా ప్రోత్సహించాలి. ఈ బాధ్యత ఉపాధ్యాయులదే. వారు మొట్టమొదట బడికి రావడానికి కాస్త భయపడుతూ ఉంటారు. వారిని బడికి వచ్చేలా ఆసక్తి కలిగించాలి. కొత్త కొత్త పుస్తకాలు ఆట వస్తువులు స్నేహితుల గురించి వారికి వివరించాలి. అలా క్రమక్రమంగా బడి అంటే భయం పోయి ఇష్టం ఏర్పడుతుంది. తొలి కొన్నాళ్లు పాఠాల బోధన కంటే ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో మమేకమయ్యేలా వారిని ఉత్సాహపరచాలి.

– మోత్కూరి రాంచందర్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

ప్రతీరోజు 8కి.మీ దూరం...

భైంసాటౌన్‌: ప్రతి ఒక్కరి బాల్యంలో మరుపురాని జ్ఞాపకాలు ఉంటాయి.. నాకూ పాఠశాల రోజులు ఇప్పటికీ గుర్తుకొస్తాయి. బాల్యంలో స్నేహితులతో గడిపిన రోజులు బాగుండేవి. మాది మహారాష్ట్రలోని జల్‌గాం గ్రామం. వ్యవసాయ కుటుంబం.

నాన్న సుభాష్‌ పాటిల్‌కు ప్రజలకు సేవచేసే కొలువు చేయాలన్న కోరిక ఉండేది. తాను ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాలేదని, అందుకే ప్రజలకు సేవ చేయాలంటే ఉన్నత చదువొక్కటే మార్గమని మమ్మల్ని బాగా చదివించారు.

ఏడో తరగతి వరకు ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నా చిన్నప్పుడు అమ్మ కల్పనే పాఠశాలలో దింపి వచ్చేది. 8 నుంచి 12వ తరగతి వరకు మా ఊరికి 8 కి.మీల దూరంలోని వరణ్‌గాంలో ప్రభుత్వ కళాశాలకు సైకిల్‌పై వెళ్లేవాడిని.

చౌదరి గురువుగారు నాలో ప్రతిభ గుర్తించి ప్రోత్సహించేవారు. నాన్న కల నిజం చేయాలనే సంకల్పంతో సివిల్స్‌పై దృష్టి సారించి ఐపీఎస్‌ అయ్యాను.

– కాంతిలాల్‌పాటిల్‌, ఏఎస్పీ, భైంసా
 

#Tags